5
ఆశ ఎవరికోసమయితే బయలుదేరిందో... ఆ చిన్నన్నయ్య సుందర్రావు- పెద్దకొడుకు రామంకంటే నాలుగేళ్లు చిన్న. సుందరం ఎర్రగా, సన్నగా, చిన్నగా వుండేవాడు. అతనికి చిన్నప్పటినుంచీ చదువంటే అమితాసక్తి వుండేది. "వీడు బాగా చదువుకుని యెంతో పైకి వస్తాడు" అని విశ్వనాథంగారు నిశ్చలంగా వుండేవారు.
సుందరం రామాన్ని చూశాడు. అతనాట్టే చదువుమీద ఆసక్తి లేనట్లుగా ఇంటిరీతిని పట్టించుకోనట్లుగా వుండేవాడు. అతనివలన తన తల్లిదండ్రులకి కష్టంగా వుండటం అతను గ్రహించాడు.
తను చదవాలి.
తండ్రి రామాన్ని ఇంజనీరింగ్ చదివించుదామనుకున్నాడు. అతను చదవలేకపోయాడు. తను దాన్ని సాధించాలి.
సుందరం పట్టుదలతో చదివాడు.
అతనికి ఇంటర్మీడియెట్ లో క్లాసు వచ్చింది. గబగబ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకూ అప్లై చేశాడు.
అతనికి సీటు వచ్చింది. కాని యెంత ప్రయత్నించినా కాకినాడలో రాలేదు. విశ్వనాథంగారు తను పలుకుబడి ఉపయోగించారు కాని ప్రయోజనం లేకపోయింది. అతనికి సీటు విశాఖపట్నంలో వచ్చింది.
-అవి రామం బి.ఏ. ప్యాసయి జీవితంలో యెలా సెటిల్ అవుదామా అని సతమతమవుతూన్న రోజులు. ఇంట్లో పరిస్థితి అంతగా బాగుండలేదు. ఆ సమయంలో సుందరాన్ని దూరంగా పంపటం తల్లిదండ్రులకి ఇష్టంలేదు. అయినా చేసేదేముంది?
ఓరోజు సుందరం విశాఖపట్నం వెళ్లి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి చదువు ప్రారంభించాడు.
అతనికి చిన్నప్పటినుంచీ ఆటలంటే అభిరుచి. క్రికెట్ అంటే చెవి కోసుకుంటాడు.
వీలున్నప్పుడల్లా క్రికెట్ ఆడేవాడు. లేకపోతే చదువుకునేవాడు.
సుందరం అన్నలాగ బలవంతుడు కాడు. అతని శరీరం కోమలమైనది. మనస్సు యెంతో మృదువయినది.
అతనిది సహజంగా సిగ్గుపడే స్వభావము యెక్కువ. మాటకారి కాదు.
క్రమంగా ఒకటోఏడు గడిచి రెండో ఏడులోకి ప్రవేశించాడు సుందరం. అతను మరీ శ్రద్ధగా చదవసాగాడు. యూనివర్శిటీలో క్రికెట్ ఆటలోకూడా అంతే ప్రావీణ్యం చూపేవాడు. అంతర్విశ్వ విద్యాలయాల క్రికెట్ జట్టుకు అతను సెలెక్టు అయాడు. ఓరోజు క్రికెట్ ఆటలో యెక్కువ పరుగులు చేసి అలిసిపోయిన శరీరంతో ఇంటికి వచ్చాడు.
ఒళ్ళంతా పచ్చిపుండుగా వుంది. అతని రూంమేట్ తో కాసేపు కబుర్లు చెప్పి పడుకున్నాడు. అంతటి అలసటమీద హాయిగా నిద్రపట్టవలసింది. కాని ఎంత అవస్థపడినా కన్ను మూతపడడంలేదు. అర్థరాత్రివరకూ అలాగే జాగారం చేస్తూ గడిపాడు. ఇంతలో అతని రూమ్ మేట్ లేచి లైటు వేసి చదువుకుంటున్నాడు. సుందరానికి కూడా చదువుకోవాలని ఆరాటం కలిగింది. లేచి కూర్చుని పుస్తకం ముందుపెట్టుకుని చదువుదామని ప్రయత్నించాడు. తల బద్దలౌతున్నట్లుగా విపరీతమయిన బాధ, అతను భరించలేకపోయాడు. ఆయాసంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
తెల్లవారేసరికి అతని వళ్ళు సలసలమణి కాగిపోతోంది. ఎలాగో ఓపిక చేసుకుని లేచి జ్వరం చూసుకున్నాడు. నూటనాలుగు డిగ్రీలుంది. స్నేహితుడు భయపడి, గబగబ పోయి డాక్టర్ని తీసుకువచ్చాడు. డాక్టరు వచ్చి మందిచ్చి జాగ్రత్తగా చూస్తూ వుండాలని చెప్పిపోయాడు. రోజూ వచ్చి చూసిపోతూనే వున్నాడు. రూంమేట్ శ్రమపడి చేయవలసిన సపర్యలన్నీ చేస్తూనే వున్నాడు. కాని అతనికి జ్వరం తగ్గటంలేదు. ఇంటికి వైర్ ఇస్తానంటే సుందరం వద్దంటాడు. ప్రతిచిన్న విషయానికి కంగారుపడటం అతనికి అసహ్యం.
