Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 10

    'పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే' అంటే అర్ధం చేసుకుంటే ఎంత మంచి భావన అని పద్మజ గుర్తురాగానే అతడి మనసంతా అదోలాంటి మధురమైన భావంతో నిండిపోయింది.

    నాకు నిన్ను స్పృశించాలని వుంది. ఎందుకలా  వణుకుతావు? చూపులెప్పుడో  ఆ పనిచేసేశాయికదా! నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలని వుంది. ఎందుకలా  భయపడతావు? చెవులుండేది చెక్కిళ్ళ పక్కనే. నా మాటలు ముద్దుకన్నా  తియ్యగా ఆ పక్కనే ఎప్పుడో చేరాయి కదా! సూర్యుడు పయనించని చోటికి పయన మవ్వాలని  వుంది. ఎందుకంత కంగారు పడతావు? మనో కిరణానికి  పరావర్తన సూత్రాలు అడ్డు కావు కదా.


                          *    *    *


    "గుడ్ మార్నింగ్" అంటూ  లోపలకు వచ్చాడు సోమశేఖరం.

    "హలో మార్నింగ్" నవ్వుతూ పలకరించింది హిమజ. ఇంతలో లోపల్నుంచి పద్మజ వచ్చింది.

    "రండి ముందు టిఫిన్ చేద్దురుగాని, మా రామయ్య వంట ఇంత వరకూ మీరు రుచి చూడలేదుగా" ఆహ్వానించింది పద్మజ, అతని మొహంలో అలసటను గమనిస్తూ.

    "వద్దండీ. ఇప్పుడే ఇంట్లో తీసుకుని వస్తున్నాను. టీ ఇవ్వండి చాలు" కుర్చీలో కూర్చుంటూ  అన్నాడు.

    "బయటకెళ్ళే పనుంది. నేను వెళతానక్కా! బై" శేఖరానికి చెప్పి వెళ్ళిపోయింది హిమజ - అతనేదో తన అక్కతో మాట్లాడడానికి వచ్చినట్లు గ్రహించి -

    చెల్లెలు వెళ్ళిపోయాక 'చెప్పండి ఏం జరిగింది?" అంది పద్మజ అతనికి టీ అందిస్తూ.

    "నిన్న సి.బి.ఐ. నుంచి  ఒక ఆఫీసర్ వచ్చి కలిశాడు. మనకు తెలియకుండా  చాలా రహస్యాలు బయటపడుతున్నాయి. డిపార్ట్ మెంట్ నించి. ఈ మధ్య కొందరు ఆఫీసర్ల ట్రాన్స్ ఫర్స్ విషయమై లిస్టు తయారు చేశాం గుర్తుందా? అదింకా అప్రూవ్ కానేలేదు, అప్పుడే కొందరు కాన్సిల్ చేయించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తర్వాత మన సీక్రెట్ ఫైల్ నంబర్ మూడుకి సంబంధించిన కొన్ని పేపర్ల తాలూకు జిరాక్స్ కాపీలు బయట కనిపించాయి. అంటే మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా ఫైల్స్ లో పేపర్లు బయటకు కూడా వెళుతున్నాయన్నమాట"

    "మీరూ, నేనూ జాగ్రత్త పడుతున్నాం కానీ ఆఫీసులో మిగతా వాళ్ళు  ఫైల్స్ ఎక్కడంటే  అక్కడ పడేస్తున్నారు. నేను నా కళ్ళతో చూశాను. మనం చెప్పినా వినే స్థితిలో  లేరెవరూ. ఇక మనమే జాగ్రత్త పడాలి. ఆలస్యం చేసి ప్రయోజనం లేదు. మనం అనుకున్న ప్రకారం మీరు క్యాజువల్ గా అన్ని సెంటర్లూ  తిరిగి వివరాలు సేకరించుకు  రండి. కొన్ని క్లూలయినా దొరకవచ్చు" సాలోచనగా  అంది.

    "నేనూ అదే ప్లాన్ తో వచ్చాను. మీరు చెప్పినట్లుగా ముందుగా బాంబే వెళుతున్నాను యివ్వాళ సాయంత్రం. కాని...." ఆగిపోయాడు.

    "చెప్పండి సందేహిస్తారేం ?"

    "ఏం లేదు, అమ్మకు మళ్ళీ జ్వరం వస్తోంది. రేపోసారి  శివయ్యని పంపిస్తారేమోనని"

    పద్మజ నవ్వింది.

