....అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు,
జారిపడే చేయి కాలు, దారిపొడుగు జనశవాలు
ఏ లోకం తల్లీ ఇట
ఏవో భాష్పజలాలు"
అతడి కంఠం మంద్రంగా మారింది.
ఎందుకో నేనక్కడ వుండలేకపోయాను. వాళ్ళని చూసుకొమ్మని సెంట్రీకి చెప్పి కదలి వచ్చేసేను. ఆఫీసువైపు నడుస్తూవుంటే చెంపమీద ఏదో జారుతున్నట్టు కనిపించింది. తడిమి చూసుకుంటే తడి తగిలింది. ఎప్పుడొచ్చాయో ఆ నీళ్ళు... ఎందుకొచ్చాయో కూడా అర్ధంకాలేదు.
5
"శివప్రసాద్! ఈ రోజు మనం లేడీస్ కాలేజీకి వెళ్ళాలి."
ప్రసాద్ ఆశ్చర్యంగా చూసి "ఎందుకు?" అని అడిగాడు.
"బోటనీ పరీక్ష ఈ రోజే కదా"
"అవును."
"అందుకే వెళ్ళాలి."
"నా కర్ధం కావటం లేదు గురూ. అయినా మనల్నెవరు లోపలికి వెళ్ళనిస్తారు?"
"మామూలుగా వెళ్తే వెళ్ళనివ్వరు. కాని ఈ డ్రస్ ఉన్నది చూడూ, ఇది ఎన్నైనా అద్భుతాలనిస్తుంది. ఈ కాలంలో విద్యార్ధులు కాపీ కొడుతున్నారని పోలీసులని పరీక్ష సమయంలో కాలేజీల్లో నియమిస్తున్నారా లేదా?"
"నియమిస్తున్నారు."
"మన డ్రెస్ కీ పోలీసులకీ తేడా వాళ్ళు కనిపెట్టగలరని నేను అనుకోవటంలేదు."
"అయితే?"
"అయితే లేదు గియితే లేదు. మనం ఈ రోజు వెళ్ళబోతున్నాం. అంతే."
శివప్రసాద్ కాదనలేదు. మరోసారి మంగతాయారుని చూడొచ్చనే ఆనందం వాడిది.
ఇద్దరం మోటార్ సైకిల్ మీద కాలేజీ చేరుకున్నాం. నేను అన్నట్టే డ్రెస్ లో వున్న మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదు.
కారిడార్ లో నడుస్తూ వుంటే రేఖ కనబడింది. ఆ సమయంలో నన్ను అక్కడ వూహించలేదేమో- ఆ అమ్మాయి కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనబడింది. కళ్ళతో విష్ చేశాను. చప్పున మొహం తిప్పేసుకుంది.
అంతలో లెక్చరర్ ప్రశ్నా పత్రాలకట్ట పట్టుకొస్తూ కనిపించింది.
"మేడమ్, ఆ పేపర్లొకసారి ఇస్తారా?" అని అడిగాను. నా ధైర్యానికి శివప్రసాద్ తల తిరిగిపోతున్నట్టుంది. అవాక్కయి చూస్తున్నాడు.
"వాట్స్ ద మేటర్" అందామె.
"ప్రశ్నా పత్రాలతో పాటూ ఆన్సర్లు కూడా సప్లయి అయిపోతున్నట్టు మాకు వార్త వచ్చింది. చెక్ చెయ్యాలి" అన్నారు అధికారపూర్వకమైన కంఠంతో.
ఆమె కట్ట అందించింది.
రూమ్ లో ఉన్న అమ్మాయి లందరూ మా వైపే చూస్తున్నారు- రేఖ కూడా. అదే నాకు కావాల్సింది.
కొంచెంసేపు పరీక్షించినట్టు నటించి తిరిగి ఇచ్చేశాను. "ఇంతవరకూ పరీక్షలంటే బోయ్స్ కాలేజీల దగ్గరే పోలీసు బందోబస్తు వుండేది. ఇప్పుడు ఆడవాళ్ళు కాలేజీల దగ్గిర కూడా అది వుండవలసి రావటం దురదృష్టకరం. వెళ్ళొస్తాను మాడమ్" అని ఆమెకి గుడ్ బై చెప్పేసి బయటకి వచ్చేశాం.
"అసలేమిటి గురూ ఇదంతా" అని అడుగుతున్నాడు ప్రసాద్. నవ్వి "ఇంకొంత కాలం ఆగు" అన్నాను.
కొన్ని రోజులాగి మళ్ళీ కాలేజీకి వెళ్ళాను. ఆ రోజే వాళ్ళ ప్రాక్టికల్స్. ఈసారి మోటార్ సైకిల్ మీద వెళ్ళలేదు. డ్రైవర్ తో సహా జీపులో వెళ్ళాను.
