చిరునవ్వుతో "ఇంకో పావునిముషమే వుంది. లోపలికి వెళదాం రండి అన్నాడు. ఆమె అయోమయంగా అతడివైపు చూసింది. అతడి కళ్ళు పదండి వెళదాం అన్నట్టు వున్నాయి.
ఆమెలేచి, అతనెవరు- తననెందుకు రమ్మంటున్నాడు- లాటివేమీ ఆలోచించకుండా అతడితోపాటు చక్రధర్ గదివైపు నడిచింది. చక్రధర్ పర్సనల్ సెక్రటరీ అతడు తలుపు తోస్తూండగా, "ఏయ్ మిస్టర్ మీరెవరు?" అంటూ అబ్జెక్టు చెయ్యబోయాడు. అతడు సెక్రటరీవైపు ఒక క్షణం మాట్లాడకుండా చూసి తలుపు తోశాడు. అతడి ధైర్యానికి సెక్రటరీ ఏమీ మాట్లాడలేకపోయాడు.
ఇద్దరూ లోపలికి ప్రవేశించారు.
చక్రధర్ కళ్ళు మూసుకుని వున్నాడు. తలుపు చప్పుడు వినపడగానే అతని మొహంమీద తను గెల్చానన్న భావంతో నవ్వు కదలాడింది. కళ్ళు మూసుకునే ముద్దుకోసం మొహం ముందుకు జరిపాడు.
"మీ ఎడమకాలు చెప్పు తీయండి" అన్నాడు అతడు కామ్ గా. విద్యాధరి అదిరిపడింది.
అతడు ఆమెవైపు తలతిప్పి "తియ్యండి" అన్నాడు. అతడి కంఠస్వరానికి చక్రధర్ కళ్ళు విప్పకపోవటం ఆమెని మరింత అయోమయంలో పడేసింది. అతడు ప్రోత్సహిస్తున్నట్టు తలూపాడు. ఒకరకమైన ట్రాన్స్ లో వున్న దానిలా ఆమె కాలిచెప్పు తీసి పట్టుకుంది.
"వెళ్ళి బాదండి" అన్నాడు తాపీగా. "దీనివల్ల శిక్షలో పెద్ద మార్పుండదు. అయినా ఇక్కడ సాక్షులెవరూ లేరు."
ఆమె గాలిలో తేలుతున్నట్టు వెళ్ళి అతడి చెంపలమీద ఎడా పెడా వాయించింది. అంతా ఎవరూ వూహించని రీతిలో క్షణాల్లో జరిగిపోయింది.
ఇంకేదో మధురమైన దాన్ని వూహిస్తున్న చక్రధర్ అకస్మాత్తుగా జరిగిన సంఘటనకి ఉలిక్కిపడి కళ్ళు విప్పి చేతులు అడ్డు పెట్టుకునే లోపులోనే నోటిమీద కూడా రెండు దెబ్బలు పడ్డాయి. 'దీనివల్ల శిక్షలో పెద్ద మార్పుండదు' అన్న అతని మాటలు ఆమెలో తెగింపు ధైర్యాన్నిచ్చింది. చక్రధర్ లేచి, "ఏయ్ ఏమిటిది.... ఆపు" అని కేకలు వేసేలోపులో మరో నాలుగు బాదింది. చక్రధర్ ఆమెను పట్టుకోవటానికి ముందుకు రాబోతూ వుంటే అతడు వెనక్కి తోశాడు. చక్రధర్ వెళ్ళి కుర్చీలో పడ్డాడు. పడుతూ "పోలీస్ పోలీస్" అని అరిచాడు.
"సౌండ్ ఫ్రూఫ్. నీ మాటలు బయటకు వినిపించవు" అతనన్నాడు. చక్రధర్ చప్పున బెల్ నొక్కాడు. ఎవరూ రాలేదు. ఇంటర్ కమ్ లో హడావిడిగా సెక్రటరీ - సెక్రటరీ' అని పిలిచాడు. ఎవరూ రాలేదు. విద్యాధరితోపాటు వచ్చిన వ్యక్తి వినోదం చూస్తున్న ప్రేక్షకుడిలా దీన్నంతా చూస్తున్నాడు. చక్రధర్ ఇంకా బెంబేలు పడ్డవాడిలా లేచి బయటకు వెళ్ళబోతూంటే అతడు మళ్లీ తోశాడు. చక్రధర్ కుర్చీలో కూలబడి- "ఇంతకు ఇంతా ఫలితం అనుభవిస్తావ్" అని అరిచాడు ఇంగ్లీషులో - దానికి ముందొక బూతుమాట కలిపి.
