ఫోన్ పెట్టేసి తన వాళ్ళకి సూచనలు ఇచ్చిందామె. ఆమె చకచకా పనులు చేస్తూంటే చూస్తూ కూర్చున్నాడు విహారి. చూసేకొద్దీ ఆమెమీద గౌరవం పెరగసాగింది.
సరీగ్గా పది నిముషాలు గడిచాయి.
నాలుగున్నరయింది. అన్ని రేడియోల్లోనూ, టీ.వీ.ల్లోనూ ముఖ్యమంత్రి సందేశం ప్రకటించబడింది.
నికుంజ్ విహారి సూచించిన దాన్నే కాస్త అటు ఇటుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీ రద్దుచేస్తే అయ్యే ఖర్చుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకొమ్మని టెర్రరిస్టులని కోరటం జరిగింది. అయితే, ఇదంతా కేవలం వారినుంచి టైమ్ సంపాదించటానికే.
అయిదయింది.
ఆరయింది.
మరో హత్య జరగలేదు.
పిల్లలు తల్లిదండ్రులు కాస్త స్థిమితంగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారి ఆందోళన పూర్తిగా తగ్గలేదు. పిల్లలు ఇంటికి వస్తేగానీ అది తగ్గదు. ఆమె విహారివైపు అభినందన పూర్వకంగా చూసింది. అతడి ప్లాన్ ఫలించింది.
రాబోయే ఫోన్ కోసం అందరూ వేచి వున్నారు. టెలిఫోన్ లు ట్రాప్ లో పెట్టడం అనవసరం. అవి ట్రాప్ లో వుంటాయని ప్రత్యర్దులకి కూడా తెలుసు. ఆ విధమైన ఉపయోగం లేదని ఆమెకూ తెలుసు. పైగా ఈ విధమైన ట్రాప్ వుంటే అది తెలిసి వాళ్ళు ఇంకో విధంగా కబురుపంపిస్తారు. అదిష్టంలేదు ఆమెకు. తను ట్రాప్ చేసిందని వాళ్ళకు నిముషాల్లో తెలుస్తుంది. తన డిపార్ట్ మెంట్ లోనే వాళ్ళ మనుష్యులున్నారు.
ఆరున్నర...ఏడు... ఏడున్నరకి ఫోన్ మ్రోగింది. ఆఫీసు ఒక్కసారిగా జాగృతమైంది. "ముఖ్యమంత్రి దిగిపోవటమే మాకు కావల్సింది. వేరే ఎవరు ముఖ్యమంత్రయినా మాకు అభ్యంతరం లేదు.... కానీ ఈ మార్పంతా" విమాన శబ్దంలో అవతలి వ్యక్తి మాటలు సరీగ్గా వినపడలేదు.
"హల్లో- హల్లో-"
"ఈ మార్పంతా రేపు సాయంత్రంలోగా జరిగిపోవాలి" అవతల్నుంచి ఫోన్ కట్ అయింది. ప్రవల్లిక ఫోన్ పెట్టేస్తూ, "మీ ఐడియా కొంతవరకు ఫలించింది. రేపు సాయంత్రం వరకూ టైమ్ దొరికింది" అంది.
"ఇంకొంచెంసేపు మాట్లాడవలసింది" అన్నాడు విహారి.
"వాళ్ళు అడిగిన విషయాలన్నీ చీఫ్ మినిష్టర్ కి చెప్పాలి కదా."
వీళ్లు మాట్లాడుకుంటూ వుండగా ముఖ్యమంత్రే హడావుడిగా లోపలికి ప్రవేశించాడు.
"ఏమిటి? వాళ్ళేదో కోరికలు చెప్పారట. ఏమిటవి?" అని అడిగారు. ప్రవల్లిక చెప్పింది. ఆయన మొహం చూస్తూంటే పిల్లల తల్లి దండ్రులకన్నా ఆయన ఎక్కువ బాధ అనుభవిస్తున్నట్టున్నారు.
ప్రవల్లిక చెప్పినది వినగానే ఆయన మొహం విప్పారింది. "హమ్మయ్య! అంతవరకూ ఒప్పుకున్నారుకదా! మన సూర్యారావుని చేద్దాం. నేను పదవి దిగిపోవటానికి అభ్యంతరం లేదు" అన్నాడు.
