"గంటక్రితం వరకు నన్ను వివాహం చేసుకుందామన్న వ్యక్తితో. అరగంట వరకూ నాతో ఉత్తి స్నేహమైనా ఫర్వాలేదనీ బ్రతిమాలిన మనిషితో, ఇప్పుడు కారణం లేకుండా పంతం పట్టిన ఇగోయిస్ట్ తో-"
"ఐ విల్ సీ యువర్ ఎండ్."
"వెల్ కమ్" అని ఆమె ఫోన్ పెట్టేసింది. మానేజర్ తో - "అతను నా మాట వినటం లేదు. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. రేప్రొద్దున్న వస్తాను" అని ఇంటికి వచ్చేసింది.
ఆమె ఈ పన్లన్నీ చేసుకొని తిరిగి వచ్చేసరికి పన్నెండు కావొస్తూంది. గదిలో బల్లమీద పుస్తకం అలాగే వుంది. ఆమె కుర్చీ లాక్కొని కూర్చుని రెండో పేజీలో వ్రాయటం మొదలుపెట్టింది.
"ప్రకృతి మనిషిని మిగతా ప్రాణులకన్నా గొప్ప జీవిని చేయటం కోసం రీజనింగ్ అన్న శక్తి నిచ్చింది. కానీ చరిత్ర సాగేకొద్దీ.... మనిషి సంస్కారవంతుడయ్యే కొద్దీ ఆ శక్తిని 'తన కోసం' ఎలా ఉపయోగించుకోవాలా అన్న స్వార్థంతోనే ఆలోచించసాగాడు. ఈ రోజు నేను మొట్టమొదటిసారి ఆ శృంఖలాలు తెంచుకోగలిగాను."
ఆమె ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది.
* * *
3 మే, 1987
సిగ్మా ఇన్వెస్టింగ్ కంపెనీ,
రింగ్ రోడ్.
పదింటికి ఆమె మామూలుగానే ఆఫీసుకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి ఆఫీసంతా అల్లకల్లోలంగా వుంది. అందరూ ఆమెవైపు సానుభూతిగా చూడసాగారు.
చక్రధర్ కి తనమీద కోపం వస్తుందని తెలుసు. కానీ ఇంత దారుణంగా పగ తీర్చుకుంటాడని అనుకోలేదు. ప్రేమ ఇంత చిన్న చిన్న కారణాలవల్ల పగగా మారుతుందని కూడా ఆమె వూహించలేదు.
ఆమె ఆలోచిస్తూ వుండగానే పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది. ఇన్ స్పెక్టర్ అదో విధమైన ఫోజుతో ఎవర్నీ చూడకుండా టకటకా బూట్ల శబ్దం చేసుకుంటూ చక్రధర్ గదిలోకి వెళ్ళాడు. ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో బయట వారికి తెలియలేదు.
అయిదు నిముషాల తరువాత ఇన్ స్పెక్టర్ వచ్చి అకౌంట్స్ మేనేజర్ దగ్గర్నుంచి ఏవో కాగితాలు తీసుకుంటున్నాడు.
అప్పుడొచ్చింది విద్యాధరికి లోపల్నుంచి కబురు. ఆమె లోపలికి వెళ్ళింది.
చక్రధర్ రివాల్వింగ్ చైర్ లో కూర్చుని వున్నాడు. ఆమెని చూసి నవ్వేడు. ప్రతిరోజూ నవ్వే నవ్వుకి దీనికి తేడా వుంది. ప్రతిసారీ ఆహ్వానం వుంది. ఈసారి విజయగర్వం వుంది. తనని కూర్చొమ్మని కూడా అతను అనకపోవటం ఆమె గమనించింది.
"ఇన్ స్పెక్టర్ ఎందుకొచ్చాడో తెలిసిందా?" ఆమె తెలీదన్నట్టు తలూపింది.
"మన కస్టమరు శోభాచంద్ నిన్న పాతికవేలు పంపించాడు. అతడికి నువ్వు ఇచ్చిన రశీదు మన కంపెనీది కాదు, అలాగే పోలికలు ఉండేలా సృష్టింపబడింది. అది ఫేక్ రసీదు అని అతడికి అనుమానం వచ్చిన నాకు తెల్లవారుజామునే ఫోన్ చేశాడు. నీ టేబుల్ తాళాలు బ్రద్దలు కొట్టించి నలుగురి సమక్షంలో వెతికించాం. అందులో ఈ నకిలీ రషీదు పుస్తకాలు రెండు దొరికాయి. అంటే ఎంతకాలం నుంచో నువ్విలా కస్టమర్లు ఇచ్చిన డబ్బుని నీ స్వంతానికి వాడుకుంటూ తరువాత జమ చేస్తున్నావన్నమాట."
