"అవును! మనమంతా పొదుపు చెయ్యాలి!" అంది రాజేశ్వరి.
"పొదుపంటే ఖర్చులోనే కాదు- అన్నిటిలోనూ పొదుపు చేయాలి" అంది సావిత్రమ్మగారు.
ఆ మర్నాటి నుంచే అన్ని విషయాల్లోనూ పొడుపు చెయ్యాలని అందరూ నిర్ణయించేశారు. దుబారా విషయంలో ఆడాళ్ళకంటే మగాళ్ళే ఎక్కువ చొరవ తీసుకోవాలని వాళ్ళనేసరికి మేము కొంచెం ఇబ్బందిలో పడ్డాం.
"రోజుకి ఓ సిగరెట్ పెట్టె కాల్చేవాళ్ళు సగం పెట్టే కాల్చాలి" అంది శ్రీవల్లి.
వాళ్ళాయనను సిగరెట్లు మాన్పించడానికి అంతకంటే మరో ఉపాయం తట్టలేదామెకి. సరేనన్నారు చాలామంది.
"సుపారీ పొట్లాలు కూడా తగ్గించాలి" అన్నారు వారు
అదీ ఒప్పుకున్నాం.
సినిమాలు కూడా వారానికొకటల్లా నెలకు రెండుకి తగ్గించాలి.
ఎక్కువ పొదుపు చేసినవారికి కాలనీ కమిటీ తరపున 'పొదుపురత్న" అవార్డు కూడా ఇవ్వాలని రంగారెడ్డి సూచించాడు.
మర్నాటి నుంచీ పొదుపు డీల్ ప్రారంభమయింది.
"పొదుపు చేసిన ప్రతి నీటిచుక్కా ప్రగతికి సోపానం" అన్న అంశంతో రోజుని ప్రారంభించాలని అందరం అనుకోవడం చేత నేను రోజూ బక్కెట్ నీళ్ళు స్నానానికి వాడేవాడినల్లా అరా బక్కెట్ కి తగ్గించి స్నానం చేయాలని నిర్ణయించుకొని బకెట్ తీసుకొని బాత్ రూమ్ కి చేరుకున్నాను. తీరా చూస్తే పంపులో నీళ్ళు రావటం లేదు.
"వేసవికాలం మొదలయిందికదా! బహుశా నీళ్ళు మామూలు సప్లయ్ వుండదు కాబోలండీ" అంది మా ఆవిడ.
"మరిప్పుడెలా?"
"ఇవాళింకేం స్నానం చేస్తారూ- సాయంత్రం చేద్దురుగాన్లెండి! ఆఫీసుకి టైమవుతోంది వెళ్ళండి" అంది.
గత్యంతరం లేక స్నానం లేకుండా ముఖం కడుక్కుని డ్రస్ చేసుకొని బయటకొచ్చాను.
"ఇవాళ నీళ్ళు ఆదా చేయటానికి ఛాన్స్ దొరకలేదు" అన్నాడు రంగారెడ్డి.
పోన్లే రేపట్నుంచి చేద్దాం" అన్నాడు శాయిరామ్.
"ఏమిటి? ఎవరూ స్కూటర్లు లేకుండా వచ్చారా?" అడిగాడు జనార్ధన్ మేము రావటం చూసి.
మేము విజయగర్వంతో నవ్వాం.
"పిచ్చివాడా! ఇంధనాన్ని ఆదా చేయటం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయండి! అని మన దూరదర్శన్ చెప్పటం లేదూ?? ఈ పని మనం తేలికగా చేయగలం! కనీసం మనం తేలిగ్గా చేయగలిగిన పనులన్నా చేయకపోతే ఎలా?" అన్నాడు రంగారెడ్డి.
"నిజమే! నేనూ ఇవాళ్టినుంచి మోటార్ సైకిల్ బయటకు తీయను"
అందరూ బస్టాప్ లో నిలబడ్డారు.
బస్ లు వరుసగా వస్తున్నయ్ గానీ అన్నింట్లోనూ జనం పుట్ బోర్డ్ బయట ఓ మీటర్ డయామీటర్ లో వేలాడుతున్నారు.
చివరకు ఆ ఇరుకులోనే దూరి నిలబడ్డాం.
బస్ గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. కొంచెం రోడ్ ఎత్తు వచ్చినచోట మాత్రం ఓసారి ఎత్తు ఎక్కలేక వెనుకకు డొల్లి పోయింది గానీ డ్రయివర్ మళ్ళీ గేరు మార్చి ముందుకు నడిపాడు.
ప్రతి స్టేజీలోనూ లోపల్నుంచి దిగాలంటే ఐదు నిమిషాలు, ఎక్కాలంటే పది నిముషాలు పడుతోంది.
చివరకు మేము ఆఫీసు చేరుకునేసరికి పదకొండయింది.
ఆ పూటకి లీవ్ లెటర్ రాయించుకున్నాడు మా సూపర్నెంట్.
"అనవసరంగా లీవ్ తీసుకున్నాం! లీవ్ దుబారా ఐపోయింది" అన్నాడు రంగారెడ్డి.
"అంతేకాదు! అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి లీవ్ దొరక్కుండాపోతుంది" అన్నాడు శాయిరామ్.
