Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 45


    "రావటం- రాకపోవటం అనేది నువ్వెలా సర్దిచెపుతావు అన్నదానిమీద ఆధారపడి వుంటుంది. రేప్పొద్దున్న చేతులు కాలాక, ఆయన సస్పెండ్ అయి, "దీని వెనుక ఇంత కత వుందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు' అని నీ మీద విరుచుకుపడితే ఆ తరువాత నన్ను తప్పుపట్టకు. ఎందుకైనా మంచిదని ఇప్పుడు జరుగుతూవున్న ఈ సంభాషణ కూడా రికార్డు చేసి వుంచాను".

    ఇన్ స్పెక్టర్ కర్చీఫ్ తో చెమట తుడుచుకుంటూ "ఇప్పుడు మన ఈ సంభాషణ కూడా రికార్డయిందా?" అన్నాడు.

    "చెప్పానుగా ఎందుకైనా మంచిదని...."

    ఇన్ స్పెక్టర్ కుర్చీ లోంచి లేచి, "వెళ్ళొస్తాను".

    "మంచిది. సలీంశంకర్ కి చెప్తావుగా-"

    "చెప్తాను...."

    ఇన్ స్పెక్టర్  వెళ్ళిపోయాక బిల్లూ పడిపడీ నవ్వసాగాడు. జానీ కూడా అతడితో శృతి కలిపాడు.

    "ఆ రోజు మనం ఇచ్చిన పార్టీకి పోలీసు ప్రముఖులంతా వచ్చిన మాట నిజమే. రెండు కోళ్ళు తిని ఒక  కోడిని కక్కుకున్న మాట కూడా నిజమే. కానీ వీడియో- హహ్హా- నిజంగా వీడు అదంతా నమ్మేసేడంటే....." అని తిరిగి నవ్వేడు.

    "వీడియోలో బొమ్మ కనపడేట్టు రావాలంటే కనీస లైటింగ్ వుండాలని కూడా తెలియనివాడు కాబట్టే ఇంకా పోలీసు డిపార్ట్ మెంట్ లో వున్నాడు. ఓ.కె. బిల్లూ...... చాలా రాత్రయింది పడుకో. ఇక ఈ రాత్రికి సలీంగాడు ఏ ప్రయత్నమూ చెయ్యడని నా నమ్మకం" అంటూ లేచాడు జానీ.


                         *    *    *

    "నీలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్ మెంటులో ఇంకా వున్నారంటే నమ్మబుద్ధి కావటంలేదు. పాపం చాలా కృషి చేశావు" అంది అనూష పైలు క్రింద పెడుతూ రాత్రి రండింటివరకూ ఆమె చదువుతూనే వుంది. వసంత్ దాదా గురించిన ఫైలు అది. పూర్తి వివరాలున్నాయి అందులో. ఎన్నో సంవత్సరాలు కష్టపడి శ్రీకాంత్ తయారుచేశాడా ఫైలును. అతడి కష్టాన్ని అందులో ప్రతి వాక్యమూ చెపుతుంది.

    అనూష అంది "ఇంత శత్రువైన నిన్ను ఇంతవరకూ దాదా  ఈ ఏరియా నుంచి ట్రాన్స్ ఫర్ చేయించలేదంటే చిత్రమే!"

    "చాలా ప్రయత్నం చేశాడు. కానీ ప్రభుత్వాధికారుల్లో ఇంకా కొంతమందిలో నిజాయితీ మిగిలివుంది. ఇక ఇప్పుడేం లాభంలేదు. నేను కోరలు తీసిన పాముని అయిపోయానని దాదాకి తెలుసు".

    "ఎలా?"

    "ఇప్పుడు నువ్వు చదివిన ఫైలు కాపీ మొత్తం అతడి దగ్గిర వుంది".

    "మైగాడ్".

    "అవును. మా డిపార్ట్ మెంటు సామర్థ్యం అది! దానివల్ల అతడు ముందే ప్రతిదానికీ తగిన ఆధారం తన వైపు నుంచి నిర్మించుకుంటూ వచ్చాడు. కోర్టు బారి నుంచి సులభంగా తప్పించుకున్నాడు. పైగా  నన్నే కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు".

