"అవును. అప్పటికి సుమతి కూడా వప్పుకుంటుంది. భవిష్యత్తు అంతా ఆనందమే".
అతడు అదిరిపడి "ఏమిటి వాణీ నువ్వు అంటున్నది" అన్నాడు.
వాణి నవ్వి "ఎంతో గొప్ప లిటిగెంటు అయిన జి.కె. గురించే తెలుసుకో గలిగాము. ఇదెంత?" అంది. అతడు తల వంచుకున్నాడు.
ఆమె అంది- "నేనూ సింహం కలిసి ఆలోచించాము, ఈ పల్లెలో ఇంత ఆకర్షణ ఏముందా అని? అసలు రహస్యం... క్షణాల్లో దొరికిపోయింది-"
"మా మధ్య ఏమీ లేదు వాణీ! అంతా నా వైపు నుంచే. అసలు విషయం ఎలా చెప్పాలో కూడా తెలియటంలేదు".
"ఎంత చిత్రం. ప్రపంచపు One of the biggest gang leader తన ప్రేమని ఎలా చెప్పాలా అని కొట్టుమిట్టులాడటం-" నవ్వి, "నేను సాయం చేస్తాలే అంది.
"నిజంగానా. ఎలా?"
"ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుంది. నీలాంటి వాడిని ఏ అమ్మాయీ కాదనదు. నాకు తెలుసు".
"అదంతా తరువాత. ముందు నా తల్లిని కలుసుకోవాలి. అదీ ముఖ్యం".
విషయం మళ్ళీ సీరియస్ అయింది.
"ఒక్క విషయంచెప్పు. జి.కే. కి నీ తల్లెవరో తెలుసని నిశ్చయంగా నీకు నమ్మకం వుందా?"
"ఉంది. అతడికి తెలుసు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఆ సంవత్సరం ఆ గదిలో ఎవరున్నారో- అ రిజిష్టర్ అతడి దగ్గిరే వుంది".
ఆమె మాట్లాడలేదు. పూర్తిగా సంతృప్తి చెందలేదు కూడా.
జి.కె. వెళ్ళి రామ్మూర్తితో ఎందుకు చేతులు కలిపాడు? అప్పటివరకూ స్వంత కొడుకులా చూసుకున్న వాడిని ఎందుకు చంపించటానికి ప్రయత్నించాడు? 'అతడు' చెప్పిన కారణం అంత సంతృప్తికరంగా కనిపించటం లేదు. కేవలం రామ్మూర్తిని మంచి చేసుకోవటానికే అయితే 'అతడిని' చంపించే అవసరంలేదు.
సరీగ్గా అదే సమయానికి రామ్మూర్తి గదిలో జి.కె. అతడితో రహస్య సంప్రదింపులు జరుపుతున్నాడు.
"మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం అతడు నీళ్ళలోపడి మరణిస్తాడనుకున్నాం. కానీ తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇంకో కొద్ది రోజుల్లో నా దగ్గిరకు వస్తాడు. తన తల్లి చిరునామా ఇమ్మంటాడు. ఇవ్వాలి".
"ఇవ్వకపోతే"
"నన్ను ఖండ ఖండాలుగా నరుకుతాడు".
"ఇవ్వు" నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి.
జి.కె. అతడివైపు ఇబ్బందిగా చూశాడు.
"అతడి తల్లెవరో నాకు సరీగ్గా తెలీదు".
"సరీగ్గా- అంటే"
"వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి ఒక పసిగుడ్డు విసిరివేయబడ్డట్లు నాకు తెలుసు. ఆ చెత్తకుండీకి సరీగ్గా పైన వున్న గదిలో ఆ సంవత్సరం ఎవరున్నారో వాళ్ళవివరాలు న దగ్గరున్నాయి. అదొక్కటే ఆధారం. ఆ గదిలో ముగ్గురుండేవారు. వాళ్ళు ఇప్పుడెక్కడున్నారో పట్టుకోవాలి. బహుశా వాళ్ళు పెళ్ళి చేసుకుని స్థిరపడి వుండాలి జీవితంలో. అందులో ఒకరిద్దరు ఈ పాటికే చచ్చిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు...."
"వార్డెను....?"
"ఆవిడ ఈ దేశంలో లేదనుకుంటాను". ఇంకొక చిక్కు కూడా వుంది. ఆ ముగ్గురిలో నిజంగా అతడి తల్లి వున్నా ఈ పరిస్థితుల్లో అతడిని కొడుకుగా వప్పుకుంటుందని నమ్మకం ఏమిటి? ఆమె ఇప్పుడు సుఖంగా సంసారంచేసుకుంటూ వుండవచ్చు. ఏ ఆడదైనా తన సంసారంలో కలతలు రావడానికి చూస్తూ చూస్తూ ఎందుకు అంగీకరిస్తుంది?"
