Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 13

 

    "నా పేరు ప్రత్యూష"
    "నిక్ నేమ్?"
    "కొంగ" నవ్వాపుకుంటూ చెప్పింది.
    "ఎందుకనో నాకు తెలుసు"
    "చెప్పండి"
    "పొడుగు కాళ్ళేసుకుని కొంగలా నడిచి వుంటారు"
    "కాదు - మా స్కూల్ దగ్గరున్న చెరువులో కొంగ నిలబడి వుంటే పట్టుకోటానికని వెళ్ళి బురదలో కూరుకుపోయాను. చిన్నప్పటినుంచీ ఎడ్వంచర్స్ అంటే ఇష్టం నాకు."
    "బురదలో కూరుకుపోయి బెరుమని ఏడవటం ఎడ్వంచరా?"
    "నేనేం ఏడవలేదు"
    బేరార్ బిల్ ప్లేట్లో పెట్టి తెచ్చి వారి ముందుంచాడు.
    "మీరిక్కడే వుండండి. హోటల్ వెనక వైపు నుంచి దారేమైనా వుందేమో చూసోస్తాను."
    "ఎందుకు?"
    "బిల్లు కట్టకుండా సింహద్వారం నుంచి వెళ్ళటం బావుండదు కదా"
    "అందాల సాహసవంతులు బిల్లు కట్టలేరా?" తన బ్యాగ్ లోంచి డబ్బు తీసి ప్లేట్లో వుంచుతూ అందామె.
    "డబ్బుల్లేకెగా వేనుకదార్లు వెతికి సాహసాలు చేయటం."
    ఇద్దరూ బయటికొచ్చారు.
    "ఇంక మనం ఏదైనా గార్డెన్ లో కెళ్ళి పాటలు పాడదామా?"
    "అదేమిటి?"
    "మన సినిమాల్లో అలాగే జరుగుతుంది కదా! హీరో , హీరోయినూ కలుసుకుని రెండు డైలాగులు మాట్లాడుకోగానే పాటలోకి, డాన్స్ లోకి దిగిపోతారు.
    లైబ్రరీ దగ్గర కొచ్చారు మళ్ళీ.
    "నాకు మీతో ఇలా మాట్లాడుతుంటే బావుటుంది"
    "నాకు మాట్లాడకుండా వుంటే బావుంటుంది."
    ఆమె అతని వైపు అనుమానంగా చూసింది.
    "సి యూ టుమారో"
    "రేపు బ్యాంకులో ఇంటర్యు "
    "సి యు డే ఆప్టర్"
    "ఎల్లుండి మా ఇంట్లో వ్యూ"
    "అంటే"
    "మా గాళ్ ఫ్రెండ్ తాలుకూ వ్యూ"
    ఆమె నవ్వేసింది. "సిల్లీ"
    "చూసేవారికి"
    ఆమె వెళ్ళిపోయింది.
    టైమ్ చూసుకున్నాడు సురేష్. పదకొండు . బస్ స్టాండ్ కి నడిచాడు.