ఆమె నిర్విణ్ణురాలైంది. చక్రధర్ రాత్రికి రాత్రి ఇంత పెద్ద ప్లాన్ వేస్తాడని ఆమె వూహించలేదు. తెల్లవారుఝామునే అప్పటికప్పుడు నకిలీ రసీదు పుస్తకాలు ప్రింటు చేయించాడన్నమాట. శోభాచంద్ ఎలాగూ వాళ్ళమనిషే.
తూనీగలకి దారంకట్టి అవి బాధపడుతూంటే చూసి ఆనందించే మనస్తత్వం అతడిలో ఆమెకి కనపడింది. లేకపోతే తనలాటి చిన్న ఉద్యోగి మీద కక్ష తీర్చుకోవటానికి ఇంత క్రూరమైన ప్లాన్ అవసరం లేదు. అతడి అంతస్థు, పలుకుబడితో పోల్చుకుంటే చాలా చిన్న ప్రాణి తను.
"నేను చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా నిక్కచ్చిగా వుంటాను. నా ఈగో దెబ్బతినటం అసలు సహించను. నిన్న ఏమన్నావ్ నువ్వు? నా భార్య నన్ను వదిలెయ్యటం నాకు మైనస్ పాయింటా? నాతో గడపకుండానే నీకు నా మైనస్ లు ఎలా తెల్సినాయ్?" నవ్వేడు.
నిన్న రాత్రి తన చేతుల్ని అతడి చేతుల్లోకి తీసుకున్నది ఇతడేనా అన్న అనుమానం కల్గింది. అంత ప్రేమ ఇంత ద్వేషంగా ఎలా మారింది?
తన తల్లిదండ్రులు రాత్రిళ్ళు ఇలాగే దగ్గరయ్యేవారు. పగలు దున్నపోతుల్లా పోట్లాడుకునేవారు. ప్రేమవున్న చోట ద్వేషం ఎలా వుంటుందో పగలు ఒకరిపట్ల ఒకరు అంత ద్వేషంగా ఉన్న వాళ్ళు రాత్రిళ్ళు ఎలా దగ్గరవగలరో ఆమెకి అర్థమయ్యేది కాదు.
మనుష్యుల సంగతి సరే -మిత్ర రాజ్యాలై హిరోషీమాని నాశనం చేసిన రెండు దేశాలూ తరువాత బద్ధశత్రువులు ఎలా అయ్యాయి. మాది క్యాపిటలిజం - మీది కమ్యూనిజం అన్న వాదనవల్లా ?
"ఇక నీకు ఆలోచించుకోవటానికి వ్యవధిలేదు. ఆ బేరరు గురించి మర్చిపోవాలి నువ్వు, అది మొదటి షరతు" అన్నాడు చక్రధర్.
ఆమెకు తను పూర్తిగా ఓడిపోతున్నానని తెలుసు. ప్రాధేయ పూర్వకంగా అంది. "పాపం అతడు ముసలివాడు. మీకేం అపకారం చేశాడు?"
"నేను మంచివాళ్ళకి మంచివాడిని, ఎదురు తిరిగితే నా అంత చెడ్డవాడు ఎవరూ వుండరు".
ఇతడు కూడా - ఆఖరికి ఇతడు కూడా తను మంచివాడినని అనుకుంటున్నాడు. తన ఈగోని ఒక 'అర్హత'గా పేర్కొంటున్నాడు.
"ఇంతకీ నా రెండో షరతు వినవేం?"
"ఏమిటది?"
"సంవత్సరంపాటు అందీ అందనట్లు ఊరించినందుకు ప్రతిఫలంగా ఊరించింది అందించాలి-"
ఆమె తెల్లబోయి "నేను ఊరించానా?" అంది. అతడు అడిగిన దానికన్నా, అతడి ఆర్గ్యుమెంటు ఎక్కువ షాకు కల్గించింది.
"మరి?... మొదట్నుంచీ నాకు నీ మీద ఇంట్రెస్టు వుందని నీకు తెలీదా?"
ఇంటరెస్టు వున్న ప్రతిమొగాడ్నీ స్త్రీ ఎదుర్కోదు. అపాయకరంగా పరిణమించేదాకా చూసీ చూడనట్టు వదిలేస్తుంది. ఈ గుణాన్ని అతడు తన వాదనకి పునాదిగా వాడుకుంటున్నాడు. రేపు ఇతడు ఈ వాదనని ప్రపంచం ముందు పెడితే సగం జనాభా ఇతనికి ఓటువేసినా ఆశ్చర్యం లేదు.
