"మీ తప్పేమీలేదని నేను గ్రహించగలిగాను. ఆ ప్రాసిక్యూటర్ లాగా మూర్ఖుణ్ణి కానునేను. జరిగినదేమిటో అద్దంలో మొహం చూసుకున్నంత స్పష్టంగా కనబడుతుంటే, అరె, వింత మనుషులు వీళ్ళు! వీళ్ళ ఆలోచనలూనూ!" అని విసుక్కుని గట్టిగా పొగపీల్చాడు అతను. "వీళ్ళ అజ్ఞానాన్నీ, అవివేకాన్ని ఎత్తి చూపడానికే నిఖిల్ ఈ ట్రిక్కు ప్లేచేసాడు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నిఖిల్ మేబీ ఏ బ్లడీ క్రూక్ బట్ హిఈజ్ నాట్ ఏ ఫూల్! ఇండియన్ పోలీసులకన్నా, ఈ న్యాయవ్యవస్థా చట్టాలన్నా చాలా తేలిక అభిప్రాయం ఉంది నిఖిల్ కి. వీళ్ళకళ్ళలో దుమ్ముకొట్టి పారిపోవడానికి తలబద్దలు కొట్టుకుని పెద్దప్లాను వెయ్యడం కూడా అనవసరం అని అతని ఉద్దేశ్యం. అందుకే అందరికీ తెలిసిన అతి పాపులర్ అయిన ఈ నవలలో వర్ణించిన ట్రిక్కునే అతను ప్లేచేసి తప్పించుకుపోయాడు" అని నిన్న రాత్రి అమూల్య చదువుతూ వదిలేసిన నవలని ఎత్తి పట్టుకున్నాడు అతను. 'రేజ్ ఆఫ్ ఏంజెల్స్' అది.
ఆ పుస్తకం వైపు కళ్ళప్పగించి చూసింది అమూల్య.
అతను ఆ పుస్తకంతో సోఫామీద కొడుతూ ఒక్కొక్కపదం ఒత్తి ఒత్తి అన్నాడు. "అతని అహంభావం, అతని అహంకారం, అతని అతిశయం ఈ చర్య ద్వారా బయట పెట్టుకున్నాడు. 'మూర్ఖులారా!' అని అందరినీ మూక ఉమ్మడిగా ఈసడించి రొమ్ము విరుచుకుని వెళ్ళిపోతున్నాడు. రేపు అతని మీద ఉన్న కేసుకొట్టేస్తారు తగినంత సాక్ష్యాధారం లేదని! మీరు....మీ కెరీర్ వికసించకుండానే వాడిపోతుంది. అవునా?"
తల ఊపింది అమూల్య.
"నిఖిల్ మీద మీకు కోపంగా లేదా మిస్ అమూల్యా?"
"ఎందుకులేదు. కనబడితే గుడ్లు పీకెయ్యాలని ఉంది"
అతను నవ్వాడు.
"అంతకంటే పెద్ద శిక్షే పడాలి వాడికి. ఇప్పుడు దొరికినదానికంటే పెద్దసాక్ష్యం దొరకాలి మనకు. ఆ సాక్ష్యం మీరు సేకరించాలి"
"నేనా?" అంది అమూల్య తెల్లబోతూ.
"మీరే మీకే ఆ అవకాశం ఉంది."
"ఎలా?"
"నిఖిల్ కి ఉన్న దుర్గుణాలతో బాటు భేషజం కూడా విపరీతంగా ఉంది. తను అభినవ దానకర్ణుడిననీ, ఇరవయ్యో శతాబ్ధపు రాబిన్ హుడ్ ననీ అనుకుంటూ ఉంటాడు అతను. ఆ వానిటీని ఎక్స్ ప్లాయిట్ చెయ్యాలి మనం."
శ్రద్దగా వింటోంది అమూల్య.
అతను చెబుతున్నాడు. "మీరు నిఖిల్ ని కలుసుకోవాలి. అతనివల్ల ఉద్యోగం పోయిందనీ, మీకు వేరే ఆధారం లేదనీ దీనంగా మొహం పెట్టి చెప్పాలి. అప్పుడతను తప్పకుండా మిమ్మల్ని తన అండలోకి తీసుకుంటాడు."
