అందరూ తీవ్రమైన ఆలోచనలో పడ్డారు.
రంగారెడ్డి చాలాసేపు ఆలోచించాక నెమ్మదిగా అన్నాడు. "మీరెవరూ మరోలా అనుకోనంటే ఓ చిన్న ఐడియా."
"ఏమిటిది?" ఆతృతగా అడిగారు ఆడాళ్ళు.
"ప్రతి ఇంట్లోనూ చిన్న పిల్లలుంటారు కదా! వాళ్ళతో రోజూ ఉచ్చ ఈ చెట్ల దగ్గరే పోయిస్తే బ్రతుకుతాయేమో"
అందరూ రంగారెడ్డి మీద విరుచుకుపడ్డారు.
ఆ రోజు సాయంత్రానికి మొక్కలు వాడిపోయాయి. మర్నాటి ఉదయానికి చచ్చిపోయాయి.
మేమంతా ఇప్పుడు నీళ్ళు ఆదాచేయటం కోసం కేవలం నాలుగు చెంబుల నీళ్ళు మాత్రమే స్నానానికి వాడుతున్నాం- అంచేత నీటి విషయంలో కొంతవరకూ పొదుపు చేయడానికి వీలైంది.
కరెంట్ కూడా రాత్రి ఏడునుంచీ తొమ్మిదివరకూ ఉంటుంది. గనుక ఆ రెండు గంటల్లో ఓ గంటే వాడి ఓ గంట ఆదా చేస్తున్నాం. కరెంట్ తీసేసిన సమయంలో రంగారెడ్డి వాళ్ళమ్మమ్మ బాత్ రూమ్ కి వెళ్ళబోయి చీకటితో ఓ బల్ల తగిలేసరికి కాలు ఫ్రాక్చరయ్యింది. ఆమెను హాస్పిటల్ లో చేర్చాం అందరం.
ఆ రోజు మేము ఆఫీసు కెళ్ళేసరికి మిగతా గుమాస్తాలందరూ బల్లలకింద, అల్మారాల కిందా ముక్కుకు కర్చీఫ్ లు అడ్డంగా పెట్టుకుని వెతకసాగారు.
"ఏమిటి?" అడిగాడు రంగారెడ్డి.
"ఎక్కడో ఎలుకలు చచ్చినట్లున్నయ్- నిన్న కూడా ఇలాగే వాసన వచ్చింది-" అన్నారు వాళ్ళు. మేము కూడా వెతికాంగానీ ఎక్కడా ఎలుకల శవాలు కనిపించలేదు.
మేమంతా బయటికెళ్ళి నిలబడి ప్యూన్ తో మొత్తం పర్నీచర్ అంతా జరిపి చూడమన్నాం. వాళ్ళు వెంటనే బయటికొచ్చారు మళ్ళీ. ఇప్పుడేం వాసనలేద్సార్?" అన్నారు ఆశ్చర్యంగా. అందరూ మళ్ళీ లోపలికెళ్ళారు. నేనూ రంగారెడ్డి, శాయిరామ్ మాత్రం కాంటీన్ కెళ్ళి కాఫీ తాగి మళ్ళీ కాసేపట్లో చేరుకునేసరికి అందరూ ఠక్కున ముక్కులు మూసుకున్నారు. అప్పుడర్థమైంది మాకూ వాళ్ళకూ కూడా.
ఆ చచ్చిన ఎలుక వాసన మా దగ్గర్నుంచే అనీ- ప్రభుత్వం దూరదర్శన్ లో ఇస్తున్న ప్రకటనలు అమలు పరచడానికి నీళ్ళు పొదుపు చేస్తున్నామనీ అందుకే కొంచెం కుళ్ళు వాసన వస్తుందేమోననీ చెప్పాం వాళ్ళకు. మాతో బలవంతంగా శెలవు పెట్టించి ఇంటికి పంపించారు వాళ్ళు. మేము నీళ్ళ విషయంలో పొదుపు పాటించినంత కాలం ఆఫీస్ కి రాకూడదని కూడా నిష్కర్షగా చెప్పారు. తీరా మేము ఇళ్ళు చేరుకునేసరికి పిల్లలు కూడా ఇంటి బయటే ఆడుకుంటూ కనిపించారు.
"ఏమిటి? మీరు స్కూలు కెళ్ళలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు గోపాల్రావ్.
"వెళ్ళి వచ్చేశాం"
"అప్పుడే ఎలా వచ్చారు స్కూలు సాయంత్రం మూడు వరకు కదా?"
"మా ప్రిన్సిపాల్ ఇంటికి పంపించేశారు కాలనీ పిల్లలందరినీ"
"ఎందుకని?"
"మేము మరీ మురికిగా వున్నామంట-"
ఈలోగా మా ఆవిడ చిరాకుగా బయటకొచ్చింది.
"చూశారా వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టులు - అందరికీ జీరోలు." మేము ఉలిక్కిపడ్డాం.