ఆయనతోపాటు లోనికి వచ్చిన విలేఖరులు ఈ వార్తను ఫ్లాష్ చేయడానికి హడావుడిగా వెళ్ళిపోయారు.
"కానీ సర్-" అంది ప్రవల్లిక. "వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోవడం మన ఓటమిని ఒప్పుకోవటం అవుతుందేమో!"
"మొత్తం అసెంబ్లీయే డిజాల్వ్ చెయ్యమంటారేమోనని నేను భయపడ్డాను. లేదా అపోజిషన్ వాళ్ళకి అధికారం ఇమ్మంటారేమో అనుకున్నాను. పసిపిల్లల ప్రాణాలు చేతిలో పెట్టుకుని వాళ్ళు ఏదైనా కోరవచ్చు. అంత పెద్ద డిమాండ్ లేమీ చేయకుండా కేవలం నన్ను దిగిపొమ్మనటం అదృష్టం. పదవికేముంది? వాళ్ళు పట్టుబడ్డాక ప్రజలు కోరితే మళ్ళీ అధికారంలోకి వస్తాను. నేనెంతో సూర్యారావూ అంతే. పాపం అతడిమీద కూడా హత్యాప్రయత్నం జరిగిందట. మరి అతను ముఖ్యమంత్రి అవటానికి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కనుక్కోండి. రేప్రొద్దున్నే రాజీనామా విషయం అసెంబ్లీలో ప్రకటిస్తాను" తలదించుకొని వెళ్ళిపోయాడాయన. నికుంజ్ విహారి ఇంతసేపూ ఆయన వైపే చూస్తూ వున్నాడు. ఆయన నిబ్బరం, నిర్ణయాలు తీసుకునే విధానం, త్యాగశీలత ఎంతో నచ్చాయి అతనికి. అధికారం కోసం ఎన్ని కిరాతకాలైనా చేసే రాజకీయ నాయకులున్న ఈ దేశంలో, పాతికమంది పిల్లలకోసం పదవి వదులుకునే నిస్వార్ధ పరులుండటం అబ్బురమే.
అతడు డిప్యూటీ చీఫ్ వైపు చూశాడు.
ఆమె మొహంలో రిలాక్సేషన్ కనపడుతోంది! టెంపరరీగా ఈ సమస్య దాటినట్టే. బహుశా ఆ అరాచక శక్తులు పిల్లల్ని రేపు సాయంత్రానికి వదిలెయ్యవచ్చు.
"మొత్తానికి అందరిలోనూ అదృష్టవంతుడు సూర్యారావుగారు. టెర్రరిస్టులకీ, ముఖ్యమంత్రికీ వున్న కక్ష్యలవల్ల అతడు లాభం పొందాడు. మొన్న ఆ మంత్రిగా వేషం మీరువేసి వుండకపోతే పాపం ఆయన ఈ పాటికి ఎక్కడ వుండేవాడో?"
విహారి కాస్త సిగ్గుతో, "ఏదో ఆ కాలేజీ అమ్మాయిల్ని కాస్త ఏడిపిద్దామని" అన్నాడు.
"ఆ గ్రీన్ రూమ్ లో కూడా మీరు సాహసం చేయకపోయివుంటే నాకు పిస్టల్ తీసేటంత టైమ్ వుండేదికాదు" అంది.
అతడు మాట మార్చటానికి, "నాకెందుకో అంత సంతోషంగా లేదు. ఏదో ఆలోచన వచ్చి నేను మీకు చెప్పినమాట నిజమే. కానీ మీ డిపార్టుమెంట్ ఏదైనా చేసి, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే లోపులో ఆ టెర్రరిస్టులని పట్టుకుంటే బావుంటుంది" అన్నాడు.
ఆమె మొహంలో రిలాక్సేషన్ పోయింది. "అవును. పిల్లల ప్రాణాలు రక్షించగలిగాం. కానీ, విజయం వాళ్ళదే! దీన్ని యిలా వదిలేస్తే రేపుప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి పనికీ ఇదేపని చేస్తారు ఈ కిరాతకులు" అంది.