మరికొన్ని రోజులకు జ్వరం తిరుగుముఖం పట్టింది. కాని మనిషి మరీ నీరసించిపోయాడు. ముఖంలో కళ నశించింది. వంట్లో అతి నిస్సత్తువుగా వుండేది. అలాగే క్లాసులకి పోయి వస్తూండేవాడు.
ఓరోజు మళ్ళా జ్వరం తగిలినట్లుగా అనుమానం తోచి ధర్మామీటరు తీసి చూసుకున్నాడు. నూట ఒకటి వుంది.
అతనికి అర్థంకాలేదు. మానసికంగా ఘాతం తగిలింది. అవతల పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. తనకు చూస్తే అనారోగ్యం. అలాగే నెట్టివేసుకుని తిరిగాడు. నెలరోజులకు తగ్గింది. ఇదివరకెప్పుడూ లేదు. అతనికిప్పుడు పుస్తకం ముందు పెట్టుకొని చదువుతోంటే కళ్ళు చెదిరిపోతున్నట్లుగా, కణతలు పగిలిపోతున్నట్లుగా, తలంతా గజిబిజి అయిపోయినట్లుగా బాధగా వుంటోంది. దీనికి పరిష్కారమేమిటో తెలియక ఓరోజు రిక్షా ఎక్కి డాక్టరుదగ్గరకు వెళ్ళాడు.
ఆ డాక్టరు ఎవరో అంతకుముందు సుందరానికి తెలీదు.
బోర్డు కనిపించింది. డిగ్రీ చూసి ఫర్వాలేదనుకుని లోపలకు వెళ్ళాడు.
లోపల ఎవరూ పేషెంట్లు కనబడలేదు. కుర్చీలన్నీ ఖాళీగా వున్నాయి. సుందరం నీరసంగా ఓ కుర్చీలో కూర్చున్నాడు. అతనికి కళ్ళు తిరుగుతున్నట్లుగా వుంది.
ఇంతలో లోపల్నుంచి డాక్టరు వచ్చాడు. ఆయన పచ్చని పసిమితో మిసమిసలాడుతున్నాడు. ఆయనకు గెడ్డం వుంది. అరవయి ఏళ్లు పైనే వుంటాయి.
"మై డియర్ యంగ్ మేన్! నీకోసం ఏమి చెయ్యగలను?" అన్నాడు డాక్టరు ముందుకువచ్చి.
"నాకు జ్వరం వస్తోంది" అన్నాడు సుందరం.
డాక్టరు చెయ్యిపట్టుకొని పరీక్షచేశాడు. ఎన్ని రోజుల్నుంచి, ఏమిటి ఎలా అని వివరాలన్నీ అడిగాడు. సుందరం విపులంగా తెలియజేశాడు.
ఆయన కొంచెం ఆశ్చర్యపడి "వాట్! యిన్ని రోజుల్నుంచీ జ్వరం తగ్గలేదా? ఇది డెఫెనెట్ గా టైఫాయిడ్" అన్నాడు.
సుందరం హృదయం ఝల్లుమంది. "ఏమిటి టైఫాయిడా? అయితే నేను లేచి ఎలా తిరగగలుగుతున్నాను?" అన్నాడు పాలిపోయిన ముఖంతో.
"వాట్ యీజ్ దేర్? అదంత కష్టమైన విషయంకాదు. షర్టు విప్పెయ్యి. నిన్ను పరీక్ష చెయ్యాలి" అని డాక్టరు స్టెతస్కోపు తీసుకుని సుందరాన్ని పరీక్ష చేశాడు.