"సాలేగాడికి హాండ్ కప్స్ వేసి తీస్కపొండి" కానిస్టేబుల్స్ ని ఆజ్ఞాపించాడు. తక్షణం ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి చేతులకుబేడీలు వేసి లాక్కెళ్ళి జీప్ లోకి తోశారు. లాకప్ లో సాయంత్రం వరకూ వుంచాక ఇన్ స్పెక్టర్ తన దగ్గరకొచ్చాడు.
"ఇంటికి పోవాలనుందా?" అడిగాడు హేళనగా.
తను మాట్లాడలేదు.
"కాగితం రాయి-" అంటూ కాగితం, పెన్నూ తన ముందుంచాడు.
"ఏమని?"
"నువ్వు ఆ స్టూడెంట్స్ మీద పాత కక్షలవల్ల దొంగ కంప్లయింట్ ఇచ్చానని"
"నేను రాయను-"
బెల్ట్ దెబ్బవీపుమీద పడింది. వరుసగావళ్ళంతా దెబ్బలు చేతులకూ, ముక్కుకీ రక్తం కారుతోంది. ఎప్పుడు స్పృహ తప్పిందో తెలీదు. మెలకువవచ్చేసైర్కి ఊరి బయటచెట్ల మధ్యపడి వున్నాడు. అతికష్టం మీద లేచి ఇంటికి చేరుకోవటం ఊరి వాళ్ళంతా చూశారు. ఎవ్వరూ, సానుభూతిగా ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు.
తన భార్య తననుచూస్తూనే ఏడిచింది.
"మనం ఈ ఊరునుంచి వెళ్ళిపోదాం" అంటూ గొడవచేసింది.
తను వప్పుకోలేదు.
కలెక్టర్ బంగళాకు చేరుకున్నాడు. కలెక్టర్ ఎస్పీకి ఫోన్ చేశాడు. క్షణాల్లో యంత్రాంగం కదిలింది. అప్పుడు వచ్చాడు భూపతి రంగంలోకి.
"ఏరా, బ్రతకాలనిలేదా నీకు? ఎవళ్ళతో ఠకరాయిస్తున్నావ్ రా?" అన్నాడు తనను ఇంటికి పిలిపించుకుని.
"మన దిక్కు మాలిన దేశంలో పుట్టినరోజునుంచే ప్రాణాలమీద ఆశ వదులుకుని బ్రతుకుతూంటారు అందరూ"
"సాలే, మంచిగ జెప్తున్నాను ఇను. ఎవళ్ళో పోరిలను మా పిల్లగాండ్లు బనాయిస్తే నీకే మాయెరా. నీ పెండ్లాంనేమయినా అంటే నువ్ మాట్లాడాలె. ఇగో చూడు! నీకు 24 గంటలు టైమిస్తున్నా. ఈ ఊరిడిచిపో. ఎస్పీసాబ్ ఈడ ఎంక్వయిరీకి ఆదివారం నాడొస్తుండు. అప్పటివరకూ నీ నామ్ నిశాన కనిపించొద్దు. సమజాయెనా?"
"నేనీ ఊరు వదిలివెళ్ళేది లేదు. నీ ఇష్టం వచ్చినట్లు చేస్కో"
"అట్లనా, మంచిదిబిడ్డా. ఇంక పో నువ్వు"
తను ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి జరిగింది దారుణం. రెండు గంటలకు లారీఆగిన చప్పుడయింది ఇంటి ముందు. క్షణాల్లో దరవాజాలు పగిలితెరచుకున్నాయ్. అరడజనుమంది- తన తల మీదగట్టిగా మోదటంగుర్తుంది. తననూ భార్యనూ తాళ్ళతోకట్టి నోట్లోగుడ్డలు కుక్కారు. పిల్లలిద్దరినీ కూడ కట్టేసి లారీలో పడేశారు. ఆ తరువాత కళ్ళు తెరిచేసరికి తెల్లారిపోయి వుంది.
తనకు కొద్ది దూరంలోనే వివస్త్ర అయి పడి వుంది భార్య. మరి కొంతదూరంలో పిల్లలు. తన భార్యను సామూహికంగా మానభంగం జరిపారని అర్ధమయాక తనలో మార్పువచ్చింది. తను అనుసరిస్తున్న పద్దతి సరయినది కాదు.
తను ఒక్కడే యింతపెద్ద దారుణాన్ని ఎదుర్కోలేడు.
అప్పుడు గుర్తుకొచ్చారు అన్నలు-
వెతుక్కుంటూ చేరుకున్నాడు వాళ్ళను.
ఆ దళం నేత డాక్టర్ ఫణి తనకు అభయమిచ్చాడు. అతనే తనకీ తనభార్యకీ తన పిల్లలకీ వైద్యం చేశాడు. తమకు ఉంటానికి అక్కడ దగ్గర పల్లెలోనే ఓ ఇల్లు చూపించాడు. అక్కడి వర్తకులతో చెప్పి తనక్కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయించాడు.
