Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 6

    "అదేమిటండీ_తండ్రి  గురించి చెప్తూ  'పెంచాడు' అంటున్నారే" అన్నాను.

    "అందులోనే  ఎంతో ఆప్యాయత  వుంది సరోజా! మా నాన్నని 'నువ్వు' అని పిలిస్తేనే ఎంతో బాగా అనిపించేది. అప్పుడప్పుడూ  'నాన్నా' అని పిలిచినా, 'బాబా' అనే ఎక్కువగా  పిలిచేవాణ్ని" అని చెప్పారు.

    "ఏవండీ  నాకో సందేహం. మీకు శ్రీనివాసరావని పేరు ఎవరు, ఎందుకు పెట్టారండీ" అని అడిగాను.

    "మంచి ప్రశ్నే వేశావు. మా నాన్నే పెట్టాడీ పేరు. ఆయనకి పి.టి. శ్రీనివాసయ్యంగారిమీద  వున్న అపార గౌరవమే  అందుకు కారణం అనిపిస్తుంది నాకు. అతను  అనేక విద్యలలో  అఖండమైన ప్రజ్ఞాశాలిట" అని చెప్పారు.

    "మీ ఇంటిపేరు అసలు 'శ్రీ రంగం' వారేనా?" అని అడిగాను.

    "కాదు సరోజా, మా నాన్న అసలు పేరు పూడిపెద్ది  వెంకటరమణ. మా నాన్న  శ్రీరంగం సూర్యనారాయణగారి దత్తపుత్రుడిగా  మారడంవల్ల ఇంటి పేరు కూడా  'శ్రీరంగం' అని మారింది.

    అందరూ తల్లిచాటు  బిడ్డలయితే  నేను తండ్రిచాటు  బిడ్డగా  పెరిగాను. మా అమ్మకి నాకన్నా  ముందుగా ఒక కొడుకు పుట్టి, పురిట్లోనే  పోయాడట. మా అమ్మ చనిపోయిన తర్వాత  మా నాన్న  మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. నా రెండో తల్లి పేరు సుభద్ర. గొప్ప తాశీల్దారుగారి  అమ్మాయి. ఆవిడ తొలి చూలులో  కొడుకును కన్నది. వాడు ఏడాదికో, ఏణ్ణర్ధానికో  చనిపోయాడట. ఆవిడ  పాలు కూడా తాగి నేను జీవించాను" అని ఆయన చెబుతూంటే_     

    "అదేమిటి? 'ఆవిడ పాలుకూడా' అని అంటున్నారేమిట"ని  అడిగాను.

    "అవును సరోజా! నా చిన్నతనంలో  మా అమ్మ చనిపోవటంవల్ల అయిదో ఏడు వచ్చేదాకా  ఎందరమ్మలో  నాకు చనుబాలిచ్చి  బతికించారు. నా పినతల్లి  నన్నెంతో  గారాబంగా  పెంచింది ఆమెకూడా  నాకు దక్కలేదు. 1924వ సంవత్సరంలో  చనిపోయింది" అని వివరించారు.
    "ఇంతకీ  మీ పుట్టిన తేదీ నికరంగా  ఏదంటారు?" అని అడిగాను.


    "నాకీ పుట్టిన తేదీల పట్టింపులు, పుట్టినరోజు  పండుగ వేడుకలు, చాదస్తాలు లేవు సరోజా! ఎప్పుడు పుడితే ఏం? అయినా  నువ్వు అడుగుతున్నావు కనుక చెప్తాను. 2_1_1910వ తేదీ నా పుట్టినరోజుగా  చెలామణి అవుతోంది. కానీ  ఆరోజు  నేను పుట్టలేదు. దాని వెనుకాల  ఓ చిన్న కథే వుంది.

    1910 ఏప్రిల్ లో శ్రీరామనవమి రోజున  పుట్టానని  అమ్మమ్మ అంటూండేదని  చెప్పానుగా! నా స్కూల్ రిజిష్టర్ కోసం మా నాన్న రాయించిన తేదీ 2_1_1910 అదే ఇప్పటికీ  ఖాయమైంది. ఏమైనా 1910లో పుట్టిన  విషయం యథార్ధం. పోతే  నెలల్లో తేడా.

