"సాయంత్రం అయితే తప్ప గేటు ఎలా తెరుస్తాను సార్ ? తెరవకూడదని మీరే అన్నారు కదా ?"
"ఓరి వెధవా ! మేము వచ్చినా తెరవ్వంట్రా ?"
"ఎవరొచ్చినా సరే - తెరవకూడదని మీరే చెప్పారు కదండీ."
"మేము తప్ప ఎవరొచ్చినా సరే అని అర్ధంరా ! త్వరగా తెరచి ఏడు."
"అమ్మగారినడిగి వస్తానండీ ! ఆమె తెరవమంటే తెరుస్తాను."
"ఒరేయ్ ... మేము స్వయంగా చెపుతూన్న మా మాటలు లెక్కలేవన్న మాట! అంతేనా ? నిన్ను డిస్ మిస్ చేసి పారేస్తున్నాను" కోపంగా అన్నాడు నరసింహం.
ఘూర్కా వాడికి అనుమానం ఎక్కువైపోయింది. ఏ పరిస్థితుల్లోనూ ఎవరినీ లోపలకి రానీయవద్దని మరీ చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే లోపలికి వెళ్ళనీయమంటున్నారంటే ఇందులో ఏదో గూడార్ధం వుంది. బహుశా తనను పరీక్షించడానికే ఇలా చేస్తూండి వుంటారు.
"ఏమైనా చేసుకోండి సార్! లోపలి కెళ్ళటానికి వీల్లేదు." అన్నాడు వాడు మొండిగా.
వాడిని అతి కష్టంమీద వప్పిమ్చి, నచ్చజెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.
ఇద్దరూ హడావుడిగా ఇంటిలోకి పరుగెత్తారు.
"రాధా!" గట్టిగా అరిచాడు మురళి ఇంటిలో కొస్తూనే.
గదులన్నీ త్వరత్వరగా తిరుగుతూ మేడమీదకు చేరుకున్నాడతను.
బాల్కనీలో కూర్చుని టేప్ రికార్డర్ లో ఇంగ్లీషు మ్యూజిక్ వింటోందామె. అతనలా 'రాధా' అని గట్టిగా, అరుస్తూ రావటం చూచి ఆశ్చర్యపోయింది.
"ఇక్కడున్నావా ? ఇల్లంతా వెతుకుతున్నాను నీ కోసం."
రాధ నవ్వింది.
"బాగుందండీ ! కొత్త కాసెట్ వచ్చింది - విందాం రమ్మని నన్ను మీరేగా మేడమీదకి తీసుకొచ్చారు ? ఇంతలోనే వెతకటం ఏమిటి ?"
మురళి రెండు చేతుల్తో తల పట్టుకున్నాడు.
"నేను ఇప్పుడేగా వచ్చింది - అనకండి మళ్ళీ" మళ్ళీ నవ్వుతూ అందామె.
"మురళీ !" బయటినుంచి పిలిచాడు నరసింహం.
మురళి హాల్లోకి వచ్చాడు.
"ఇలాగయితే లాభం లేదు. అమ్మాయికి అసలు సంగతి చెప్పేసెయ్. వాడెవడో నీ పోలికలతో అన్ని చోట్లా మోసం చేస్తున్నాడని చెప్పు ! ఈ రోజు నుంచీ జాగ్రత్తగా కనిపెట్టి వుండమను. ఎంత పోలికలున్నవాడయినా, భార్య అన్నాక తేడా కనిపెట్ట గలగాలి కదా ?"
"అలాగే మావయ్యా !"
"వెళ్ళు ఇప్పుడే చెప్పు."
మురళీ రాధ దగ్గరకొచ్చాడు.
ఆమెతో మాట్లాడి బయటి కొచ్చాక గానీ నరసింహానికి సంతృప్తి కలుగలేదు.
"నేను బాంక్ కెళ్ళి - నా సంతకంతో ఏ చెక్ వచ్చినా తిప్పి కొట్టమని రాసిచ్చివస్తాను" అంటూ కార్లో వెళ్ళిపోయాడు మురళి.
అతను వెళ్ళిన కొద్ది క్షణాలకే రాధ కెవ్వున కేక వేయటం వినిపించి లోపలకు పరుగెత్తాడు నరసింహం అదురుతున్న గుండెలతో.
బాత్ రూమ్ దగ్గర నిలబడి వణికిపోతోంది రాధ.
"ఏమిటమ్మా ఏమైంది ?" భయంగా అడిగాడు నరసింహం.
ఆమెకు మాట రావటంలేదు.
చేత్తో బాత్ రూమ్ వేపు సైగచేసి చూసింది. నరసింహం రెండు అంగల్లో బాత్ రూమ్ దగ్గర కెళ్ళి లోపలకు తొంగి చూశాడు.
మురళి - కాళ్ళూ చేతులూ కట్టివేయబడి- క్రింద పడి వున్నాడు. నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయ్.
నరసింహానికి మతి పోయినట్లయింది. తను చూస్తూంది కలో నిజమో తెలీటంలేదు. అంతవరకూ తనతో మాట్లాడింది మురళి కాదని తను మురళి అని భ్రమించేటంత గొప్పగా నటించగలిగేవాడనీ తెలిసిపోయింది.
హరికృష్ణకు తప్పితే మురళిలా పోలికలు మరొకటి ఉండటానికి వీల్లేదు. మరి హరికృష్ణమో ఆ రోజే చచ్చిపోయాడు !
అయోమయంతో సాలోచనగా అతడు మురళి కట్లు విప్పాడు.
"ఏం జరిగిందిరా ! ఎవరు కట్టేశారు నిన్నిలా ?" ఆత్రుతగా అడిగాడు నరసింహం.
"ఇంకెవరు ! వాడే ? అచ్చం నాలానే వుంటాడని చెప్పాను కదా ! నేను నా గదిలో కెళ్ళేసరికి - ఎక్కడ దాక్కున్నాడో ఏమో నన్ను వెనుకనుంచీ తలమీద బాది తాటితో కట్టేసి బాత్ రూమ్ లో పడేశాడు...అయిదు నిముషాల్నుంచీ లోపల మూలుగుతున్నాను."
నరసింహం మొఖం కోపంతో ఎరుపెక్కింది.
"అసలు వాడింట్లో కెలా వచ్చాడు ! మనం ఘూర్కాని కాపలా పెట్టాం కదా !"
"మనం ఘూర్కాని దబాయించి 'ఎలా లోపలి కొచ్చామో వాడూ అలాగే వచ్చి వుంటాడు."
నరసింహం కుర్చీలో నీరసంగా కూలబడ్డాడు.
"వాడికెంత ధైర్యం ? మనింట్లోకే వచ్చి - నాకే టోకరా ఇచ్చాడంటే వాడు సామాన్యుడు కాదు_"
"నాకీ విషయం అర్ధం కావటంలేదు ! వాడెవడయినా కానీ, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటారు ?"