"నోర్ముయ్! మంచి ఏదో చెడు ఏదో నాకు తెలుసు. ఇక రమణ విషయం మరిచిపో. కృతఘ్నుడు వాడు. మనం ఎంత వాడిని ఎంత చేశాం! ఆ విశ్వాసమైనా లేదు వెధవకి. ఇల్లు కట్టుకుని చేరేప్పుడు మనల్ని పిలిచాడా? పొలం కొన్నప్పుడు మనల్ని సంప్రదించాడా? అలాంటి వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయమంటావా?"
"ఎవరు కృతఘ్నులు? మనమేం చేశాం అతనికి? అతనే చేశాడు మనకు. నాన్న చనిపోయాక అతని తండ్రీ, ఆ తండ్రి పోయాక అతనూ చొరవతీసుకుని తమదిగా భావించి కృషిచేసి వుండక పోయివుంటే ఈ సంసారం కుక్కలపాలూ నక్కలపాలూ అయ్యేది. అలాంటి వాడిని బయటికి సాగనంపాం మనం. వెళ్ళేప్పుడు ఏమిచ్చావ్? ముష్టి పది వేలు ...
"ఆ రోజు కుప్పలు తగలబడి పోతున్నప్పుడు అతనే దూకి ఆర్పకపోయివుంటే ఒక్క గింజ చేతికి వచ్చేది కాదు మనకు. ఆ మిగిలిన గింజల్లో నాలుగో వంతు ధర ఇచ్చినా ఆ పదివేలని మించిపోయేది.
కూలికి శరీరాన్ని అమ్ముకున్నాక ప్రాణాలకి తెగించి అయినా సేవచేయాలి. అది అతని ధర్మం."
"హు! ధర్మం? ఏం ధర్మం మనసిచ్చినవాడికి ఇచ్చి పెళ్ళి చేయటం ధర్మం కాదా?"
"ఇదిగో, విశాలా ధర్మపన్నాలు చెప్పద్దునాకు. నీకు మునసబుగారి అబ్బాయి నచ్చకుంటే విజయపురి అబ్బాయి సంబంధం చూస్తాను. అంతే."
విశాల తిరిగి సమాధానం చెప్పేలోగా "విశాలా! ఇక నోర్మూసుకో" అని కసిరింది మాణిక్యమ్మ.
తర్వాత దసరా ముహూర్తాల్లో విజయపురి రామభద్రయ్యగారి అబ్బాయి వేణుకి విశాలను ఇచ్చి పెళ్ళిచేశారు.
పెళ్ళి జరిగినన్ని రోజులూ విశాల ముఖాన కళాకాంతులు లేవు.
పెళ్ళికి రామలక్ష్మి కానీ, రమణ కానీ రాలేదు.
'వెధవ! టెక్కు మీరాడు. వెళ్ళి బొట్టూ కాటుకా పెట్టి పిలిస్తేకానీ రాకూడదు కాబోలు. ఈనాడింత వాడయ్యాడంటే అది మా చలువ కాదా? అనుకుంది కసిగా మాణిక్యమ్మ.
సరిగా విశాల వివాహం వేళలో పొలానికి నీళ్ళు పెడుతూ ఈ పైరు పచ్చలాగే విశాల జీవితమూ పచ్చ పచ్చగా ఉండాలని, ఆశీర్వదించాడు మనస్పూర్తిగా రమణ.
7
మూడేళ్ళు గడిచిపోయాయి.
ఈ మూడేళ్ళలో గోపీ ఇంటర్ పాసయ్యాడు. రమణ తన పొలంపై అప్పుతీర్చాడు.
ఆ జూన్ నెలలో డబ్బు సర్దుబాటు చేసుకొని రిజిస్ట్రేషన్ కి వెళ్ళాలని తయారవుతున్నాడు రమణ.
ఒక రోజు అకస్మాత్తుగా వంట ఇంట్లో మజ్జిగ చిలుకుతున్న రామలక్ష్మి అలాగే పడిపోయింది. బయట కూర్చుని మాట్లాడుకుంటున్న రమణ, గోపీ ఆ శబ్దం విని, గబగబా ఇంట్లోకి వెళ్ళారు.
వాళ్ళు వెళ్ళేసరికి మజ్జిగ కుండ ముందు విరుచుకు పడిపోయింది ఆమె.
"అమ్మా! అని కేక వేశారిద్దరూ.
కానీ, వాళ్ళ కేక వినిపించనంత సుదూరాలకి పయనిస్తున్న రామలక్ష్మికి ఆ కేక వినిపించలేదు. చేతులపై ఎత్తుకుని బయటికి వచ్చాడు రమణ. గడప దాటి మంచం వేపు నడుస్తున్న రమణ చేతిలో అలాగే తలవాల్చేసింది ఆమె.
"అమ్మా!" అని భోరుమన్నాడు రమణ.
ప్రపంచంలో ఏ తల్లీ ఇంతవరకూ కన్నకొడుకు రోదన ధ్వనులకి తిరిగి వచ్చిన దృష్టాంతం లేదు. రామలక్ష్మి దీనికి మించింది కాదు.
కొడుకులిద్దర్నీ దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోయిందామె.
* * *
పదమూడు రోజులు కర్మ ముగించుకుని వస్తున్న రమణకి మరో మర్మఘాతమైన దెబ్బ తగిలింది.
విశాల భర్త ఏక్సిడెంటులో పోయాడని తెలిసి ఆఘమేఘాల మీద వెళుతున్నాడు చంద్రం. అతన్ని వెళ్ళి ఓదార్చాలనిపించింది రమణకి. కానీ, అతనికా అవకాశం ఇవ్వకుండా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు చంద్రం.
