Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 45


    నరసింహం తడబడ్డాడు - తనకు అనుమానం వుందిగానీ అది తనొక్కడే ఆలోచించి తేల్సుకోవాల్సిన విషయం ! మురళీకి తెలీకూడదు.

    "వాడు ఖచ్చితంగా నా రక్తం పంచుకు పుట్టినవాడేనని నాకు అనుమానంగా వుంది ! లేకపోతే ఇన్ని పోలికలుండవ్__"

    "నేనూ అదే అనుకొంటున్నాను" అన్నాడు నరసింహం. అప్పటికప్పుడు ఏదో ఒక కథ అల్లి మురళికి చెప్పాలి. ఆ కథ ఎలాంటి దయ వుండాలంటే - ఆ కథ వినగానే మురళి తన సోదరుడి మీదా, తల్లి మీదా పగబట్టాలి. వాళ్ళిద్దరూ తన శత్రువులని భావించాలి ! అలాంటి కథలల్లి చెప్పటం మొదలుపెట్టాడు.

    "అవున్రా ! ఇన్నాళ్ళూ ఈ విషయం చెప్పటం ఇష్టంలేక దాచాను. అసలు విషయం తెలిస్తే నీకు కన్నతల్లి మీదే ద్వేషం కలుగజేసినట్లవుతుందని చెప్పలేదు-"

    "ఏమిటి అది ?"

    "నీ చిన్నప్పుడు జరిగిన విషయం ఇది. నీ నాన్న పచ్చి తాగుబోతు. రోజూ తాగి అర్దరాత్రి ఇంటికి చేరుకుని మీ అమ్మను చావగొడుతుండేవాడు. పాపం మీ అమ్మ చాలా రోజులు ఆ నరకం నిశ్శబ్దంగా అనుభవించింది. ఓ రోజు రాత్రి నీ నాన్నకు ఎదురు తిరిగింది. తన వంటిమీద చేయిపడితే సహించేది లేదని హెచ్చరించింది. దాంతో మీ నాన్న మరింత రెచ్చిపోయి ఆమెను గొడ్డును బాదినట్లు కొట్టడం ప్రారంభించాడు. ఇదంతా తలుపు దగ్గర నిలబడి చూస్తున్న మీ అన్నయ్య రోకలిబండ తీసుకొని వెనుక నుంచి వచ్చి మీ నాన్న తలమీద కొట్టాడు. అంతే ! మీ నాన్న అక్కడికక్కడే మరణించాడు. మీ మ్మ కెవ్వుమని కేకవేసి స్పృహ తప్పింది. మీ అన్నయ్య ఆ రక్తంచూసి భయపడి ఇంట్లోనుంచి పారిపోయాడు. ఆ తరువాత ఏమయ్యాడో తెలీదు. ఆ నేరం తనమీద వేసుకుని మీ అమ్మ జైలు కెళ్ళింది. ఇప్పుడు నన్ను సాధించాలని ఈ విధంగా పధకం వేసినట్టున్నాడు."

    "నువ్వు చెప్పినదంతా నాకు తెలిసిన కథే కానీ ఆ హరికృష్ణ నన్ను సాధించటం దేనికి ?"

    "అతడి భార్యని నువ్వు చేసుకున్నందుకు ?"

    మురళి మొహంలో ఆందోళన కనపడింది. "నన్ను నువ్వు కూడా నమ్మటంలేదా మావయ్యా ?" అన్నాడు దిగులుగా.

    "నమ్ముతున్నాననుకో కానీ అనుమానం అనుమానమే కదా ?"

    మురళి ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా, "సరే నీ దగ్గర కూడా నా స్థానాన్ని అనుమానాస్పదం చేసిన ఆ దుర్మార్గుడిని ఎలా ఎదుర్కోవాలో నాలో నేనే ఆలోచిస్తాను." అని అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు.

    నరసింహం మొహంలో ఆనందం తొంగిచూసింది.

    తనక్కావలసింది సాధించిన ఆనందం. అతడికింకా ఒక అనుమానం మిగిలిపోయింది. నీళ్ళదగ్గిర ఒక కుర్రవాణ్ణి కాల్చేసి, మరొకడిని తనతోపాటు బయటకు తీసుకువచ్చి, వాడినే ఆయుధంగా శారదమ్మని బెదిరించాడు. అయితే తను తీసుకువచ్చింది ఆ చీకట్లో ఎవరిని ? హరికృష్ణనా ? మురళీకృష్ణనా ? తన కూతురి మెడలో చిన్నప్పుడు తాళి కట్టింది మురళీ అని తనకు తెలుసు ! అయితే ఇప్పుడు మురళి అన్న పేరుమీద తనకి అల్లుడు అయినవాడు నిజంగా మురళీయేనా? లేక హరికృష్ణే పేరు మార్చుకుని కేవలం రాధ ప్రేమ సంపాదించటానికి యీ అబద్దమడుతున్నాడా ? అదేగానీ నిజమైతే తన అల్లుడు తనకన్నా పెద్ద మోసగాడు. అటువంటప్పుడు ఈ హరికృష్ణ తన న్యాయబద్ధమైన స్థానం కోసం పోరాడటంలో తప్పులేదు.

    అయినా కూడా తన ప్రస్తుత అల్లుడిని రక్షించాలి !

    కూతురి మీద ప్రేమతోకాదు.

    తన రహస్యం బయటపడకుండా  వుండటం కోసం.


                        *    *    *


    ఆ సాయంత్రం నరసింహం కారులో నగరానికి ఉత్తరం దిక్కుగా బయల్దేరాడు.

    దాదాపు అయిదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక ఒక ఫ్యాక్టరీ వచ్చింది.

    'మోర్కా' బిస్కెట్స్ ఫ్యాక్టరీ అది.

    గేటు దగ్గిర  ఆపి సెక్యూరిటీ గార్డుతో "నాకు రంగా అని, ప్యాకింగ్ సెక్షన్ లో వుంటాడు అతడు కావాలి" అని చెప్పాడు.

    సెక్యూరిటీ గార్డు మామూలు సమయాల్లో అయితే ఇలాంటివి వప్పుకోడు. కానీ వచ్చింది కార్లో కనుక నమ్రతగా.

    "మీ పేరేమని చెప్పమంటారు ?" అడిగాడు.

    "సుబ్రహ్మణ్యం" అన్నాడు నరసింహం.

    "రెండు నిమిషాల తర్వాత  అతి సామాన్యంగా ఉన్న ఓ వ్యక్తి ఫాక్టరీనుంచి గేటుదగ్గరకు వచ్చాడు. పైకి మాత్రమే అతడు సామాన్యంగా కనపడతాడు. నరసింహాన్ని కార్లో చూస్తూనే అతని మొఖంలో ఆశ్చర్యం కనిపించింది.

    "నమస్కారం సార్ !" అన్నాడు చిరునవ్వుతో దగ్గరకొస్తూ. "సుబ్రహ్మణ్యం అంటే ఎవరో అనుకున్నాను."

    "కారెక్కు-" అన్నాడు నరసింహం క్లుప్తంగా.

    "ఇప్పుడా ?"

    "అవును !"

    "డ్యూటీ__"

    "ముందు కారెక్కు"

    "మా సూపర్ వైజర్ తో చెప్పి వస్తాన్సార్-"

    "త్వరగా రా-"

 Previous Page Next Page