Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 46


    విష్ణు శర్మ వ్రాసిన వుత్తరంలో ఆ నెంబర్ "కూడా" వుందన్న విషయం, దాదాకి అనుమానం రాలేదన్నమాట అనుకుంది. ఆమెకి థాంక్స్ చెప్పి ఆ క్యాసెట్ తీసుకుని కారులో ఇంటికి బయల్దేరింది.

    అదే పోలీసులకీ, బయటి వ్యక్తులకీ తేడా! పోలీసులే గానీ ఈ నెంబర్ ని ట్రాప్ చేయవలసి వస్తే ఎంతో పెద్ద తతంగం చేయవలసి వచ్చేది. ఆమె చిన్న స్నేహం ప్లస్ వంద రూపాయిల ఖర్చుతో దాన్ని సాధించింది.

    ఇంటికొచ్చి    టేప్ విన్నది.

    "నేనూ శంకర్ ని"

    "ఏమైంది? ఉత్పల దొరికిందా?" ఇట్నుంచి దాదా స్వరం.

    "లేదు. ఆ కట్ మల్ ఇన్ స్పెక్టర్ గాడు వుత్తిచేతుల్తో తిరిగొచ్చాడు. వారెంటు మేము తయారుచేసిందే అన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది".

    ఇట్నుంచి దాదా ఏదో గొణుక్కున్నాడు.

    "అనూష దగ్గిర్నుంచి ఆ వుత్తరం బయటపడితే తప్ప మనకీ టెన్షన్ తగ్గదు. ఏమయితే అదయింది దాదా. నువ్వామె ఖతమయ్యేట్టు చూడు. ఈ ముగ్గురి సంగతి నేను చూసుకుంటాను. ఇదొక్కటే ఆఖరి మార్గం. చూద్దాం ఆ వుత్తరం బయట పడ్డాక ఎవడేం చేస్తాడో....."

    "అనూష సంగతి చూసుకోనక్కర్లేదు. ఆవిడ దాన్ని బయటపెట్టదు. అది నేనూ ఆవిడా చూసుకుంటాం. ఉత్పల మాత్రం...... ఓ.కే సలీం- గాంగ్ వార్ ప్రారంభం అయితే అయింది. ఇవ్వాళో రేపో ఆ అమ్మాయితో సహా ఇద్దర్నీ చంపెయ్యి. కానీ చంపేముందు చివరిసారిగా మరొకసారి బెదిరిస్తే మంచిదేమో అని నా వుద్దేశ్యం. బెదిరింపు అంటే ఇప్పటివరకూ చేసినట్టు సెర్చి వారెంట్లని- రాయబారులని పంపటం కాదు. కొంత నష్టం కలిగిస్తే తప్ప వాడు మనమాట వినడు".

    "ఆ మాత్రం పర్మిషన్ ఇచ్చావ్ చాలు దాదా! ఇక చూసుకో! జానీగాడికి తన హొటల్ అంటే ప్రాణం. ఈ రోజే దాన్ని భూస్థాపితం చేస్తాం. ఆ అమ్మాయి కూడా ఆ గోడల క్రిందపడి సమాధి కావాలి. అప్పటికి గానీ బుద్ధిరాదు వాడికి. చాలా చిన్న విషయాన్ని ఇప్పటికే అనవసరంగా పెద్దది చేసాం....."

    "నాకు రేపు ఫోన్ చేసి చెప్పు. అన్నట్టు ఆ చోటీ గల్లి ఫోన్ ఉపయోగించకు. విష్ణుశర్మగాడు దాని నెంబరు ఉత్తరంలో వ్రాసినట్టున్నాడు".

    "సరే....."

    ఫోన్ కట్ అయింది.

    అనూష పోస్టాఫీస్ కి వెళ్ళి తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. అరగంట తరువాత జానీ దగ్గిర్నుంచి ఆమెకి ఫోన్ వచ్చింది. అతడి గొంతులో ఎగ్జైట్ మెంట్ కొట్టొచ్చినట్టు కనపడుతూంది.

    "ఎక్కడున్నావ్ నువ్వు?" సంభ్రమంతో అరిచాడు.

    "ఇంకా  ఢిల్లీలోనే-" నవ్వుతూ అంది.

    "ఏం చేస్తున్నావ్?"

    "నిన్ను రక్షించే పథకాలు ఆలోచిస్తున్నాను".

    "నిన్ను నువ్వు రక్షించుకోవటం అయిపోయిందా? అన్నట్టు మరో ముఖ్య విషయం-"

    "ఏమిటి?" అంది.

    "నాకు నిన్ను అర్జెంటుగా చూడాలని వుంది".

    "ఇంకేమీ లేదా?"

    "ఉందిగానీ అది ఫోన్ లో చెప్తే బావోదు. అద్సరే కానీ ఎందుకు ఇలా బయట నుంచి ఫోన్ చేయమని కబురు చేసావు?"

    "నీ ఫోను వాళ్ళు వింటున్నారేమో అని అనుమానం వచ్చి..... జానీ! ఈ రోజు రాత్రి వాళ్ళు నీ  హొటల్ మీద దాడి జరపబోతున్నారు".

