Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 11


    సానికొంపలో పుట్టినా, నన్ను ప్రేమించి, అపురూపంగా చూసుకునే భర్త కావాలని కోరుకున్నాను. నా కల నిజం కావాలని రోజూ కోదంట  రామాలయంలో స్వామి ముందు నర్తించి, వచ్చేముందు ప్రార్దించేదాన్ని స్వామిని. ఆ స్వామికెందుకు నామీద దయ కలగలేదో కేతకిగా తీరని కోరికలకు అది సమాధానమేమో..... నువ్వు గుర్రం మీద వస్తూ, ఏటినుండి  నీళ్లు తెస్తున్న నన్ను చూశావు.  మోహించావు. బలవంతంగా నీ బంగళాకి రప్పించావు. పవిత్రంగా నాభర్తకే అర్పించాలనుకున్న నా కన్నెతనాన్ని పశువులా దోచావు. మానం పోయాక, ప్రాణం ఎందుకనిపించింది. భరించలేని ఆ దుఃఖంలో నా ప్రాణం పోయింది. ఒకవిధంగా నేను అదృష్టవంతురాలిని. బ్రతికినా జీవన్మృతురాలినయ్యేదాన్ని. చచ్చినా నా ఆత్మకి శాంతి లేకుండా పోయింది. తీరని కోరికలతో నా ఆత్మ  పరితపించిపోతోంది. హరిచందనలో వుండి, ఆ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాను.  దాన్ని పెళ్లిచేసుకో. నీ ద్వారా సంసార సుఖాన్ని అనుభవిస్తాను.  నీ ద్వారా పిల్లల్ని కని పెంచుతాను."

    "అది ఈ జన్మకు తీరని కోరిక చంద్రరేఖా. ఎందుకంటే నువ్వు హరిమీదున్నా నన్ను తాకలేవు. నాలో ఇప్పుడు యోగశక్తి ప్రవహిస్తోంది. నీవంటి పిశాచాలు తాకలేవు సరికదా,  దగ్గరగా కూడా రాలేవు.  నీ కోరిక తీరాలంటే నువ్వు మళ్లీ మానవజన్మ ఎత్తాల్సిందే, నువ్వు మళ్లీ పుడితే మాత్రం  నీ మెడలో  తప్పకుండా తాళికట్టి, నీకు జరిగిన అన్యాయాన్ని  సరిదిద్దుతాను. నిన్ను నా ఆలిగా ఏలుకుంటాను. కేతకిగా, చంద్రరేఖగా నువ్వు ఏం కోరుకున్నావో అవి నీకు నేను అందిస్తాను. ఇది నా వాగ్దానం.

     "అయితే ముందు నాకీ పిశాచరూపం వదిలించు నీ యోగశక్తి ధారబోసి."

    "ధారపోయడానికి నేను సిద్దమే. కానీ నాకున్న శక్తి చాలదు."

    "అయితే నా గురించి మళ్లీ తపస్సు చేయి."

    "చేస్తాను."

    "ఎప్పుడు?"

    "తపస్సు అంటే ఇంట్లో కుదరదు. ప్రశాంతంగా,  ఏకాంతంగా వుండే ప్రదేశం కావాలి."

    "అలాంటి ఏకాంత ప్రదేశం ఎక్కడుందో నేను చెప్పనా?"

    "ఎక్కడుంది?"

    "భైరవుని కొండ! ఆ కొండ దిగువన మారుతి క్షేత్రం. అతి పురాతన క్షేత్రం అధి. చెంచుల ఆరాధ్య దైవం ఆయన. తిమ్మడిగా నీ ధ్యానమందిరం చేసుకున్న పవిత్ర స్థలమది.

     "భైరవుని ఆ  కొండ గుహలో వున్న నిధికే కదా నువ్వు బలి అయ్యి, కాపలా కాసింది."

    "తెలీనట్లు అడుగుతావేం? మీ గురువుగారు ఆ రోజు చెప్పారుకదా. ఆయన చెప్పింది యదార్దం. అపారమయిన నిధి, ఎవరూ వెలకట్టలేని నిధి వుందక్కడ!"

    "మా గురువుగారు చెప్పకముందే, ఆ భైరవుని కొండ గురించి విన్నానులే. మా స్నేహితులమంతా కలసి భైరవుని కొండ చూద్దామని వెళ్ళాం. దగ్గరగా వెళితే నిధి రహస్యం ఏమైనా తెలుస్తుందేమో గుహలో జొరబడి ధనాన్ని సంచులకు ఎత్తుకురావచ్చుగాని ఆశ.  వచ్చినవాళ్లలో ఒకడికిపాము కరిచింది.  ఒకడికి తేలు కరిచింది. భయపడి మిగతావాళ్లు రాలేదు. నేనూ, అంబాజీ వెళ్లాం. భైరవుని కొండ అన్ని కొండల్లాగే మామూలుగా అనిపించింది.  అక్క గుహ ఉన్నట్లుగా గుర్తులేమీ లేవు.  గుహ అంటే ద్వారం వుండాలికదా?"

    "ద్వారం ఎందుకులేదు?పెద్ద బండరాయి... చెంచుపిల్ల బొమ్మ చెక్కి వుందే.... అదే ఆ గుహ ద్వారానికి తలుపు....."

    "sఏనుగు ప్రమాణంలో వున్న ఆ బండరాయి ఏనుగులైతేనే జరుపగలవు. మనుష్య మాత్రులు ఆ బండని జరుపలేరు."

    "అదేకదా ఆ నిధి రహస్యం. ఆ బండరాయి ఏనుగులైతేనే జరుపగలవనిపించే  ఆ బండరాయి దూదికన్నా తేలికయ్యే సమయం ఒకటుంది."

    "అంతపెద్ద బండరాయి దూదికన్నా తేలికవుతుందా?"   

    "పెద్ద పెద్ద దేవాలయాల్లో పెద్ద పెద్ద స్తంభాలని, మనుష్యమాత్రులెవరూ ఎత్తలేరనిపించే స్తంభాలని, పెద్ద పెద్ద బండరాళ్లని చూస్తాం. క్రేన్ లు యంత్రాలూ లేని కాలంలో వాటిని ఎలా నిలబెట్టగలిగిగారని, ఎలా ఎత్తగలిగారని ఆశ్చర్యపడతాం. కానీ ఆనాటి శిల్పులకీ తెలుసు. రాళ్లకి నిదురించే టైం ఒకటుందని. అని నిదురించే సమయంలో అవి దూదికన్నా తేలిక అవుతాయట. చెంచుపిల్ల  వున్న ఆ బండరాయి కూడా పున్నమినాటి అమృత ఘడియలో దూదికన్నా తేలిక అవుతుంది. అప్పుడు ఆ బండని జరుపవచ్చు, ఆ నిధి  కావాలంటే చెప్పు. నేను నీకు సహాయపడగలను."

    "మా గురువుగారు ధన వ్యామోహం మంచిది కాదన్నారు. ఆశ దుఃఖాన్ని తెచ్చిపెడుతుందని  చెప్పారు. ఇప్పుడున్న జ్ఞానం అప్పుడుంటే, అస్సలు భైరవుని కొండవద్దకు వెళ్లేవాడినే కాదు."

    "నువ్వు కావాలని ఆశ పడకు, నేనే నీకు వరదక్షిణగా ఆ నిధిని నీకిస్తాను."

    "వరదక్షిణగా ఇస్తానంటే వద్దంటానా? ఇవ్వు మరి సిటీలో పెద్ద హాస్పిటల్ కట్టాలన్న నా కలను నిజం చేసుకుంటాను. డబ్బులేక చాలా పనులు ఆగిపోయాయి తెలుసా?"

    "ఎవరితో మాట్లాడుతున్నావు చినబాబూ!" ఏటినీళ్ళ కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిన మునిరాజు అడిగాడు, సూర్య ఒంటరిగా కూర్చుని మాట్లాడుతుండటం చూసి.

     "ఎవరూ లేరు. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను."

    "మీలో మీరే మాట్లాడుకుంటున్నారంటే, సూర్య బాబుకి పిచ్చెక్కిందని ప్రచారమైపోగలదు. మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసులెండి. మీ బంగళాలో తిరిగే ఆడదెయ్యం ఇప్పుడు సాక్షాత్తు మీకు కనిపిస్తుందటగా. మీరు దానితో మాట్లాడుతున్నారని ఊళ్ళో చెప్పుకోగా విన్నాను."

     "ఆ సంగతి పోనివ్వు మునిరాజూ! ఊళ్లో సంగతులేమిటి? రచ్చ కట్టదగ్గర మీ సమావేశాలు బాగా జరుగుతున్నాయా?మళ్లీ భైరవుని  కొండకెళ్లే ఆలోచన వుందా?"

    "ఎందుకు లేదు డాక్టర్ బాబూ! ఈసారి గట్టి బందోబస్తుతో వెళ్లాలని అనుకుంటున్నాం. ఆ భైరవుని కొండను డైనమేట్లతో పేల్చయినాసరే నిధిని సాధించాలన్న  ప్లాన్ లో వున్నాం. ఈసారి మీరు మాతో కలుస్తారా లేదా?" మునిరాజు కడవలో నీళ్లు ముంచుకుని, భుజంమీద పెట్టుకుని కదులుతూ అన్నాడు.

     సూర్య లేచి అతడిని అనుసరిస్తూ అన్నాడు "ధనవ్యామోహం మంచిదికాదని మా గురువుగారు చెప్పారు. కావలసినదానికన్నా ఎక్కువ సంపాదించుకోవడం కూడా పాపమన్నారు."

    "ఇందాక అదే మాట అన్నారుకదా? ఎవరితో చినబాబూ?"

    "నాలోనే అనుకున్నాను."

    "కాదులెండి. ఖచ్చితంగా మీరెవరితోటో మాట్లాడుతున్నారు. వెనుకటికి మా అమ్మమ్మ గారింట్లో ఓ ముసలి దెయ్యం వుండేది. ఉయ్యాలలో పిల్లలు ఏడుస్తుంటే, "ఒసే నర్సమ్మా! ఉయ్యాల్లో పిల్ల ఏడుస్తుంటే, వినిపించడంలేదా?"అంటే చాలు. ఉయ్యాల ఊగేదిట. ఏడుస్తున్న పాప ఏడుపు మానేసే వాళ్లట."

    "అలాగా!"

    "నిధులిచ్చే దెయ్యాలు కూడా వుంటాయని ఈరోజు తెలిసింది. ఎంత మంచి దెయ్యమండీ అది. అది నాకు పట్టకూడదూ కోటీశ్వరుడైపోతా" మునిరాజు మాట పూర్తి చేయలేదు. వెనుకనుండి మెడమీద చేయేసి నెట్టినట్లుగా మూడు ముగ్గులు ముగ్గి బోర్లాపడ్డాడు. సరిగ్గా ఒక బండరాయికి  తగిలింది అతడి ముఖం. పడుతూనే ముందరిపన్ను పైది విరిగి పోయింది. పెదవులు పగిలాయి. భుజంమీద కుండ భళ్ళున బద్దలై చిన్న చిన్న పెంకులుగా మారిపోయాయి.

     "అరెరె......" సూర్య వంగి అతడిని లేపుతుంటే, రక్తసిక్తమైన అతడి నోరు, పగిలిన పెదవులు మహా భయంకరంగా కనిపించాయి.

     "ఎలా పడ్డావు మునిరాజూ? రాయి తగిలిందా కాలుకు?"

    "మీరు కాదా నా మెడమీద చెయ్యేసి ముందుకు తోసింది."

    "బాగుందయ్యా! నేనేందుకు త్రోస్తాను?"

    "అయితే ఇది ఖచ్చితంగా మీ దెయ్యం పనే" మునిరాజుకు వెన్నులోంచి భయం పుట్టుకొచ్చింది. తమాషాగా దెయ్యాలమీద జోకులేస్తే అది తన మెడకు పట్టుకు ముఖం పగిలేలా త్రోసింది. అది తనప్రక్కనే వున్నట్లుగా, దాని వేడిశ్వాస తనకు తగిలినట్లుగా, అనిపించడంతో గుండె ఆగినంత పనైంది. "శ్రీ ఆంజనేయం..... ప్రసన్నాంజనేయం...."ఎంత ప్రయత్నించినా, భయంతో గొంతు పెగలడంలేదు.

    చంద్రరేఖ నవ్వుతోంది. పెళ్లుమని నవ్వుతోంది.

     సూర్య నవ్వు బిగపట్టుకుంటున్నాడు.

     హాస్పిటల్ కి తీసుకెళ్లి, నోటిర్కతమంతా శుబ్రంగా తుడిచి ఇంజెక్షన్  చేశాడు.

     అప్పటికే అతడి మూతి  పందిమూతిలా ఉబ్బిపోయింది.

     "నిధి పేరెత్తితేనే మూతి పచ్చడయింది. ఇహ నిధికోసం వెడితే ఏమౌతుందో కదా మునిరాజూ?"

    "ఏమీ కాదులెండి. అంబాజీ మా కోసం తాయెత్తులు తయారుచేస్తున్నాడు. పాములు గీములు ముట్టకుండా, గరుడ యంత్రం కూడా తయారుచేస్తున్నాడు. గాలి, ధూళి ఏమన్నా ఆమడదూరంలో ఆగిపోవాలి. నేను కూడా అంబాజీ దగ్గర శిష్యరికం చేసి, చిన్న చిన్న మంత్రాలు నేర్చుకున్నాను లెండి. అది హఠాత్తుగా దొంగదెబ్బ తీసిందిగానీ, దాని వునికి కనిపెడితే మంత్ర దిగ్బంధం చేసేవాడిని."

    చంద్ర కిటికీలో కూర్చుని అతడికేసి ఎర్రటి కళ్లతో చూడ్డం కనిపించింది సూర్యకు.

     మునిరాజుకు  ఏదో మూడిందని అనుకున్నాడు.

    అతడు నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు.

 
                                                       *    *    *    *    *

   
    వారం రోజుల నుండి సూర్యకోసం ఎదురుచూస్తోంది హరిచందన అతడు సాయంత్రం షికారుగా అటువైపు వస్తుంటాడని తెలుసు.

     వారం రోజుల నిరీక్షణ ఆ రోజు ఫలించినట్టుగా సూర్య వచ్చాడు.

    బిందెమీద చేతులానించి, మెట్లమీద కూర్చుని వుంది. హరిచందన యమున ఒడ్డున కృష్ణునికోసం నిరీక్షిస్తున్న రాధలా వుందామె.

     "బాగున్నావా హరిచందనా?" నవ్వుతూ పలకరించాడు.

 Previous Page Next Page