ఓ రోజు జమీందారు ఇంకోవూరి జమీందారుగారితో కలిసి వేటకి వెళ్ళారు. మూడోరోజు రావాల్సిన ఆయన రెండో రోజు సాయంకాలానికి వచ్చారు. శ్యామల చీర ఎగగట్టి కొంగు దోపి హాలంతా చీపురుతో తుడుస్తూ-సోఫాలని కూర్చుని మాట్లాడుతూ పెద్దగా నవ్వుకుంటున్నారు. ఆయన ఒక్క క్షణం అలా వుండిపోయారు శ్యామల పెద్ద సోఫా ఒకటి లాగలేక 'నర్సింలూ కాస్త ఈ సోఫా అక్కడ పెడతావా అంది. నర్సింలు ఎక్కసంగా 'వోయబ్బ యీ మహారాణి సుకుమారి- యీవిడగారి కింద మరో నౌకరీవాడు కావాలా ఎల్లు ఎల్లు నీమోచేతిక్రింద మేము పడిలేం-నీవేటి సెబితే అది చేయడానికి' అంటూ శ్యామల ఎదుటే బీడి పొగ వదిలాడు. రంగారావు కోపం పట్టలేక హాలులోకి వచ్చి 'నర్సింలూ అని పొలికేక పెట్టారు. నర్సింలు బిక్క చచ్చిపోయాడు. పనివాళ్ళంతా ఆ హఠాత్ సంఘటనికి దిమ్మెర పోయి నిలబడ్డారు శ్యామల ఏం చెయ్యాలో తెలియనట్టు గాబరాపడింది. "ఏమిటిరా కూశావ్ ఆమె ఎవరను కుంటున్నావురా-" వళ్ళు తెలియని ఆగ్రహంలో ఆయన మాట తడబడింది. "శ్యామల యీ పనులన్నీ నీవే చేస్తున్నావా. వీళ్ళెవరూ పని చెయ్యడం లేద సరిగా మరి యీ విషయం నాకెందుకు చెప్పలేదు యీ వెధవ లందరిని తిని కూర్చోపెట్టి మేపడానికా. వీళ్ళు నీ మాట వినటం లేదన్న సంగతి నాకెందుకు చెప్పలేదు." శ్యామల తలదించుకుంది. "ఏం చెప్పను? ఎలా చెప్పను. పనివాళ్ళెవరికి నా రాకయిష్టంలేదు. వాళ్ళ మీద నేను అధికారం చెలాయిస్తున్నానని కోపం నా మాట ఎవరూ వినటం లేదు. నన్నేం చెయ్యమంటారు?" దీనంగా అంది.
"అయితే ఇన్నాళ్ళూ నీ వక్కర్తినే చేస్తున్నావన్న మాట యీ పనులు, నా కెందుకు చెప్పలేదు శ్యామలా, చెపితే యీ వెధవలందరినీ తన్ని తరిమేసేవాడిని" "బాబుగారు- పాతికేళ్ళబట్టి మీ ఉప్పు తిని బతుకుతున్నాం-యింటి యజమానుల మాట మేం ఇంటాంగాని ఎవర్తినో తీసుకొచ్చి మానెత్తి మీద పెడితేమేం ఇనమండి-" నర్సింలు కాస్త పొగరుగా ధిక్కరించాడు. "వరేయ్-మర్యాదగా మాట్లాడు శ్యామలలకీ అధికారం నేనిచ్చాను. ఆమె మాట విననివాళ్ళు ఇక్కడ ఒక్క క్షణం వుండదానికీ వీలులేదు. యిష్టం లేనివారంతా బయటికి పొడి తక్షణం" రుద్రుడై అరిచాడు రంగారావు. ఆ తరువాత ఆయన ఎవరినీ ఉపేక్షించలేదు. అన్నాళ్ళు కొలుపు వదులు కొని పోలేనివారంతా చచ్చినట్టుపడి వుండక తప్పలేదు. శ్యామల ఆజ్ఞలు పాటించక తప్పలేదు వాళ్ళకి, అలా అని శ్యామల ఎవరిని చులకన చెయ్యలేదు, తనూ వాళ్ళల్లో ఒకరిగా కలిసి పనిచేసేది-చేయించేది, క్రమంగా శ్యామల కార్యదీక్షత మంచితనం గ్రహించి వాళ్ళందరూ శ్యామల అభిమానించ సాగారు. అంతేకాక శ్యామల చెపితే జమీందారు ఏదన్నా వింటారని- తమకు ఏం కావల్సివచ్చినా శ్యామలకే చెపితే అయి తీరుతుందని గ్రహించాక శ్యామల పట్ల గౌరవం చూపకతప్ప లేదు వాళ్ళకి.