ఛెళ్ళున కొరడాతో ముఖంపై బాదినట్లయిందతనికి.
పాలిపోయిన ముఖంతో ఇంటికి చేరాడు రమణ, గోపీ అనుసరించాడు అన్నని.
తల్లి మరణం, విశాల వైధవ్యం రమణని చాలా బాధించాయి.
పక్షం రోజులు గడిచిపోయాయి.
మునసబు పదేపదే పోరుతూ ఉండటంతో ఓ రోజు రిజిస్ట్రేషన్ కి వెళ్ళాడు రమణ. రిజిస్ట్రేషన్ ముగించుకుని తిరిగి వస్తున్న రమణకి బస్సుదిగి, జట్కాలో ఇంటికి వస్తున్న విశాల కనిపించింది.
'నిండా మూడేళ్ళ వైవాహిక జీవితంలో ఆవిడ సాధించిందీ, సంపాదించిందీ ఏమీలేదు. భర్తతో మూడేళ్ళు గడిపి వచ్చింది. అంతే! అదో తీయనయిన మధుర స్మృతి.
ఇక విశాలకి ఆ స్మృతులే గతి "అనుకున్నాడు రమణ."
అతని మనస్సులో క్షణం పాటు ఓ ఆలోచన మెదిలింది. కానీ, నిరాశగా తనలో తనే నవ్వుకున్నాడు. 'ఆనాడే ఈ ముఖానికి దిక్కులేదు. ఇంకిప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అడగగలడు' అనుకున్నాడు.
తిరిగి కాలేజీలు తెరవటంతో గోపీ వెళ్ళి యూనివర్శిటీలో చేరాడు డిగ్రీ కోర్సులో. ఇంటర్ లో క్లాసు రావటంతో అతనికి సీటు సులభంగానే దొరికింది.
రమణ జీవితం మళ్ళీ గాడిలో పడింది.
* * *
మరో అయిదారు నెలలు గడిచిపోయాయి.
డిసెంబరు సెలవుల్లో ఇంటికి వచ్చాడు గోపీ.
రబీ పంట కోతలు ఇంకా బాగా కలియలేదు. అక్కడక్కడ చెదురుమదురుగా జరుగుతున్నాయి. రమణ పొలం ఇంకా బాగా ఆరకపోవటం వల్ల మరో వారం రోజులు ఆగి కోతలు ప్రారంభించవచ్చు అనుకుని యింటికి వచ్చాడు.
ఇంటికి వచ్చి తమ్ముడికి కాఫీ చేసి యిచ్చి, శీను భార్య రంగమ్మ పాలు తీసి ఇవ్వగా దాలిలో పెట్టి బయటికి వచ్చాడు.
సరిగ్గా అదే సమయానికి వచ్చాడు వెంకయ్య.
"ఇదిగో రమణా! ఆడదిక్కులేని సంసారం సంసారమే కాదు. నీవయినా ఆషామాషీగా తిరిగే రకం కాదు. అటు పొలం పనులు, ఇటు ఇంటిపనులు ఎలా చూసుకోగలవు? ఎప్పుడూ పచ్చడి మెతుకులు తిని తిని ఎలా అయిపోయావో చూడు" అన్నాడు ఆప్యాయంగా.
ఆయన ఆదరణకి పులకరించిపోయాడతను. ఈమధ్య తల్లి పోయాక అతని చెవులకి ఇంత తీయనైన పలుకే వినిపించలేదు.
తమ్ముడికని చేసిన కాఫీలో మిగిలినదానిలో మరిన్ని పాలు, పంచదార కలిపి తెచ్చి ఇచ్చాడు రమణ.
"ఆఁ ఇప్పుడు కాఫీ ఎందుకు? అసలే ఆడదిక్కు లేని సంసారం. ఊరికే శ్రమపడ్డావు" అన్నాడు వెంకయ్య.
"ఇందులో శ్రమ ఏమిటిలెండి? కాఫీ వేళకి వచ్చారు, ఇచ్చాము. అదే వేళతప్పి వస్తే ఇవ్వగలమా?" అన్నాడు గోపీ.
వెంకయ్య కాఫీ తాగేసి, "అందుకే మీ అన్నయ్యని త్వరగా పెళ్ళి చేసుకోమంటున్నానయ్యా, బాబూ!" అన్నాడు.
"తగిన సంబంధమయితే అభ్యంతరమేముంది?" అన్నాడు గోపీ.
"నా కూతుర్నివ్వాలనే వచ్చానయ్యా, గోపీ! అసలు ఈ పెళ్ళి ఎప్పుడో జరిగిపోయి ఉండవలసింది. చంద్రం పెళ్ళిలోనే ఈ పెళ్ళి జరిపెయ్యాలనుకున్నా కాలం కలిసి రాక ఆగిపోయింది. మా అమ్మాయికి తగిన సంబంధం రాలేదు. అయినా ఏం వయస్సు మించిపోయిందని తొందరపడాలన్నట్టుగా కూడా జరిగిపోయింది. ఈ మాఘంలో పెళ్ళి చేసెయ్యాలని నిశ్చయించుకున్నాం. మీరు ఊ అంటే అన్నీ సరిపోతాయి."
రమణ జవాబు చెప్పలేదు.
వెంకయ్యకి తెలియకుండా అన్నగారి ముఖం చూశాడు గోపీ.
ఆ ముఖంలో ఏ భావం చదివాడో ఏమో "చూడండి. రేపు నేనూ- మా అన్నయ్యా మీ యింటికి వస్తాం తగిన పెద్దల్ని పిలిపించండి" అన్నాడు గోపీ.