ఆమె జవాబు చెప్పలేదు. అతడే ముందుకు వంగి, "ఇంకో కొద్ది రోజుల్లో నాన్నతో నా కాంట్రాక్టు అయిపోతుంది. అమ్మ చిరునామా అతడు తెలుపుతాడు. నాదంటూ కొద్దిగా డబ్బు లేకపోతే ఎలా! అమ్మని ఎలా పోషించను! ఇంత కాలంగా నా కోసం ఎదురుచూస్తూ వుండి ఉంటుంది. చెట్టంత ఎదిగిన కొడుకుని!! ముసలి కాలంలోనైనా ఆమెని సుఖపెట్టవద్దా?" అన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కలిసివున్నారు. అయినా అతడి కంఠంలో ఇంతకుముందు ఎప్పుడూ కనపడని ఆ లాలిత్యపు ఆప్యాయతకి ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాటిని బయట పెట్టకుండా దాచుకుంటూ, "మనదంటూ ఏముంది? ఇప్పటివరకూ మనం ఎన్ని దోపిడీలు చేసినా, న్యాయబద్ధంగా ఎన్ని హత్యలు చేసి ఎంత సంపాదించినా అది మీ నాన్న అనబడే జి.కే. కే ఇచ్చేసేం" అన్నది చివరి పదాన్ని వత్తిపలుకుతూ.
"అవును. అదీ కాంట్రాక్టే"
"ఆ డబ్బులోంచి పైసాకూడా జి.కే.నీ కివ్వడు"
"ఇవ్వవలసిన అవసరం అతనికిలేదు. అతనికీ నాకూ కాంట్రాక్టు ఏమిటంటే- నేను పదిసంవత్సరాలపాటు అతని క్రింద పనిచేయటం- అతనేం చెపితే ఆ పనిచేయటం- సరీగా పదో సంవత్సరం ఆఖరిరోజు పూర్తవగానే అతడు నా తల్లెవరో నాకు చెప్పటం".
"అందుకని నిన్ను ఒక బానిసగా వాడుకున్నాడు. తుపాకిని తిప్పినట్టు తిప్పాడు. అఖండమైన నీ తెలివితేటల్తో లక్షల్ని కోట్లుగా మార్చుకున్నాడు. కేవలం- కేవలం, నీ తల్లి ఎవరు, అన్న రహస్యాన్ని నొక్కి పెట్టటం ద్వారా-"
"పోన్లే వాణి, తొమ్మిది సంవత్సరాలపైగా ఓపికపట్టాము. ఇప్పుడిక వాదన లెందుకు?"
"ఎందుకంటే...." ఆమె ఆవేశంగా అన్నది- "జి.కె.కి నీ తల్లి ఎవరో తెలియదన్నది ఇప్పుడు నమ్మకంగా తోస్తూంది కాబట్టి"
"నో...జి.కె.కి తెలుసు"
"తెలీదు"
"తెలుసు" అతడు గట్టిగా అరిచాడు.
ఆమె అంతకంటే గట్టిగా "తెలుస్తే నిన్ను హత్యచేయించటానికి ప్రయత్నించడు" అంది.
అతడు నిర్విణ్ణుడయ్యాడు. తనలోతనే గొణుక్కుంటున్నట్టు "నిజమా..." అన్నాడు సన్నటి కంఠంతో... "నన్ను జి.కె. హత్య చేయించటానికి ప్రయత్నించాడా?"
"అవును" అందామె. "నన్ను క్షమించు. నువ్వు గాయాల్తో నీటిలో పడిపోయావని తెలిశాక మేమంతా తల్లడిల్లిపోయాము. సింహం అయితే నిజంగా సింహమే అయ్యాడు. మొత్తం డొంకంతా బయటికి లాగాడు. జి.కే. రామ్మూర్తితో చేతులు కలిపాడు అన్న విషయం తెలుసుకున్నాడు. ఈ లోపులో నేను వెతకటం మొదలుపెట్టాను. నాకు ముందు నుంచీ అనుమానమే- చివరికి నా అనుమానానికి ఋజువు దొరికింది".
"ఏం దొరికింది వాణి"
"మనం ఎప్పుడూ సమావేశమయ్యేగదిలో ఒక రహస్య మైక్రోఫోనువుంది. దాని కనెక్షను జి.కే. గదిలో వుంది. అంటే- ఒక రకంగా చెప్పాలంటే రొయ్యలగూడేనికి నువ్వు వెళుతున్నావన్న విషయం అతడే రామ్మూర్తికి చెప్పింది".
అతడు లేచి పచార్లు చేయసాగాడు. ఎంతో ఆవేశం వస్తేనే అతడు అలా చేస్తాడు. ఆమెకా విషయం తెలుసు. మౌనంగా కొంచెం సేపు వూరుకొంది. అతడు ఆగి, అన్నాడు- "జి.కే.ని నేను కన్న తండ్రికన్నా ఎక్కువగా చూసుకున్నాను".
"నా ఉద్దేశ్యం జి.కె.కి నీ తల్లి ఎవరో తెలీదని"
"తెలుసు" అన్నాడు అతడు. ఆమె మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ... "సాక్ష్యాధారాల్తో సహా నాకు చూపించాడు".
"అటువంటప్పుడు గడువు ఇంకా కొన్ని రోజుల్లో పూర్తవుతుందనగా ఎందుకు రామ్మూర్తితో చేతులు కలిపి నిన్ను చంపే ప్రయత్నం చేయటం".
