Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 11

    "మీరు కోపం తెచ్చుకోనంటే ఒకమాట చెప్తాను పద్మజా! నేను నాస్తికుణ్ణి. కానీ అది కేవలం,  అక్కయ్యను సంతోష పెట్టడానికే."

    "అబ్బే! కోపం దేనికి మీరు ఫ్రాంక్ గా చెప్పడమే మంచిది కదా."

    "అయితే జోక్ చెయ్యొచ్చన్న  మాట. మీ యింట్లో  రోజూ  కొబ్బరిపచ్చడి చేసే అవకాశాలు  ఎక్కువున్నాయా?" అడిగాడు సీరియస్ గా.

    ఫక్కున నవ్వింది పద్మజ.

    "హమ్మయ్య. మళ్ళీ సంభాషణ దారిలో పడింది. ఇంతకీ మన సంభాషణ సీరియస్ గా మారడానికి కారణం ఏమిటంటారు?"

    "కారణం ఏముంది అన్ని విషయాలు మాట్లాడుకోవాలిగా."

    "అదికాదు నేను చెప్తా వినండి. మనం సూపు తీసుకుని అరగంటయింది. ఇంకా తర్వాత అయిటమే రాలేదు. అదీ కారణం. వేడి వేడి సూపు కడుపులో  చేరి మనల్ని హాట్ హాట్ గా చేస్తోందన్న మాట...." వివరించాడు గిరి.

    "బాగుంది. అయితే బేరర్ ని పిలిచి కేకలేద్దామా...." అంది కొంటెగా.

    "వద్దు - అంతపని చెయ్యకండి. పాశ్చాత్యుల్లా  మనకు భోజనంలో అన్ని కోర్సులు ఎందుకు పెట్టలేదో ఇప్పుడర్ధం అయింది నాకు. అసలు హోటల్లో నాలుగు గంటలు గడపాలంటే మనం ఒక పని చెయ్యొచ్చు. బాగా మసాలాలు కలిపి గంటన్నరకే  ఉడికే పదార్ధం ఆర్డరిస్తే చాలు. ఎలాగూ మనం ఆర్డరిచ్చాకే వంట మొదలు పెడతాడు గదా !"

    "ఒక్కోసారి మీరు చాలా  అవకాశవాదులని అనిపిస్తుంటుంది మీ మాటలు వింటూంటే" నవ్వుతూనే అంటించింది పద్మజ.

    "మీలాంటి జీనియస్ తో మాట్లాడడం నిజంగా ఒక ఛాలెంజ్ !  చూడండి నా తత్వాన్ని  ఎంత బాగా కనిపెట్టేశారు. కానీ - ఒక్క విషయం నా కిష్టమైన విషయాల్లో  అవకాశవాదినే కాదు ఆశావాదిని కూడా."

    "మరీ అలా జీనియస్ అని పదే పదే అనకండి. ఎవరైనా పప్పులో  కాలేస్తూనే వుంటారు...." సర్వరు తెచ్చిన పదార్ధాలు సర్దుతూ అంది పద్మజ.

    "ఇప్పుడీ సర్వరు  తెచ్చిన పప్పులో మాత్రం కాలేయకండి  మళ్ళీ  తేవడానికి గంట పడుతుంది."

    "అది పప్పుకాదండీ బాబూ మీరు ఆర్డరు చేసిన స్పెషల్ చికెన్ గ్రేవీ అది."

    "ఓహో అయితే నేను పప్పులో  కాలేశానన్నమాట. నేనూ జీనియస్ నయిపోతున్నాను చూశారా ఈ కాస్త పరిచయంతోనే."

    ఆమె మాట్లాడలేదు. ఎందుకో ఈ సంభాషణ కృతకంగా అనిపించింది.