ఈలోపులో ఆ యువకుడు తాపీగా కుర్చీ లాక్కుని కూర్చుంటూ విద్యాధరిని కూడా కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. ఆమె కూర్చోలేదు. ఆమెకు నెమ్మది నెమ్మదిగా మైకం విడిపోతున్నట్టు అనిపించింది. తనేం చేసిందో తల్చుకుంటే ఆమెకి ఇదంతా కలో నిజమో అర్థంకావటంలేదు. ఎర్రగా కందిన చక్రధర్ మొహం మాత్రం ఇదంతా కల కాదని నిరూపిస్తూంది. ఈ లోపులో అతడు విద్యాధరిని చూపిస్తూ- "ఈ అమ్మాయిమీద కేసు ఉపసంహరించుకోవాలి. అంతేకాదు, ముందుకు వంగి ఆమె కాళ్ళమీద శిరస్సు ఆన్చి క్షమాపణ వేడుకోవాలి. నువ్వు చేసిన పన్లకు ఈ విధంగా నీకు శిక్ష విధించేటందుకు నిర్ణయించాను" అన్నాడు.
"బాస్టర్డ్! నువ్వు నిర్ణయించటం ఏమిటి? అసలెవరు నువ్వు ?"
అనవసరమైన సంభాషణలకి ప్రాముఖ్యత ఇవ్వటం ఇష్టం లేనట్టుగా అతడు నొసలు చిట్లించి, "నేనూ నీ లాజిక్ నే ఉపయోగిస్తాను. పోనీ సంవత్సరంనుంచీ చేతలకి అడ్డుచెప్పక పోవటం ఆమె తప్పుగా ఆర్గ్యూచేశావు. ఆమెకన్న నువ్వు పవర్ ఫుల్ కాబట్టి ఆమెని అరెస్టు చేయించేవరకూ తీసుకెళ్లి నీ ఆధిపత్యం నిరూపించుకోవడంలో తప్పులేదని వాదించావు. ఇప్పుడు ఆమె తరఫున నేను మరింత పవర్ ఫుల్ గా వచ్చాను. కాబట్టి...." అంటూండగా ఫోన్ మ్రోగింది. అతడు "ష్...." అనగానే ఫోన్ దానంతట అదే ఆగిపోయింది. బెల్ ఆగాక తిరిగి అన్నాడు- "నీ లాజిక్ ప్రకారమే నిన్ను ఆమె పాదాక్రాంతుణ్ణి చేసే హక్కునాకుంది. నిముషం టైమిస్తున్నాను. వంగి నమస్కారం పెట్టు."
"ఈ నిమిషంలోనే నిన్నూ" - అంటూ చక్రధర్ లేచి తలుపువైపు వెళ్ళబోతుంటే అతడు చొరవగా పట్టుకుని చక్రధర్ కోటు జేబులోంచి ఒక ఫోటో తీసి అతడికి అందిస్తూ "ఇంకా నలభై సెకండ్లు టైముంది" అన్నాడు.
ఆ ఫోటో చూడగానే చక్రధర్ మొహం వెలవెల బోయింది. అతడు అంతగా బెదిరిపోవటం ఆమె ఎప్పుడూ చూడలేదు. "ఇది.... ఇదేమిటి?" అన్నాడు కంపిస్తూన్న స్వరంతో.
"ఆ నకిలీ రశీదు పుస్తకాలు నువ్వే పెట్టేవని కేసు ఉపసంహరించుకునేలా చేసే ఏకైక ఆయుధం".
"ఈవిడ... ఈవిడ ... నా తల్లి..."
"డిటైల్స్ వద్దు. సభ్యసమాజం హర్షించదు. పరిణామాలు ఆలోచించు. ఈ ఫోటో పది కాపీలు తీసి పదిమందికీ పంచిపెట్టడం జరిగిందనుకో ప"
"ఈ ఫోటో ఎవరు తీశారు? ఎప్పుడు తీశారు? నీ జేబులోకి ఎలా వచ్చింది."
"ఇంకా ఇరవై సెకన్ లు."
చక్రధర్ వంగి ఆ యువకుడి కాలర్ పట్టుకుని "నువ్వెవరు?" అని అడిగాడు.
"ఇంకా పదిహేను సెకన్ లు."
ఆ గదిలో హఠాత్తుగా అలముకున్న నిశ్శబ్దానికి విద్యాధరి వెన్ను చలితో వణికింది.
"ఇంకా అయిదు సెకన్ లు. ఒక నిజమైన వ్యాపారవేత్త ఒక నిర్ణయం తీసుకోవటానికి ఇంత టైమ్ అవసరం."
చక్రధర్ ఆలోచిస్తున్నట్టు కనిపించాడు. ఆ ఫోటో ఎంతో దారుణమైనది అయివుంటుందనీ, అందువల్లే పులిలాంటి వాడు పిల్లిలా అయిపోయాడని ఆమె భావించింది. అయితే ఆ ఫోటోలో ఏమున్నదీ ఆమెకూ అర్థంకాలేదు.