    నాకు అయిదో ఏట  తిరుపతిలో  ఉపనయనం, విశాఖపట్నంలో  అక్షరాభ్యాసం  జరిగాయి. నా ఉపనయనం 1915లో  జరిగింది. ఆ సంవత్సరం నాకు ముఖ్యమైన సంవత్సరం. అప్పటివరకూ  చుట్టుపక్కల  ఉండే ఊర్లే కానీ  దూర ప్రయాణం చేసి ఎరగను.

    ఒడుగుకి  తిరుపతి  వెళ్ళడమంటే  అదో పెద్ద ప్రయాణం అన్నమాట. గూడూరుదాకా  ఒక బండి, అక్కడి నుండి తిరుపతికి  మరో బండి. ఏడుకొండలెక్కి  ఎగువ తిరుపతికి  మళ్ళీ  డోలీలమీద  ప్రయాణం. నాకు కూడా  తిరుపతిలో  పూర్తిగా గుండు గీయించేశారు" అంటూ, "ఏది ఆ సిగరెట్ ఇలా  అందుకో" అన్నారు. ఇచ్చాను.

    "చెప్పండి" అన్నాను.

    "చెప్తాను  కానీ కాఫీ  తెప్పిస్తావూ?" అని అడిగారు.

    "తెప్పిస్తానుండండి" అంటూంటే  కారు హారన్ చప్పుడయ్యింది.

    ఆవిడ వచ్చేశారు. "మరో  పదినిముషాలుండి  నేనిక వెళతానండి" అన్నాను.

    "రేపు కారు పంపిస్తాను. రా" అన్నారు.

    "కారు వద్దు. నేనే వస్తానులెండి" అన్నాను.

    "ఎన్ని గంటలకి?" అని అడిగారు.

    "ఉదయం  వస్తాను. కానీ చిన్న కండిషనండీ. మీ గురించి ఇంకా  వివరాలు  చెప్పాలి" అన్నాను.

    "సరే. ముందు నువ్వు రా చూద్దాం" అన్నారు.



                              *              *              *              *


    మరునాడు ఉదయం  తొమ్మిది గంటలకి  హాస్పిటల్ కి చేరుకున్నాను.

    "ఇంత ఆలస్యమయ్యిందే? బస్సులో  వచ్చావా? లేక లేని దేవుడ్ని  పట్టుకొని మొరపెట్టుకోవడంలో  లేటయిందా?" అని అడిగారు.

    "దేవుడు లేడని  అంటారేమిటి? లేడని  మీరు మాత్రం  ఎలా చెప్పగలరండీ?" అని అడిగాను.

    "ఉన్నాడన్న  నమ్మకంతో  కన్నా, లేడేమోనన్న  సందేహంతో  బతుకు సరోజా! బాగుపడతావు. నీ పూజలూ  పునస్కారాలవల్ల, భక్తి భజనల వల్ల నువ్వు  మోసపోతావేకానీ  అనుకున్నదేమీ  సాధించలేవు" అని ప్రారంభించారు.

    "మా అమ్మ కూడా  పూజలూ  పునస్కారాలూ  చేసేదిట. ఆవిడ పూజలన్నీ  తన కడుపు  ఫలించాలనే  చేసిందిట. ఫలించే  నేను పుట్టానట. ఏమైంది? నా ఆటాపాటా, ముద్దూ ముచ్చటా  కళ్ళార చూడకుండానే  కళ్ళు మూసింది. కొండా కొండా అని మేం ఇంట్లో  పిలిచేకొండంత  నా తమ్ముడు ఆత్మహత్య చేసుకోడానికి  మా దరిద్రమే  కారణం.

    అవి నా దరిద్రపు  రోజులు. రెండేసి  రోజులు తిండిలేకుండా  బతికేవాడ్ని. పది సంవత్సరాలు గడ్డురోజుల్ని  చవి చూశాను. ఆ రోజుల్లోనే  'మహా ప్రస్థానం' గీతాలు  రాశాను. అంత దరిద్రపు  రోజుల్లోనూ  నేను ఎవరినీ 'దేహీ' అని యాచించలేదు. రోజుకి  ఇరవైమైళ్ళు  ఒళ్ళూపై  తెలియకుండా  నడిచేవాడిని. నేనొక  ఏకాకిని  సరోజా!" అంటూ నిట్టూర్పు  విడిచి.      

 Previous Page Next Page