ఆ విధంగా రెండు మూడు నెలల్లో శ్యామల ఆ ఇంటిని ఓ కొలిక్కి తీసుకొచ్చి పని వాళ్ళల్లో క్రమశిక్షణ తెచ్చింది. దుబారా ఖర్చులు తగ్గాయి. అన్ని ఏర్పాటులు ఇదివరకు కంటే బాగా వున్నాయి, జమీందారిణి వుండే రోజుల్లో ఆవిడా ఓ జమీందారు బిడ్డ పనివాళ్ళ మీద అధికారం చూపడం తప్ప అభిమానం చూపలేదు. స్వయంగా ఏపని చూడడం అలవాటులేదు. అంచేత ఆమె ఉన్నప్పుడు ఖర్చులు సగానికి సగం ఖర్చు తగ్గింది. రంగారావు చాలా సంతృప్తిపడ్డాడు.....శ్యామల పట్ల ఆయనకి అభిమానం, ఆకర్షణ రోజురోజుకీ పెరిగాయి. ఆమెని ఓ ఉద్యోగస్తురాలిగా కాక ఇంటి సభ్యురాలిగా ఆయన ప్రతి విషయంలో ఆమె సలహా సంప్రదింపులు చేయసాగారు. "శ్యామలా శ్యామలా" అంటూ దేనికో దానికి తరుచు పిలుస్తారు. శ్యామల స్వయంగా ఆయన గది సవరిస్తుంది. బట్టల విషయం చూస్తుంది. కాఫీ తెస్తుంది ఆయన కిష్టమైన పదార్ధాలు అడిగి తనే వండి దగ్గరుండి వడ్డిస్తుంది. భార్యకూడా చూపని శ్రద్దాశక్తులు శ్యామల చూపిస్తుంటే ఆమె సేవాపరాయణత ఆమె భక్తి ఆయనను శ్యామల రోజురోజుకి ఆకట్టుకోసాగింది.
సాయంత్రం తోటలో కుర్చీలువేసి టీ తాగుతూ శ్యామలనీ కూర్చోమని టీ తాగేవారు ఆమెతో, బ్యాట్ మెంటన్ కోర్టులో తనతోపాటు ఆడమనేవారు. ఏం తోచడం లేదు పేకాడుదాం అనేవారు-యెవరైనా మిత్రులువస్తే వారితో శ్యామలని తమ బంధువుగా పరిచయం చేసి వారి సరసన ఆమెనీ కూర్చోపెట్టే వారు. విందులకీ వినోదాలకీ శ్యామల రాకతో ఆయన భార్యాబిడ్డల వియోగం మరిచిపోగలిగారు, ఇప్పుడిప్పుడు ఆయన మనసారా నవగలుగుతున్నారు. ఆయనలో గూడుకట్టిన నిర్లిప్తత విరక్తి తొలగిపోయి బతుకుపట్ల నూతనోత్సాహం కలగసాగింది. శ్యామల అయితే రంగారావు చూసే ఆదరాభిమానాలకి తబ్బిబ్బు అయిపోయింది. ఆయనతో సమంగా జమీందారీ స్థాయిలో తనని గౌరవించడం చూసి కృతజ్ఞతతో ఆమె మనసు నిండిపోయింది. చూడడానికి అంత గంభీరంగా వుండే మనిషి హృదయం ఇంత సున్నితమైనది తెలిశాక ఆమె భక్తి-ఆరాధన పెరిగింది.