"థూ! నీ యవ్వ బస్ లు! రేపటికెళ్ళి నా స్కూటర్లో నేనొస్తాభయ్! ఈ పెట్రోల్ పొదుపు నాతోని కాదు" అన్నాడు యాదగిరి.
ఆ సాయంత్రం మళ్ళీ బస్ లో ఇల్లు చేరుకునే సరికి ఏడున్నరయిపోయింది.
"ఏమిటింత ఆలస్యంగా వచ్చారు? పిల్లలకు హోమ్ వర్క్ ఎప్పుడు చెప్తారింకా?" అన్నారు ఆడాళ్ళు.
"పెట్రోలు ఆదా చేశాం కాబట్టి హోమ్ వర్క్ కి టైముండదు. వాళ్ళనే చేసుకోమనండి!" అన్నారు మగాళ్ళు.
"ఇప్పుడు మనం కరెంట్ ఆదా చెయ్యాలి! త్వరగా భోజనం చేసేద్దాం పదండి" అంది మా ఆవిడ.
అందరం భోజనం గదిలో కెళ్ళేసరికి కరెంట్ పోయింది.
అరగంటసేపు ఎదుర్చూసినా గానీ కరెంట్ రాకపోయేసరికి మాకు నిరాశ కలగటం మొదలుపెట్టింది.
రోజూ పదిగంటల వరకూ లైట్లు వెలుగుతూండేవి. ఆ రోజు నుంచీ తొమ్మిది గంటలకే లైట్లు ఆర్పివేస్తే చాలా కరెంట్ కలిసొస్తుందని అనుకున్నాం.
రాత్రి పదయినా కరెంట్ రాలేదు.
అందరం కొవ్వొత్తులు కొనుక్కొచ్చి వాటిని వెలిగించుకున్నాం.
"ఇవాళ్టి నుంచీ 'పవర్ కట్' అని పేపర్ లో వేశారండీ మర్చేపోయాం" అంది పక్కింటావిడ.
ఎప్పుడు నిద్రపట్టిందో మాకు తెలీదు. తెల్లారుజామున నాలుగింటికి మెలకువ వచ్చింది. అదీ పార్వతీ గాంగ్ వాళ్ళు తలుపు తట్టబట్టి. "ఏమిటి ఇంత ప్రొద్దున్నే వచ్చారు?" అడిగింది మా ఆవిడ నిద్రకళ్ళల్లో.
"పొదుపు చేయటమంటే రాత్రంతా లైట్లు, ఫానులు వేసుకుని పడుకున్నారేమిటి? పైగా ఆ టీవీ కూడా ఆఫ్ చేసినట్లులేదు" అన్నారు వాళ్ళు.
"నిద్రపోయాక కరెంట్ వచ్చినట్లుంది" అన్నాను గొణుక్కుంటూ.
"త్వరగా లైటార్పి ఆదా చేయండి"
నేను లైట్ స్విచ్ దగ్గర కెళ్ళేసరికి మళ్ళీ 'పవర్ కట్' వచ్చేసి ఇల్లంతా చీకటయిపోయింది.
అప్పుడు వినిపించింది పంపు నుంచీ నీళ్ళు వస్తోన్న ధ్వని.
మా ఆవిడ కెవ్వున కేకవేసి వంటింట్లోకి పరుగెత్తింది.
"అయ్యయ్యో! ఇంట్లో చుక్క నీళ్ళు లేవు- వాడు రాత్రి నీళ్ళు వదిలినట్లున్నాడు. తెల్లార్లూ నీళ్ళు కాస్తా పోయాయ్ దుబారా అయిపోయాయ్" అని నెత్తీ నోరూ బాదుకుంటూ బక్కెట్లతో నీళ్ళు నింపసాగింది. రెండు బక్కెట్లు నిండేసరికి నీళ్ళు రావటం ఆగిపోయింది.
ఆడవాళ్ళంతా అప్పుడే బయట గుమిగూడి అందరినీ పిలవటం మొదలుపెట్టారు.
"ఇవాళ కాలనీ అంతా చెట్లు నాటాలికదా! కాలుష్యం నివారణకు మనకు చేతనైనంత సాయం మనం కూడా చేద్దాం!" అంటోంది పార్వతీదేవి.
మరికాసేపట్లో ఆడాళ్ళంతా కలసి కాలనీ కమిటీవాళ్ళు ఫారెస్టు డిపార్ట్ మెంట్ నుంచి తీసుకొచ్చిన మొక్కలు కాలనీ అంతా ప్రతి ఇంటి ముందూ ఓ మొక్క చొప్పున నాటారు. నాటాక గుర్తొచ్చింది అందరికీ- వాటికి పోయడానికి నీళ్ళులేవని.
"ఇప్పుడెలా?" అంది రాజేశ్వరి.
ఎవరికీ నోట మాట రాలేదు.
"పోనీ ఇవాళ ఒక్కరోజు ఎలాగోలా పోద్దామన్నా రేపట్నుంచి ఎలా? ఈ సమ్మర్ అంతా నీళ్ళు సరిగ్గా దొరకనే దొరకవ్? మనకి-" అంది సావిత్రమ్మ.