"ఇంకొక్క సెకను".
చక్రధర్ వంగి నమస్కారం పెట్టాడు. ఆమెకిదంతా డ్రమెటిక్ గా తోచింది. టెన్షన్ అంతా పోయి నవ్వొస్తూంది.
"ఈమె నిక్కణ్ణుంచి ట్రాన్స్ ఫర్ చేయవు. వీలైతే రేపు చిన్న ప్రమోషన్ కూడా ఇస్తావు. నేను మాత్రం నిన్ను వాచ్ చేస్తూ వుంటాను. సరేనా" ఆమెతో కలసి అతడు గది బయటకి వచ్చేశాడు. చక్రధర్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.
"ఇదంతా నాకేమీ అర్థంకావటంలేదు. మీరెవరు?" అని అడిగింది వచ్చి సీట్లో కూర్చున్నాక. అతడు ఎదుటి సీట్లో కూర్చునే ప్రయత్నమేమీ చెయ్యలేదు.
"నా పేరు అనుదీప్. అంతకన్నా వివరాలు చెప్తే మళ్ళీ షాక్ తింటారు. వద్దులెండి."
"మీకు ఆఫీసు విషయాలు అన్నీ ఎలా తెలిసినయ్?"
అతను నవ్వి వూరుకున్నాడు.
"ఆ ఫోటోలో ఏముంది?"
"ఇంకొకరి వ్యక్తిగత జీవితాల చీకటి గురించి మనం చర్చించటం అంత బావోదు విద్యాధరిగారూ."
ఆమె సిగ్గుపడి "సారీ" అంది. అయినా ఆమె కుతూహలం తగ్గలేదు.
"పోనీ, ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. అటువంటి ఫోటో మీ జేబులోకి ఎలా వచ్చింది?"
అతడు చొరవగా ఆమె బ్యాగ్ తెరిచి, అందులోంచి ఒక పువ్వుతీసి ఆమెకిస్తూ "ఇదెలా వచ్చిందో అదీ అలాగే" అని నవ్వేడు! ఆమె తలమునకలయ్యే ఆశ్చర్యంతో తన చేతిలోని మల్లెపూవు వంక చూసింది. అదొక అద్భుతంలా తోచింది. అసలా యువకుడే ఒక చిత్రాతి చిత్రమైన మనిషిలా తోచాడు. ఇంకా ఏదో అడగటానికి తలెత్తేసరికి అతడు అక్కడ లేడు.
ఆ తరువాత సంఘటనలన్నీ చాలా తొందర తొందరగా జరిగిపోయాయి. ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఏదో జరుగుతుందని ఊహించిన ఆమె కొలీగ్స్ అందరూ తమ తమ పనుల్లో నిరాసక్తంగా మునిగిపోయారు. సాయంత్రం వరకూ చక్రధర్ ఆమెని పిలువలేదు. ఆమె దాని గురించి పట్టించుకోలేదు కూడా. ఈ సమస్య ఇక సమసిపోయినట్టే భావించింది. చక్రధర్ వాలకం చూస్తే అతడిక తన జోలికి వచ్చేటట్టు కనిపించలేదు.
ఆ రాత్రి ఆమె తన పుస్తకంలో వ్రాసుకుంది.
"ఈ రోజు చాలా థ్రిల్లింగ్ సంఘటన జరిగింది. దీని గురించి వివరాలు వ్రాసుకోవటం అనవసరం. ఎందుకంటే నా జీవితాంతం ఈ సంఘటన సజీవంగా మిగిలిపోతుంది."
ఆ రాత్రి ఆమె చాలాసేపటివరకూ నిద్రపోలేదు. జరిగిందంతా నిజమని ఆమెకి ఇంకా నమ్మకం కుదరలేదు.
నమ్మకం కుదిరే సంఘటన ఆ మరుసటి రోజు జరిగింది.
* * *
అశ్వనీ ఆడిటోరియం.
రాత్రి 7-30.
విద్యాధరి అసహనంగా కుర్చీలో కదిలింది. ఆమె చివరి వరుసలో కూర్చుని వుంది. అసలారోజు అంత రష్ గా వుంటుందని ఆమె వూహించలేదు. అయిదున్నరకే వచ్చినా, అప్పటికే హాలు నిండింది. ఆరు అయ్యేసరికి గేట్లు మూసేశారు. ఏడుంపావుకి బైట జనం గొడవ. లోపలికే వినిపించేటంతగా గుమికూడారని బయట అరుపులనుబట్టి తెలుస్తూంది.