"తర్వాత ఏమవుతుంది?"
"తర్వాత మీరు అతని దగ్గరే ఉంటూ అతని రహస్యాలూ రాబడతారు."
"నాకు తన రహస్యాలు ఎందుకు చెబుతాడు?"
కొంచెం ఇబ్బందిగా సోఫాలో కదిలాడు తరుణ్. "మీరు అతనితో కొంచెం సన్నిహితంగా ఉన్నట్లు నటించాలి. మిస్ అమూల్యా! రహస్యాలు సేకరించడం నా వృత్తి. ఈ వృత్తిలో ఉండి నేనున్ గ్రహించినది ఏమిటంటే అతి గొప్ప రహస్యాలు కూడా చాలాసార్లు ఆడవాళ్ళ ద్వారానే బయటపడిపోతాయి. సో! విష్ యూ గుడ్ లక్!"
"ఐ విష్ దట్ నిఖిల్ వెరీ వెరీ బాడ్ లక్! నేను ఈ పని చాలా ఇష్టంగా చేస్తాను. చెప్పండి. ఎప్పుడు ఎలా మొదలెట్టాలి."
జేబులోంచి ఒక అందమైన విజిటింగ్ కార్డు తీశాడతను. దానిమీద స్క్రీన్ ప్రింటింగ్ తో 'నిఖిల్ ఎంటర్ ప్రైజెస్', ఎక్స్ పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్, హైదరాబాద్.......విశాఖపట్టణం.....కాకినాడ" అని ఉంది. అడ్రసులు ఉన్నాయి.
"ఇది నిఖిల్ చేసే అసలు వ్యవహారాలకి అందమైన మేలిముసుగు. ఈ అడ్రసులో మీరు అతన్ని కలుసుకోవచ్చు" అన్నాడు తరుణ్.
విజిటింగ్ కార్డుని టీపాయ్ మీద పెట్టింది అమూల్య.
తరుణ్ లేచి నిలబడ్డాడు.
"ఒక నిముషం!" అంది అమూల్య "నేను మిమ్మల్ని కలుసుకోవాలంటే ఎలా?"
అతను నవ్వాడు.
"నన్ను కలుసుకోవడం కుదరదు. నేనే మళ్ళీ వచ్చి కలుసుకుంటాను."
"ఇంకొక్క విషయం"
"ఏమిటి?"
"ఈసారి వచ్చేటప్పుడు ముందు తలుపు తట్టి రండి."
అతను మళ్ళీ నవ్వి తలుపువైపుకి నడిచాడు. అతను నడుస్తుంటే అడుగుల చప్పుడు కూడా కాకపోవడం గమనించింది అమూల్య.
* * *
నాలుగురోజుల తర్వాత పొద్దున్నే పదింటికి నిఖిల్ ఎంటర్ ప్రైజెస్ కి వెళ్ళింది అమూల్య. అల్ట్రామోడరన్ గా డెకరేట్ చేసి ఉంది ఆ ఆఫీసు. విజిటర్స్ రూంలో యం.యఫ్.హుస్సెయిన్ వేసిన గుర్రాల పెయింటింగ్ వేలాడుతోంది.
అమూల్యని చూడగానే తలపంకించి చిరునవ్వు నవ్వింది రిసెప్షనిస్టు. "యస్ ప్లీజ్?"
"మిస్టర్ నిఖిల్ ని కలుసుకోవాలి" ఆ అమ్మాయి నవ్వుతున్న కళ్ళతో చూసింది. "అపాయింట్ మెంట్ ఉందా?"
"లేదు"
ఆ అమ్మాయి కళ్ళలో నవ్వు తగ్గింది. "మిస్టర్ నిఖిల్ వైజాగ్ వెళ్ళారు. మిస్టర్ రాజూని కలుసుకుంటారా?"
"రాజు ఎవరు?"
"రాజు మిస్టర్ నిఖిల్ కి సెక్రెటరీ, లీగల్ అడ్వయిజరు, ఫైనాన్షియల్ అడ్వయిజరు-ఆల్ ఇన్ వన్."
"కలుసుకుంటాను"