Previous Page Next Page 
శిక్ష పేజి 7


    జమీందారంతటి ఆయన స్వయంగా తనని చూడడానికి రావడం, తన మీద అంత శ్రద్ద చూపడంతో శ్యామల ఉక్కిరి బిక్కిరి అయింది. సిగ్గుపడింది. "నేను బాగానే వున్నాను. నాకోసం మీరిలా శ్రమపడి రాకండి. మరో నాలుగైదు రోజులలో పూర్తిగా బాగయి వెళ్ళవచ్చని డాక్టరుగారన్నారు. ఇంక నాకేం అవసరంలేదు అనవసరంగా మిమ్మల్ని యిబ్బంది పెట్టి నట్లున్నాను - "శ్యామల బిడియంగా అంది. "నా మూలంగా ఏక్సిడెంటు జరిగింది, నీకు పూర్తిగా నయమయే వరకు నీ బాధ్యత నాదేగా, రాకుండా ఎలా అవుతుంది" చిన్నగా అన్నాడు రంగారావు పైకి ఎంతో గంభీరంగా చూపులకి హడలు పుట్టించేలా వుండే, ఆయనంత మృదువుగా మాట్లాడుతుంటే శ్యామలకి వింతగా వుంది. కేవలం ఏక్సిడెంటు అయింది గనక ఆమె భారం తనదే, అంచేత ఆయన వచ్చారన్నది పూర్తిగా నిజంకాదు. శ్యామల కాక యింకెవరన్న అయితే యింత శ్రద్దగా ఆమె బాధ్యత తీసుకునేవాడతను? అనుకుంటే ఆ ప్రశ్నకి జవాబు ఆయనకే తెలియలేదు.
    ఆరోజేకాదు శ్యామల అక్కడున్న వారంరోజులు ఆయన రెండు పూటలా నర్సింగ్ హోమ్ కి వచ్చి శ్యామలని పలకరించేవారు. శ్యామల బిడియపడి వద్దంటుంటే నర్సింగ్ హోమ్ కి రావడానికి ఏదో వంక ఎందుచుకుని సాకు చెప్పేవారు. "ఇలా పనుండి వెళ్తూ ఎలాగోతోవే అని వచ్చానని ఒకపూట 'యేం తోచలేదు ఎలావున్నావో చూసిపోదామని వచ్చానని' ఒకసారి 'డాక్టరు నిన్నెప్పుడు డిశ్చార్జి చేస్తాడో అడిగి బిల్ సెటిల్ చేద్దామని వచ్చానని' ఒకసారి- 'నా కేమిటో వంట్లో సరిగ్గా లేదు డాక్టరు దగ్గరికి వచ్చానని ఒకపూట ఇలా ఏదో వంకతో రెండుపూటలా వచ్చి శ్యామలని పలకరించి వెళ్ళేవాడు. ఆయన ఎందుకిలా వస్తున్నారో, ఎందుకింత శ్రద్దతీసుకుంటున్నారో ఆయనకి తెలియలేదు. మొత్తంమీద ఆయనని శ్యామల ఎందుకో ఆకర్షించింది.
    శ్యామల పెద్ద అందగత్తెకాదు. కాని చూడగానే ఏదో ఆకర్షణ కన్పిస్తాయి. సూటిగా వుండే ఆ చూపులలో తెలివితేటలు కన్పిస్తాయి. కానీ కనిపించకుండా మోహంలో ఎప్పుడూ విరిసే నవ్వు ఆమెకి అందాన్నిచ్చింది. మొత్తంమీద ఆమెని చూడగానే ఎందుకో ఆకర్షించక మానరు ఎవరూ రంగారావు అంతే ఎన్నిసార్లు శ్యామలకు వున్నదేమిటో వెతకాలని ఆమె మొహంలోకి చూసేవారు. అసలు ఆమె తనని ఎందుకంత ఆకర్షించిందో తెల్సుకోలేక పోయారు.
    శ్యామల గాయాలు పూర్తిగా మానాయి వారం రోజులయింది. ఆమె అక్కడ చేరి ఆవారంలో శ్యామల పట్ల ఏదో అనుబంధం కల్గింది ఆయనకు. మర్నాడు ఆమె డిశ్చార్జ్ అయ్యే రోజు ఆ రాత్రీ అంతా రంగారావుకి నిద్రపట్టలేదు. శ్యామలతో అనుబంధం రేపటికే సరి అనుకుంటే ఆ మాట ఆయనకి నచ్చలేదు, కాని ...... కాని...... ఏం చెయ్యను అసలు తన ఆలోచనకి ఒక రూపు ఏమీ ఏర్పడలేదన్న సంగతి ఆయనకి తట్టింది. ఆలోచనల మధ్య ఒక ఆలోచన మనసులో కురిసింది. ఆ తర్వాత నిశ్చింతగా నిద్రపోయారాయన.
    మర్నాడు శ్యామల తాలూకు బిల్లులన్నీ చెల్లించారు. తరువాత శ్యామల గదిలోకి వెళ్ళారు.' శ్యామలా నిన్ను నాతో తీసుకువెళ్ళాలని నిర్ణయించాను." అన్నారు హఠాత్తుగా తన గదికి చేరుస్తానని ఆయన అంటున్నారనుకొని "అబ్బే వద్దండీ మీకు యిబ్బందివద్దు. యిన్నాళ్ళు మీరు చూపిన దయచాలు." అంది బిడియంగా.