    "దాంతో నువ్వు నీరుకారిపోయావు".

    "ప్రతి మనిషికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఒకటుంటుంది అనూషా! అతడు నన్ను మానసికంగా చాలా దెబ్బ తీశాడు. మా డిపార్ట్ మెంట్ మీదే నాకు విసుగొచ్చేలా చేశాడు".
   
    "ఎలా?"

    "ఎలా ఏముంది? నా శెలవులన్నీ అతడు నా మీద పెట్టిన కేసులకోసం కోర్టు చుట్టూ తిరగటానికి అయిపోయాయి. నాకు డిపార్ట్ మెంట్ నుంచి సానుభూతి తప్ప మరేమీ దొరకదు. ఎంతకాలం ఒంటరిగా పోరాడగలను? ఇది తెగదు, ముడిపడదు..... అతడి టెక్నిక్ కూడా అదే.....! అవతలి మనిషిని నిర్వీర్యం చేయటం.  అతడు కావాలనుకుంటే ఏ ఆక్సిడెంటో సృష్టించి నన్ను చంపగలడు. కానీ చంపడు. ఆడుకుంటాడు. అతడిదదే సాడిస్టు మెంటాలిటీ!"

    "నేను కూడా అతన్ని చంపను. ఆడుకుంటాను-" మనసులోనే అనుకుంది అనూష. ముందుకు వంగి అన్నయ్యతో అంది-

    "ఈ ఫైలు అంతా చదివేక మీరు అతడిమీద పెట్టిన ఏ కేసూ నిలవలేదని కొద్దిగా 'లా' పరిజ్ఞానం వున్న ఎవరికైనా తెలుస్తుంది. ఇదంతా కేవలం డిపార్ట్ మెంటు పద్ధతిలో జరిగిన ఎంక్వయిరీ- అందరికీ తెలిసిన నిజాలు తప్ప మరేమీ లేవు-"

    "తప్పదు. అవతలివాడు చిన్నవాడయితే, లాకప్పులో పెట్టి ఏదోవిధంగా రహస్యం రాబట్టవచ్చు. కానీ మేము 'నాన్-బెయిలబుల్ వారెంటు' తెచ్చినా, మాకన్నా ముందే అతడు బెయిల్ సంపాదించగల్గుతున్నాడు. క్షణాల్లో బయటపడి అంతా "సిమెంట్' చేసుకోగల్గుతున్నాడు".

    "నీకు అతడి మీద అంత పట్టుదల వుంటే ఒక పోలీసు అధికారిగా కాకుండా మామూలు మనిషిగానే అతడిని ఎదుర్కోవచ్చుగా-"

    "ఎలా?"

    "ఒక తప్పుడు కేసు అతడిమీద బనాయించవచ్చు. ఉదాహరణకి ఒక ఆయుధ కర్మాగారం అతడికి వున్నట్టు నిరూపించగలిగావు అనుకో. దానిద్వారా టెర్రరిస్టులకి తుపాకీలు సప్లై చేస్తున్నాడని సాక్ష్యాలు ప్రవేశపెట్టావనుకో. మరణశిక్షకి దరిదాపుల్లో అతడికి శిక్ష పడుతుంది కదా-"

    "అన్యాయం"

    ఆమె ఉత్తేజితురాలైంది. "అన్యాయమా? ఏమిటి అన్యాయం? దేశానికి సమాంతర ప్రభుత్వం నడుపుతూ, దేశ సౌభాగ్యాన్ని సగం  కొల్లగొడుతూ ఒక గూండా రాజులా బ్రతుకుతూ వుంటే అతడిని కటకటాల వెనక్కి పంపటానికి న్యాయం- అన్యాయం అని రెండూ వేరువేరుగా వుంటాయా?"

    "నువ్వు అనుకున్నంత సులభం కాదది అనూషా".

    "ఎందుక్కాదు? చూస్తూ వుండు. అతడో నేనో తొందర్లోనే తేలిపోతుంది".

