Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 6

    "విద్యా.... అతనలా మాట్లాడుతున్నప్పుడు నీవు కాస్త సౌమ్యంగా నచ్చచెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? నీవు అతనితో సరిగ్గా ఆర్గ్యూ చేస్తే అతనికి మరింత తిక్కరేగేదేమో! నీవు అతను ఒంటరిగా వుండగా సౌమ్యంగా నచ్చచెప్పకపోయావా?" నిర్మల అంది.  
    "ఎందుకు చెప్పలేదు? మాకు ఈ పాత ఆచారాలు అవి తెలియక కొన్ని మర్యాదలు చెయ్యలేదు. మీ వాళ్ళని అవమానించాలని ఏం చెయ్యలేదు. మా శక్తికి మించే పెళ్ళి చేశారు. కారు అదీ ఇంక ఇవలేరు అని చెప్పాను. కాని ఆయన వింటేనా? తెలియకపోతే ఎవరినన్నా అడిగి చెయ్యాలి, కారు ఇచ్చే తాహతు లేనప్పుడు పెద్ద సంబంధాలకు ఎందుకు ఎగబడటం! నీకెంతసేపూ మీ వాళ్ళని సమర్థించుకోవడమే సరిపోతుంది. అని మొండిగా వాదిస్తే ఏం చెయ్యమంటారు. మీకు తెలియదు ఆంటీ.... ఆయనతత్వం అలాంటిది" విద్య విరక్తిగా అంది.
    "పోనీ హైదరాబాదు వెళ్ళాకన్నా మారలేదా?"
    "ఆ ఆశా నెలరోజులలో తేలిపోయింది ఆంటీ..... అసలు కాపురానికి వెళ్ళగానే డల్ అయిపోయాను. అది వాళ్ళ నాన్నగారిచ్చిన రెండు బెడ్ రూమ్ ల ఫ్లాట్. ఇల్లు బాగానే ఉంది. కాని మాకింత వుంది అంత వుంది అని గొప్పలు చెప్పుకునే మనిషి. మూడు వేలు ఉద్యోగం చేస్తున్న పెద్ద మనిషి ఇల్లు. ఓ గుమస్తాది కూడా అంత బీదగా ఉండదు. కింద పరుపు వేసుకుని పడుకునే వారు కాబోలు. ఓ మూల ఓ పక్క చుట్ట తాడు కట్టి దానిమీద హాంగర్సుకి బట్టలు, ఓ గాడ్రెజ్ టేబుల్, రెండు ఫోల్డింగ్ కుర్చీలు, వంటింట్లో ఓ కిరసనాయిల్ స్టవ్, రెండు మూడు డబ్బాలు- ఇదీ ఆయన సంసారం.  
    అలాంటి కొంప ఎప్పుడూ చూడక ఆ ఇల్లు చూడగానే షాక్ అయ్యాను. బాగా వున్నవాళ్ళు, మంచి ఉద్యోగంలో ఉన్నవారు, ఇల్లు చాలా మోడర్న్ గా, టిప్ టాప్ గా వుంటుందనుకున్న నేను నీరు కారిపోయాను. "ఇదేమిటి? ఇంట్లో ఫర్నీచర్ అది ఏం కొనలేదా? అప్పుడే ఆర్నెల్లబట్టి ఈ వూళ్ళో ఉన్నారు.... ఎలా మేనేజ్ చేస్తున్నారు?" అన్నాను.
    పెళ్ళయ్యాక మీ అత్తగారు ఇస్తారుగా. వాళ్ళేం ఇస్తారో చూసి మిగతావి కొనొచ్చు అన్నారు మా వాళ్ళు. అయినా మా ఇంట్లో బోలెడున్నాయి. రెండు ఫ్రిజ్ లు, నాలుగు గాడ్రెజ్ లు, రెండుమూడు రకాల సోఫాసెట్లు, రెండు డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ నాకు, అన్నయ్యకేగా. మళ్ళీ కొనడం ఎందుకు దండగ-" అన్నాడు గరంగా. ఆ మనిషి మాటలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు - వాళ్ళింట్లో ఉంటే ఇప్పుడే ఇచ్చేస్తారా? అయినా తన కాపురానికి ఏం కావాలో ముచ్చటగా అన్నీ అమర్చుకోకుండా ఎవరో ఇస్తారని ఎదురు చూడడం ఏమిటి?  
    "మీ ఇంట్లో వుంటే ఇక్కడున్నట్టేనా - ఆ వున్నవన్నీ ఇప్పుడే ఇచ్చేయబోతున్నారా మీవాళ్ళు" అన్నాను వళ్ళుమండి.
    "మా అమ్మ మీ వాళ్లేం ఇస్తారో చూసి మిగతావి ఇస్తానంది. "చిన్నపిల్లవాడు తల్లి ఐస్ క్రీమ్ కొనిపెడతానంటే పడే సంబరం గుర్తు వచ్చింది.  