    "సరే యిప్పుడు భోజనాన్ని సమంగా  పంచుకోవాలన్న మాట...." ఆమె ప్లేట్లో వడ్డిస్తూ  అన్నాడు గిరిధర్. "వున్నది యిద్దరమే కాబట్టి  చపాతీలు చెరి రెండూ. రైసుని రెండు భాగాలు చేయడం కష్టం కాదు. కాకపోతే "ఎల్" షేపు స్థలం పజిల్ లా ఈ చికెన్ లెగ్ ను....అన్నట్లు ఏమండీ మనం ఆర్డరు వేసింది చికెన్ కదు. యితను కొంగను పట్టుకొచ్చాడనుకొంటాను. ఒకే కాలు  కనిపిస్తోంది."

    నవ్వింది పద్మజ. "మీరు ఆర్డర్ చేసింది  హాఫ్ చికెనే మర్చిపోయారా ?"

    "ఓ అవునుగదూ__నాకంటే  ఆ సర్వారాయుడికి లెక్కలు బాగా వచ్చుననుకుంటాను. ఇంతకీ దీన్ని పంచుకోవడమెలా  చెప్పండి."

    "అన్నింటినీ  పంచుకోవసిందేనా ఏమిటి ?"

    "ఆ, మీకు అభ్యంతరం లేకపోతే అన్నింటినీ  ఏకంగా పంచుకోవాలనుకుంటున్నాను, మీ జీవితంతో సహా" సూటిగా ఆమె వైపు చూశాడు.   

    పద్మజ షాక్ తగిలినట్టు  చూసింది అతని వైపు. ఎందుకో తెలీదు గానీ అతడామాట అనగానే  ఆమెకి సోమశేఖరం గుర్తొచ్చాడు. దానికి లాజిక్ లేదు. కానీ  ఎందుకో మరి. ఈ లోపులో  గిరి అన్నాడు.

    "నిజం పద్మజా! రెండురోజుల  పరిచయానికే యిలా అడగడమేమిటని  మీకు ఆశ్చర్యంగా ఉందేమో. కానీ మిమ్మల్ని చూసిన రోజునే నేను చేసుకున్న నిర్ణయం అది. మీరు ఆలోచించి చెప్పండి. తొందరేం లేదు."


                         *    *    *


    "హిమా?"

    "ఏంటక్కా, ఇంకా పడుకోలేదా....?" పక్కమీద  నుంచి లేస్తూ అంది హిమజ.

    "ఫరవాలేదు పడుకో - నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను...."

    "చెప్పక్కా, ఏమిటి ?"

    "నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను."

    "నిజంగా__అయామ్ వెరీ వెరీ హాపీ, ఎవరో నాకు తెలుసులే" టీజింగ్ గా అంది హిమజ.

    "ఆ రోజు పార్టీలో  పరిచయమయ్యాడని  చెప్పాను చూడు గిరిధర్ అని ఆయన్ని." హిమజ నమ్మలేనట్టు  చూసింది.

    చివరికి  నెమ్మదిగా - "అక్కా, నేను....నేను....నువ్వు సోమశేఖరం గార్ని  చేసుకుంటావనుకున్నాను" అంది.

    "సోమశేఖరాన్నా ? లేదమ్మా  అతనిమీద  నాకు ఇలాంటి అభిప్రాయం కలగలేదెప్పుడూ. మేమిద్దరం మాంచి స్నేహితులం అంతే"

    హిమజ ఆమెవైపు సూటిగా చూసింది. ఆ అమ్మాయి తెలివైంది. అందుకే ఆ విషయం రెట్టించకుండా, "కానీ ఈయన గురించి  నీకేమీ తెలియదుగా. నాలుగు రోజుల  పరిచయంతో  ఈ నిర్ణయం  తీసుకున్నావా?" అంది.

    "అర్ధం చేసుకోడానికి  నాలుగు రోజులు చాలనే అనుకుంటున్నాను. మా ఆఫీసునించి  అంత టెన్షన్ లో వచ్చే నాకు కావలసింది శేఖరం లాంటి స్నేహితుడు కాదు. నన్ను నవ్వించి, మైమరపించే  తోడు కావాలి. గిరి సమక్షంలో నేను అంతా మర్చిపోయి హాయిగా నవ్వగలను. అలాంటి వ్యక్తినే  నేను కావాలనుకున్నది."

 Previous Page Next Page