వాళ్ళకు ఇంతవరకూ ఏ పరీక్షల్లోనూ పాస్ మార్కులు తగ్గలేదు. అలాంటిది సడెన్ గా జీరోలు రావటం ఎలా జరుగుతుంది??
"ఏమిటి జీరోలా?" వాళ్ళను నిలీశాడు జనార్ధన్ బెల్ట్ తీసుకుని కొట్టడానికి రెడీ అవుతూ. వాళ్ళు ఏడుపు మొఖాలు పెట్టారు.
"మాట్లాడరేం? చెప్పండి! చదువంటే ఇంట్రెస్ట్ పోయింది! అవునా? ఇరవై నాలుగ్గంటలూ ఆ టీవీ ముందు కూర్చోవటం వల్లే బ్రెయిన్స్ దెబ్బతిని ఇలా తయారయ్యారు- అంతేనా?"
"కాదు- మాకు చదువుకోడానికి లైట్లు వుండటం లేదుగా! మీరు ఎనిమిదింటికే లైట్లార్పేస్తున్నారు" అందరం మొఖాలు చూసుకున్నాం.
"మనకు ఈ పవర్ కట్స్ తో కరెంట్ ఉండేదే రాత్రి ఏడుగంటల నుంచి తొమ్మిది వరకూ! ఆ రెండుగంటల్లో కూడా పొదుపు చేస్తే మళ్ళ పిల్లలు పెద్దయాక అడుక్కుతింటారు" అన్నాడు చంద్రకాంత్.
"నిజమే! గవర్నమెంటే మనకి పవర్ సప్లయ్ లేకుండా చేసి ఇంకా సిగ్గులేకుండా "విద్యుత్ ని ఆదాచేయి" అంటూ పిచ్చివాగుడు వాగిస్తారేమిటి ఆ టీవీ ద్వారా?" అడిగింది పార్వతీదేవి.
"నీళ్ళు కూడా అంతే! నీళ్ళు రోజు విడిచి రోజు సప్లయ్ చేస్తుంటే ఆ మెంటల్ నినాదాలేమిటి "ప్రతి నీటి చుక్కా ప్రగతికి సోపానం" అంటూ రాజేశ్వరి కోపంతో అంది.
"పెట్రోలు ఆదా చేస్తే ఏమౌతుందో చూశారుగా! రోజూ ఆఫీసుకి లేటే! దాంతో శెలవుళు ఎక్కువ ఖర్చయి, అవసరానికి శెలవులు లేక, జీతాల్లేక, జీతం నష్టం మీద శెలవు తీసుకోవలసి వస్తుంది-" అంది సావిత్రమ్మ, అక్కడి నుంచి అందరూ తలోమాటా మాట్లాడసాగారు.
"అసలే తాగటానికి క్కూడా నీళ్ళు లేక ఛస్తుంటే- చెట్లు పెంచండి- పచ్చదనం ప్రగతికి సోపానం- అంటూ అడ్డమైన వాడూ చిల్లర నినాదాలే."
"మనకొచ్చే జీతాలేమో గొర్రెకు బెత్తెడు తోకలు- అది చాలక అందరం ముష్టివాళ్ళల్లాగా బ్రతుకుతున్నాం నచ్చిన బట్టకట్టుకోలేం- తినాలనుకున్నవి తినలేం- చేయాలనుకున్నవేమీ చేయలేం- అయినా గానీ ఇంకా పొదుపు చేయాలంటే ఏం చేయాలి? ఓ పూట తిని రెండో పూట పస్తుండాలా? ఈ కొద్ది రోజులు పొదుపు చేసే సరికే మన కాలనీలో ఎనిమిదిమందికి ఎనీమియా వచ్చి డాక్టర్ల దగ్గరకెళ్ళి టానిక్ లు కొనుక్కున్నారు."
"అయినా మా బ్రతుకుల్ని బాగుచేయమనీ, మమ్మల్నీ ముష్టి బ్రతుకుల నుంచి ఉద్దరించమనీ మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే గెలిచిన మర్నాటినుంచే పొదుపు చేయండి, విద్యుత్ వాడకండి, నీళ్ళు ఆదా చేయండి, పెట్రోల్ వాడకండి, ప్రయాణాలు చేయకండి అంటూ మరింత దిక్కుమాలిన బ్రతుకులు బ్రతకమంటారేమిటి? ఇలాంటి మెంటల్ గాళ్ళ నెందుకు ఎన్నుకోవాలి మనం? ఇంకొకసారి ఓట్ల కోసం ఇంటికి రానీండి! చెప్పు తీసుక్కొడతాను" అంది శ్రీవల్లి. ఆ రోజు నుంచీ మళ్ళీ ఎప్పుడూ మా కాలనీ వాళ్ళు దేశభక్తి గీతాలు, కార్యక్రమాలు, నినాదాలు విని ఉత్తేజితులవలేదు.
* * * * *