ప్రవాహంలా విలేఖర్లు ఆ వూరికి రావటం ప్రారంభించారు. అప్పటివరకూ ఏ ప్రాముఖ్యతా లేకుండా ఓ మూలకి విసిరేసినట్టు వున్న ఆ కుగ్రామం రాత్రికిరాత్రి వార్తలో ప్రాముఖ్యత పొందింది.
ఎక్కడ చూసినా హడావుడే.
"మనం ఈ పాక వదిలేసి కనీసం ఒక మంచి ఇల్లన్నా తీసుకుందామా" అని అడిగాడు జానకిరాముడు.
"వద్దు వద్దు నిరాడంబరత మనకి ప్లస్ పాయింటు".
"నాకిప్పటికీ అనుమానమే. ఎలక్షన్స్ ఇంక నెలరోజులుకూడా లేవు. అసలు ఎన్ని ఓట్లు పడతాయి అని నీ ఉద్దేశ్యం?"
"నీ ఉద్దేశ్యం ఏమిటి?"
"రెండువేలదాకా పడతాయని".
"ఏమిటి? దేశంలో ఇన్ని కోట్ల మంది ఓటర్లు వుండగా, మనకి రెండు వేలా?"
"నాకు చదువురాకపోవచ్చు కానీ మన ప్రధానమంత్రి గురించీ, ముఖ్యమంత్రి గురించీ బాగా తెలుసు. ఎంతో గొప్ప చరిత్ర వున్న ఒక పటిష్టమైన పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి. అతనికి పోటీగా నిలబడుతూన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నిజాయితీపరుడు. రాష్ట్రంకోసం ఎంతో దీక్షగా పనిచేస్తున్నవాడు. వీరికి నేను పోటీనా?"
"వ్యక్తులు గొప్పవారు కావొచ్చు. కానీ ప్రజలు..." అంటూ ఆ తరువాత పదంకోసం ఆగాడు. ఎప్పుడూ ఒకేపదం ఉపయోగిస్తే బాగోదు. కానీ ఎంత వెతుక్కొన్నా అతడికి మరోపదం దొరకలేదు. ఇక దాన్ని పూర్తిచేసే ప్రయత్నం మానుకుని, "గెలవటానికి మనం శాయశక్తులా ప్రయత్నం చేద్దాం" అన్నాడు.
ఇంతలో బయట కారు ఆగిన చప్పుడు వినపడింది. ఒకప్పుడైతే పిల్లలు గుంపుగా మూగేవారు. ఇప్పుడు వారికీ ఆ గ్రామంలో తరచు కార్లు ప్రవేశించడం అలవాటయిపోయింది.
పాకలోకి లోహియా వచ్చాడు. అతడి చేతిలో స్వంత దినపత్రిక వుంది. "చదివావా" అని అడిగాడు.
అతడు తలూపాడు.
"మొత్తం అన్ని ఎడిషన్ లలోనూ ఇలాగే వచ్చింది. రేపు ఇంటర్వ్యూ ప్రచురిస్తున్నాం-"
"అది కూడా తయారుచేశారా?"
"నువ్వు చెప్పిన విధంగానే తయారుచేశాము".
"గుడ్"
"మన వ్యతిరేక పత్రికలు... అంటే వంకచెక్కా రామ్మూర్తి ఆధ్వర్యంలో వున్నవి- చాలా అసహ్యంగా వ్రాశాయి".
"దేని గురించి"
"జానకిరాముడు గురించి, అతడిని సపోర్టు చేస్తున్న నీ గురించి ...."
"నేను బ్రతికే వున్నానన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయిందన్న మాట-"
"రామ్మూర్తి ఈ సారి 'డర్బీ'లో తన గుర్రానికి 'జానకిరాముడు' అని పేరు పెట్టబోతున్నాడట".
"ఎందుకట?"
"ఎలక్షన్స్ లో అతి తక్కువ ఓట్లువచ్చిన అభ్యర్థిగా జానకిరాముడు ప్రాచుర్యం పొందుతాడట."
