ఆశకు ఇందులోని నిజం తెలుసు. కాని అట్లే ప్రశ్నించి తల్లి మనసుకు చికాకు కలిగించటం ఇష్టంలేక మాట మారుస్తూ "ఏమైనా సాయం చేయమంటావా అమ్మా? చారుపొడి కొద్దిగా ఇమ్మంటావా?" అన్నది.
లలితమ్మగారు తల ఊపి ఊరుకున్నది.
ఆశ తనకు కావలసిన సామాగ్రి తీసుకుని ఇవతలకు రాబోతూంటే "చూడు" అంది.
"ఏమిటమ్మా?" అంది కూతురు ఆగి.
లలితమ్మగారు ఒక్కక్షణం వూరుకుని "మీ చిన్నన్నయ్య మలయా ఎప్పుడు వెడుతున్నాడు?" అనడిగింది.
"ఎల్లుండి ఇక్కడ్నుంచి బయలదేరతాడనుకుంటానమ్మా!"
ఆమెలో శోకం పెల్లుబుకుతోంది. "వాడు... ఇంతవరకూ ఇక్కడికి రాలేదు చూశావా?" అంది బాధగా.
"బహుశా వాడంతట వాడు యిక్కడికి రాడేమోనమ్మా" అంది ఆశ సాలోచనగా.
లలితమ్మగారు నిట్టూర్చింది. 'అవును వాడు కన్నతల్లి మనసుని అర్థం చేసుకోలేకపోయాడు' అంది విషాదంగా.
ఆశ ఏమీ బదులు చెప్పలేదు.
"వాడిని యెంత గారాబంగా పెంచాను" అంది లలితమ్మగారు మళ్ళీ.
ఆశ కొంచెం భయంగా "చిన్నన్నయ్య మంచివాడేనమ్మా" అంది.
తల్లి నిష్ఠూరంగా "అయితే మేమే చెడ్డవాళ్ళమంటావా ఆశా?" అంది.
"అది కాదమ్మా! నా ఉద్దేశం ఇందులో యెవరి పొరబాటు లేదని" అంటూ నసిగింది ఆశ.
"పోనీ మీ నాన్నగారంటే భయమూ, భక్తి వుంటే అలా చేస్తాడా?" అంది లలితమ్మ కోపంగా.
ఓ క్షణం ఆగి ఆమె మళ్ళీ "నాన్నగార్కి మనసు ఎంత విసిగిపోయిందో... ఆయనా వాడిగురించి ఎత్తటంలేదు. ఎంతసేపూ రామంగురించి తప్ప సుందరం గురించి అసలు తలచటమే లేదు" అన్నది.
"నాన్నగారి మనసులో బాధల్ లేదంటావా అమ్మా? వాడిమీద వచ్చిన కోపంకొద్దీ, పట్టుదలకి బయటకి అనరంతే. లోపల ఎప్పుడూ అదే ఆలోచిస్తూ వుంటారని నా ఉద్దేశం" అంది ఆశ తండ్రి మనస్తత్వం గురించి విడమర్చి చెబుతూ.
లలితమ్మగారు ఏమీ జవాబు చెప్పలేదు. ఆలోచిస్తూ పరధ్యానంగా ఊరుకుంది.
ఆశ కొంచెంసేపు పోయాక "పోనీ చిన్నన్నయ్య దగ్గరకు నన్ను వెళ్లి రమ్మంటావా?" అనడిగింది భయపడుతూ.
"వెళ్ళి?"
"తీసుకువస్తాను."
"చిన్నవాడు వాడంతట వాడు దారికి రావటంపోయి మేమే రాజీకి రావాలంటావా?" అంది లలితమ్మగారు అహంగా.
ఆశ సిగ్గుపడుతూ "చిన్నతనంచేత వాడు తెలియక తప్పుచేస్తే పెద్దవాళ్ళు క్షమించవచ్చు కదమ్మా" అంది.
"అయితే వెళ్ళి వస్తానంటావా?" అన్నది తల్లి గుట్టుగా.
"అవునమ్మా. లేకపోతే ఏమవుతుందో చూడు. చిన్న మాటపట్టింపుకోసం శాశ్వతంగా విడిపోవటం, చివరకు మనకే కదా నష్టం?"
"కాని నాన్నగార్కి తెలిస్తే కోపం వస్తుంది సుమా" అని భయపడింది లలితమ్మగారు.
"నాన్నగారు ఇంకా గంటన్నరా రెండు గంటలకుగాని రారమ్మా. వెళ్లి వెంటనే వచ్చేస్తాను."
"తప్పంతా వాడిదే అని వాడికి తెలియచెప్పు ఆశా. జరిగిందానికి పశ్చాత్తాపం కలగాలి. వాడికోసం ఇక్కడ నిద్రాహారాలు మాని ఎవరూ కృంగి పోవటం లేదని చెప్పు."
ఆశకు నవ్వు వచ్చింది. మాటపట్టింపుకోసం ఎంత అభిమానం తల్లికి? గోరంతతో పోయేదానికి అనవసరంగా యెంత రగడ చేసుకున్నారు?
"అలాగేనమ్మా" అని బయల్దేరింది.
ఆమె వెళ్ళిపోవటం వెనకనుండి అలాచూస్తూ నిలబడిన లలితమ్మగారు ఓ క్షణం గడిచాక కళ్ళు తుడుచుకుంది.
ఆశ గుమ్మందాకా వచ్చాక ఆమెకు ప్రసాదరావుగారు ఎదురుగా వచ్చాడు. ప్రసాదరావుకు ఇరవయిమూడు, ఇరవయి నాలుగేళ్ళుంటాయి. ఎర్రగా, బక్కపలచగా వుంటాడు. అతను వరలక్ష్మిగారి కొడుకు. వరలక్ష్మి భర్త అనేక దుర్వ్యసనాలకు లోనయి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి కొడుక్కి చదువు చెప్పించే శక్తికూడా లేకపోయింది వాళ్ళకు. అందుకని వరలక్ష్మి మేనల్లుడ్ని తనదగ్గర పెట్టుకుని చదువు చెప్పించమని అన్నను కోరింది. చెల్లెలిమాట తీసివేయలేక అలాగే ప్రసాదరావుని తన ఇంట్లో వుంచుకుని బి.ఏ.దాకా చదువు చెప్పించాడు విశ్వనాథంగారు. ఇప్పుడు ప్రసాదరావు కొంత ప్రయోజకుడయినాడు. కాకినాడలోనే వుండి ఉద్యోగం చేస్తూ నెలకు నూటయాభయి రూపాయలుదాకా సంపాదిస్తున్నాడు. అతనిప్పుడు విడిగా గది అద్దెకు తీసుకుని వుంటున్నాడు. తరుచు యీ ఇంటికి వచ్చి పోతూంటాడు.
"ఎక్కడికి ఆశా?" అడిగాడు ప్రసాదరావు.
ఆశ జవాబు చెప్పింది.
"జగన్నాథపురందాకా ఒక్కదానివే వెడతావా? నేనూ తోడు వస్తానుండు."
"వొద్దులే బావా. రిక్షాలో వెడతానుగా. మళ్ళీ ఓ గంటన్నరలో వచ్చేస్తాను. అప్పటిదాకా వుండకూడదూ?"
"నువ్వు వుండమంటే వుంటాను. ఈవేళ ఆఫీసుకు సెలవేగా. ఆదివారమాయె."
"ఉండు. ఈ పూట ఇక్కడే భోంచెయ్యి" అంటూ వీధిలోకి వెళ్లిపోయింది ఆశ.