"బంగారు గుడ్లు పెట్టే బాతు మరో వారం రోజుల తరువాత వట్టిపోతుందని తెలిసి, ఈ రోజే వండుకుని తిందామన్న మనస్తత్వం..." అన్నాడు అతడు. ఆ ఆలోచన వచ్చాక, దాన్ని సమర్థిస్తున్నట్టు, "ఔను అదొక్కటే కారణం! ఇంకొకటి అవటానికి వీలులేదు! నా తల్లెవరో నాకు తెలిశాక నేను ఒకక్షణం కూడా అతని క్రింద పని చెయ్యను. నా శక్తి సామర్థ్యాలు అతడికి బాగా తెలుసు. నేను కూడా ఒక బలమైన శక్తిగా రూపొందుతాను. రామ్మూర్తి, లోహియాలతో పాటూ నేనూ పోటీలో నిలబడతాను. నన్ను ఇప్పుడే చంపేసి, రామ్మూర్తితో చేతులు కలుపుతే, లోహియా ఒక్కడే అయిపోతాడు. అప్పుడిక తనకి ఏ వ్యతిరేకతా వుండదు. జి.కె. వుద్దేశ్యం అదే అయి వుంటుంది. 'అయివుండటం' ఏమిటి? అదే..." అన్నాడు. ఆ ఆలోచన, అలా సమర్ధించుకోవటం అతడికెంతో సంతృప్తి ఇచ్చినట్టు అతడి మొహమే చెపుతోంది.
వాణి అతడివైపు జాలిగా చూసింది. తుపాకి చివరి కొసతో ప్రపంచాన్ని శాసించగల 'అతడు' ఈ చిన్న విషయం దగ్గిర బలహీనమవుతున్నాడు. అతడి ఈ బలహీనతని జి.కే. చాలా బాగా వాడుకుంటున్నాడు.
"నేనే నీ పరిస్థితిలో వుంటే ఏం చేసే దాన్నో తెలుసా?"
"ఏం చేసే దానివి?"
"ఎంత లేదన్నా ఇన్ని సంవత్సరాల్లో నువ్వు జి.కే.కి పది పదిహేను కోట్లదాకా సంపాదించిపెట్టి వుంటావు. కాంట్రాక్టులోకి ప్రవేశించకుండా వుంటే, నువ్వే అంత డబ్బూ సంపాదించి వుండేవాడివి. ఆ డబ్బులో పదోవంతు ఆశపెడితేచాలు- జి.కే. ఆ రహస్యాన్ని నీకు చెప్పేసి వుండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితమే నీ తల్లి ఎవరో నీకు తెలిసివుండేది"
"అతడు చెప్పనూ అని వుంటే..."
"ఈ పదిహేను కోట్లూ నీకు మిగిలి వుండేవి"
"అప్పుడు నా తల్లెవరో శాశ్వతంగా నాకు తెలియకపోయి వుండేది" తాపీగా అన్నాడు అతడు.
ఆమె స్థబ్దురాలయింది.
ఆమె సందిగ్దత చూసి అతడు ఆమె దగ్గరగా వచ్చి అన్నాడు. "ఇదంతా నీకు స్టుపిడిటీగా కనపడుతూ వుండవచ్చు. పుట్టగానే చెత్తకుండీలో వదిలేసిన ఒక తల్లికోసం కొడుకు పది, పదిహేను కోట్లు వదులుకోవటం..."
అతడు ఆగాడు. అతడి కళ్ళు శూన్యంలో ఎక్కడో చూస్తున్నాయి. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టూ అన్నాడు. "కొన్ని కొన్ని సెంటిమెంట్లకి రీజన్ వుండదు వాణీ! మన సెంటిమెంట్లు అవతలి వాళ్ళకి ఫూలిష్ గానూ, తెలివి తక్కువగానూ కనపడవచ్చు. చిన్నప్పటి నుంచీ ఆప్యాయతకి మొహం వాసిపోయివున్నాను. నేను ఏ కష్టంలో వున్నా 'అమ్మా- అమ్మా' అనుకునే వాడిని. ఆకలిగా వున్నప్పుడు పొత్తికడుపులో కాళ్ళు దూర్చుకుని 'అమ్మా' అని ఏడ్చేవాడిని. అలాటి 'అమ్మ' బ్రతికేవుందనీ ఈ ప్రపంచంలో నాదంటూ ఒక మనిషి వుందనీ తెలిసిన క్షణం నేను దేనికైనా వప్పుకునే స్థితిలో వున్నాను. అదిగో అప్పుడే జి.కే. నాతో ఈ బేరం పెట్టాడు. ఫలితం అతడి దగ్గర కుక్కలా పని చేయటం- హత్యలు, మాఫియా...నీకు తెలియనిదేముంది?" అతడు ఆగి, నెమ్మదిగా అన్నాడు. "...ఇంకెంత? వారం రోజులు... నా తల్లి నాకు దొరుకుతుంది. ఆమెని తీసుకుని ఒక దూర ప్రదేశానికి వెళ్లి పోతాను. జి.కే. మాటలబట్టి ఆమె ఒక సౌజన్యమూర్తి... కేవలం తప్పని పరిస్థితుల్లో ఆమె దగ్గిర బంధువులు ఆమె నుంచి పసికందుని వేరు చేసి చెత్తకుండీలో విసిరేశారు. ఆ తల్లిని శేష జీవితంలో సుఖపెట్టటంకన్నా కావల్సింది ఏముంది? ఇక ముందంతా శాంతే. భవిష్యత్తు అంతా ఆనందమే".