    "పోలీస్ అధికారిగా కాదు- అన్నయ్యగా సలహా ఇస్తున్నాను. దీంట్లో నువ్వు వేలు పెట్టక. వీలైనంత వరకూ మేము చూసుకుంటాము".

    "పది సంవత్సరాల నుంచీ చూసుకుని ఏం చేశారు? మీరేమీ చేయలేరు?"

    "నువ్వు మాత్రం ఏం చేయగలవు?"

    "ఏం చేసినా చెయ్యకపొయినా ముందు ఫ్లాట్, కారు అమ్మేశాను".

    శ్రీకాంత్ అదిరిపడి, "వ్వాట్- ఎందుకు?" అన్నాడు.

    "ఉద్యోగం నుంచి ఎలాగూ సస్పెండ్ అయ్యాను. ఇక నాకు అవి రెండూ ఆ వూళ్ళో ఎందుకు? ఒక అన్నయ్యగా నన్ను పోషించటం నీ ధర్మం. అందుకే నీ  దగ్గిరకి బుద్ధిమంతురాలైన చెల్లాయిగా వచ్చేశాను".

    "హస్యాలకిది సమయం కాదు".

    "ఇందులో హాస్యం ఏమీ లేదు. నువ్వే అన్నావుగా- ప్రతి మనిషీ ఏదో ఒకచోట 'బ్రేక్' అవుతాడని. నేనలా తొందరగా బ్రేక్ అవకుండా, వెనుక పునాది బలంగా నిర్మించుకుంటూ వస్తున్నాను. అతడు తన కోట్లతో కోట నిర్మించుకుని, దేశంలో చాలా మందిని కొనేశాడు. ఆ కోటని బ్రద్దలుకొట్టి నేను అందులో ప్రవేశించాలంటే నేనూ అతని మనుష్యుల్ని కొంతమందిని కొనాలి. అందుకే నా ఆస్తులన్నీ డబ్బుగా మార్చుకున్నాను. చెప్పానుగా- అటో ఇటో తేలిపోవాలని".

    అతడు చాలాసేపు మాట్లాడలేదు. చెల్లెలి పట్టుదల తెలుసు. కానీ మరోవైపున దాదా శక్తి సామర్థ్యాలు కూడా తెలుసు. చివరికి ఒకే మాట అన్నాడు. "నువ్వు కానీ నువ్వు ఢీకొనబోయేది పెద్దకొండతో- నువ్వేం చేయగలవు?"

    సమాధానంగా అన్నట్టు టెలిఫోన్ మ్రోగింది. అతడు అందుకోబోయే లోపులో అనూషే రిసీవర్ తీసుకుని "హలో" అంది.

    "నేనూ- అరవిందని" అట్నుంచి వినిపించింది.

    "ఎక్కణ్ణుంచి?"

    "అమెరికా నుంచి. ఇక్కడ పగలు, బహుశ అక్కడ అర్థరాత్రయి వుంటుంది. సారీనే! అనవసరంగా నిద్రలో డిస్టర్బ్ చేసి వుంటాను".

    "పర్లేదులో ఎప్పుడూ ఇండియా రాక?"

    "ఇంకో గంటలో బయల్దేరబోతున్నాం. అందుకే అర్జంటుగా చేశాను. నీకోసం ఏం తీసుకురాను?"

    "ఏం తీసుకొస్తావ్?"

    "టాప్లర్స్"

    "అయితే తప్పకుండా తీసుకురా. నేను ఎయిర్ పోర్ట్ కి రానా?"

    "రా"

    "ఎన్నింటికి ఇక్కడ లాండింగ్?"

    "అయిదింటికి"

    "ఉంటాను"

    "ఓ.కే."

    "వింటున్న శ్రీకాంత్ కి ఏమీ అర్థంకాలేదు. "ఏమిటిదంతా" అన్నాడు.

