Previous Page Next Page 
దావాగ్ని పేజి 10

 
    తప్పు నాన్నా: అలా అనకూడదు షి ఈజ్ అవర్ ఫ్రెండ్... వినీల:" అన్నాడు బాబూజీ.

 

    "ఓహ్: ఫ్రెండ్: అయితే వినీలా: మనం ఫుట్ బాల్ ఆడదామా?" అన్నాడు ప్రతాప్ ఉత్సాహంగా.

 

    అతని పరిస్థితిని అర్థం చేసుకున్న వినీల మృదువుగా అంది - "నాకు ఫుట్ బాల్ ఆడటం రాదు..."

 

    "పోనీ హాకీ?:

 

    "అదీ రాదు..."

 

    "అయితే నీకు తప్పకుండా కబడీ వచ్చి ఉండాలి. దా: ఆడుకుందాం: కబడీ: ఏం?" అన్నాడు ప్రతాప్.

 

     వినీల మొహం ఎర్రబడింది ఆమె యిబ్బందిని అర్థం చేసుకున్న బాబూజీ అన్నాడు. "వినీలకి చాలా పనివుంది నాన్నా: మళ్ళీ రేపొస్తుంది ఏం?"

 

    "అయితే మనిద్దరం పిగ్గీబాక్ ఆడుకుందాం..." అని లేచి ఎగిరి, బాబూజీ వీపుమీద యెక్కడానికి ప్రయత్నంచేశాడు ప్రతాప్.

 

    జాగ్రత్తగా ప్రతాప్ పట్టు వదిలించుకొని, అతడ్ని నౌఖరుకి అప్పగించి, ముందుకు నడిచాడు బాబూజీ అతనితోబాటు నడిచింది వినీల.

 

    కొద్ది క్షణాలు మౌనం తర్వాత స్వగతంలా అన్నాడు బాబూజీ-

 

    "ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరకం చింతపెట్టడం ఆ దేవుడికి సరదా కాబోలు: నాకు అన్నీ ఇచ్చాడుగానీ ఈ చింతను మిగిల్చాడు దేవుడు."

 

    "అతనికి ఏమైంది...?" అంది వినీల మెల్లగా.

 

    నిట్టూర్చి చెప్పాడు బాబూజీ. "సరిగ్గా రెండేళ్ళ క్రితం... నేనంటే గిట్టని వాళ్ళెవరో... నన్నేం చేసే దమ్ములేక, దొంగచాటుగా దెబ్బతీయదలుచుకొని, నా ప్రాణానికి ప్రాణమైన నా భార్యని హత్య చేసేశారు... కాలింగు బెల్లు మోగించి, డిటర్జెంట్ కేక్ ల సేల్స్ మాన్ లాగా లోపలికి చొచ్చుకొని వచ్చినవాడే తనపాలిటి యమదూత అవుతాడని నా భార్య ఊహించి వుండదు... ఆమె శరీరం మీద తొంభైతొమ్మిది కత్తిపోట్లు ఉన్నాయి. అతను నూరోసారి పొడిచేలోపల మా కుక్క హిట్లర్ వాడి మీదపడి కండలు పీకిపారేసింది ఘోరమైన చావు చచ్చాడు వాడు. కానీ చనిపోయిన నా భార్య తిరిగి వస్తుందా? ఆ తర్వాత ఇంటికొచ్చి యిదంతా చూసిన నా కొడుకు ప్రతాప్ కి మతిచలించింది. అప్పటినుండి అతను తన బాల్యంలోకి జారిపోయినట్టు ప్రవర్తిస్తున్నాడు.... ప్రపంచంలోని ప్రసిద్ధ వైద్యులందరికీ చూపించాను. గానీ ప్రయోజనం లేకపోయింది" అన్నాడు. అతడి గొంతు బొంగురుపోయింది.     

 

    ఆయన మీద జాలేసింది వినీలకి. "ఐ యామ్ సారీ..." అంది సిన్సియర్ గా.

