Previous Page Next Page 
శిక్ష పేజి 8


    యజమాని వెంట కారు దిగుతున్న యువతిని పనివారందరూ ఆశ్చర్యంగా చూశారు వాళ్ళల్లో వాళ్ళే ప్రశ్నార్ధకంగా చూసుకున్నారు, అతి సామాన్యంగా వున్న యువతి జమీందారుతో కారులోకూర్చుని రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. రంగారావు ఇంకా పూర్తిగా లోపలికి వెళ్ళిపోకుండానే ఆ వార్త వృద్ధ జమీందారిణీకి దాసీద్వారా తెల్సిపోయింది. రంగారావు శ్యామలని వెంటబెట్టుకు తల్లి గదిలోకి వచ్చే క్షణంలోపలే ఆవిడ మనస్సులో రకరకాల ఆలోచనలు చోటు చేసుకున్నాయి. కొడుకు పట్టణంలో యెవరినైనా వివాహం చేసుకు రాలేదు గదా అనుకుంది ఆమె.
    కొడుకు వెంట గదిలోకి వచ్చిన శ్యామలని ఒక్క చూపులో ఆపాదమస్తకం పరీక్షించింది. రంగారావు "మా అమ్మగారు" అనగానే చాలా వినయంగా నమస్కరించింది. "ఈ అమ్మాయి ..... ఈ అమ్మాయి ఎవరు?" జమీందారిణీ ఆత్రుత అణచుకోలేక అడిగింది. "ఆమె పేరు శ్యామల, అమ్మ! మీ కోసమే యీ అమ్మాయిని తీసుకొచ్చాను మీకు కావాల్సినవి చూడటం కోసం ...... " ఆయన మాట పూర్తికాలేదు.
    "ఇంట్లో దాసదాసీలు చాలరనా ....." ఆవిడ మధ్యలోనే విరక్తిగా అంది శ్యామల ఆ మాటకి చిన్నపుచ్చుకుంది. రంగారావు కలవరపడుతూ శ్యామల వంక చూశాడు. "అమ్మా! ఈ అమ్మాయిని దాసీపనికి తేలేదు. ఇంట్లో యెవరూ లేరని నౌకర్లు అజమాయిషీ కోసం, మీపనులు చూసి, మీకు చదివి విన్పించడానికి కాలక్షేపంగా ఉంటుందని- ముఖ్యంగా ఇంట్లో అన్నీ చూడడం కోసం ....." గంభీరంగా అన్నారు.
    "హు ...... యింటికి రావల్సింది యిల్లాలు, ఎంత మందిని తెచ్చినా యిల్లాలు సాటిరాదు. కానీ నీ యిష్టం. వున్నవారితో పాటు ఈ అమ్మాయి ఒక్కర్తి- "ముసలావిడ విముఖంగా అంది'. 'అదిసరే అసలీ అమ్మాయి ఎవరు. నీవెలా తీసుకొచ్చావు?' అనుమానంగా చూసింది ఆమె. అసలావిడ కొడుకు ఆమెని తీసుకొచ్చి నీ కోడలంటాడు అని భయపడింది. గాభరా పడింది. ఎవరో అనామికని గృహిణిగా, అందులో జమీందారిణిగా తీసుకురావడం ఆవిడకి యిష్టంలేదు. ఆవిడ ఎంతైనా ఒకప్పుడు జమీందారిణి ఆవిడలో రాజరికపు రక్తం నరనరంలోనూ వుంది. పాత ఆచారాలను, అలవాట్లను వదులుకోలేని ఛాందస్తురాలు, అలాంటి ఆవిడ, కొడుకు ఎంత రెండో పెళ్ళి అయినా తమ హోదాకు సరిపడని కన్యని వివాహం ఆడడానికి ఆమోదించదు. 'కోడలు' అననందుకు సంతోషించింది కాని, పని కోసం అయితే ప్రత్యేకం ఎక్కడినించో ఆ అమ్మాయిని కారెక్కించుకొని మరీ తీసుకురావడం ఏమిటో అర్ధం కాలేదు. ఆ వ్యవహారం నచ్చలేదు. తల్లి మొహంలో ఆప్రసన్నత కనిపెట్టి రంగారావు శ్యామల ఎదురుగా ఆ విషయం చర్చించడం యిష్టం లేక "చూడు లక్ష్మి- యీ అమ్మాయి గార్కి అతిథి గదులలో ఓ గది చూపించి ఆమెకేం కావాలో అన్ని ఏర్పాట్లు చూడు. ఆమెకి కాఫీ ఫలహారాలు ఇయ్యి.
    శ్యామలా, లక్ష్మి నీ గది చూపిస్తుంది వెళ్ళిసామాను సర్దుకో" అని పనిమనిషితో శ్యామలని అక్కడనించి పంపేశాడు. తరువాత తల్లి ప్రశ్నకి అన్నీ చెప్పాడు. ఏక్సిడెంటు శ్యామల అనాధ శరణాలయంలో పెరిగిన విషయం అన్నీ చెప్పాడు.
    "బాగానే వుంది ఏక్సిడెంట్ జరిగితే ఏదో డబ్బు ముట్ట చెప్పేస్తే సరిపోయే దానికి ఇంట్లోకి తీసుకురావడం ఎందుకు- ఏ కులమో - యెవరో ఏం తెలియనిదాన్ని తీసుకొచ్చి అందలం ఎక్కించడం బాగాలేదు. ఇప్పుడు వున్నవారు చాలరా ఎందరుంటే మాత్రం ఇల్లాలుపాటి అవుతారా, ఏమో నాకేం నచ్చలేదు," ఆవిడ ఖచ్చితంగా అంది.
