Next Page 
హైజాక్ పేజి 1

                                 


                                                    హైజాక్
                                                     మైనంపాటి భాస్కర్

                                                    

"నువ్వు ఎక్కడ చనిపోతావో, ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు.
కానీ, నువ్వు ఎలా బతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది."

                                                                           - జోన్ బీజ్

                             *    *    *    *

ఒక పెద్ద బ్యాంకు తాలూకు చిన్న బ్రాంచి అది. కస్టమర్సు ఎక్కువమంది లేరు.
క్యాష్ కౌంటర్లో కూర్చుని ఉంది సుజాత, కొత్తగా బ్యాంకులో చేరింది తను. క్యాష్ కౌంటర్లో కూర్చోవడం అదే మొదటిరోజు. కొత్త కొత్తగా, భయం భయంగా ఉంది తనకి.
"టోకెన్ నెంబర్ ఇరవయ్ ఇంకా రాలేదా?" అంటూ దగ్గరికొచ్చాడు ఒక తలపాగా ఆసామి. వస్తాదులా కనబడుతున్నాడు.
ఉలిక్కిపడి ఆ మనిషిని చూసి, తర్వాత విత్ డ్రావల్ స్లిప్పు మీద ఉన్న అంకెని ఆశ్చర్యంగా చూసింది సుజాత. అతను ఒక్కసారిగా తన అక్కౌంటులో నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు.
కష్టపడి లక్షరూపాయలు లెఖ్ఖ పెట్టింది సుజాత. చేతులు సన్నగా కంపిస్తున్నాయి. తన పనిమీద తనకే ఇంకా నమ్మకం కుదరకపోవడం వల్ల, ఆ నోట్లని మళ్ళీ మళ్ళీ - మొత్తం పదిసార్లు లెఖ్ఖ పెట్టింది. అవి కష్టమర్ కి అందించబోతూ ఆగి, ఎందుకన్నా మంచిదని మళ్ళీ పదకొండోసారి లెక్కపెట్టబోతుంటే అతను చిరాకు పడ్డాడు.
"టూటీ పూటే లక్షరూపాయలని లక్షసార్లు లెక్కపెడతావా ఏమిటమ్మా? జల్ది ఇవ్వు, పోయెడిది ఉంది" అన్నాడు.
బెదిరిపోయి, హడావిడిగా నోట్లు లెక్కపెట్టడం పూర్తిచేసి, డబ్బు కస్టమర్ కి అందించింది సుజాత. అతను వెళ్ళిపోయాక, పక్క కౌంటర్ లో ఉన్న క్లర్కుని అడిగింది. "ఎవరతను? లక్షరూపాయలంటే లక్ష్యం లేనట్లు మాట్లాడుతున్నాడేమిటి?"
"అతనికేమండీ? గొప్ప నీళ్ళ వ్యాపారస్థుడు!" అన్నాడు క్లర్కు.
"నీళ్ళ వ్యాపారస్థుడా?" అంది సుజాత తెల్లబోతూ.
"అవును మేడం! నీళ్ళలో రుచికోసం కొద్దిగా పాలు కలిపి అమ్ముతుంటాడు."
అది పరమ పాతచింతకాయ పచ్చడి జోకే అయినా, సుజాత నవ్వేసింది - మొహమాటానికి.
"క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బు అంతా ఊడ్చేసుకు పోయాడు. ఏం చేస్తాడో? ఇంకా గేదెలు కొంటాడనుకుంటాను" అంది సుజాత.
"గేదెలెందుకు కొంటాడండీ? ఇంట్లో ఇంకొన్ని కుళాయిలు పెట్టించుకుంటాడు. మన దగ్గర డబ్బులు పితుకుతాడు."
మళ్ళీ పాత జోకే! అయినా మొహమాటంకొద్దీ మళ్ళీ నవ్వింది సుజాత.
తనకి మొహమాటం మరీ ఎక్కువ. దానికి అక్కా చెల్లెళ్ళలాగా కంగారూ, భయం ఎక్కువే. తను అసలు ఈ బ్యాంకు ఉద్యోగానికి, అందులోనూ క్యాషియర్ జాబ్ కి బొత్తిగా పనికిరాదు. ఆ సంగతి అందరికంటే తనకే బాగా తెలుసు.
కానీ ఏం చెయ్యగలదు తను? ఇది ఇండియా? ఇష్టమైన చదువు చదువుకోవడం, చదివిన చదువుకి సార్థకత ఉండే ఉద్యోగం చెయ్యడం ఇక్కడ లక్షమందిలో ఏ ఒక్కళ్ళకో తప్ప అందరికీ సాధ్యం కాదు.