గత మూడు నెలలుగా శ్యామల రాకతో ఇంట్లోనే కాక కొడుకులో వచ్చినమార్పు జమీందారిణికీ తెలుస్తూంది. ఎంత మంచంలోంచి కదలలేనిది అయినా ఇంట్లో జరుగుతున్న విషయాలు కొన్ని విని- కొన్ని చూసి ఆవిడా గ్రహించింది శ్యామల పట్ల రంగారావు చూపే శ్రద్దాసక్తులకి కారణం ఆవిడకి బోధపడినట్లయింది. ఎవరో కులమో గోత్రమో తెలియని దాన్ని తీసుకొచ్చి అందలం ఎక్కించడంతప్పే ఈ విషయం సరిపోదన్నది ఆవిడకి తట్టింది- శ్యామల కార్యదక్షత- శ్యామల మంచితనం మీద ఆవిడకేం అపనమ్మకం లేదుగాని ఓ ఉద్యోగస్థురాలిని స్థానం నుంచి శ్యామలకు ఇంకేం ఇవ్వడం ఆవిడకిష్టంలేదు. వూరుకుంటే ఈ వ్యవహారం చాలా దూరం వెళ్ళే సూచనలు గుర్తించి ఆరోజు ఆవిడ అందుకే రంగారావుకి కబురు పంపించి. అందుకే ముందు రోజు రంగారావు వేటకి శ్యామలని కూడా తీసుకు వెళ్ళాడన్న వార్త అందాక ఆవిడింక ఉపేక్షించ దలచలేదు.
"అమ్మా.....ఎందుకు రమ్మన్నారు?" వంట్లో కులాసాగా వుందికదా - రంగారావు అడిగారు జమీందారిణి కొడుకుని ఆపాదమస్తకం సూటిగా పరీక్షిస్తూ, "నా వంట్లో కులాసాకి ఏంలే- నిన్నో విషయం అడగాలని అనుకుని పిలిచాను" - గంభీరంగా అంది. రంగారావు ఒక్కక్షణం ఆశ్చర్యంగా తల్లిని పరికించి చూసాడు.
"అడగండి -దానికింత సందేహం ఎందుకు?"
"శ్యామలని తీసుకుని నిన్న ఎక్కడికో వెళ్ళినట్టున్నావు?" ఆవిడ సూటిగా చూసింది.
రంగారావు మొహం క్షణకాలం యెర్రబడింది ---"ఆ .......అవును వేట చూడాలని వుందని ఒకసారి అంటే తీసికెళ్ళాను ......" మామూలుగా జవాబిచ్చాడతను."నీ కింద పనిచేసేవారిని అందులో ఒక యువతిని అలా తీసుకెళ్ళాడం అనుచితం అనిపించలేదా? మన మెవరమో--మనహోదా - పరువు ప్రఖ్యాతులెలాంటివో మరిచిపోయావా నీ కింద పనిచేసే దానితో నీ యీ చనువు గురించి నలుగురూ ఏమనుకుంటారోనన్నది గ్రహించావా?" గంభీరంగా అడిగింది. రంగారావు మొహం మరింత ఎర్రబడింది చిన్న పిల్లాడిని దండించినట్లు తనంత వాడైనా తనని తల్లి అలా నిలదీయడం చిన్నతనం అన్పించింది. అయినాతల్లితో అమర్యాదగా మాట్లాడలేక" ఎవరు ఏమనుకునేది నాకు లెక్క లేదు."