    తల్లి అలా మాట్లాడుతూంటే అంగీకరింపజెయ్యలేని అసహాయత రంగారావు కోపం తెప్పించింది. ఆ విషయం పెంచకుండా 'ఏమో ఆ అమ్మాయి నాకు నచ్చింది మంచి దానిలా కన్పించింది. ఇల్లు వాకిలి బాగా చూస్తుందన్న నమ్మకం కల్గి వెంటబెట్టుకు వచ్చాను. మీకు అవసరం లేదంటే మీ పని చూడదు. ఇంట్లో మిగతావి చూడమని చెపుతాను-" రంగారావు దృఢంగా అని అక్కడనుంచి వెళ్ళిపోయాడు- కొడుకు తనకి తోచింది తప్ప మరోకటి చేసే రకం కాదు అని ఆవిడకి తెల్సు కనక కొడుకు అంత ఖచ్చితంగా అభిప్రాయం చెప్పినపుడు యింక మాట్లాడేందుకు ఏమీ లేక ఊరుకుంది జమీందారిణి.
    శ్యామల పట్ల మొదట్లో తిరస్కార భావం గల్గినా అతి కొద్దిరోజులలో ఆమె పట్ల భావం మార్చుకోక తప్పలేదు. జమీందారిణికి అతివినయంగా, శ్రద్దగా ప్రతి విషయం తనదిగా చూస్తూ పనిచేస్తున్న శ్యామలని ఆవిడ మనసులో మెచ్చుకోకుండా ఉండడం కుదరలేదు వచ్చి నెలరోజులు కాకముందే ఎన్నాళ్ళు గానో ఇంట్లో ఉన్నట్టు ఇల్లు చక్కదిద్దడం, ఆ తెలివి శుభ్రత అంతా చూశాక జమీందారిణి కొడుకు మంచిపనే చేశాడన్న నమ్మకం కల్గింది.
    భార్య పోయిందగ్గిరనుంచి కేవలం నౌకర్లమీదే ఇల్లంతా వదిలేశారు రంగారావు. ఇల్లంతా అదోరకం పాడుపడినట్లు, దుమ్ముకొట్టుకు పోయినట్లు ఉండే భవంతి శ్యామల ఆధ్వర్యంలో తిరిగి జీవం వచ్చి కళకళ లాడసాగింది. పనివాళ్ళు బద్ధకం వదిలి వళ్ళు వంచాల్సి వచ్చింది. ఖర్చు అదుపులోకి వచ్చింది. అన్నింటిలో వున్నానంటూ శ్యామల ఇంట్లో తిరుగుతుంటే ఇల్లాలు లేని లోటు కనపడడం లేదు ఇప్పుడు.
    ఒక రెండు నెలల్లో ఇంట్లో వచ్చిన మార్పులు చూసి రంగారావు చాలా సంతోషించారు. శ్యామల రాకతో ఇంటికే కాక తమకూ పట్టిన తుప్పు వదిలినట్లనిపించింది ఆయనకి. ఇదివరకు పట్టుమని రెండు రోజులు కూడా ఆవూర్లో ఉండకుండా ఎక్కడెక్కడో తిరిగే ఆయన నెల రోజులుగా ఇల్లు కదలలేదు.
    శ్యామల రాక పనివాళ్ళల్లో చాలా సంచలనాన్నే కల్గించింది. ముందు ఎవరో అనుకున్నారు-తరువాత శ్యామల శరణాలయంలో అనాధగా పెరిగిందన్న నిజం గుర్తించాక వారి దృష్టిలో చులకన అయింది కానీ జమీందారు స్వయంగా వెంటబెట్టుకు రావడం - పనివాళ్ళు అజమాయిషీ యింటి ఖర్చులు ఆమె చేతికి వదలడం చూశాక గుసగుసలాడుకున్నారు ఎవర్తో అనాధ తమమీద అధికారం చెలాయించడం వారందరికి కోపకారణం అయింది. ఎన్ని ఏళ్ళుగానో జమీందారులకు సేవచేస్తున్న తమందరూ వున్నా ఈనాడు ఎవర్తోవచ్చి తమని అజ్ఞాపించడం సహించలేకపోయారు. శ్యామల అధికారం ఆ ఇంట్లో చెల్లదని చూపించదలిచారు. అంతాకలిసి ఒక ఉమ్మడిగా శ్యామల అధికారాన్ని నిరసించారు. ఎవరికి ఏ పని చెప్పి చేయించడం శ్యామలకి దుస్సాధ్యమైంది- ఆ విషయం రంగారావు గారికి ఎలా చెప్పాలో ఆమెకి తెలియలేదు. పనివాళ్ళ గుసగుసలు వ్యంగ్యోక్తులు ఆమెని బాధించినా, ప్రతీపని తను వంటరిగా చేసుకోవలసి రావడం కష్టం అనిపించిన ఏనాటినించో ఉన్న వాళ్ళందరి మీద నేరాలు చెప్పడం యిష్టం లేకపోయింది. రంగారావు ఎప్పటికప్పుడు శ్యామలా నీకిక్కడ సదుపాయంగా వుందా-అంత సరిగా జరుగుతూందా-దేనికి ఇబ్బంది లేదుకదా' అని అడిగేవారు శ్యామల తలాడించేది. ఇంట్లో శ్యామల ఎదుర్కొంటున్న తిరస్కారాలు, అవమానాలు ఆయనంతట ఆయన చూసే వరకు తెలియలేదు.

 Previous Page Next Page