"నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను"
"చాలా పాత డైలాగ్. అరిగిపోయిన రికార్డులోని పదం" సుధకు అతని మాటలు కంకరరాళ్ళలా గుండెకు తగిలాయి.
ఆ బాధ ముఖంలో స్పష్టంగా కనిపించింది.
గౌతమ్ తను చాలా మొరటుగా మాట్లాడినందుకు తనలో తనే సిగ్గుపడ్డాడు.
సుధ ముఖం, చెవులూ ఎర్రబడ్డాయి. ముఖంలోకి ఏదో మొండితనం తెచ్చి పెట్టుకున్నట్టు కనిపించింది.
"పాత డైలాగే అయినా అది నిత్యనూతన,మైంది. ఏం రేణుక నోటివెంటవస్తే ఆ డైలాగ్ సరికొత్తగా విన్పిస్తుందా?"
"లేదు ఎవరి నోట వెంటవచ్చినా అది నాకు పాత డైలాగ్ లాగే ఉంటుంది"
"నువ్వు హిపోక్రాటివి!"
గౌతమ్ సుధ ముఖంలోకి చూశాడు.
"సారీ! నువ్వు అన్నాను"
"పర్వాలేదులే. ధనవంతులు బీదవాళ్ళను ఎలాగయినా పిలవవచ్చును."
"అదిగో మళ్ళీ ధనం అంటున్నారు! మీ మాటల్లోనే బీదతనం అంటే మీకు ఎంత అసహ్యమో తెలుస్తుంది. బాగా డబ్బు సంపాదించాలన్న కోర్కె కూడా కనిపిస్తుంది. మీకు డబ్బు కావాలి. అది నాదగ్గర పుష్కలంగా ఉంది. నాకు మీరు కావాలి."
గౌతమ్ అదోలా చూస్తూ "ఊ చెప్పండి! ఆగిపోయారేం?"
"మీ హౌస్ సర్జెన్సీ పూర్తికాబోతుంది. ఆ తర్వాత మీకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు"
"అవును!"
"డిస్పెన్సరీ ఓపెన్ చెయ్యడం ప్రాక్టీసు పెట్టుకోవడం మీకు సాధ్యంకాదు."
"అదీ నిజమే!"
"అందుకే నన్ను పెళ్ళిచేసుకోండి"
"నాకు అంత అదృష్టమా?"
"మీరు మాట్లాడే ధోరణిలో వ్యంగ్యం స్పురిస్తున్నది. కాని నేను వాస్తవం చెబుతున్నాను. కాళ్ళ దగ్గరకు వచ్చిన సిరిని తన్నెయ్యడం తెలివైనవాళ్ళ పనికాదు. బతకటం చేతకాని దద్దమ్మలు చేసేపని"
"ఇంకా?"
"పొట్టకోసం ఇంత శ్రమ పడనక్కర్లేదు. రాజకుమారుడిలా బతకొచ్చును. ఆ మాటకొస్తే మీరు ఉద్యోగమే కాదు...ప్రాక్టీసు కూడా చెయ్యనక్కర్లేదు. ఫర్ దర్ స్టడీస్- చెయ్యాలనుకుంటే ఫారెన్ కూడా వెళ్ళొచ్చును"
"మరి నువ్వు కూడా వస్తావా?"
"ఎగతాళి చేస్తున్నావా? నన్ను వెక్కిరిస్తున్నావా!" సుధ రోషంగా అన్నది.
"నేను కాదు ఎగతాళి చేస్తున్నది. మీరు. నా బీదతనాన్ని వేలెత్తి చూపించి వెక్కిరిస్తున్నారు. ఆ అధికారం మీకు నేను ఇవ్వలేదు. నేను మీ దగ్గరకు వచ్చి యాచించలేదు. డబ్బున్న వాళ్ళకు చూస్తే చులకనభావం కలుగుతుందనేది నాకు తెలియని విషయంకాదు. నేను దరిద్రుణ్ణే కావచ్చును. కాని ఆ దారిద్ర్యం నా మనసుకు లేదు. ఆ దారిద్ర్యం నా వ్యక్తిత్వాన్ని కృంగదీయలేదు. బీదతనానికి నేను ఏనాడూ భయపడి డబ్బున్నవాళ్ళ అండను పొందడానికి ప్రయత్నించలేదు"
సుధ గాభరాగా గౌతమ్ ముఖంలోకి చూసింది.
అతను ఉద్రేకంతో ఊగిపడుతున్నాడు.
"నాకు రెండు చేతులు ఉన్నాయ్. శరీరంలో బలం ఉంది. నాలో ఆత్మవిశ్వాసం ఉంది"
సుధ తడబాతుగా చూసింది.
"సారీ గౌతమ్! మిమ్మల్ని బాధపెడితే క్షమించండి. నన్ను అర్థం చేసుకోండి. మీ సుఖంకోసమే నేను అలా అన్నాను"
"మీ త్యాగానికి నా థ్యాంక్స్! కాని ఆ త్యాగం నాకు అక్కర్లేదు"
"ప్లీజ్! నన్ను అర్థం చేసుకోండి"
"అర్థం చేసుకున్నాను. ఈ బీదవాణ్ణి మర్చిపోండి. నేను మీకు తగినవాణ్ణికాదు. ఇక వస్తాను." అంటూ గిర్రున వెనక్కు తిరిగాడు.
"గౌతమ్!" పరాజయం ఆక్రోశించింది.
విజయం ఆగింది.
వెనక్కు తిరిగి చూసింది.
జాలిగా చూసింది.
"గౌతమ్ ఒక్కమాట!" సుధ దగ్గరగా వచ్చింది.
"చెప్పండి"
"ఒక్క విషయం అడుగుతాను. నిజం చెబుతారా?"
"అబద్ధం చెప్పాల్సిన అవసరం, ముఖ్యంగా మీ దగ్గర నాకు లేదు అడగండి"
"నాలో ఏం తక్కువైంది! నాలో లేని సుగుణాన్ని రేణుకలో చూశారు?"
గౌతమ్ సుధ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు.
"నాకంటే ఎర్రతోలు ఉన్న మాట నిజమే! అదేనా మీ ఆకర్షణకు కారణం?"
"కాదు"
"మరి ఏమిటి?"
"మీలో లేనిసంస్కారం ఆమెలో ఉన్నది"
"ఏమిటా సంస్కారం"
"ఎదుటి వారి మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి మనలో కూడా మంచితనం ఉండాలి. అలాగే ఇతరుల్లోని సంస్కారాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనలో సంస్కారం ఉండాలి. ఆమెకు గర్వం లేదు మీలాగ!"
"గర్వమా? ఏం చూసుకొని?"
"ఆమెకు మీకు లేని అందం ఉన్నది. మీకు లేని తెలివితేటలు ఉన్నాయ్. బ్రిలియంట్ స్టూడెంటు"
"ఇంకా?"
"మీకు డబ్బు గర్వం. ఆ డబ్బుతో ప్రపంచంలో దేన్నయినా కొనగలననే అహం ఉన్నది. అంతవరకు పర్వాలేదు. మనుషుల్ని, మనసుల్నీ కూడా కొనగలను అనుకుంటున్నారు. అది పొరపాటు. అది మీ సంస్కారానికి నిదర్శనం!"
"గౌతమ్!" దాదాపు అరిచినట్టే అన్నది.