తనకి సంగీతం అంటే ప్రాణం. మ్యూజిక్ కే తన జీవితం అంకితం చేసెయ్యాలన్నంత తపన ఉంది. కానీ కేవలం సంగీతాన్నే నమ్ముకుని బతకడం, ఈ దేశంలో అందరికీ సాధ్యం కాదన్న జ్ఞానం ఉంది తనకి. అందుకే యూనివర్శిటీ చదువులు చదివింది. ఇంగ్లీషు లిటరేచరంటే తనకి ఇష్టం కానీ అది చదివినవాళ్ళకి ఉద్యోగాలు దొరకడం కష్టం అని గ్రహించి సైన్సెస్ లో చేరింది.
ఎమ్మెస్సీ చదివినా ఆ లైన్ లో ఉద్యోగం దొరక్క ఈ బ్యాంకులో చేరింది. చిన్నప్పటినుంచీ తనకి అంకెలూ, లెక్కలూ అంటే అలర్జీ అయినా!
ఎక్కడి కక్కడ సర్దుకుపోవడమే! తృప్తిలేదు.
రోజులు గడవడం కోసం ఇలా దొరికిన ఉద్యోగమేదో చేసేస్తూ రాటయి పోకుండా, నచ్చిన చదువులు చదువుకుని నచ్చిన ప్రొఫెషన్ లోనే వెళ్ళాలంటే ఏ అమెరికానో వెళ్ళిపోవాలి.
కేవలం తిండికోసమే, జీతం కోసమే ఉద్యోగం చెయ్యడం తనకి గిట్టదు. ఉద్యోగం వల్ల జాబ్ సాటిస్ ఫాక్షన్ కూడా కలగాలి. మనకి నచ్చిన పని మనస్ఫూర్తిగా చేస్తున్నామన్న తృప్తి కలగాలి.
అది ఇండియాలో అసంభవం! అందుకే అమెరికా వెళ్ళిపోవాలి తను. వెళ్ళిపోతుంది కూడా - రేపు తనని చూడడానికి వస్తున్న అమెరికా అబ్బాయితో పెళ్ళి సెటిలయిపోతే!
డ్రీమీగా అయిపోయాయి సుజాత కళ్ళు - మధురోహలు మనసుని నిలవనివ్వకుండా కుమ్మేస్తూ ఉంటే, మైకం కమ్మేస్తున్నట్లు అయిపోతోంది.
ఊహలలోనుంచి బలవంతంగా బయటపడి, తన దగ్గర మిగిలివున్న క్యాష్ ని ఉజ్జాయింపుగా లెక్కపెట్టింది సుజాత. దాదాపు ఎనిమిది వేలు ఉంది. అంతే! మధ్యాహ్నందాకా పేమెంట్స్ చెయ్యడానికి ఇది సరిపోదు. స్ట్రాంగ్ రూంలోకి వెళ్ళి మరికొంత క్యాష్ తేవాలి.
లేచి నిలబడింది సుజాత.
"ఎక్స్యూజ్ మీ!" అంటూ విత్ డ్రావల్ స్లిప్పు అందించాడు ఒక కస్టమరు. బాగా పొడుగ్గా ఉన్నాడతను. ఎడం చెయ్యి యధాలాపంగా కౌంటర్ మీద ఆనించి ఉంది. దానిమీద లెదర్ జెర్కిన్ ఉంది.
"ఇది టెల్లర్ కౌంటరు కాదు. విత్ డ్రావల్ స్లిప్పు మొదట అక్కడ ఆ కౌంటర్లో ఇవ్వాలి! అనడానికి నోరు తెరిచిన సుజాత, నోటివెంబడి మాటలేకుండా అలాగే నిలబడిపోయింది. స్లిప్పుమీద అరుస్తున్నట్లు కనబడుతున్న పెద్ద పెద్ద అక్షరాల వంక కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది.
ఆపదలో చిక్కుకున్నప్పుడు కొంతమంది ఒళ్ళెరుగని భయంతో కేకలు పెడతారు.
మరికొంతమంది దానికి విరుద్ధంగా నిశ్చేష్టులై నోటమాట రాకుండా నీలుక్కుపోతారు.
సుజాత ఆ రెండో రకానికి చెందినది. నిజానికి అలాంటి పరిస్థితి ఎదురయితే మోగించడానికి ఆ కేబిన్ లో అలారం బెల్లు ఉంది.
కానీ ఆ విషయం ఆమెకి స్పురించలేదు. మెదడు మొద్దుబారిపోయింది.
అచేతనంగా కాసేపు అక్షరాలని చూస్తూ ఉండిపోయి, తర్వాత ఆ మనిషి చేతిమీద ఉన్న జెర్కిన్ నీ, దానికింద నుంచి అక్షరాలా తననే గురి చూస్తున్న రివాల్వర్ నీ చూసింది. ఊపిరి అందడం లేదు తనకి.
"కమాన్! క్విక్!" అన్నాడు ఆ మనిషి తగ్గు స్వరంతో. ఆ గొంతులో దయాదాక్షిణ్యం లేదు.
సుజాతలో ఒక్కసారిగా చలనం వచ్చింది. నోట్లు గబగబ జమచేసి, అతని ముందు ఉంచింది.

Next Page