అదంతా కలో నిజమోకూడా తనకర్ధం కాలేదు.
అంతా పబ్లిగ్గానే, అందరిఎదురుగ్గానే అక్కడి పోలీసులు చూస్తూండగానే తనను ఆదుకున్నారు వాళ్ళు అంతవరకూ తను నగ్జలైట్స్ అంటే ఎక్కడో అడవుల్లోనూ, కొండ గుహల్లోనూ ఉంటారనుకున్నాడు. కానీ వాళ్ళందరూ ప్రజల్లోనే ఉంటారనీ, ప్రజల సహకారంతోనే, ప్రజాబలంతోనే తమ కార్యక్రమాలు సాగిస్తారనీ, తమకూ తమ తోటివారికీ జరిగిన అన్యాయాలను ఎదుర్కోటానికే వారా వుద్యమం చేపట్టారనీ తనకు అప్పటివరకూ తెలీదు.
తనకు కొద్ది రోజులు రకరకాల తుపాకులు, రివాల్వర్లు ఉపయోగించే శిక్షణవారే ఇచ్చారు. ముందు భూపతిని చంపటం తనకుద్దేశించబడిన మొదటి కార్యక్రమం.
డాక్టర్ ఫణి తనతోపాటే ఉన్నాడు.
భూపతి హైద్రాబాద్ వెళుతోన్న విషయం తెలుసుకున్నారు ముందే. ఆ బస్ లోతనూ, ఫణీ ఇద్దరూ వెనుక సీట్లల్లో కూర్చున్నారు. బస్ జనగామ్ దాటాక తన గన్ తీసుకుని భూపతి సీటు దగ్గరకు నడిచాడు. ప్రయాణీకులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్ కి కండక్టర్ లేడు. ఫణి డ్రైవర్ దగ్గరకు నడిచాడు. ముందు తన చేతిలోని తుపాకి పేలింది. డ్రైవర్ బస్ ఆపేశాడు. అంతా భయభ్రాంతులయి చూస్తూండిపోయారు. తనూ, ఫణీ బస్ దిగారు.
"డ్రైవర్, బస్ పోనీ" ఆదేశించాడు ఫణి.
బస్ బయల్దేరివెళ్ళిపోయింది.
వెళ్ళేముందు భూపతి సీట్ వేపు చూశాడు తను. అంతా రక్తమయం అయిపోయింది. తనకు ఆనందం కలిగింది.
జీవితంలో ప్రప్రధమంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోగలిగాడు. కాలేజ్ ఎడ్మిషన్ల విషయంలోనూ, దారినపోయే వారందరిదగ్గరా బలవంతంగా చందాలు వసూలు చేసే జంట నగరాల గూండాలతో తగూ పడినప్పుడూ, ఉద్యోగాల విషయంలోనూ- ఎన్నో అన్యాయాలుచవి చూశాడు.
ఏనాడూ ప్రతీకారం తీర్చుకొనేధైర్యం, శక్తి తనకులేవు. కానీ ఇప్పుడు- తన జీవితానికి ఓ అర్ధం లభించినట్లయింది.
రెండో టార్గెట్ గా ఆ ఇన్ స్పెక్టర్ ని తనే ఎన్నుకున్నాడు. డాక్టర్ ఫణి తనభుజం తట్టాడు "నీకు సహాయంగా ఇద్దరినిస్తాను. నువ్వే ప్లాన్ తయారుచేసుకో" అన్నాడు.
తను ప్లాన్ తయారుచేశాడు కూడా. కానీ ఆ విషయం ఆ ఇన్ స్పెక్టర్ ముందేపసిగట్టాడు. తనమీద ప్రెజర్ తేవటంకోసం తన భార్యాపిల్లలను అరెస్ట్ చేయించాడు. వారెక్కడున్నారోకూడా తనకు తెలీలేదు. ఇన్ స్పెక్టర్ కేమయినాహాని కలిగితే తన భార్యా పిల్లలు తనకు దక్కరు - ఇదీ అతని మెసేజ్.
తను కృంగిపోయాడు. కానీ ఫణి ధైర్యం చెప్పాడు.
"నీ భార్యా పిల్లలను నీ దగ్గరకు చేర్చేపూచీ నాది. ఎవరు వాళ్ళను కిడ్నాప్ చేసుకెళ్ళారో వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి వదిలేసేలా చేస్తాను" అన్నాడు.
చాలా రోజుల్తరువాత ఆ కార్యక్రమం అమలుచేసే సమయం వచ్చింది. హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేయటం-అతనిని రిలీజ్ చేయాలంటే అక్రమంగా అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలనూ, వారి కుటుంబాలనూ పోలీసులు వదిలిపెట్టటం- ఇదీ ప్లాన్-
అంతా అనుకున్నట్లే జరుగుతోంది ఈ క్షణంవరకూ.
