టిఫెన్ బాక్స్ లో వున్నవి బర్ఫీలే. వాటిలో ఒకే ఒక బర్ఫీ మాత్రం అదే రంగు అదే ఆకారంతో చేసిన ప్లాస్టిక్ ది. దానిలో అతి ముఖ్యమైన వార్త పొందుపర్చి వుంది. ఏదైతే బైటపడకూడదో అది బైటపడింది. ఆ బర్ఫీయే ఇన్ స్పెక్టర్ కళ్ళబడింది. అతని జేబులోకి వెళ్ళిందీనూ.
చేజారి పోకూడనిదే చేజారి పోయిందని ఆ నిమిషాన అవంతికి తెలియదు.అది తినే బర్ఫీ కాదని ఇన్ స్పెక్టర్ కి తెలియదు.
వేగంగా నడుస్తూ అటే వస్తున్న ఇన్ స్పెక్టర్ ని చూసి చంద్రాన్ని వుతుకుడు కార్యక్రమంలో వున్న జనం పక్కకు తొలిగారు.
ఇన్ స్పెక్టర్ దగ్గరకు వచ్చాడు.
చంద్ర ఇన్ స్పెక్టర్ ని చూస్తూనే "నాకే పాపమూ తెలియదు" అనబోయాడు. మాట గొంతులోనే ఆగిపోవటంతో చేతులెత్తి దండం పెట్టాడు.
"ఏమైంది!" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
రెండు ముక్కల్లో జరిగింది చెప్పారు అక్కడున్న వాళ్ళు.
చంద్ర నోటి పక్కనుంచి కారుతున్న రక్తాన్ని చొక్కాతో తుడుచుకున్నాడు. ఏదైనా చెపుదామన్నా కంఠం పెగలటంలేదు. మనసారా ఏడవాలనిపిస్తున్నది.
"ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ వ్యక్తికి మీరే శిక్ష విధిస్తే మేమెందుకు?" ఇన్ స్పెక్టర్ గంభీరంగా అడిగాడు.
ఎవరి నోట్లోంచి మాట రాలేదు.
"ఇతనిని ఎవరెవరు కొట్టారు?" ఇన్ స్పెక్టర్ కరకుగా అడిగాడు.
నేను కొట్టానని చెపుతారా! పక్కవాళ్ళ మీదకు తోయగలరా! ఎవరికీ వారే గొణిగారు కొందరు చల్లగా జారుకునే ప్రయత్నంలో పడ్డారు.
"ఇతన్ని ఎవరెవరు కొట్టారో వాళ్ళంతా నాతోపాటు పోలీసు స్టేషన్ కి రావాల్సి వుంటుంది."
"కొట్టింది ఎవరో నేను చూడలేదు. ఇక్కడ ఏదో గోల జరుగుతుంటే వచ్చాను" కాస్త మార్పుగా అందరూ అదే చెప్పారు. వాళ్ళని ఇన్ స్పెక్టర్ రెండు బూతులు తిట్టాడు. చంద్ర చెప్పేది వినిపించుకోకుండా దెబ్బలవల్ల కుంటుతూ నడుస్తున్న చంద్రాన్ని తన వెనుకనే రమ్మని స్టేషన్ కి బైటికి వచ్చాడు.
ఆటోని పిలిచాడు ఇన్ స్పెక్టర్.
"సార్!" చంద్ర ఏదో చెప్పబోయాడు.
"స్టుపిడ్, నోరు మూసుకొని ఆటో ఎక్కు. ఇదేమిటో చూశావుగా! దీనికి పని కల్పిస్తే షేపులు మారిపోతాయి. ఆ...." ఇన్ స్పెక్టర్ లాఠీ కర్ర గాలిలో ఆడిస్తూ గాండ్రించాడు.
"నీవు న్యాయాన్ని కోరుతున్నావా! అయితే న్యాయస్థానానికి వెళ్ళకు. నీవు ఘోరమైన నేరం చేశావా! అయితే నీవు వెళ్ళి సాయం కోరవలసింది పోలీసులని వాళ్ళే నిన్ను రక్షిస్తారు" ఇలాంటి గిమిక్స్ ఇందర్ నవ్వుతూ వినిపిస్తుంటాడు.
ఆటో పక్క రోడ్డుకి తిరగంగానే "పోలీస్ స్టేషనుకి తరువాత ముందు ఒకరింటికి వెళ్ళాలి, ఆ విషయం మర్చేపోయాను అక్కడికి పోనియ్యి," అంటూ ఆ అడ్రస్ చెప్పాడు ఇన్ స్పెక్టర్.
ఆటో అతను 'అలాగే సాబ్' అన్నాడు గేరు మారుస్తూ.
చంద్ర గాబరాగా ఏదో చెప్పబోయాడు.
"చుప్ రహో, నీవు చెప్పవలసింది తర్వాత చెపుదువుగానీ పెదవి కదిపావో ముప్పై రెండు పళ్ళు రాలుతాయి, ప్రతివాడు నేరం చేయటం నేరం బైట పడంగానే నాకే పాపం తెలియదని గోలుగోలున ఏడవటం. తాటవల్చి మరీ వుతకాలి. డొక్కచీల్చి దబ్బలంతో కుట్టాలి. అంట కత్తెరగాళ్ళు. ప్రతి వెధవకీ నవ్వులాట అయింది. పోలీసు డిపార్ట్ మెంట్ అంటే...."
ఇన్ స్పెక్టర్ ఖాండ్రించి మధ్య మధ్య ఆటోలోంచి బైటికి ఉమ్మెస్తూ బండగొంతుకతో వాగుతున్నాడు.
చంద్ర ఆటోలో మూలకు వదిగి బిక్క చచ్చిపోయి కూర్చుండిపోయాడు. పది నిమిషాల తర్వాత ఆటో ఆ యింటి ముందు ఆగింది.
* * *
సాయంత్రం అయిదూ యిరవై.
అవంతి టాక్సీ దిగంగానే టాక్సీ ముందుకు దూసుకుపోయింది.
చిన్న బ్రీఫ్ కేస్ ని తీసుకొని లోపలికి వచ్చిన అవంతి ముందుగా తలుపుల వేపు చూసింది.
తలుపుకి తాళం బిగించి లేదు. తలుపులు ఓరగా వేసి వున్నాయి.
"నా కోసం ఎవరైనా వచ్చారా బక్కయ్యా!" అవంతి అక్కడే నిలబడి అడిగింది.
నోట్లో నాలుకలేని బక్కయ్యకు మూడు భాషలు వచ్చు. మాట్లాడలేని కారణాన అవసరం అయితే ఏదో ఒక భాషలో రాసి చూపిస్తుంటాడు. తక్కువ అక్షరాలు గనుక అయితే అరచేతిలో వేలుపెట్టి రాస్తాడు. రాసే తీరుని బట్టి అర్ధం అవుతుంది. ఏ అవసరం లేకపోతే తల వూపుతాడు.
అవంతి అడగంగానే బక్కయ్య ఎడం అరచేయి చాచి కుడిచేతి వేలితో ఒక అక్షరం మీద మరో అక్షరం చకచక రాశాడు.
అవంతి వేగంగా చదివింది. సరే అంది చదవటం పూర్తికాగానే వెంటనే తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళింది.