విష్ణు తన చేస్తున్న పని ఆపి, "ఒరేయ్ వినీల్? నీ దగ్గిర చాక్లెట్ లు వున్నాయి కదరా" అన్నాడు.
వినీల్ తలూపాడు.
"మరింకా చూస్తావేమిట్రా వాటిని పంచు" అన్నాడు. ఉన్న కుర్రాళ్ళలో కాస్త ధైర్యంగా వున్నవాడు విష్ణు ఒక్కడే. హుషారు చేస్తున్నాడు. ఇంట్లో కోయవలసిన కేకు ఎదురుచూస్తూ వుండగా, ఇక్కడ వినీల్ ఒక్కొక్కకుర్రాడి దగ్గిరకి వెళ్ళి చాక్లెట్లు పంచుతున్నాడు.
"వినీల్ కి హాపీబర్త్ డే చెప్పండ్రా."
పిల్లలందరూ ముక్తకంఠంతో అన్నారు-
"హేపీ బర్త్ డే టూ యూ వినీల్-" ఆ లేత స్వరాల ప్రకంపనలు తరంగాలుగా వ్యాపించాయి. గోడమధ్య మొలిచిన రావిమొక్క దిగులుగా వూగుతోంది. ఆకాశం మేఘావృతమై వుంది.
"మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు వినీల్" విష్ణు అందించాడు.
మరోసారి "మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు వినీల్" కోరస్ గా పిల్లలు అన్నారు. కళ్ళనీళ్ళ మధ్య మెరుపంత సంతోషం..... విషాదం మధ్య రవంత చిరునవ్వు ఆ పసివాళ్ళ మొహాల్లో అమాయకంగా కదలాడింది.
అప్పుడు ప్రవేశించాడు అనంతానంతస్వామి అక్కడికి. లేళ్ళ గుంపుని చూసిన మృగంలా వాళ్ళవైపు కొద్దిక్షణాలు తేరిపార చూసాడు. చిరునవ్వుతో అడిగాడు-
"నీ పేరేమిటి?"
"వినీల్".
"ఏం చదువుతున్నావు?"
"ఆరో తరగతి".
అనంతానంతస్వామి చాలా పొడుగు. వినీల్ తలపైకెత్తి మాట్లాడుతూంటే వర్షపు చుక్క ఒకటి వాడి కంటి అద్దంమీద పడింది. తుడుచుకున్నాడు. స్వామి వాడి భుజంమీద చెయ్యివేసి బయటకు తీసుకువెళ్ళాడు. మిగతా ముగ్గురు టెర్రరిస్టులూ లోపలే ఉన్నారు. బైట సంభాషణ లోపలికి వినిపిస్తోంది.
"మీ స్కూల్లో ప్రేయర్ ఏం చేస్తార్రా వినీల్?" స్వామి అడుగుతున్నాడు.
"ప్రొద్దున్న పూటేమో మా తెలుగు తల్లికి మంగళారతులు, సాయంత్రం పూటేమో జనగణమణ....."
"నీకు పూర్తిగా వచ్చా?"
"ఓ! పూర్తిగా వచ్చు అంకుల్..."
"పాడు చూద్దాం...."
"జనగణమణ అధినాయక జయహే...." ఆ కుర్రవాడి కంఠం నిండా ఆర్తి. పూర్తిగా పాడితే అందర్నీ వదిలేస్తారేమో అన్న ఆశ. ఊపిరితిత్తుల నిండా బలంగా గాలి నింపుకుని స్వరం హెచ్చించి పాట పూర్తి చేశాడు.
జనగణమంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా.....
జయహే - జయహే- జయహే- జయహే-
జయ....జయ....జయ....జ....య....హే"
తెల్లపావురాలు గుంపులా లేచినట్టు- వాతావరణం చెదిరిపోయేలా ప్రకృతి చెదిరిపోయేలా పిస్టల్ పేలిన శబ్దం.
ఆకాశం రోదించడం ప్రారంభించింది. మేఘాలు కరగడం మొదలైంది.
* * *
"అసెంబ్లీ ముందు బాలుడి శవం".
ఈ వార్త తెలియగానే కంట్రోలు రూమ్ దగ్గిర వున్న తల్లిదండ్రుల్లో కలవరం చెలరేగింది. ప్రవాహంలా అక్కడికి చేరుకున్నారు.
తుపాకిగుండు తగిలి నేలకూలిన హంసలా రోడ్డు పక్కన పడివున్నాడు వినీల్. వాడిచుట్టూ రక్తం వర్షంతోపాటు మడుగుకట్టింది. వాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తోంది.
సునాదమాల విద్యుద్ఘాతం తగిలిన దానిలా అచేతనంగా నిలబడి వుంది. వృద్ధాప్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా బామ్మ అయిదారు గంటల్నుంచీ అలాగే అక్కడే నిలబడి వుంది. నేల ఈనినట్టు జనం. కంట్రోలు చేయటం కష్టమవుతోంది. విలేఖర్లు ఫోటోలు తీసుకుంటున్నారు. ప్రతి వారికి అక్కడ పడివున్న బాలుడి శవం తమ పిల్లాడి శరీరం లాగే కనపడుతోంది.
తమ నిస్సహాయతకు నిదర్శనగా పడివున్న ఆ బాలుడి శవాన్ని చూసి పోలీసులు సిగ్గుతో తల వంచుకున్నారు.
చీకటి పడింది. ఎవరూ అసెంబ్లీ ముందునుంచి కదలటం లేదు. జనం కామెంట్స్ చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రుల్లో అలజడి, ఆవేశం ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం నుంచి దీనికి పరిష్కారం వెంటనే ఆశిస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం మాత్రం ఏం చెయ్యగలదు? పాతికమంది పిల్లల్ని బంధించి బెదిరిస్తే ఒక సుస్థిరమైన ప్రభుత్వం దిగిపోవలసి వస్తే ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలకి చోటెక్కడ వుంటుంది? టెర్రరిస్టులు మరింత విజృంభిస్తారు. ఇదొక మార్గం అయిపోతుంది వాళ్ళకి.
ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గం సభ్యులు రకరకాల భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు.
మరుసటిరోజు పేపర్లలో మొదటి పేజీలో ఆ ఫోటో పడింది.
అసెంబ్లీ ముందు ముడుచుకు పడివున్న బాలుడి శవం! హృదయ విదారకంగా ఏడుస్తూన్న తల్లి ఫోటో.....
గంట తిరిగేసరికల్లా రాష్ట్రమంతా పాకిపోయింది ఈ వార్త.
ప్రజల్లో కలవరం!
అధికార వర్గాల్లో కలవరం!!
ఎంతమంది పిల్లల్ని ఇలా బలిపెడతారు ముఖ్యమంత్రి? ఎందుకంటే టెన్షన్? పోనీ రాజీనామా చెయ్యకూడదూ?.....
విత్తనంలా ప్రారంభమైన ఈ భావం కొన్ని వర్గాల్లో అంకురమై క్రమంగా చెట్టులా మారింది. ప్రజాభిప్రాయం మార్చటం ఎంతసేపు?
సాయంత్రమయ్యేసరికి మరో శవం తయారవుతుందా? ఈ ఆలోచననే ప్రజలు భరించలేకపోతున్నారు.
ఆ నరరూప రాక్షసులు వార్నింగ్ కూడా ఇవ్వటం లేదు. సంప్రదింపులు జరపటం లేదు. ఇరవై అయిదు రోజులపాటు రోజుకొక కుర్రవాణ్ని చొప్పున చంపుతామని ధృడ నిశ్చయంతో వున్నారు. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు.
పత్రికా సంపాదకీయాల్లో కూడా నిన్న వున్నంత పట్టుదల లేదు. ముఖ్యమంత్రి ఏదో చెయ్యాలన్న అభిప్రాయాన్ని నెమ్మదిగా సూచించాయి. అలా కాకుండా ఏ మాత్రం అటూ ఇటుగా వ్రాసినా ప్రజాగ్రహానికి లోనుకాక తప్పదు.
'ఇంకో ఇద్దరు మరణించేవరకు చూద్దాం' అని వ్రాస్తే పేపరువాన్లు తగలబడిపోతాయి. ఏ పత్రికైనా బ్రతికేది ప్రజలమీదే! విలేఖర్లు మాత్రం ఏం చేస్తారు?
నిన్నటివరకూ ముఖ్యమంత్రి పట్ల సానుభూతితో, దీన్ని ఎలా అయినా ఎదుర్కోవాలని సలహా ఇచ్చినవారే, ఇప్పుడు కాస్త వెనుకాడుతున్నారు. విమానాన్ని హైజాక్ చేసినవారు కూడా అవతలివారు ఆలోచించుకోవటానికి కాస్త టైమిస్తారు. వీళ్ళు అదీ చేయటంలేదు. తమ లక్ష్యం తప్ప మిగతా దారులు మూసేశారు. Ball is in your court అన్న అభిప్రాయాన్ని కలుగచేశారు.
అధికార పక్షం ఇరుకున పడింది.
* * *
విసుగ్గా వుంది ప్రవల్లికకి. ఇరిటేటింట్ గా వుంది.
ఏం చెయ్యాలో అర్ధంకావటంలేదు. చీఫ్ అర్జెంటు పని అని ఢిల్లీలో వున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇరుకున పడటం ఎవరికి సంతోషం? బ్లడీ పోలిటిక్స్.....
సాయంత్రం మవుతూంటేనే భయంగా వుంది ఆమెకి. మరో అమాయక బాలుడి శవం ఎదురు చూస్తున్నట్లు వుంది. ప్రతిపక్షాలు అప్పుడే బంద్ కి పిలుపు నిచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పిల్లల తల్లిదండ్రులు చేసే గొడవ హృదయ విదారకంగా వుంది. వారి అలుసు తీసుకుని సంఘ విద్రోహులు చెలరేగితే కష్టం. ఈ పరిస్థితుల్లో పోలీస్ కమీషనర్ లాఠీ ఛార్జీకి ఆర్డరిచ్చినా-వెల్లువలా తిరగబడ్తారు ప్రజలు. అసలే పోలీసుల మీద సానుభూతి అంతంత మాత్రం!
కంట్రోల్ రూమ్ ఎదురుగా జనం గుంపులు గుంపులుగా వున్నారు.
దాదాపు ఇరవై నాలుగ్గంటల్నుంచీ తరువాత వంతు ఎవరిదీ అన్నట్టు బిక్కమొహాల్తో నిలబడిన తల్లిదండ్రుల్ని చూస్తూంటే ఆమెకి బాధగానూ, విచారంగానూ వుంది.
ఏం చెయ్యటానికీ తోచటంలేదు.
ఆ సమయంలో ఫ్యూను వచ్చి "ఎవరో మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు మేడమ్" అని చెప్పాడు.
ఆమె విసుగ్గా "ఎవరు?" అంది.
"విహారి అట!"
ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఈ సమయంలో విహారి.........
"రమ్మను" అంది క్లుప్తంగా.
విహారి వచ్చి ఎదురుగా కూర్చుంటూ, "క్షమించాలి. మీ టైమ్ అనవసరంగా వేస్టు చేస్తున్నట్టున్నాను" అన్నాడు.
"చెప్పండి. ఏమిటి?"
"పోలీసు డిపార్టుమెంట్ నుంచిగానీ, మంత్రివర్గం నుంచిగానీ ఏ ప్రకటనా లేదు. అయిదు అవటానికి ఇంకో గంట మాత్రమే టైమ్ వుంది."
ఆమె కాస్త కోపంగా, "అవును. ఆ విషయం మాకు తెలుసు" అంది.
అతడు ఆమె కోపాన్ని పట్టించుకోలేదు. సిన్సియర్ గా అన్నాడు. "నాకీ విషయాల్తో ఏ సంబంధమూ లేదు. ఒక సామాన్య పౌరుడిగా పేపర్లు చదివి విషయం తెలుసుకోవటం-"
ఈ లోపులో ఆమె సర్దుకుంది. తన అకారణ కోపానికి సిగ్గుపడింది. ఈ ఇరిటేషన్ నుంచి బయటపడగలిగితేనే గానీ నిజమైన ఎగ్జిక్యూటివ్ లక్షణాలు రావు.
అతనన్నాడు. "మీరేదైనా చేస్తే తప్ప మరో గంట తర్వాత జరగబోయే మరో పసిపిల్లాడి హత్యని ఆపలేరు. వాళ్ళని ఏదో విధంగా కాంటాక్ట్ చెయ్యాలి."
"అవును. చెయ్యాలి. కానీ వీళ్ళెవరో, ఎక్కడుంటారో కూడా తెలియటంలేదు. ఎంత ఘోరమైన టెర్రరిస్టులయినా సంప్రదింపులు జరుపుతారు. ఇది కావాలీ అని అడుగుతారు. కానీ వీళ్ళేమీ చెయ్యటంలేదు. తమ కోర్కెల్లో వెసులుబాటు చూపించటం లేదు."
"ఆ విషయమై నాకో ఆలోచన వచ్చింది. ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్ధంకాలేదు. ఈ లోపులో మీరు గుర్తు వచ్చారు".
ఆమె కళ్ళు విప్పారితం చేసి, "ఏమిటా ఆలోచన?" అంది.
"వాళ్ళు మన ముఖ్యమంత్రికి ఏం చెప్పారో అర్ధంకాలేదు. ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యటం వరకూ సరే..... అసెంబ్లీ రద్దుచేయాలా? లేక తన మంత్రివర్గంలో ఎవరికయినా పట్టం కట్టాలా? అదీగాక ప్రతిపక్షానికి అధికారం వప్పచెప్పాలా? ఈ మూడిట్లో ఏది చెయ్యాలి? టెర్రరిస్టుల వ్యతిరేకత ముఖ్యమంత్రి మీదా? మొత్తం అధికార పక్షం మీదా? ఇవన్నీ మనం అడుగుతాం. వాళ్ళు సమాధానం చెప్తారు. ఆ విధంగా కాస్త టైమ్ దొరుకుతుంది. కనీసం ఒక పిల్లవాడి-" అతడి మాటలు పూర్తి కాకుండానే ఆమె లేచి, "థాంక్స్" అంటూ మరి మాట్లాడకుండా ఫోన్ అందుకుంది. అతడి మాటల్లో అర్ధాన్ని ఆమె పసిగట్టటానికి క్షణంకూడా పట్టలేదు. ఆమె చేతులు మిషన్ కన్నా వేగంగా ఫోన్ డయల్ చేశాయి.
"నాకు పదవినుంచి తప్పుకోవటానికి అభ్యంతరం లేదు. పిల్లలు ముఖ్యం. మీరే విధమైన ప్రకటన ఇచ్చినా నాకు సమ్మతమే" అట్నుంచి ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఒక్కరోజులో పది సంవత్సరాల వయసు పైబడిన వారిలా వున్నారాయన.