    "మీ వాళ్ళేం సామాను కొనలేదా! వెనకనుంచి పంపిస్తారా.... అత్తవారింటికి పంపినపుడే ఇవ్వాలటగదా" ఆ మాటల్లో వెకిలితనం చూస్తే అసహ్యం అనిపించింది. అమ్మ పదివేలిస్తాను సామానుకి, మీకేం కావాలో కొనుక్కోండి. మీరు హైదరాబాదు వచ్చాక నేను వచ్చి నాలుగు కొని సర్దివస్తాను' అంది. ఆ మాట అప్పుడు ఆయనతో చెప్పాలనిపించకపోయినా అమ్మ ఎలాగో వస్తుంది. అప్పుడైనా చెప్పాలిగా అని చెప్పాను.
    "డబ్బిస్తే మనం కొనుక్కోలేమా ఏమిటి.... ఆవిడెందుకు మధ్యన" అన్నారు మొహం చిట్లించి.
    "కూతురి కొత్త కాపురం ముచ్చట చూడాలని వస్తుంది లెండి" అన్నాను వళ్ళుమండి.
    "ఇదిగో, ఇప్పుడే చెబుతున్నాను. మీ అమ్మ దగ్గర డబ్బు పుచ్చుకోగానే ఏం కొనకు. మా వాళ్ళనడిగి ఏం కొనమంటే అది కొంటాను" అన్నారు. తెల్లబోయాను.   
    "అదేమిటి.... మావాళ్ళు ఇచ్చినడబ్బుతో నా సంసారానికి ఏం కావాలో కొనుక్కుంటాను. మధ్య మీ వాళ్ళను అడగడం ఎందుకు?" అన్నాను తీవ్రంగా.
    "అంటే ఏమిటి? పెద్దవాళ్లని అడగడం తప్పా! నీకు మీ అమ్మ ఎంతో మావాళ్ళూ నాకు అంతే!" అని ఎగిరారు.
    "పెద్దవాళ్ళంటే - ఇలా అత్తవారిచ్చిన డబ్బుతో ఏం కొనుక్కోవాలో కూడా వాళ్ళ పర్మిషన్ అడగాలా? నేను పెళ్ళాడింది మిమ్మల్ని. మీ వాళ్ళతో కాపురం చెయ్యడం లేదు. ఇది నా ఇల్లు. నా సంసారం. నాకు నచ్చినవి, నా టేస్ట్ ప్రకారం కొంటాను" గట్టిగా అన్నాను.    
    కొత్త కాపురానికి ఇంట్లో అడుగుపెట్టగానే మా మధ్య జరిగిన సంభాషణ ఇది ఆంటీ.... మీరు చెప్పండి, ఆ పరిస్థితిలో ఏ భార్య అంతకంటే శాంతంగా ఉండగలదు? నేను చదువుకొన్నాను.... నాకూ వ్యక్తిత్వం ఉంది..... అభిరుచులు ఉన్నాయి. భర్త అంటే గౌరవం, అత్తమామలంటే భక్తి వుండాలి.... ఒప్పుకుంటాను. కాని చదువు సంధ్యలేని పాతకాలం ఆడపిల్లలా భర్త వెంట తలవంచుకుని వెళ్ళి మాటకి ఎదురాడకుండా పెట్టింది తిని, వళ్ళు ఇమ్మన్నప్పుడు ఇచ్చి చాకిరి చేసుకుంటూ భర్తే దైవం అని నమ్మే ఆనాటి ఆడపిల్లను గాను. నా స్థితిలో మీరుంటే ఇలా కాక ఇంకెలా మాట్లాడుతారు." నిలేసినట్లు అంది.   
    నిర్మల నిట్టూర్చింది. ఆ స్థితి తనకంటే ఎవరికి బాగా అర్థం అవుతుంది?
    "ఆయన మొహం మాడ్చుకున్నారు. ఆ రోజంతా నాతో మాట్లాడలేదు. హోటల్నుంచి క్యారియర్ పట్టుకొచ్చాడు ఎవరో కుర్రాడు. ఉన్నది ఒకటే పరుపు. అది మామూలుగా నవదంపతులకి ఎక్కువే. కాని మనసు విరిగిన నేను ఆయన రమ్మంటే గాని వెళ్ళకూడదని నా పెట్టెలో దుప్పటి కిందపరుచుకుని ఎయిర్ పిల్లో పెట్టుకుని పడుకున్నాను. కింద అలవాటు లేక నిద్రపట్టక దొర్లాను. ఆ మగమహారాజుకి రాత్రి పెళ్ళాం అవసరం వచ్చి పక్కమీదికి లాగారు. మొగుడు కనక చచ్చినట్లు వళ్ళప్పగించాను.
    కాని నాకే అనుభూతి ముందురోజు నుంచీ కలుగలేదు. కలిగించాలని ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు. అంత సరసం తెలిస్తే మా కాపురం ఇలా ఎందుకుంటుంది. మర్నాడు ఉదయం లేస్తూనే 'ఈ హోటల్ తిండి తిని మొహం మొత్తింది. సామాను తెస్తాను..... వంట మొదలుపెట్టు' అన్నారు.

 Previous Page Next Page