ఆమెని భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది. ఈ ప్రపంచంలో నిర్దిష్టమైన మంచితనం అంటూ ఏమీలేదు. ప్రతి చర్యకీ ఒక రీజనింగ్ వుంటుంది. గాంధీని చంపినవాడికీ, చార్లెస్ శోభరాజ్ కీ, సత్వంత్ సింగ్ కీ, తన తండ్రికీ - అందరికీ తమని తాము సమర్ధించుకోవటానికి ఒక వాదనా, దాన్ని సపోర్టు చెయ్యటానికి ఒక గ్రూపూ వుంటాయి. అదే 'థ్రిల్లర్' పుస్తకంలో -
ఇంట్లో -మంచంపక్క టేబిల్ మీద పెట్టిన వుంచిన ఆ పుస్తకం గుర్తు రాగానే ఆమెలో ఏదో తెలీని ధైర్యం ప్రవేశించింది.
"మిస్టర్ చక్రధర్ - న్యాయం నావైపున వున్నదని నీకూ తెలుసు. ఎప్పటికైనా నేనే గెలుస్తాను."
అతడు సాడిస్టిక్ గా చప్పట్లు చరిచి "గుడ్" అన్నాడు. "... కానీ అప్పటికి నీకు జైల్లోనే ముసలితనం వస్తుంది. బయటెక్కడా ఉద్యోగం దొరకదు. ఈలోపులో పోలీసులు నిన్ను దోచుకోరని కూడా నమ్మకం లేదు. అందులోనూ నీ అంత అందమైనదానిని-" అతడి నవ్వు ఆగిపోయింది. "థియరిటికల్ గా ఆలోచించకు. నువ్వు 'ఊ' అంటే నీ స్టేటస్ మార్చేస్తాను!"
కొత్తగా కపంపట్టిన రచయిత్రులతో తన తండ్రి కూడా ఇదే అనేవాడు. వాళ్ళందరూ ఇప్పుడు లబ్ధ ప్రతిష్టులై సమాజానికి నీతిపాఠాలు వల్లిస్తున్నారు. సుఖంగా భర్తల్తో సంసారాలు చేసుకుంటున్నారు. కత్తి అంచున నిలబడి ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు వాళ్ళు చేసుకున్న ఆత్మవంచన గురించి ఆ తరువాత జీవితంలో ఒక్కసారైనా... తాము చేసుకున్న ఆత్మవంచన గురించి ఆలోచిస్తారా? ఆనంద సంతోషాలు బహుశా వాళ్ళకి ఆ అవకాశాన్నీ, ఆలోచించే టైమ్ నీ ఇచ్చివుండవు. పునాది బురదలోంచి తీస్తేనేం - భవంతి నిర్మింపబడ్డాక....
"అయిదు నిముషాల టైమిస్తున్నాను, ఆలోచించుకో, ఐదు నిముషాల్లో నువ్వు తిరిగిలోపలికి రాకపోతే-" ఆగిఅన్నాడు. "బైట పోలీస్ వ్యాన్ నీ కోసం ఎదురుచూస్తూంది".
ఆమె ఏమీ తోచని దానిలా ఒక క్షణం అలాగే నిలబడిపోయింది. ఆమె కాళ్ళు ఆమెకి సహకరించటంలేదు. అతడు నవ్వేడు. అలా మాటి మాటికీ అతడు నవ్వే నవ్వు ఆమెకి కంపరం కలిగిస్తూంది. ఆమె తలుపు దగ్గరకు వచ్చింది.
తలుపు తీస్తూండగా అతనన్నాడు. "సరిగ్గా అయిదు నిముషాల్లో రావాలి. నువ్వు వచ్చేసరికి నేను కళ్ళు మూసుకుని వుంటాను. పాపం నీకు నీ నిర్ణయం నోటితో చెప్పటం కష్టం అవుతుందని నాకు తెలుసు. పెదాలమీద ముద్దు పెట్టుకో. అదే మన అగ్రిమెంటు...."
సాడిస్ట్ ... సాడిస్ట్ -
ఆమె బయటకు వచ్చేసింది. అందరూ ఆమెనే చూస్తున్నారు.
వచ్చి కుర్చీలో కూలబడింది. గుండెల్లో గరగర, బాగా ఏడవాలని వుంది. ఫాల్స్ ప్రిస్టేజి మన కిష్టమైన పన్లని కూడా హాయిగా చేసుకోనివ్వదు. స్నేహితురాలు దగ్గిరగా వచ్చి "ఏం జరిగింది?" అని అడిగింది. అందులో సానుభూతికన్నా- ఏం జరిగిందో తనే ముందు తెలుసుకుని అందరికీ చెప్పాలన్న ఆతృత ఎక్కువుంది.