 

    "ఫర్వాలేదు. ఎవరి ఖర్మ వారనుభవించక తప్పదు..."

 

    వాళ్ళకి ఎదురుగా - వాచ్ టవర్ కనబడింది. మూడంతస్థుల మేడ అంత ఎత్తున ఉండి అది. గుండ్రంగా, స్థంభంలా వున్న ఆ కట్టడానికి అన్నివైపులా అద్దాలే. దానిపై అంతస్థులో గన్ పట్టుకుని ఉన్న గార్డు యజమానిని చూసి అలర్ట్ గా నిలబడ్డాడు.

 

    "నా భార్య చనిపోయాక, నా కొడుకుమీద కూడా హత్యాప్రయత్నం జరుగుతుందేమోనని భయపడి, నా యింటిని ఇలా ఒక కోటలా దుర్భేద్యంగా మార్చి, ఇంత కాపలా పెట్టాను" అన్నాడు బాబూజీ.

 

    ఆయనమీద జాలేసింది వినీలకి ఆమెకి ఇంకో ఆలోచన కూడా వచ్చింది: ఆ వాచ్ టబ్ మీద ఎక్కి చూస్తే, తన కళ్ళుగప్పి మాయమైపోయిన ఆ కారు ఆ చుట్టుపక్కల ఎక్కడున్నా కనిపించవచ్చని.

 

    "దానిమీదికి ఎక్కి చూడొచ్చా?" అంది.

 

    "బై ఆల్ మీన్స్..." అన్నాడు బాబూజీ.

 

    ఇద్దరూ పైకి ఎక్కారు. వాళ్ళు నిలుచోవడానికి వీలుగా వుంటుందని కాబోలు గార్డు కిందకి వెళ్ళిపోయాడు.

 

    అన్నివైపులా తీక్షణంగా పరికిస్తోంది వినీల.

 

    ఒక నిముషం తర్వాత బాబూజీ అన్నాడు నిదానంగా.

 

    "ఎక్కడా కనబడలేదు కదూ. కనబడదు. ఎందుకంటే, ఆ కారు నా గారేజ్ లో ఉంది."

 

    గిరుక్కున వెనక్కి తిరిగింది వినీల. అప్పటికే అద్దాల తలుపులు మూసుకుపోతున్నాయి. తలుపు బయట వున్నాడు బాబూజీ. అతని మొహంలో పరిహాసంతో కూడిన నవ్వు.

 

    "మీ అపార్ట్ మెంట్స్ లో ఉన్న ఆ పిల్ల...ఐ హాడ్ ఫ్లింగ్ విత్ హర్ - సరదాగా ఓరోజు గడిపాను నేను. దానిమీద నాకు ఎంత మోజు పుట్టిందంటే దాన్ని పెళ్ళి చేసుకోవాలని గూడా అనిపించింది. పెళ్లి చేసుకుందామనుకున్నాను కూడా. కానీ దానికి అత్యాశ. నేను నా మనసులోని మాట బయట పెట్టేలోగానే, నన్ను బ్లాక్ మెయిల్ చేసి, నా దగ్గరనుంచి ఏదో లబ్ధిపొందాలనుకొని, మా సరసాన్నంతా వీడియో మీది కెక్కించింది. అది పెద్ద కిలాడీ.

 

    అందుకనే దాన్ని ఫినిష్ చేసేశాను. ఇంకోళ్ళచేత చంపించి వుండొచ్చు నేను కానీ నాకు అంత నిరాశ కలిగించిన చీప్ ఉమన్ ని నేనే స్వయంగా చంపాలనిపించింది. అనుకోకుండా ఆ హత్యని నువ్వు చూసేశావు. ఇప్పుడు చెప్పు: నిన్నుకూడా చంపెయ్యటం నాకు చాలా అవసరమంటావా కాదా?" అన్నాడు చాలా బిజినెస్ లైక్ గా.

 Previous Page Next Page