రామ్మూర్తి నవ్వేడు. "ఎంతో తెలివైనవాడు, ఎన్నో పెద్ద పెద్ద సమస్యల్ని చిటికెలో పరిష్కరించగలవాడు ఇంత చిన్న విషయంకోసం నీ దగ్గిర పది సంవత్సరాలు పనిచేసేడంటే, అతడికి తన తల్లిమీద చాలా ప్రేమ వుండి వుండాలి".
"అవును, ఇప్పుడు నా భయం అదే! ఇన్ని సంవత్సరాలు అతడిని ఇలా ఉపయోగించుకున్నాక ఇప్పుడు తెలీదంటే నిలువునా షూట్ చేసేస్తాడు".
"అంతవరకూ రాదులే. ఆ ముగ్గురు ఆడవాళ్ళ వివరాలూ ఇవ్వు. నేను వెతికిస్తాను".
"ఇంకెంతో టైం లేదు. వారం, పదిరోజులే వుంది".
"చాలు".
జి.కె. రామ్మూర్తి వైపు చూశాడు. అవును చాలు. రామ్మూర్తి తాలూకు మనుష్యులు తలుచుకుంటే అఖాతంలో వున్నా వెతికి పెట్టుకోగలరు.
జి.కె. మనసు తేలికైంది. ఇన్నేళ్ళుగా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని బాధపడుతూ వచ్చాడు. ఇప్పటికి బాధ్యత అంతా రామ్మూర్తి మీద వదిలి నిశ్చింతగా వుండొచ్చు. ఒకవేళ అతడి తల్లిని కనుక్కోలేకపోయినా అతడు విషయం గ్రహించి రెచ్చిపోకముందే అతడిని చంపే ఏర్పాట్లు రామ్మూర్తి చేయగలడు.
అదే సమయానికి రామ్మూర్తి కుర్చీ వెనక్కి వాలి, పైకప్పు కేసి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రామ్మూర్తి అలా ఆలోచిస్తున్నాడంటే- అతడి మనసులో ఏదో ఆలోచన అస్పష్టంగా కదలాడుతూంది అన్నమాట! అది నిశ్చయంగా దుష్టాలోచనే.
13
"ఒకమ్మాయిని ప్రేమిస్తే ఆ విషయం ఆమెకు ఎలా చెప్పాలి?"
వాణి పడీపడీ నవ్వింది. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతడు ఉడుక్కుంటున్నట్టు "తెలియకపోతే చెప్పరాదా ఏమిటి?" అన్నాడు.
"ప్రేమ గురించి చెప్పటమే కదా".
"ఏం చెయ్యను? ఉత్తరం వ్రాయనా?"
వాణి కళ్ళు పెద్దవి చేసి "అయ్యో నీకూ ఆలోచనలు వస్తున్నాయే" అంది. "వ్రాయి, కానీ ముందు నా కొకసారి చూపించు. ఎందుకయినా మంచిది.
అరగంటలో అతడు ఉత్తరం వ్రాయడం పూర్తిచేసి చూపించాడు. ఆమె చదవటం మొదలుపెట్టి నాలుగు వాక్యాలు చదవగానే కొంగు నోట్లో పెట్టుకుని నవ్వు ఆపుకోలేక కష్టపడసాగింది. ఎర్రబడ్డ మొహంతో అతడు "తెలియకపోతే చెప్పరాదా ఏమిటి?" అన్నాడు. "ఆగాగు. చదవటం పూర్తి చేయనీ" అంటూ ఆమె అతడినుంచి దూరంగా పరుగెత్తి చదవటం కొనసాగించింది.
అందులో ఇలావుంది-
సుమతిగార్కి,
నమస్తే. ఇది నేను వ్రాయు మొదటి ప్రేమలేఖ. తప్పులున్న క్షమించగలరు. నాకేం వ్రాయాలో తోచడంలేదు. మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీరంటే ఎంతో బావున్నారని అనిపించింది. పాయింట్ 38 రివాల్వర్ లా వున్నారు. అదికూడా నిగనిగ లాడుతుంది. నాకు చాలా యిష్టం. నేను చాలా దూరం నుంచి కూడా పిస్టలు కాల్చగలను. నేను మొట్టమొదటిసారి నవ్వింది మీదగ్గిరే. మీరు నాతో వుంటే ఇంకా నవ్వగలను. అన్నట్టు మీకు వంటొచ్చా. మనం వివాహం చేసుకుంటే వంట మనిషిని పెట్టుకుందాంలెండి. మీరు నా గురించి ఏమయినా తెలుసుకోదల్చుకుంటే వాణిని అడగండి. అన్నీ చెపుతుంది...."