మళ్లీ ఆ లెక్చరరే వుంది. "ఏమిటి, ప్రాక్టికల్స్ లో కూడా స్లిప్పులు అందుతున్నట్టు వార్త వచ్చిందా?" అని అడిగింది. నవ్వి లోపలికి వెళ్ళాను. రేఖ ప్రాక్టికల్స్ చేస్తూ వుంది. చాలా సేపట్నుంచి రిజల్టు రాక కష్టపడుతున్నట్టు ఆమె నుదుటి మీద చెమట సూచిస్తూ వుంది.
"గుడ్ ఆఫ్టర్ మాన్ మాడమ్. ఏమిటి- పాస్ అవటంకోసం చాలా కష్టపడుతున్నారే! బోటని పేపరు బాగా వ్రాశారా?" అని అడిగాను.
"బ్రహ్మాండంగా వ్రాశాను."
"స్వపరాగ సంపర్కం గురించి బాగా పేజీలకు పేజీలు వ్రాసినట్టున్నారు."
"ఆహా. ఉదాహరణలతో సహా వ్రాశాను."
"పప్పులో కాలేసారు."
"అంటే?"
"మిగతా అందరూ పరపరాగ సంపర్కం గురించి వ్రాస్తే, మీరేమో రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించీ, అదీ ఉదాహరణలతో సహా పేజీలకు పేజీలు వ్రాశారు. దీనికి మెచ్చుకొని ఎగ్జామినర్ మీకో పెద్దకోడి గుడ్డు, అంటే గుండుసున్నా ఇవ్వబోయాడు."
ఆమె మొహం పాలిపోయింది. చేతివేళ్ళు వణుకుతున్నాయి. "ఇది ఇదెలా జరిగింది." అని గొణిగింది.
"ఆ రోజు మీ పరీక్ష దగ్గరికి నేను రావటం చూసే ఉంటారు. మీరు ముందు వరుసలో ఎడమవైపు మొదట కూర్చున్నారు. పరీక్షపత్రాల్లో ఏదో అనుమానం ఉందన్న నెపంమీద నేను వాటిని పరీక్షించాను. ఆ పరీక్షించటంలో అన్నిటికన్నా పైనున్న పేపరు తీసేసి, మీ కోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించిన పేపరు పెట్టాను. వరుసగా పంచటంవల్ల నేననుకున్నట్టే అది మీకొచ్చింది. దాంతో అందరూ ఒక సంపర్కం గురించి వ్రాస్తే మీరు ఉలిపికట్టెలా మరొకటి వ్రాశారు."
ఆమె మొహం ఉక్రోషం, రోషం, కసి, నిస్సహాయతలాటి అన్ని భావాల్తో కలిసి అదోలా మారిపోయింది. మృదువుగా అన్నాను.
"ఇంకెప్పుడూ ఎవరితోనూ ఛాలెంజి చెయ్యకండి మాడమ్. ఓడిపోతారు. అనవసరంగా పరీక్ష పోగొట్టుకున్నారు. వచ్చే సంవత్సరం బెస్ట్ ఆఫ్ లక్! అన్నట్టు మరో విషయం చెప్పటం మర్చిపోయాను. ఇప్పుడిక ఈ ప్రాక్టికల్స్ చేయటం కూడా వేస్టే."
"ఎందుకు?"
"ఆ పరీక్ష నాళికలో ఆసిడ్ కి బదులు నీళ్ళుపోసి పెట్టాను కాబట్టి- మీరెంత తన్నుకున్నా ఈ ప్రయోగం రాదు కాబట్టి"
ఆమె చెయ్యి మెరుపుకన్నా వేగంగా కదిలింది. "యూ బ్రూట్" అంటూ చేతిలో పరీక్ష నాళికని నా మీదకు విసిరింది. అందులో ద్రవం పౌంటెన్ లా నా కళ్ళలోకి చిమ్మటం ఏమిటి? అవి భగ్గున మండటం ఏమిటి? రెండూ రెప్పపాటు కాలంలో జరిగిపోయినయ్. కెవ్వుమన్న కేక అప్రయత్నంగా వెలువడింది. "...ఎంతపని చేశావ్ రేఖా! నేను చెప్పినదంతా నిజమని న...మ్మి..." అంతే...... ఆ తరువాత మాట్లాడలేకపోయాను. "స్పృహ తప్పింది" అని అంటున్నారు ఎవరో.
* * *
"ఆసిడ్ మరీ చిక్కనిది కాకపోవటంతో మొహం మీద చర్మం కాలిపోలేదు. అంతవరకూ అదృష్టవంతుడు" డాక్టర్ అంటున్నాడు.
"కళ్ళు డాక్టర్" అంటోంది రేఖ. కళ్ళకి బ్యాండేజి ఉండటంతో ఏమీ కనపడటం లేదు. కానీ రేఖ కంఠం గుర్తుపట్టగల్గుతున్నాను.
"రేపు గానీ చెప్పలేను" అంటున్నాడు డాక్టర్. "రేపు బ్యాండేజి విప్పిన తరువాత చూసి చెపుతాను" అతడు వెళ్ళిపోయిన అడుగుల చప్పుడు.