"ఏం లేదులే" అంది విద్యాధరి మొహం తిప్పుకుని. ఆవిడ ఆశాభంగం చెంది వెళ్ళిపోయింది.
విశాలమైన హాలు. దాదాపు ఇరవైమంది దాకా ఆ హాల్లో వున్నారు. ఆ హాల్లో అంత నిశ్శబ్దం ఎప్పుడూ లేదు. టైప్ చేయవలసిన వాళ్ళుకూడా చేయకుండా ఏదో మిషమీద కాగితాలు సర్దుతున్నారు. పోలీసు ఇన్ స్పెక్టరు మానేజర్ ఎదురుగా కూర్చుని సిగరెట్ వెలిగించి లోపల్నుంచి వచ్చే చక్రధర్ సిగ్నల్ కోసం చూస్తున్నాడు - చట్టం అన్యాయం నుంచి అనుమతి కోసం చూస్తున్నట్లు.
ఆ గదిలో టెన్షన్ పూర్తిగా నిండి వుంది. 'నా' అనేవాళ్ళు ఎవరూ లేకపోవటం ఎంత నరకమో విద్యాధరికి తెలిసింది. కనీసం మనసు విప్పి చెప్పుకోవటానికి కూడా ఎవరూలేరు. తన చేతులు కంపిస్తున్నట్లు గమనించి, వాటిని అదుపులో పెట్టుకోవటానికి వృధాప్రయాస చేసింది. తనని ఎలా తీసుకెళతారు? చేతికి బేడీలు వేసా? మామూలుగానేనా? పోలీస్ స్టేషన్ లో ఎంతకాలం వుంచుతారు? .... ఆమెకి కోర్టు ప్రొసీజర్లు తెలియవు. వెంటనే జైలుశిక్ష వేస్తారా? లాయర్ ని ఎలా కలుసుకోవాలి? లాయర్ కివ్వటానికి డబ్బు కూడా లేదు. అయినా అంతవరకూ రాదు. పోలీస్ వ్యాన్ ఎక్కుతూ వుండగానే గుండె ఆగిపోవచ్చు. అలా ఆగినా బావుణ్ణు అనుకుంది.
నాలుగు నిముషాలు గడిచాయి. చక్రధర్ గదికి అవతలి వైపున్న ఎయిర్ కండిషనర్, హాల్లో ఫ్యాన్లు, ఈ చప్పుడు తప్ప మరింకేదీ వినిపించటం లేదు.
విద్యాధరి చాలా సామాన్యమైన మెంటల్ స్టాటస్ వున్న అమ్మాయి. కేవలం బేరర్ సమస్య ఒకటే అయితే, ఇంత మానసికమైన వత్తిడి భరించలేక పట్టు వదిలేసేదేమో. కానీ నైతిక విలువలపట్ల ఆమెకున్న నమ్మకం ఆ సాడిస్టు కోరిన కోరికల్ని వప్పుకోనివ్వటం లేదు. అలా అన్చెప్పి, 'ఏం జరిగితే అది జరుగుతుందని' అని ధైర్యంగా వుండగలిగే మొండితనమూ ఆమెకి లేదు. ఆ క్షణం ఆమెకి ఒక్కటే అనిపించింది. ఎవరూ చూడకుండా ఒక్కసారి భోరున ఏడిస్తే బావుణ్ణు అని.
అతడు పెట్టిన గడువుకి ఇంకా అరనిముషం వుందనగా ఆమె పక్కనుంచి "హల్లో" అని వినిపించింది.
తల వంచుకుని, హాండ్ బ్యాగ్ ని గట్టిగా పట్టుకుని పెదవుల్ని బిగపట్టి ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూన్న ఆమె తలెత్తింది.
అతడొక బెంగాలీబాబులా ఉన్నాడు. లాల్చీ పైజామా, భుజానికి వేలాడే కలకత్తా సంచి, చిన్న గెడ్డం, చురుకైన కళ్ళు - అయిదడుగుల అయిదంగుళాలు ఎత్తు, ఆకుజోళ్లు - జీవితం అంటే పెద్ద లక్ష్యంలేనట్టు నుదుటి మీదకు పడుతూన్న జుట్టు.... సాధారణంగా జర్నలిస్టులు ఎలా వుంటారో అలా వున్నాడు. అన్నిటికంటే ఎక్కువగా అతడి మొహంలో అదోలాటి తేజస్సు కనపడుతూంది. అతడి తీక్షణమైన కళ్ళు నవ్వినప్పుడు మాత్రం దయని వర్షిస్తున్నట్టు వున్నాయి.