ఆ రోజు ఒక సినిమా యాక్టరు ఫంక్షనుంది. ఆ యాక్టర్ గత సంవత్సరమే సినిమా ఫీల్డులోకి ప్రవేశించాడు. ఒక చిత్రంలో కొజ్జా వేషం వేసి సాటి మనిషి అంగవైఫల్యాన్ని భూతద్దంతో చూపించి ప్రేక్షకుల్ని కవ్వించటానికి ప్రయత్నం చేశాడు. మరొక చిత్రంలో పోలీసు వేషం వేసి, ప్రజలకు పోలీసులమీద వున్న న్యూనతాభావాన్ని మాటల రచయిత కాష్ చేసుకోగా, ఆ పాత్రకి కొంచెం ప్రాచుర్యం లభించింది. అంతే గత ఏడాదిగా అతడు నటించిన చిత్రాలు ఆ రెండే. అతడికోసం అంతమంది జనం వస్తారని ఆమె వూహించలేదు.
ఆమె వచ్చింది, దేవులపల్లి బాలగంగాధరచలాన్ని చూడటం కోసం. ఆయనకి తొంభై ఏళ్ళుంటాయి. గొప్ప సాహిత్యవేత్త. పది సంవత్సరాల క్రితం తన తండ్రి ఒక పత్రిక్కి సంపాదకుడు. వీళ్ళిద్దరికి హస్తిమశకాంతరం తేడా వుండేది. ఆయన సంపాదకత్వం చదువుతూ వుంటే "ఈయనకి తెలియని విషయం లేదా" అనిపించేది. భావుకత్వం ఉండేది. విజ్ఞానం వుండేది. ప్రజలమీద, వారి సమస్యల మీద ఆర్ద్రత కూడిన వేదన వుండేది. అది ఆ పత్రికలో రిఫ్లెక్టు అయ్యేది. ఫలితంగా ఆయన పత్రిక మూతపడింది. విద్యాధరి తన తండ్రి నిర్వహించే పత్రిక 'యువతీ యువకుల్ పత్రిక' అన్న పేరు క్రింద మానసిక వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ 'సమాజంలో జరిగే అత్యాచారాల్ని బయటపెడుతున్నాము' అన్న శీర్షిక క్రింద యవ్వనాన్ని రెచ్చగొట్టే బొమ్మలు వేస్తూ - ప్రాచుర్యం పొందింది. రాత్రిపూట రచయితలతో కూర్చుని (వీళ్లే సీసాలు తెచ్చేవాళ్ళు) తన గొప్పతనాన్ని ఉపన్యసించేవాడు.
"చూశారా మనకెంత ఫాలోయింగో..." అనేవాడు. శ్రోతలు తలలూపేవారు దాన్ని వింటూ, లోపల్నుంచి తను అనుకునేది "నాన్నా! నువ్వు మూర్ఖుడివా? లేక ఆత్మ లేదు కాబట్టి ఆత్మవంచన అన్న పదమే ఎరుగని అజ్ఞానివా? నీకు ఇంట్లోనే ఫాలోయింగ్ లేదు? నీ భార్య బ్రతికున్నంతకాలమూ నీతో పోట్లాడేది. నీ కూతురు నిన్ను ప్రతి అణువూ అసహ్యించుకుంటూంది. ఇక నీకేమి ఫాలోయింగ్? ఇప్పుడు నీకు సీసాలు సప్లై చేసేవాళ్ళు, నువ్వొక మేధావివని, స్నేహసంపన్నుడవనీ పొగిడే రచయిత్రులూ, రేపు నీ పొజిషన్ లో ఇంకొకరు వచ్చినా ఆ పని చేస్తారనే తెలుసుకోలేని ఆలోచనా రహితుడివా? తెలిసీ, దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే లౌక్యుడివా? లౌక్యుడివే ఐతే మనకెంత ఫాలోయింగో అన్న ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు? ఫాలోయింగ్ అంటే అదికాదు నాన్నా. 'క్రిక్కిరిసిన మనుష్యుల మధ్య ఫాన్ లేక ఉక్కపోసే స్థితిలో ఒక తొంభై ఏళ్ళ వృద్ధుణ్ణి చూడటం కోసం నేను వచ్చాను చూడూ - అదీ ఫాలోయింగ్ అంటే.... కొజ్జావేషాలు వేసేవాడు కూడా తన కోసం వచ్చిన ఈ జనాన్ని చూసి ఇదంతా తన ప్రతాపమే అనుకుంటే ఎలా? అర్థరాత్రి నిద్రలో కూడా ఎవరి మేధస్సు మన ఆలోచన్లని ఆరోగ్యవంతం చేస్తుందో, తమతమ రంగాలకి ఎవరైతే అకుంఠిత దీక్షతో తమ జీవితాల్ని అర్పిస్తారో! వాళ్ళకుండేది... అదీ ఫాలోయింగంటే."