సురేష్ ఉలిక్కిపడ్డాడు.
"ఎక్కడ?"
"నువ్వు రాకముందు బార్లో కూర్చున్నాడు మరికొన్ని నక్కలతో పాటు - గుర్తుపట్టి టేబుల్ దగ్గర కెళ్ళాను. నన్ను చూసి ఏం చేశాడో తెలుసా?" పారిపోయాడు.
సురేష్ కి డార్క్ డెవిల్ మీద జాలేసింది.
"ఒరేయ్! నువ్వింక ఆ విషయం మర్చిపోవటం మంచిది"
"నేను మర్చిపోయాను. ఆ బాస్టర్డ్ కనబడి మళ్ళీ గుర్తు చేశాడు. అటో- ఏయ్ అటో!" ఆటోని పిలిచాడతను.
ఇద్దరూ ఆటోలో కూర్చున్నాడు. "మీ ఇల్లెక్కడో డ్రైవర్ కి చెప్పు ముందు."
డార్క్ డెవిల్ పాట మొదలుపెట్టాడు.
"మీ హసీనా జుల్ఫోంవాలీ జానే జహా"
"హాసీనా ఎక్కడుందిప్పుడు?"
డార్క్ డెవిల్ పాట ఆగిపోయింది సడెన్ గా. చటుక్కున సురేష్ చొక్కా పట్టుకున్నాడు.
"హాసీనా సంగతి ఎందుకు గుర్తు చేశావిప్పుడు?"
"నాకు గుర్తుకొచ్చింది."
"నువ్వెవడివి నా హాసీనాను గుర్తు తెచ్చుకోవడానికి?"
"నీ ఫ్రెండ్ ని ."
డార్క్ డెవిల్ అతని చొక్కా వదిలేశాడు.
"వద్దురా, ఆ రోజుల్ని ముందుకి లాగొద్దు! అలానే అడుగున పడి వుండనీ" అతని కళ్ళల్లో నీళ్ళు మెరిసినాయ్.
సురేష్ కి దుఃఖం ఆగలేదు.
"మై పూర్ డార్క్ డెవిల్ " అన్నాడు అతని భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ.
ఎంత నరకం అనుభవిస్తున్నాడు వాడు?
మేడల్లో వుంటూ , కార్లలో తిరుగుతూ జీవితం గడిపినవాడు బతుకు తెరవు కోసం కేబరే షాల్లో గిటార్ వాయిస్తూ , "నా" అనేవాళ్ళు లేకుండా.
ఇదంతా కేవలం అతని పెద్దనాన్న చేసిన మోసం! డార్క్ డెవిల్ గాడి తండ్రి సడెన్ గా హార్ట్ ఎటాక్ తో పోయినప్పుడు రాత్రికి రాత్రే ఎకౌంట్లు మార్చి, లాభాల్ని నష్టాలుగా చూసి, ఆస్తుల్ని అప్పులుగా చేసి కట్టుబట్టలతో డార్క్ డెవిల్ గాడినీ , వాళ్ళమ్మనూ బయటగ్గెంటితే - ఎవడి తరం ఈ దారుణం భరించడం?
అందుకే ఆ దారుణాన్ని మర్చిపోడానికే ప్రయత్నిస్తున్నాడు వాడు.
పూర్తిగా మర్చిపోడానికి.
అటో ఆగింది.
"గుడ్ నైట్."
అన్నాడు సురేష్ దిగి.
అటో వెళ్ళిపోయింది.
తులసి నిద్రలోనే దూరంగా నెట్టిందతనిని.
"తాగావ్ కదూ?"
"అవును"
"డార్క్ డెవిల్ దగ్గర కెళ్ళావా?"'
"ఊ"
కొద్ది క్షణాలు నిశ్శబ్ద యుద్ధం జరిగింది.
"నా నిద్ర చెడగొట్టకు" అతని చేతులు తీసివేస్తూ అంది.
"నేననేది అదే - నివ్విలా పోట్లాడుతుంటే తెల్లారిపోతుంది. నీ నిద్రంతా పాడయి...."
"సురేష్" కోపంగా అందామె.
"హ. నిన్నెవడు చేసుకుంటాడో గాని అంటార్కిటికా జిమ్ లో చేరిపోతాడు."
తులసికి నవ్వాగలేదు.
"ఎందుకు?"
"నీకంటే "ఐస్" నయమని."
తులసికి తెలిసిపోతుంది - తనింక రేసిస్ట్ చేయలేదు.
"సురేష్ ! ఇంకా నిద్ర పోనీ లేకపోతె ఉదయం ఆఫీసులో ......."
తలుపు కొట్టిన చప్పుడు.
"పాల ప్యాకేట్టేమో?"
తులసి అయిదు నిమిషాల తర్వాత తలుపు ఓరగా తీసి పాల ప్యాకెట్ కోసం చేయి బయటకు జాపింది.
గంగాభవాని ఆమె చేతిని పట్టుకుని గిల్లింది నవ్వుతూ.
"తోమ్మిదయినా లేవకపోయే సరికి ఇంట్లో వున్నారా, లేదాని....."
మత్తు వదిలిపోయింది ఇద్దరికీ.
"మైగాడ్! తొమ్మిదా?" ఒక్క దూకు దూకాడు సురేష్. తులసి లోపలికి పరుగెత్తింది. గంగాభవాని లోపలికొచ్చేసింది నవ్వుతూ.