అతడి మొహం ఎర్రగా కందింది. "అతడికి ఒక విషయం కబురు చెయ్యండి" అన్నాడు.
"ఏమని?"
అతడు వెంటనే సమాధానం చెప్పలేదు. కళ్ళు మూసుకున్నాడు. తన ప్రతిజ్ఞ గుర్తొచ్చింది.
బోటువెళ్ళి పడవని ఢీకొనటం- అందులోంచి రాబోట్ శరీరం ఖండఖండాలుగా గాలిలోకి ఎగరటం... కుడిచెయ్యి వచ్చి తన పక్కన పడటం- ఇంతకంటే దారుణంగా రామ్మూర్తిని చంపుతానని తన మనసులోనే అనుకోవటం-
అతడు కళ్ళు విప్పాడు.
"ఏమని కబురు చేయాలి?" తిరిగి అడిగాడు లోహియా.
"ఎలా చంపాలి? ఏది మంచి పద్ధతి? అని ఇంతకాలం ఆలోచిస్తూ వచ్చాను. జనం మధ్యలో చంపాలి అనుకున్నాను. ఇప్పుడు పరిష్కారం అతడే చెప్పాడు. జనం చేతనే అతడిని చంపిస్తాను. జానకిరాముడు కారణంగానే అతడు చస్తాడు"
"నా కారణంగానా?" అప్పటివరకూ ఈ సంభాషణ అంతా వింటూ జానకిరాముడు ఉలిక్కిపడి అడిగాడు జానకి.
"కాదు. నీ పేరుగల గుర్రం కారణంగా".
* * *
మరో మూడురోజులు గడిచాయి. ఎన్నికలవేడి నెమ్మదిగా పుంజుకుంటూంది.
'హిందూ' పత్రిక జరిపిన సర్వే ఆ రోజు పేపర్లో వచ్చింది. దాని ప్రకారం మాజీ ప్రధానమంత్రికి 62 శాతం, ప్రతిపక్షపు అభ్యర్థి (మాజీ ముఖ్యమంత్రి)కి 36 శాతం, మిగతా అభ్యర్ధులందరికీ కలిసి రెండు శాతం వస్తాయని అంచనా వేయబడింది.
పందేలు సాగుతున్నాయి. ప్రధానమంత్రి మీద రూపాయికి అర్థరూపాయి బెట్టింగ్ జరుగుతూంది. ప్రతిపక్ష అభ్యర్థిమీద రూపాయికి రెండు రూపాయలు ఇస్తున్నారు. మిగతా అభ్యర్థి ఎవరైనా సరే రూపాయికి ఇరవైదాకా పందెం జరుగుతూంది. ఉత్తర భారతదేశపు గుజరాతీ సేఠ్ లు కొంతమంది రూపాయికి నలభై రూపాయలు కూడా ఇస్తున్నారని తెలిసింది. జానకిరాముడు గెలిస్తే రూపాయికి "యాభై" అనికూడా కొంతమంది ముందుకొచ్చారు.
"మనదంతా ఎంతుంది వాణీ" అని అడిగాడు అతడు. "నగదు రూపేణా బ్యాంకుల్లో సంపాదించగలిగే అప్పు... మొత్తం కలసి".
"ఎందుకు" అంది వాణి. ఆమె మధ్యాహ్నమే అక్కడికి వచ్చింది. అతడిని ఎదురుప్రశ్నించగలిగేది వాణి ఒక్కతే.
"జానకిరాముడిమీద బెట్ కట్టు, రూపాయికి యాభై లెక్కన".
"మొత్తం అంతానా-"
"ఆహా, అంతా- మన దగ్గిర వున్నదంతా"
వాణి ఇబ్బందిగా చూసి, "మనం అనుకున్నది అనుకున్నట్టు జరక్కపోతే-" అంది.
"ఏమవుతుంది? ఫుట్ పాత్ లమీద పడతాం! అక్కణ్నుంచే కదా మనం వచ్చింది"