    "శేఖరం! ఇన్నాళ్ళనించి కలిసి పని చేస్తున్నాం. నాతో ఏదన్నా చెప్పాలంటే  ఎందుకంత సందేహిస్తారు? రేపు శివయ్యని పంపుతాను. నేనూ వెళ్ళి వస్తాను. అసలావిణ్ని ఇక్కడికే తీసుకొస్తే  బాగుంటుందేమో"

    "వద్దులెండి. తను అంత సులభంగా ఇల్లు వదిలిరాలేదు"

    "సరే. మీ ఇష్టం"

    శేఖరం  బయటికి  వెళుతూంటే  అతడి చెవుల్లో ఆమె మాటలే గింగిర్లు తిరుగుతున్నాయి. "నాతో చెప్పాలన్నా  ఎందుకు సందేహిస్తారు?" అన్నవి.

    ప్రేమలో  ప్రపంచమంతా  ఆనందంగా కనబడటానికి  కారణం "దగ్గిరతనం" అనేది ఒక లెక్కలాంటిదికాబట్టి !

    సంతోషం గుణకారం, దుఃఖం భాగహారం.

    స్నేహం కూడిక, శతృత్వం తీసివేత.


                         *    *    *


    "మనకు కూడా విదేశీయుల్లా  భోజనం  అంటే నాలుగయిదు కోర్స్ లుంటే బాగుంటుంది కదండీ. ఎంచక్కా  ఓ నాలుగు గంటలపాటు  డిన్నర్ పేరుతో  హోటల్లో  గడిపేయవచ్చు" స్పూన్ తో సిప్ చేస్తూ అన్నాడు గిరి.

    "అవునవును. ఈ లోపల తిన్నది అరిగిపోతుంటే మళ్ళీ తినొచ్చు కూడా. ఇంతకీ హోటల్లో కూర్చునే గంటలు గడపడమెందుకట" అంది పద్మజ నవ్వుతూ.

    "ఎప్పుడూ అనిపించదనుకోండి. ఎంత త్వరగా పారిపోదామా అనే అనిపిస్తుంటుంది. కానీ ఇవాళ స్పెషల్ - నా జీవితంలో ఒక స్త్రీకి నేను డిన్నర్ ఇవ్వడం  ఇదే మొదటిసారి మరి"

    "అంటే ఇప్పటివరకూ  వాళ్ళే మీకు డిన్నర్ ఇస్తూ వస్తున్నారా ?"

    "అదిగో! మళ్ళీ దెబ్బకొట్టారు నన్ను. అసలు నాలాంటి  వెధవతో అడగ్గానే డిన్నర్ కొచ్చే పిచ్చి తల్లులెవరు చెప్పండి?"

    "నా వేషధారణ చూచి నేను చాలా మాదర్నే అని మీరు అనుకుంటే చాలా పొరబడుతున్నారు గిరీ. బారెడు జుట్టుకి పోషణ చేసుకోవడానికి టైం లేక యిలా  పొట్టిగా  కత్తిరించుకోవడం  తప్ప మిగతా విషయాల్లో నేను చాలా ఆర్తడాక్స్. పొద్దుటే లేచి స్నానం చేసి దీపం పెడ్తేగాని  పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. ఏం ఎందుకలా  నవ్వుతున్నారు ?"

    "మీరు మరీ అంత ఆర్తడాక్స్ అంటే నమ్మలేకపోతున్నాను"

    "కాని అదే నిజం గిరిధర్! నాకు టైంలేదుగానీ వీలుంటే రోజుకో రెండుగంటలు పూజగదిలోనే గడుపుతాను. మా నాన్నగారి దేశభక్తి, మా అమ్మ దైవభక్తీ సమపాళ్ళలో  నాలో  కలిసిపోయాయేమో. ఉద్యోగం మానేయాలంటే మనసొప్పదు. దేశానికి కాస్త సేవ చేస్తున్నాననే  తృప్తి. అది మా నాన్నగారి కోరిక కాబట్టి  తీరుస్తున్నాననే  ఆత్మ సంతృప్తి. కాకపోతే  ఇందాక మీరు అన్నారే చక్కటి పాట వింటుంటే ఏదో వెలితి అని. అది నేనూ ఫీలయేదే కాని అదేమిటో అర్ధంకాలేదింతవరకూ, నిద్ర పట్టకపోతే కాస్సేపు దైవస్మరణ చేసుకుని, అప్పటికీ  నిద్ర పట్టకపోతే  డాక్టరు ఇచ్చిన మాత్రలు మింగి నిద్ర కొని తెచ్చుకోవడం  అలవాటయింది."  

 Previous Page Next Page