* * *
"థాంక్స్" అన్నాడు సూర్యారావు అనంతానంతస్వామి చేతులు పట్టుకుని. "మీ ఆలోచన అద్భుతం. మీ పథకం అపూర్వం!! మొదట మీరు చెప్పినప్పుడు ధియేటర్ లో నా మీద హత్యాప్రయత్న మేమిటా అని ఆశ్చర్యపోయాను. ఆ విధంగా ప్రజల సానుభూతి సంపాదించి ఆ తరువాత ఇలా నాకు పదవి సంపాదించి పెట్టారంటే - మీ రుణం నేను ఏ విధంగా తీర్చుకోను?"
"నా మూడో స్తంభంగా నిలబడటం ద్వారా..... నా నాలుగు స్తంభాలూ ఏమిటో తెలియక సి.బి.ఐ. కొట్టుకుచస్తుంది. నా మూడో స్తంభం రాజకీయం. అది నువ్వు. తెలివితేటలు, బలం, రాజకీయం - పరమేశ్వరం, రామ్ లాల్, నువ్వు ఈ ముగ్గురూ నా వెనుక వుండగా, నేను భారతదేశపు నియంతనయ్యే రోజు ఎంతో దూరంలో లేదు."
"మీ నాలుగో స్తంభం ఎవరు స్వామీ-" ఉత్సుకతతో ప్రశ్నించాడు.
స్వామి నవ్వేడు. "అది చెప్తే నీ గుండె ఆగిపోతుంది, అవసరం వచ్చినప్పుడు చెపుతాను."
"ఏది ఏమైనా మీ రుణం తీర్చుకోలేను-"
"అంటే.....? కోటి రూపాయలూ ఇవ్వవా?"
"కోటి ఏమిటి స్వామీ! రెండుకోట్లు ఇచ్చినా మీ రుణం తీరదు. అసలు ఇదంతా నిజమేనా? నిజంగా జరిగిందా? అని అనుమానంగా వుంది. పాపం ఆ ముఖ్యమంత్రిగారు ఈ పదవిలోకి రావటానికి ఎంతో కష్టపడ్డారు. అహర్నిశలూ శ్రమించారు. అటువంటి పదవిని చిన్న ఎత్తుతో మీరు సాధించి నాకు ఇప్పిచ్చారంటే నమ్మకం కుదరటంలేదు."
"ఇదంతా ప్రతిపక్షం వాళ్ళ ఎత్తు అనో- లేక విదేశీ శక్తుల కుట్ర అనో అందరూ అనుకున్నంతవరకూ నీ పదవికి ఢోకా లేదు. కేవలం ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత కక్షవల్ల అతడిని పదివిలోంచి దింపామని ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా టెర్రరిస్టులకు అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని ప్రజలకు కల్గించాం. నీ మీద హత్యాప్రయత్నం జరిపి, మరోవేపు సానుభూతి కలిగేలా చూశాం" స్వామి ఆగి, అన్నాడు. ".....రామ్ లాల్ వస్తాడు. కోటి రూపాయలూ ఇచ్చి పంపించు. నీ పని పూర్తయినట్టే, తరువాత నా రాష్ట్రానికి ఏజెంట్ గా వ్యవహరించు."
"రేపు ప్రమాణస్వీకారం చేయగానే ఒకటి, రెండు రోజుల్లో..."
"ఒకటి రెండు రోజుల్లో..." స్వామి భృకుటి ముడిపడింది.
"మరి ముఖ్యమైన ఫైల్స్ సంతకం పెట్టి, అంత డబ్బు వసూలు చేయటానికి ఆ మాత్రం టైమ్ పడుతూంది కదా స్వామీ..."
"అయితే అంత డబ్బు నీ దగ్గర లేదంటావ్?"
"లేదు స్వామీ" సూర్యారావు నసిగాడు.
