Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 5


    "నాతో రావద్దు! మీరు వేరుగా రండి. నేను ఇంటి దగ్గర ఉంటాను!"
    మరోసారి తెల్లబోయింది. మనసులో ఏవో అప స్వరాలు చికాకు పెట్టాయి.
    "నేనురాను!" అని చెప్పేయాలనిపించింది.
    "అలాగేవస్తాను" అంది.
                                   * * *
    యశోద ఊహించినట్లే దేవిశంకర్ ఇల్లు చాలాడాబుగాసరిగా ఉంది. ఇంటిముందు లాన్ లో గంగాధరుడైన శంకరుడివిగ్రహం ఉంది.
    ఆ విగ్రహం శిరసు పైన ఉన్న గంగమ్మ మీదుగా ఫౌంటెన్ కిందకు ఉరుకుతోంది. పాలరాతివిగ్రహంఅది. కాంపౌండ్ గేటు దగ్గరినుంచి ముందరి వరండా వరకూ నల్ల బండలుపరిచిన రోడ్డు... దానికి రెండు పక్కలా గులాబీమొక్కలు తెలుపు ఎరుపు పసుపు రంగులు గల గులాబీలు ఒక క్రమంలో అమర్చి ఉన్నాయి. రోడ్డుకి అటు పక్కలాన్ లో తూగుటుయ్యాల.

    టి.వి.యస్. మీద వచ్చింది యశోద. కాంపౌండ్ గేటు తెరుచుకుని రోడ్డు మీదుగా వరండా వరకూ వచ్చింది.
    "భౌ!" మని అరుస్తూ మీద పడింది నలుపూ బూడిదరంగూ కలిసిన రంగులో ఉన్న ఆల్సేషియన్ డాగ్.

    దానికి తన టీ.వి.యస్ అడ్డుగా పెట్టి, వెనక్కి తగ్గింది. మనసులోపలినుంచి ఏదో గొంతు వెళ్ళిపో! వెళ్ళిపో! అని అరుస్తున్నట్లుగా తోచింది.
    కుక్క అరుపు వినగానే 'ఎవరూ?' అని బయటికి వచ్చింది ఒక నలభై ఏళ్ళముత్తైదువ.
    "ఏయ్ టింకూ! ఊరుకో!" అని కుక్కను అదిలించింది. వరండాలో ఒక వైపుగా కుక్కకోసం ప్రత్యేకంగా వేయించిన పిల్లర్ కికట్టేసింది. పండుతమలపాకు పసిమిలో తెలుపు కలిసిన శరీర ఛాయ....
    బక్కపలచని మనిషి, ఆకర్షణీయమైన కళ్ళూ.... అమాయకంగా స్వచ్చంగా ఉన్న నవ్వు.
    "కాంపౌండ్ గేటు బయటే కాలింగ్ బెల్ ఉందికదమ్మా! అది ప్రెస్ చేసి ఉంటే ముందేకుక్కని కట్టేసి ఉంచేదాన్ని. నువ్వూ, నేనూ కూడా అదృష్టవంతులం. ప్రమాదం తప్పింది. టింకూ! నిజంగా కరిచిందంటే! పోనీలే లోపలికిరా!" సాదరంగానే పిలిచింది. 
    గేటు దగ్గర గూర్ఖాని పెట్టడంకంటే మంచి ఏర్పాటు చేశాడు దేవిశంకర్. యశోద టి.వి.యస్.మీద నుంచి దిగకుండానే కాంపౌండ్ గేటు తెరిచింది. అందుకని గోడకున్న కాలింగ్ బెల్ చూసుకోలేదు.
    "ఆయామ్ సారీ!" అంది ఆవిడను చూసి "ఏమి అనుకోకండి" అంది మళ్ళీ.
    "ఆవిడ నవ్వింది.
    "నాకు 'సారీ!' 'థేంక్స్!''ఆల్ రైట్!' ఇలాంటి మాటలు అర్థమవుతాయి. అసలివి ఇంగ్లీష్ మాటలుకావు. తెలుగు మాటలు. అదీగాక నేను కూడా కాస్త చదువుకున్నాను. రా! కూర్చో!"
    సోఫా చూపించింది. తను కూడా మరో సోఫాలో కూర్చుంది.
    ఆవిడ చెవులకున్న రవ్వల దుద్దులు కిటికీ తెరల గుండా వస్తున్న సూర్య కాంతిలో తళుక్కుమంటున్నాయి.
    "ఒక్క నిముషం ఉండు!" అని లోపలికి వెళ్ళి రెండు జాంగ్రీలు, రెండు అవడలూ ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది.
    "మా ఇంట్లో పని వాళ్ళున్నారు.... బయటివాళ్ళు వస్తే ఏదైనా పనివాళ్ళతోనే ఇప్పిస్తాను. ఇంట్లో వాళ్లకి నేను స్వయంగా ఇస్తాను తీసుకో! "ప్లేట్ చిన్న స్టూల్ మీద పెట్టి యశోద ముందుకు జరిపింది.
    యశోద తెల్లబోయింది.
    "నేను ఈ ఇంట్లో మనిషినా?" అని అడిగింది.
    "నాకూ అలాగే కనిపిస్తున్నావు!"