"ఏప్రిల్ ఫూల్స్! టైమ్ అయిదే అయింది."
* * * *
తులసి రడీ అయిపొయింది.
"ఇదిగో! నువ్ తెచ్చిన బుద్దుడి బొమ్మ బాగానే వుంది గానీ ఇక్కడ ఈ చెవి ముక్కు విరిగింది చూడు."
సురేష్ అందుకుని చూశాడు . "మోసం! అమాయకులయిన కస్టమర్లని ఇలాగా మోసం చేసేది?"
"రిటన్ చేస్తావా?"
"ఎందుకులే ఇంకోటిస్తాను నెక్ష్ట్ యానివర్సరీకి"
"సాయంత్రం వస్తావా ఆఫీస్ కి?" అద్దం ముందు నిలబడి పైట సరిచేసుకుంటూ అడిగింది.
"ఓ"
"బై!" వెళ్ళిపోయింది.
* * * *
లైబ్రరియన్ సురేష్ ని చూస్తూనే విష్ చేసింది.
"నిన్న రాలేదేం?"
"నిన్న హాలిడే"
"అదేమిటి ? మీకు ఉద్యోగం రాలేదన్నారుగా"
"నిరుద్యోగులు హాలిడే తీసుకోకుడదని వుందా ఎక్కడయినా?"
"నిన్నటి పేపర్లు మీ కోసం సిద్దంగా ఉంచాను.'
అతను అరగంట సేపు పేపర్లతో గడిపాడు.
"చాలా థాంక్స్. మీ సహాయానికి ఇప్పుడే ఋణం తీర్చుకుంటాను. మీ చేయి ఏదీ?"
"మైగాడ్! మీకు జ్యోతిష్యం వచ్చా?"
జ్యోతిసామ్రాట్ వామన శాస్త్రి దగ్గర నేర్చుకున్నాను."
"అబ్బ!"
"చేయి చాపండి"
ఆమె చేయి చాపింది.
అతను ఆమె చేయి పట్టుకున్నాడు.
"వివాహమయ్యాక మీరు పైకి వెళ్తారు.'
"అంటే?"
"అంతవరకూ ఇలాగే కిందా మీదా పడక తప్పదు"
"అంటే అప్పటికి ఐ పి యస్ కి సెలక్ట్ అవుతానా?"
"మీరు......"
"అవును. ఎప్పటికయినా ఐ.పి.యస్ అవ్వాలని. నా డ్రీమ్ గర్ల్ ఎవరో తెలుసా?"
"ఎవరు?"
"డిల్లీలో వర్క్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ. ఏదో ఒక రోజు సాధిస్తాను. అమెలానే పోలీస్ ఆఫీసర్నవుతాను. అయినా మీ లెక్క ప్రకారం నా చేతిలో ఆ రేఖ వుందా లేదా చెప్పండి."
"ఉంది. ఇదిగో ఇదే పోలీస్ రేఖ లాక్ మాదిరిగా లావుగా వుంది చూడండి."
ఆమె నవ్వేసింది.
"ఆ సంగతలా వుండనీయండి. ఇవాళ మీ జీవితంలో ఓ అద్భుతమైన సంఘటన జరగబోతోంది.'
"రియల్లీ?"
"యా! ఒక అందాల సాహసవంతుడు మీకివాళ కనిపించి 'అలా హోటల్లో కాఫీ తాగుదామా?" అనడుగుతాడు. అలా అడిగినప్పుడు మీరు కాదనకండి. దాంతో మీ జీవితం ఓ శుభవంతమయిన మలుపు తిరుగుతుంది."
"సరే"
సురేష్ ధోరణి మారిపోయింది. క్రాఫ్ సరిచేసుకుని ఆమె వంక ఆనందంగా చూశాడు.
"అలా హోటల్లో కాఫీ తాగుదామా?"
ఆ అమ్మాయి నవ్వేసింది.
"ఆ అందాల సాహసవంతులు మీరేనా?"
"అవును"
"ఆయామ్ సారీ! నేను రాను"
"కానీ జోతిష్యం ప్రకారం మీరు రాననకూడదు."
"నాకు జ్యోతిష్యం మీద నమ్మకం లేదు. మీరు క్రియేట్ చేసిన వామనశాస్త్రి అనే జోతిష్య సామ్రాట్ ఈ భూ ప్రపంచంలో లేరని కూడా నాకు తెలుసు."
సురేష్ బయటకు నడిచాడు.
"మిస్టర్......"
వెనక్కు తిరిగి చూశాడు. ఆమె వెనుకే వస్తోంది."
"పదండి కాఫీ తాగుదాం"
* * * *
"మీ పేరేమిటి?" అడిగిందామె హోటల్ ప్యామిలీ రూమ్ లో కాఫీ తాగుతూ.
"అసలు పేరు సురేష్, నిక్ నేమ్ చాక్ పీస్"
ఆమెకు నవ్వాగలేదు. "చాక్ పీసెమిటి?"
"అయిదో క్లాస్ చదువుతుండగా మా సోషల్ స్టడీస్ మేడమ్ చాక్ పీస్ లు కాజేశాను. అందుకని ఆ పేరు సెటిలయిపోయింది.