కానీ అసలయిన భాగంముందుంది!
ఇంకొద్ది గంటల్లో-
* * *
గురుమూర్తి అద్దంలోనుంచి ఇంజన్ హెడ్ లైట్ కాంతిలో ఎదురుగ్గా చాలాదూరం వరకూ కనబడుతోన్న ట్రాక్ వంకే చూస్తున్నాడు. అదివరలో మరో స్టేషన్ తాలూకు సిగ్నల్స్ సైటయ్యేవరకూ అంతగా పట్టించుకునేవారుకాదు. కానీ ఆ మధ్య జి.టి.ఎక్స్ ప్రెస్ కి మీడ్ సెక్షన్ లో యాక్సిడెంట్ అయిన దగ్గర్నుంచీ డ్రైవర్స్ అందరికీ భయం ఏర్పడిపోయింది.
స్టేషన్ లో గూడ్స్ ట్రెయిన్ షటింగ్ చేస్తూండగా ఒక బాక్స్ వాగన్ పొరపాటున సెక్షన్ లోకి పరుగెట్టడం తో అప్పుడే అవతలివేపు నుంచి ఫుల్ స్పీడ్ లో వస్తోన్న ఎక్స్ ప్రెస్ కి గుద్దుకుని చాలాప్రమాదం జరిగింది.
స్పీడ్ యాభై మించకుండానే నడుపుతున్నాడతను. లోలోపల బ్రేక్ పవర్ భయం మరింత పెరిగిపోయింది - కాజీపేటలోని అనుభవంతో ఖమ్మంలో కూడా అతి కష్టం మీద ఆగింది. ఎలాగోలా తను విజయవాడకు బండి చేరుస్తేచాలు! అక్కడి టిఎక్సార్ కి మెమో ఇచ్చి మళ్ళీ వ్యాక్యూమ్ చెక్ చేయించవచ్చు.
ఆ తరువాత వ్యాక్యూమ్ ఎలాగయినా ఛావనీ, తను డ్యూటీదిగిపోతాడు.
ఇంకెప్పుడూ ఇలాంటిపొరబాటు చేయకూడదు. ఎంత పెద్ద ఆఫీసరయినా ప్రెజరయిజ్ చేయనీ. తను సంతృప్తి పడందేసంతకం పెట్టకూడదు- బండి స్టార్ట్ చేయకూడదు.
అప్పుడే చీకట్లు విచ్చుకుంటున్నాయ్. టైమ్ చూశాడు గురుమూర్తి. అయిదున్నరయింది. నిజానికి ఈ పాటికి బండి విజయవాడ చేరుకోవాల్సింది. కానీ ఈ బ్రేక్ పవర్ భయంతో నడుపుతున్నందుకు బహుశా తనకు ఛార్జ్ షీట్ వస్తుంది. అయినా ఫర్లేదు. ఛార్జ్ షీట్ వస్తుందని భయపడితను రిస్క్ తీసుకోలేడు.
అతని మనసు మళ్ళీ సంధ్య మీదకు మళ్ళింది. నిజంగా చాలా విచిత్రమయిన మలుపులు తిరుగుతోంది ఆమె జీవితం. ఆమె వివాహం జరిగిన రెండో రోజే ఆమె భర్తకు స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది. అందరితోపాటూ తనూ హాస్పిటల్ కెళ్ళాడు. అప్పటికే అతను చనిపోయాడు
సంధ్య ఎందుకు ఏడవటం లేదు. చాలా మామూలుగా, ఎప్పటిలాగానే మాట్లాడుతోంది. ఒక్కరోజులో అనుబంధం ఎంత చక్కగా వుంటుందని?
తన దురదృష్టానికి చింతిస్తున్నట్లుందామె, అంతే.
కొద్ది రోజుల తర్వాత ఆమెను కలుసుకున్నాడతను. తను వెళ్ళేసరికి ఆమె టి.వి. చూస్తోంది.
మొఖానికి బొట్టూ, కళ్ళకు కాటుకా, చేతికి గాజులూ, అన్నీ అలానే వున్నాయి. ఇప్పుడు ఆమె అందం మరింత విజ్రుంభించినట్లుంది.
ఆమెకు వివాహం అయినట్లే అనిపించలేదు.
"రండి, కూర్చోండి" అంది చిరునవ్వుతో ఆహ్వానిస్తూ.
తను ఆమెకెదురుగా కూర్చున్నాడు.
ఆమె టి.వి స్విచ్చాఫ్ చేసేసింది.
"ఏం చేయను? ఇదొక్కటే కాలక్షేపం నాకు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎవరొకరు తటస్థపడటం, పరామర్శ చేయటం, నన్ను చూసి జాలిపడటం - భలేచిరాకుగా వుంటుంది నాకు. నన్ను చూసి ఒకరు జాలి ప్రకటిస్తే సహించలేను నేను".