అనంతానంతస్వామి నవ్వేడు. "జంషెడ్ పూర్ ఇన్వెస్ట్ మెంట్స్ లో నీ డబ్బు కోటి డెబ్భై లక్షలుంది. ఏ క్షణం కావాలంటే ఆ క్షణం దాన్ని నువ్వు తీసుకోవచ్చు. తాజ్ మహల్ హోటల్ పక్క స్లమ్ డ్వెల్లర్స్ లాండ్ మూడుకోట్లు చేస్తుంది. దానిమీద కోటి రూపాయలదాకా ఏ మార్వాడీ అయినా ఇస్తాడు. ఢిల్లీ మారుతీ హోటల్స్ లో బినామీ పేర్లమీద సగం షేర్లు నీవి. నీ సెంట్రల్ బ్యాంక్ లాకర్స్ లో బంగారం వంద కేజీల్దాకా వుంది. అన్నిటికన్నా ముఖ్యంగా..." ఆగి నవ్వి, నెమ్మదిగా అన్నాడు. "....స్విస్ బ్యాంక్ అకౌంట్ నెం. 0819 xy 219 eos 123 code CAT and RAT లో నిన్న సాయంత్రానికి నీ పేర్న 79, 24, 796 స్విస్ ఫ్రాంక్ లున్నాయి. వాటిలో కోటి రూపాయలు నా పేర్న అక్కడే ట్రాన్స్ ఫర్ చేయించు".
సూర్యారావు నోట్లో తడి ఆరిపోయింది. తనక్కూడా తన ఆస్తుల సంగతి ఇంత వివరంగా తెలిసి వుండదు. తలెత్తి దిగ్భ్రాంతితో అనంతానంతస్వామివేపు చూశాడు.
స్వామి అక్కడ లేడు. రామ్ లాల్ వున్నాడు. 'వెళ్దామా' అన్నట్టు చూస్తున్నాడు.
7
"మీరు చేసిన సాయానికి థాంక్స్" అంది ప్రవల్లిక లేస్తూ. విహారి కూడా లేచి, "నేను చేసిందేముంది? మొత్తం అధికార పక్షం రాజీనామా చెయ్యాలా, లేక అసెంబ్లీ రద్దవ్వాలా అని తెలుసుకునే వరకే నేను చేశాను గానీ, చివరికి విజయం వాళ్ళదే కదా. అనుకున్నది సాధించారు" అన్నాడు.
ఆమె తల విదిలిస్తూ "ఇంకేమీ ఆలోచించే స్థితిలో లేదు మెదడు. గత ఇరవై నాలుగ్గంటలూ నిద్రలేదు. రండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను" అంది.
ఇద్దరూ బయటకొచ్చారు.
బయట జనం ఆమెను చుట్టుముట్టారు. రకరకాల ప్రశ్నలు.
"పిల్లల్ని ఎప్పుడొదుల్తారు?"
"వాళ్ళ దయా దాక్షిణ్యాలమీద వూరుకోవాల్సిందేనా?"
"కొత్త ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చేవరకూ మేము మా పిల్లల్ని చూడలేమా?"
పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేక అవస్థపడుతున్నారు. ఆమె అతికష్టంమీద కారు బయటకు తీసింది. అతడు తన అడ్రసు చెప్పాడు.
ఆమె డ్రైవ్ చేస్తూ అడిగింది- "మీరేం చదువుకున్నారు?"
అతడు చెప్పాడు. "నాన్నగారు చిన్నప్పుడే పోయారు. అమ్మకి నేనంటే వల్లమాలిన ప్రేమ. దాంతో ఆడింది ఆట. పాడింది పాట. ఈ నాటకాల పిచ్చి వుంది చూశారూ! ఇది ఆడపిల్ల ప్రేమలాటిది. దూరంగా వున్నంతసేపూ కవ్విస్తూంది. అడుగు లోపలికి పెట్టామా- రంగస్థలానికి తాళికట్టేవరకూ వదిలిపెట్టదు".
ప్రవల్లిక నవ్వింది.
కారు ట్రాఫిక్ లోకి వచ్చింది. అటూ ఇటూ కార్లు వేగంగా వెళుతున్నాయి. హారన్ శబ్దాలు చెవులు గింగిర్లెత్తిస్తున్నాయి.
ఆమె నవ్వుతూనే అంది- "మీ హాబీ ఆడపిల్ల ప్రేమలాటిదయితే మా ఉద్యోగం మగవాడి ప్రేమలాటిది. దూరంగా వున్నంతసేపూ టెమ్ట్ చేస్తుంది. లోపలికి వెళ్ళాక ఎప్పుడు బయటకు పారిపోదామా అనిపిస్తుంది."
"ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద ఉద్యోగం చేస్తూ అలా అంటారేమిటి? మీకీ ఉద్యోగం ఇష్టంలేదా?"