    "ఎలా?"

    "బహుశా బాంబుల్తో అనుకుంటా"

    "నీకెలా తెలిసింది?"

    "చెప్పానుగా, ఇక్కడ వుండి నేను చేస్తున్న పని అదే అని".

    "ఆ సలీంగాడికి ఈసారి గట్టిగా బుద్ధి చెపుతాను....."

    "దానివల్ల నీ హొటల్ కూలిపోవటం ఆగదు. వాళ్ళు అటో ఇటో తేల్చుకునేట్టు వున్నారు. అన్నట్టు ఉత్పల ఎలా వుంది?"

    "బావుంది-"

    "తనని వదిలి పెట్టవుగా".

    "ఆరు మూడయినా వదలను".

    "చాలా చిన్న పిల్ల. దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోవటాలూ, ఛాలెంజి నెపం మీద పిచ్చి వేషాలు వేయటాలూ చేయటం లేదుగా".

    "లేదు. నీమీదొట్టు. నువ్వేం ఈర్ష్య పడనవసరం లేదు".

    "నాకేం ఈర్ష్య లేదు".

    "అది నీ కంఠంలోనే కనపడుతూంది".

    "అరె- ఒక పెద్ద గాంగు ఈ రాత్రికి నీ హొటల్  సమూలంగా  నాశనం చేయబోతూంది అంటే నీకు చీమకుట్టినట్టుగా లేదే?"

    "ఇన్సూరెన్సు వస్తుంది. ఫరవాలేదు. బాంబు విసిరేముందు వాళ్లు పట్టుబడితే మాత్రం శవాలుగా మారతారు".

    "ఉత్పల?"

    "తనని బయట ఎక్కడైనా దాస్తాను".

    "నీ భుజాల్లో వున్న చురుకుదనం, కాస్త పైగా మెదడులో వుంటే, బావుణ్ణు జానీ"

    "ఏం ? ఏమైందట-"

    "బి-క్లాసు సినిమాలో సి-క్లాసు హీరో లెవల్లో ఆలోచిస్తున్నావు! దాదాలాంటి వాడి ఎత్తుకి పై ఎత్తువేసి దెబ్బకొట్టాలంటే మరింత తెలివిగా ఆలోచించాలి. వాళ్ళు మింగలేక కక్కలేక చావాలి".

    "ఎలా?"

    ఆమె చెప్పింది.

    అంతావిని, అతడు హుషారుగా విజిల్ వేసి, "ఓ.కే. అలాగే చేస్తాను" అన్నాడు. ఆ రోజు ప్రొద్దున్న పదింటికి అనూష న్యూఢిల్లీ డిప్లమాటిక్ ఎన్ క్లేవ్ లో జపాను రాయబారి కార్యాలయానికి వెళ్ళింది. పెర్సనల్ అసిస్టెంట్ ని కలుసుకుని తనని తాను పరిచయం చేసుకుంది.

    "సలీం శంకర్ మీద  జపాన్ లో కేసువుందని మీకు తెలిసే వుంటుంది. దాని తాలూకు వివరాలు కావాలి"

    "ఎందుకు-?"

    "అతడు ఎంత తొందరగా భారతదేశం వదిలి వెళ్లిపోతాడా అని చూసే వారిలో నేనూ ఒకదాన్ని. అందుకు-" అంటూ నవ్వింది. తన మొహంమీద నవ్వు బావుంటుందని ఆమెకు తెలుసు.

    "మీకేమిటి దీంట్లో ఇంటరెస్టు?"

    "సర్కిల్- 3 డి.సి.పి. శ్రీకాంత్ చెల్లెల్ని నేను. కావాలంటే అక్కడే దీనికి సంబంధించిన ఫైలు చూడగలను. కానీ మీనుంచే (హార్స్ మౌత్) ఈ వివరాలు తెలుసుకోవాలని నా ఆకాంక్ష! జపనీయులు అలస్యాన్నీ, క్రమశిక్షణా రాహిత్యాన్ని అసలు భరించరని నేనెక్కడో చదివాను. ఈ విషయంలో ఎందుకింత ఆలస్యం జరుగుతుందో నాకు అర్థంకాలేదు. దీనిమీదో ఆర్టికల్ వ్రాద్దామనుకుంటున్నాను". 

    ఆమె మాటల్లో నాలుగో వాక్యం అతడిమీద బాగా పనిచేసింది.

    "ఇందులో మా ఆలస్యమేమీలేదు. అంతా ఇండియాదే! ఇంకేదో చిన్న కేసుందని అతడిని ఆపు చేశారు. అది పూర్తవగానే మా అధికారులు అతడిని జపాను తీసుకువెడతారు".

    "ఆ విషయం నేను నా వ్యాసంలో వ్రాయొచ్చా?"

    "ఏ విషయం?"

    "ఆలస్యమంతా భారతీయ అధికారులదే అని".

    "వ్రాస్తే వ్రాయండి. కాని దానికి నన్ను బాధ్యుణ్ణి చేయకండి. జరుగుతున్న విషయ మాత్రం అదే".

