"ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కష్ట కాలంలో భగవంతుడ్ని ధ్యానించడానికి మించిన పిరికితనం ఇంకొకటి వుండదని నా అచంచల విశ్వాసం. నేను చెప్పిందేమైనా బుర్రలో కెక్కిందా? లేక నా మాటలు వింటూ మనసులో మాత్రం ఏ అమ్మమ్మదండకమో వల్లించుచుంటున్నావా?" అని అడిగారు.
"అబ్బే! అదేంలేదు చెప్పండి" అన్నాను.
"ముందు కాఫీ తెప్పించు సరోజా!" అన్నారు. ఇద్దరం కాఫీ తాగాం.
"కంపెనీ వాళ్ళెవరైనా వచ్చారా?" అని అడిగారు.
"అందరికీ ముందుగా నేనే చెప్పేశానుగా. మరో పదిహేను రోజులు ఆ విషయాలేవీ ఆలోచించకండి" అన్నాను.
"సరే మరి రేపు సాయంకాలం ఇంటికి వెళుతున్నా" అన్నారు.
"మంచిదండీ. ఎంతకాలమని ఇక్కడుంటాం?" అన్నాను.
"నువ్వు వస్తావుగా?" అని అడిగారు.
"చూద్దామండీ ఆ విషయం ఎందుకిప్పుడు?" అన్నాను.
"ఇప్పుడే తేలాలి సరోజా!" అన్నారు.
"తప్పకుండా వస్తానండి. అయినా....ఎంతసేపూ సినిమా గొడవలు, ఇంటి గొడవలేకానీ మీ చిన్నప్పటి విషయాలు చెబుదురూ" అన్నాను.
"నాకు మాట్లాడడం వచ్చిన కొత్తలోనే పాటలు పాడేవాడినట. మా తాతయ్య శ్రీరంగం సూర్యనారాయణగారు (శ్రీ శ్రీ తండ్రిని పెంచుకున్న వ్యక్తి) నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకొని భారత రామాయణ కథలు చెప్పేవారు. నాచేత పాటలు పాడించేవారు" అన్నారు.
"మీకు అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా జరిగిందా?" అని అడిగాను.
"అవును. నాచేత అయిదో ఏట బియ్యంలో పసుపు కొమ్ముతో 'ఓం నమశ్శివాయ' అని దిద్దించారు. చిన్నపిల్లలు స్కూలుకి వెళ్ళడానికి తెగ భయపడి ఏడుస్తారు. నాకా రెండూ వుండేవి కావు. కారణం....మా మాష్టారే.
అక్షరాభ్యాసానికి ముందు ఇంటి గోడలన్నీ నీటి రంగుల కుంచెలతో ఎక్కువగా జంతువులు బొమ్మలు గీసి పాడుచేసేవాడిని. నాకు కేరమ్స్, ఫుట్ బాల్, నాటకాల్లో వేషాలు వెయ్యడం అంటే చాలా సరదా.
శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో బాగా జరిగేవి. అందులో నీలిరంగు పూసుకొని రాముడి వేషం వేసుకొని నేనే రాముణ్నని గెంతేవాడిని. మొదటిసారిగా రామాయణ కథను మా తాతగారు చెప్తే, మహాభారత కథలు ఆయన పెంపుడు కొడుకైనా మా నాన్నగారు చెపుతుంటే వినేవాడిని" అని చెప్పాను.
"మరి అప్పుడు రుచించిన రామాయణ భారతాలు దేవుడి గురించేకదండీ" అన్నాను.
"అది నీలాంటి మూర్ఖులకి సరోజా! అని కూడా జరిగిన కథలేగానీ....అవతారాలూ, దేవుళ్ళూ అంటే నేను ఒప్పుకోను. ఎవరిష్టం వారిది. నేను కాదనను. మనల్ని బాధించే సెంటిమెంట్లు కరిగించేవాడ్ని కరగించవు. ప్రతీ జాతి జీవితంలోనూ ఒక్కొక్క పరీక్షా సమయం వస్తుంది. అప్పుడే మనం ధైర్యంగా ముందడుగు వేసి నిలబడాలి.
నా పెళ్ళి ప్రస్తావన
ఇంతలో ఆవిడ వచ్చారు.
నమస్కారం చేసి, "బాగున్నారా?" అని అడిగాను.
"ఆఁ బాగున్నాను. ఎప్పుడొచ్చావు?" అని అడిగారు.
"ఉదయమే తొమ్మిది గంటలకి వచ్చానండీ" అన్నాను.
"అలాగా? అంతా బాగున్నారా?" అని అడిగారు.
నేను ఆశ్చర్యపోయాను. ఈవిడేనా....ఇలా మాట్లాడుతున్నది! ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు ఈలోగా....
"సరోజా" అన్న శ్రీశ్రీగారి పిలుపుతో ఈ లోకంలో పడి, "ఏమిటండీ" అన్నాను.
ఇంటికి చేరుకొనేసరికి....అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
"ఏమయ్యింది?" అని అడిగాను.
"ఏమీ కాలేదు. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. శ్రీశ్రీగారికి ఎలా వుంది?" అని అడిగారు నాన్నగారు.
"బాగుంది. రేపు డిశ్చార్జి చేస్తున్నారు" అని చెప్పాను.
"మంచి మాట చెప్పావు. ఈరోజు నువ్వు మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళక్కర్లేదుగా" అని మా నాన్నగారు అడిగారు.
"సాయంకాలం నాలుగు గంటలకి రమ్మన్నారు" అన్నాను.
"మళ్ళీ సాయంకాలం ఎందుకమ్మా! ఈ రోజు సాయంకాలం మనింటికి బంధువులొస్తున్నారు" అన్నారు.
"బంధువులొస్తే నాకేం?" అన్నాను.
"వచ్చేది పెళ్ళివారమ్మా! నిన్ను చూడడానికే వస్తున్నారు" అని చెప్పారు.
పెళ్ళివారన్నమాట వినేసరికి నా గుండె చల్లగా మారిపోయింది. ఆ పెళ్ళి తప్పించుకోడానికి నేను చేసిన విచిత్రమైన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి.
ఇక శ్రీశ్రీగారి చెవిని ఈ మాట వెయ్యాలి. హాస్పిటల్ నుండి వచ్చి, బాగా రెస్ట్ తీసుకొని, తన పనిపాట్లు మామూలుగా చేసుకునే వరకూ శ్రీశ్రీగారికి ఈ మాట చెప్పకూడదని ఇంట్లో అందరికీ చెప్పేశాను.