    అనూష నవ్వింది. "టెలిఫోన్ ఎక్స్చేంజి నుంచి ఫోను. దాదా ఎవరికో ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాడు. అది టేప్ చేయబడింది. ఈ అరవింద ఉరఫ్ అమ్మాజీ అనే అమ్మాయి ఎక్స్చేంజి ద్వారా దాన్ని రికార్డ్ చేసింది. ఏదో ముఖ్యమైన వార్తే అయివుండాలి. అలాంటిదేదైనా వుంటే ఎంత అర్థరాత్రయినా ఫోన్ చెయ్యమని చెప్పాను. పొతే నీ ఫోను బగ్గింగ్ చేయబడింది కాబట్టి కొంచెం కోడ్ లో మాట్లాడిందంతే".

    శ్రీకాంత్ మొహం జేవురించింది. "నా ఫోనేమి బగ్గింగ్ చేయబడలేదు. ప్రతిరోజూ చెక్ చేస్తూనే వున్నాం" అన్నాడు.

    అనూష నవ్వింది.

    "మీ డిపార్ట్ మెంట్ కన్నా ఆ స్మగ్లర్లు కనీసం అయిదు సంవత్సరాలు సాంకేతిక పరిజ్ఞానంలో ముందన్నారన్నయ్యా. ఒక డి.సి.పి.గా చెప్పు- వైర్ లెస్ ద్వారా  బగ్గింగ్ చేసి, మన టెలిఫోన్ లో మాటలు అవతలి వాళ్ళు వినొచ్చా?"

    "కేవలం స్కాట్ లాండ్ యార్డ్ లో మాత్రమే ఈ మధ్య అది కొత్తగా ప్రవేశపెట్టబడిందని విన్నాను".

    "ప్రపంచంలో ఏ మూల ఏ విధంగా ఏది కొత్తగా కనుక్కోబడినా ఉపయోగపడేదైతే, లక్షలు పెట్టయినా దాన్ని తమ స్వంతం చేసుకుంటారు. దాదాలాంటివాళ్ళు. అందుకే వాళ్ళు మీకన్నా పై ఎత్తులో వున్నారు. అదే పరికరాన్ని మీ డిపార్ట్ మెంట్ నుంచి మరో డిపార్ట్ మెంట్ కి కదలాలి-"

    శ్రీకాంత్ కి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తన ఫోన్ బగ్గింగ్ చేయబడిందంటే అతడికి నమ్మకం కుదరటంలేదు. తన ఫోన్ పరికరాన్ని పరిశీలించిన సాంకేతిక నిపుణుడు కూడా దాదా మనిషి అయితే తప్ప అది సాధ్యం కాదు. ఏమో..... ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఏదయినా వీలవ్వొచ్చు.

    నిస్పృహతో తల విదిలించాడు శ్రీకాంత్.

    రాత్రి తాలూకు చీకటి కూడా అతడిని సానుభూతితో పరిశీలిస్తున్నట్టు నిశ్శబ్దంగా వుంది. ఎంత తేడా! ఒక మామూలు ఇన్ స్పెక్టర్ ఒక మాఫియా గ్రూపుకు దాసోహం అని ఇళ్లు కడతాడు, స్కాచ్ తాగుతాడు. ఒక డిప్యూటీ కమీషనర్  ఆఫ్ పోలీసు కేవలం కర్తవ్యాన్ని నమ్మబట్టి- నిద్రలేని రాత్రులు గడుపుతాడు. కోర్టులచుట్టూ తిరుగుతాడు. ప్రమోషన్లు ఆగిపోతాయి. దేశపు మారుమూల ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేయబడతాడు.

    ఈ వ్యవస్థ కూలిపోకుండా ఏ శక్తి రక్షించగలదు?


                                                             24


    ప్రొద్దున్న అయిదింటికి తననెవరూ వెంబడించటం లేదని నిశ్చయించుకుని, టెలిఫోన్ ఎక్స్చేంజికి పోనిచ్చింది కారు. ఆమె కోసమే అక్కడ ఎదురు చూస్తున్న సూపర్ విజరు ఆమెకో క్యాసెట్ అందిస్తూ "రాత్రి రెండున్నరకి హైద్రాబాద్ నుంచి మీరిచ్చిన నెంబర్ కి వచ్చిన కాల్ ఇది" అంది.

 Previous Page Next Page