    "అదికాదు" నీవు నాతో మావూరు వస్తావు. యింటికి తీసికెళ్ళితాను నిన్ను. అన్నారాయన శ్యామల మొహం కేసి చూసి శ్యామల అర్ధం కానట్లు తెల్లపోయి చూసింది. "నన్ను .... మీ యింటికా .....?" అంది ఆశ్చర్యంగా.
    "అవును శ్యామల మా యింట్లో ప్రస్తుతం మా అమ్మగారు ఒక్కరే వుంటున్నారు. కారు ఏక్సిడెంటులో నా భార్య, బిడ్డ పోవడం నీకు తెల్సుగదా. అప్పటినుంచి మా అమ్మగారు మంచంపట్టి అంత యింట్లో ఆవిడ ఒక్కర్తే వుంటున్నారు. దాస దాసీలకి లోటు లేదనుకో. నేనిలా అస్తమానమూ వూర్లు తిరుగుతూంటే ఆవిడ ఒకర్తి ఏం కాలక్షేపం లేక పిచ్చెత్తినట్లు  వుంటుంది. అంతేకాక పనివాళ్ళని అజమాయిషీ చేసేవారే లేకపోయారు. మా అమ్మ గారికి తోడుగా ఉంటూ ఆమెకి, యింటికి కావాల్సినవి చూస్తూ నీవక్కడ వుండాలని నా కోరిక -నీకీ ఉద్యోగంలో దొరికే దానికి రెట్టింపు డబ్బు యిస్తాను, నీ కభ్యంతరం వుండదన్న నమ్మకంతో అడుగుతున్నాను" - ఆమె మొహంలో హావభావాలు పరికిస్తూ సూటిగా అన్నారు. ఆ మాటలు విని నమ్మలేనిదానిలా చూసింది శ్యామల. తనేమిటి జమీందారుగారింట్లో వుండడం ఏమిటి? యింటి అజమాయిషీ చూడడం ఏమిటి - తనెక్కడ? వారెక్కడ? ఏం చెప్పాలో తోచలేదామెకు.
    "ఏం - నీకు యిష్టంలేదా? నీ వక్కడ చేసే పనేంవుండదు. కేవలం అమ్మగారికి తోడుగా వుంటూ పనివాళ్ళు సరిగా అన్నీ చేస్తున్నారో లేదో చూడడం....." "అబ్బే ...... అదికాదు ..... పనికోసం కాదు. ఏ పని చెప్పినా సంతోషంగా చేస్తాను. కాని ...... కాని...... నేనెక్కడ మీ రెక్కడ ...... ఓ అనాధని ...... నా కింత  అదృష్టం"
    రంగారావు అదోలా నవ్వారు "అలాంటి అనుమానాలేం పెట్టుకోకు. కాస్త చదువుకున్న దానివి. అమ్మకి కాలక్షేపానికి యివి అవి చదివి వినిపిస్తావని, లెక్కలవీ చూడగలవని రమ్మంటున్నా, ఇదివరకులా యింట్లో మేనేజర్లు, గుమాస్తాలు అంత మందిని భరించే తాహతు మాకు యిప్పుడు లేదు. మేమిప్పుడు జమీందార్లం కాము అన్న సంగతి నీకూ తెలుసు. గవర్నమెంటు యిచ్చే ప్రీవీపర్సులు రద్దయ్యాయి కేవలం భూములవల్ల వచ్చే ఆదాయాలు, ఇళ్ళు మిగిలాయి. మేము ఇప్పుడు సామాన్యులతోపాటే......" నవ్వారాయన.
    అలా అనకండి మీరెప్పటికీ మాకు ప్రభువులే, మాకు అన్నదాతలే. మీకు సేవచేయడంకంటే నాకు ఆనందాన్నిచ్చేది ఏముంటుంది. ఈ విధంగా మీ ఋణం తీర్చుకోగలిగే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. ఒక్కమనవి, ఇన్నాళ్ళు మీ దయాధర్మాల మీద బతికినా ఇప్పుడూ కేవలం ఆ దయ చాలు, నాకేం జీతం వద్దు మీ ఆశ్రయం చాలు" కృతజ్ఞత తో ఆమె గొంతు వణికింది. ఆమెకి తమపట్ల గౌరవాభిమానాలకు ఆయన కాస్త చలించారు. ఆమె అభిమానం మరింత ఎక్కువైంది.
    "సరే, అక్కడ నీ కేలోటురాదు సరే ఇంక బయలు దేరుదాం. నీ గదిలో సామాను సర్దుకో, యివాళ మధ్యాహ్నమే బయలు దేరి వెడదాం ......" అన్నారు రంగారావు.
    జమీందారు భవంతిలో కాలు పెడుతూ ఆశ్చర్యంగా నాలుగువైపులా ఆ వైభవాన్ని చూసింది శ్యామల. పూర్వపు జమీందార్ల భోగభాగ్యాలు యిప్పుడు లేకపోయినా ఆ పాత వైభవాన్ని అడుగడుగునా చాటుతూనే వుంది ఆ భవంతి. ఎంత జమీలు పోయినా ఆ హోదా పూర్తిగా దూరం కాలేదు. జమీందార్లకి తమపాత అలవాట్లు అభిరుచులు, వైభోగాలు దూరం చేసుకోవాలంటే యిప్పట్లో సాధ్యం కాదేమో వారి రక్తంలో వున్న రాచరికం డబ్బు లేకపోయినా గంభీరత్వాన్ని హుందాని యిస్తూనే వుంటుంది. ఇదివరకు మాదిరి అడుగడుగున దాస దాసీజపం లేకపోయినా ఇప్పుడూ అవసరాన్నిమించే ఉన్నారు నౌకర్లు-చాకర్లు.

 Previous Page Next Page