    "నేనొకసారి మా అన్నయ్యకి ఫోన్ చేయవచ్చా?"

    "ష్యూర్".

    ఆమె శ్రీకాంత్ ఆఫీసుకు ఫోన్ చేసింది.

    "ఎక్కణ్ణుంచి మాట్లాడుతున్నావు నువ్వు?"

    "జపనీస్ ఎంబసీ నుంచి".

    "ఏమిటీ?" శ్రీకాంత్ కంఠం కీచుగా ధ్వనించింది. "అక్కడేం చేస్తున్నావు నువ్వు?"

    "సలీం శంకర్ ని వీళ్ళు ఎప్పుడు జపాను తీసుకు వెడతారో కనుక్కోవడానికి వచ్చాను. వీళ్ళు ఇక్కడ చెప్పేదేమిటంటే ఆలస్యమంతా ఇండియన్ గవర్నమెంట్ దేననీ, ఇక్కడ కేసులు పూర్తిచేయడంలో జాప్యం జరుగుతూందనీ అంటున్నారు".

    "ఇప్పుడా విషయాలన్నీ నీకెందుకు?"

    "అదేమిటన్నయ్యా. నీకంతా చెప్పానుగా. శంకర్ వున్నంత కాలం నాకు  భద్రత లేదు".

    "సర్లే- ఇంతకీ ఏమంటావు?"

    "శంకర్ ని రక్షించడానికి కొంతమంది ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారా" అన్న వ్యాసం  వ్రాద్దామనుకుంటున్నాను. దానికి కావలసిన వివరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడికొచ్చాను."

    "నీకు వేపకాయంత వెర్రి వుందని ఇప్పుడు నిశ్చయంగా అర్థమవుతూంది. ఎందుకు చూస్తూచూస్తూ ప్రమాదంలో ఇరుక్కుంటావు?"

    "ఇంకా ఇరుక్కోవడం ఏమిటి? పూర్తిగా ఇందులో మునిగివుంటే....."

    "సర్లే ఇంటికి రా. వివరంగా మాట్లాడుకుందాం"

    ఆమె ఫోన్ పెట్టేసి పి.య్యే. వైపు తిరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆలస్యం అంతా మా వాళ్ళదే అని అర్థమవుతూ వుంది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా మీ దగ్గరికి రావడం నాదే తప్పు! ఫైలు అంతా చదివి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మీరు తప్పకుండా సాయం చెయ్యాలి....."

    "ష్యూర్"

    "సలీం శంకర్ ని తీసుకువెళ్ళటానికి మీ పోలీసు అధికారి ఎప్పుడు వస్తున్నారు?"

    "ఇక్కడ కోర్టులో కేసు అయిపోగానే వ్రాయమని మా దేశం మాకు సూచనలిచ్చింది. కేసు పూర్తవటం కోసమే మేమూ చూస్తున్నాం".

    "ఒకవేళ కేసు నిరూపించబడి సలీంశంకర్ కి ఏ ఆర్నెల్లో శిక్ష పడితే, మీ కేసు ట్రయిల్స్ కూడా అంత వెనక్కి జరుగుతాయా?"
   
    "తప్పదనుకుంటాను. నాకు 'లా' అంతగా తెలీదు".

    అనూష నవ్వింది. "అయితే తనకీ దేశంలోనే శిక్షపడాలని సలీం కోరుకుంటూ వుండి వుంటాడు. ఎంత శిక్షపడితే అతడి మరణం అంత వెనక్కి జరుగుతుంది కదా-"

    పి.య్యే. కూడా నవ్వి "అవును" అన్నాడు.

    ఆమె లేచి "వెళ్ళొస్తాను. థాంక్స్. ఎంతో శ్రమతీసుకుని మీ కాలాన్ని నా కోసం వెచ్చించారు" అని బయటకు వచ్చేసింది. అప్పటివరకూ బయటే వున్న మరో కారు తనని అనుసరించటం గమనించింది. అప్పటికి పన్నెండు కావొస్తుంది.

    మధ్యాహ్నం లంచ్ లో శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళిందామె. అతడు అర్థం కానట్టు ఆమె వైపు చూస్తూ, "ఎందుకు జపాన్ ఎంబసీకి వెళ్ళావ్? అసలు  వాళ్ళు నీతో ఈ వివరాలు అన్నీ ఎలా  మాట్లాడారు" అని అడిగాడు.

    "అదేమిటన్నయా? ఆడపిల్ల అడుగుతే ఆ మాత్రం చెప్పరా" అంది అమాయకత్వం నటిస్తూ.

    "జపాన్ లో జరగబోయే కేసు ప్రొసీడింగ్స్ కూడా వసంత్ దాదాకి తెలుస్తున్నాయి. ఆ కార్యాలయంలో దాదా మనుషులున్నారని మా అనుమానం! మాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళటం నువ్వు చేసిన తప్పు. ఈపాటికి వసంత్ దాదాకి నువ్వు సలీంశంకర్ మీద వ్యాసం వ్రాయబోతున్నావని తెలిసిపోయే వుంటుంది".

    "నిజమా"                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

 Previous Page Next Page