"నే నెక్కడున్నాను"
రేఖ దగ్గిరగా వచ్చింది. "ఆస్పత్రిలో...."
కొంచెంసేపు నిశ్శబ్దం.
"నన్ను క్షమించండి."
"ఇందులో నీ తప్పేం ఉంది? తప్పంతా నాది. మరీ అతి తెలివికి పోయి పరీక్ష పేపరు మార్చానని అబద్ధం చెప్పాను. నేనా పేపరు మార్చటం, పరీక్ష నాళికలో ఆసిడ్ బదులు నీళ్ళు పోయటం అంతా అబద్ధం. ఇదంతా నిజమని నమ్మటం నీ తప్పుకాదు."
"ఇప్పుడు- ఇప్పుడెలా?"
"రేపటికి చెప్తానన్నారుగా, రేపటి వరకూ వేచి చూడటమే."
"మీరింత నిబ్బరంగా ఎలా ఉండగల్గుతున్నారు?"
"తెలుగులో ఒక సామెత ఉంది తెలుసా? 'నిండా మునిగినవాడికి చలేమిటి' అని...
"నాదే తప్పు. ఫ్రెండ్స్ తో అలా పందెం కట్టకపోయినా బావుండేది" తనలో తను అనుకుంటున్నట్టు అంది.
నేను మాట్లాడలేదు. నా ఆలోచన అంతా భవిష్యత్తులో ఇంకేం చెయ్యాలి అన్న దానిమీద వుంది.
....
మరుసటిరోజు బ్యాండేజి విప్పారు.
నాకేం కనపడటం లేదని చెప్పాను.
డాక్టర్ చాలాసేపు పరీక్షించాడు. "రెటీనా ఇంకా పచ్చిగానే వుంది. ఆపరేషన్ చేస్తే బాగుపడవచ్చు. ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లున్నాయి. పదిహేను రోజుల తరువాత తీసుకురండి. ఆపరేషన్ చేస్తాను" అన్నాడు.
నేను కల్పించుకుని 'ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందా డాక్టర్" అని అడిగాను.
"చెప్పానుగా. ఫిఫ్టీ - ఫిఫ్టీ ఛాన్సెస్ అని" అన్నాడు.
అతడు వెళ్ళిపోయాక రేఖవైపు తిరిగాను. "నేనొక ఉత్తరం ఇస్తాను. అది తీసుకుని శివప్రసాద్ కివ్వాలి- ఇస్తావా?"
"దేనికి?"
"ఈ పదిహేను రోజులూ హోటల్లో వుండాలి. దానికి కావల్సిన డబ్బు అతనిస్తాడు."
"ఇదంతా నా వల్లే జరిగింది. నే నిస్తాను."
"రేఖా..." విసుగ్గా అన్నాను. "డోంట్ బి ఓవర్ సెంటిమెంటల్."
ఆమె కొంచెంసేపు ఆగి, "మీరిమ్మంటే ఉత్తరం ఇస్తాను. కానీ హోటల్ ఎందుకు? మీ అమ్మగారికి చెప్పి." అనబోయింది.
"ఆవిడ గుండె ఆగిపోతుంది" అన్నాను ఆమె మాటల్ని మధ్యలో కట్ చేస్తూ. "ఈ వార్త తెలియగానే ఆవిడతట్టుకోలేదు. నామీద చాలా అభిమానం తనకి! ఈ ముసలి వయసులో ఒక్కగానొక్క కొడుకు అంధుడయ్యాడంటే భరించలేదు. వార్త ధృవపడ్డాకే చెప్పటం మంచిదని నా ఉద్దేశ్యం."
"మీకు చూపు వస్తుందని నాకెందుకో బాగా నమ్మకం ఉంది."
"అందుకే పది- పదిహేను రోజులపాటూ ఈ విషయం దాయగలిగితే, అదృష్టవశాత్తూ చూపు వస్తే, ఆ తరువాత అమ్మకి ఇదంతా చెప్పవచ్చు. ఒకవేళ రాకపోతే, అప్పుడే జాగ్రత్తగా వివరించవచ్చు."
"కీడు శంకించకండి."
"నేను ప్రాక్టికల్ మనిషిని. ఉన్న విషయం ఉన్నట్టు ఆలోచించడం మంచిదేగా."
ఆమె నెమ్మదిగా "హోటల్ వద్దు. మా ఇంటిలో ఉందురుగాని- మీ కభ్యంతరం లేకపోతే-" అంది.
నేను వింటున్నది నిజమని నమ్మకం కుదరక "మరి మీ నాన్నగారు?" అన్నాను.
"ఆయన నాలుగు రోజులు పాటు వుండరు. బలదేవపట్నం వెళ్ళారు."
షాక్ కొట్టినట్టయింది.
బ....ల...దే...వ...ప...ట్నం.