                                                       *    *    *    *

    నటాషా నిద్ర కళ్ళతో హోటల్ గది తలుపు తెరిచింది.
    "ఓ! నువ్వా" అంది కళ్ళు నులుముకుంటూ.
    "మరోసారి వస్తాను. లోపలేమో అభ్యంతరకర దృశ్యాలున్నాయి కదా!"
    ఆమె నిద్ర మత్తు వదిలిపోయింది. వెనక్కు తిరిగి చూసి "అభ్యంతకర దృశ్యాలేమున్నాయ్?" అంది ఆశ్చర్యంగా.
    "మరి నన్ను లోపలకు రానీయకపొతే."
    ఆమె అతని చేయి పట్టుకుని విసురుగా లోపలకు లాగి తలుపేసింది.
    ఆ ఫోర్స్ కి సోపాలో పడ్డాడు.
    కర్టెన్ వెనుక ఇంకో క్యాబరే అమ్మాయి నిద్ర పోతోంది.
    బాత్ రూంలో కెళ్ళి ముఖం కడుక్కుని వచ్చి ఎదురుగ్గా కూర్చుంది.
    "రాత్రంతా మన స్కూల్ రోజులే గుర్తుకు వచ్చాయి. నిద్రపట్టలేదు" అంది నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తుంటే నిజంగా ఆనాటి కళ్ళే గుర్తుకొస్తున్నాయి.
    "మళ్ళీ ఈ జన్మలో నిన్ను చూడగలనానుకోలేదు" అన్నాడు సురేష్.
    "నేనూ అంతే!"
    "ఒకవేళ చూసినా , నీ ఫోటో ఏ పేపర్లోనో నువ్వేదో ఘనకార్యం చేసినప్పుడు కనబడుతుందని అనుకున్నాను."
    నటాషా మీట నొక్కింది. మరుక్షణం బోయ్ వచ్చాడు.
    "రెండు కాఫీ తీసుకురా."
    "మా ఫాదర్ కి పెరాలిసిస్ వచ్చింది. దాంతో ఉద్యోగం పోయింది. నా కాలేజ్ ఎడ్యుకేషన్ ఆపి జాబ్ కోసం వెతకాల్సి వచ్చింది" ఎనిమిదేళ్ళ జీవిత చరిత్రను రెండు మాటల్లో చెప్పింది.
    "నీ సంగతేమిటి? ఎక్కడ జాబ్ చేస్తున్నావు?"
    "ఒకమ్మాయి దగ్గర."
    "అమ్మాయి దగ్గరేం జాబ్?"
    'అబ్బాయ్ జాబ్."
    నటాషా నవ్వింది. అతని  చేతిని తన చేతిలోకి తీసుకుని నిమిరింది.
    "ఇంకా పిచ్చి మాటలు మానలేదు కదూ?" అప్పుడూ యింతే........ఎప్పుడూ గుర్తుకోస్తూంటాయ్."
    సురేష్ నవ్వాడు. "వట్టి మాటలేనా? మిగతావన్నీ గుర్తుకోస్తాయా?"
    నటాషా అతని చేతిని గుండెలకు హత్తుకుంది.
    "ఎవ్విరి ధింగ్"
    సురేష్ లేచి ఆమె పెదాల మీద సుతారంగా ముద్దు పెట్టుకుని మళ్ళీ తన స్థానంలో కూర్చున్నాడు.
    "మీ పిన్ని ఒకామె వుండాలి కదా! ఎలా వుందామే? ఆమె అంటే నాకెంతో ఇష్టంగా వుండేది."
    "ఆమెను లేవదీసుకుపోయిన స్వాములవారి క్కూడా ఎంతో ఇష్టం మా పిన్నంటే"
    నటాషా ఉలిక్కిపడింది.
    "నిజంగానా?"
    "ఎస్ అప్పుడే మీరు బదిలీ అయి ఆ ఊర్నుంచి వెళ్ళిన కొద్ది రోజులకే.'
    కర్టెన్ వెనుక మంచం మీద పడుకున్న క్యాబరే అమ్మాయి పక్కకు తిరిగి తలగడను కౌగలించుకుని పడుకుంది మళ్ళీ.
    "మే అయ్ హెల్ప్ యూ మేడమ్" అన్నాడు సురేష్ ఆమె వంక చూస్తూ.
    నటాషా అతని తోడ మీద గిల్లింది.
    "తనకి హెల్ప్ చేసే వాలంటీర్లు చాలామంది వున్నారులే.'
    "మరి నీ సంగతేమిటి?" హౌ మెనీ వాలంటీర్స్?"
    "మెనీ!"
    "ఎవరయినా విజయం సాధించారా?"
    "పెళ్ళి అనేటప్పటికీ పారిపోతున్నారు."
    "వాటేబోట్ చమన్ లాల్?"
    "చమన్ లాల్ ఎవరు?"
    "చమన్ లాల్ కాకపోతే అగర్ వాల్. అగర్ వాల్ కాకపోతే చెట్టి యార్, ఎవరో కరు - మన సినిమాల్లో ఈ పెర్లేగా డ్యాన్సర్ ని వదిలి పెట్టకుండా వెంబడిస్తుంటారు."
    'అలాంటి వాళ్ళు కొంతమంది వున్నారు గానీ అల్ మనీ ట్రాన్స్ క్షన్స్! అయ్ డోంట్ లైకిట్."
    'అల్ రైట్! అయితే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను."
    "నీ కింకా పెళ్ళి కాలేదా?"
    "అఫీషియల్ గా అవలేదు. తులసి అనే ఆవిడా నన్ను వుంచుకుంది."
    నటాషా తో పాటు బెడ్ మీద నిద్రపోతున్న అమ్మాయి కూడా నవ్వేసింది.
    "మీరా అమ్మాయిని చేసుకుంటారా?"
    "ఇది ట్రయల్ పిరీడ్! నేను ఉపయోగపడతాననుకుంటే పెళ్ళి చేసుకుంటుంది. లేకపోతె వాపస్."
    "మరి నన్నెలా చెసుకుంటావ్?"
    "మాములుగానే వన్- టూ- త్రీ మారేజ్."
    నటాషా తుళ్ళి తుళ్ళి నవ్వసాగింది. ఒక్కసారి చిన్నప్పటి రోజుల్లోకి విసిరివేయబడింది.
    ఏడో క్లాసా! ఎనిమిదా? ఏమో గుర్తులేదు. సరుకు తోటల్లో ఆడుకునే టప్పుడు.
    వన్ - టూ- త్రీ ఎంత అద్భుతమయిన తమాషాలు? ఎన్ని చిలిపి చేష్టలు?
    "నీ కింకా అవన్నీ గుర్తున్నాయి కదూ?" అతి కష్టం మీద నవ్వాపుకుంటూ అడిగింది.
    "గుండెల్లో సిమెంట్ అయిపోయినాయ్."
    నటాషా లేచి తన బట్టలు తీసుకుని బాత్ రూమ్ వేపు నడిచింది.
    "రెండు నిమిషాలు కూర్చో!"
    సురేష్ కూడా లేచి ఆమె వెనకే బాత్ రూమ్ లోకి నడవబోయాడు.
    బాత్ రూమ్ డోర్ కి అడ్డంగా నిలబడిందామె.
    "నువ్వెక్కడికి?"
    "రెండు నిమిషాలు బాత్ రూమ్ లో కుర్చోమన్నావ్ కదా?"
    నటాషా ఓ చేత్తో టాప్ వాటర్ అందుకుని అతని ముఖం మీద చిలికి తలుపు మూసివేసింది.
    సురేష్ గది కిటికీ దగ్గరకు నడిచి కర్టెన్ పక్కకు లాగాడు.
    మండిపోతున్న ఎండ నగరమంతా అలుముకుపోయి తగలబడుతున్నట్లుంది.
    రెండో బెడ్ మీద యువతి తలగడతో పాటే మళ్ళీ అటు తిరిగి పడుకుంటూ.
    కళ్ళు సగం తెరచి సురేష్ ని చూసి నైట్ గౌను సర్దుకోబోయింది.
    "అలాగే వుండనీయండి! చాలా అందంగా వున్నారు" అన్నాడు.

 Previous Page Next Page