    "నా గురించి మీకు ఏం తెలుసు?"
    "చెప్పనా? నంబర్ వన్ సాహసివి"
    "ఎలా చెప్పగలరు?"
    "కొత్త ఇంటికి.... అందులోనూ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తూ టి.వి.యస్ మీది నుండి దిగకుండానే గెట్ తెరుచుకుని సరాసరి వరండాలోకి వచ్చేశావు."  
    "తొందరపాటు కావచ్చుగా" అంది.
    "కావచ్చు... కానీ కాదు! నీ బోయ్ ఫ్రెండ్ ఇంట్లో అందరూ ఆర్ధోడాక్స్ అని విన్నావు.... అంచేత కావాలని షాక్ ట్రీట్ మెంట్ ఇద్దామని ఇలా వచ్చావు."

    గుటక మింగింది యశోద "నంబర్ టూ?"
    "ఒక క్లిష్టమైన పరిస్థితి వస్తే బెంబేలెత్తిపోవు. ఆ సమయానికి ఏం చెయ్యాలో ఆలోచించుకుని బయట పడతావు"
    "ఇదెలా తెలుసుకున్నారు?"  

    "టింకూ మీద పడగానే టీ.వి.యస్. అడ్డంగా పెట్టి తప్పించుకోవటం వల్ల"
    "నంబర్ త్రీ-?"
    "నీ బోయ్ ఫ్రెండ్ ని నువ్వు నిజంగా అభిమానిస్తున్నావు"
    "ఓగాడ్! అదెలా తెలుసుకున్నారు?"   
    "అతడి కుటుంబం 'ఆర్ధోడాక్స్' అని విన్నావు. నువ్వు ఆధునికురాలివైనా ఆ కుటుంబాన్ని చూడటానికి వచ్చావు?"    
    "నేను ఆధునికురాలినని ఎలా చెప్పగలరు?"
    ఆ రోజే చేతులకి వేసుకున్న గాజుల్ని చూసుకుంది.

    "పిచ్చిపిల్లా! గాజులు వేసుకోవటంలో లేదు ఆధునికత. అలాగే రవ్వల దుద్దులు పెట్టుకోవడంలో సాంప్రదాయకత లేదు."
    "మరి?"
    "సాయంత్రంవేళ... ఒక్కదానివే వచ్చావు. ఆడపిల్ల ఇలా ఒక్కర్తే రావటం.... ఆధునికత! ఇది మంచిదా! చెడ్డదా! అన్నదానికి నేను సమాధానం చెప్పలేను."
    "కానీ నేను వచ్చింది నాకు బాగా తెలిసిన వివేక్ ఇంటికి!"   

    "ఏం తెలుసు నీకు? అతడి ఇంట్లో ఎవరెవరు ఉంటారో. వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఆ వివరాలన్నీ నీకు తెలుసా? పోనీలే! నేనెవరో ఊహించావా?"         

 Previous Page Next Page