Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 44


    పులి అడుగు ముందు కేసింది.

 

    భారత ప్రభుత్వాన్ని, అమెరికన్  కోర్టులనీ కూడా శాసించగల ఆ పారిశ్రామిక వేత్త, మిగతావాళ్ళలా అనుచరుల సాయంతో కాకుండా తానే స్వయంగా ప్రత్యర్థుల ప్రాణాలు తీసే ఆ మేకవన్నె పులి, ఎదుటి పులిని చూసి అరవటానికి ఆఖరి ప్రయత్నం చేశాడు.

 

    దూరంగా ఫైర్ ఇంజన్ల హోరు వినపడుతూంది.

 

    నీటి శబ్దం ముందు మనిషి శబ్దం వినపడటం కష్టం.


                                    *    *    *

 

    "వెళ్ళొస్తా దొర....." అన్నాడు రెడ్డినాయుడు కొడుకుతో నమస్కారం చేయించి.

 

    నేత్ర  తలూపాడు. అతడు నేత్ర దగ్గిరగా వచ్చాడు. కళ్ళలో తడి కదలాడింది.

 

    "నేను నిన్ను చంపుదామనుకున్న దొరా. నువ్వు నన్ను, నా కొడుకుని బచాయించినవ్" అంటూంటే అతడి గొంతు తడబడింది.

 

    'ఇందులో నేను చేసిందేముంది?' అనబోయాడు నేత్ర. అంతలో పార్వతమ్మ ఏడుపు బిగ్గరగా వినిపించింది. అందరూ కంగారుపడి లోపలికి పరుగెత్తారు.

 

    లోపల  గజపతిరావు భార్యని "శుభమా అని వాళ్ళు బయల్దేరబోతుంటే నువ్వేడుస్తావెందుకే?" అని మందలిస్తున్నాడు.

 

    రెడ్డినాయుడు ఆవిడవైపు ఆదుర్దాగా చూస్తూ, "ఏమైనాది?" అని అడిగాడు.

 

    "మా ఆవిడకి మామూలే. నాకిందులో నలభై సంవత్సరాల అనుభవం వుంది. కంగారుపడక్కర్లేదు." అంటూ భార్యవైపు తిరిగి, "ఏమైందే....." అని అడిగాడు.

 

    "ఆ ఫిరంగిగానీ నిజంగా పేలివుంటే ఏమైపోదుమండీ....." అంటూ బావురుమంది.

 

    "ఇద్దరం చచ్చివుండేవాళ్ళం" అన్నాడు విసుగ్గా.

 

    "మీరు కాస్త  ఎడమపక్క, దూరంగా కూర్చుని వున్నారు. అటుపేలి వుంటే....?"

 

    "విధవరాలై వుండేదానివి" కసిగా అన్నాడు ఈసారి.

 

    "ఈ రోజు శ్రావణ శుక్రవారం. అది గుర్తొచ్చి ఏడుపొచ్చిందండీ......" అని బావురుమంది.

 

    "ఎప్పుడో నాలుగు రోజుల క్రితం జరిగినదానికి ఇప్పుడు ఏడవడం అందుకా-" అంటూ ఆయన తెల్లబోయాడు. కళ్యాణి నవ్వాపుకుంది. నేత్ర అన్నాడు -"నాయినమ్మా- నీలాటివాళ్ళనే ఇంగ్లీషులో 'డి.టి.' లంటారు. డౌటింగ్ టామ్ లని..... ప్రతిదాన్నీ అలా శంకించి నిరంతరం బాధపడుతూ వుండకు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు-"

 

    అతడు చెప్పింది నిజమే అనుకుంది కళ్యాణి. ఆమె  పుట్టుగుడ్డి. లోకాన్ని చూడలేదు. కానీ, మనస్తత్వాల్ని చూసింది.

 

    కొందరుంటారు. ఎప్పుడూ ఏదో జరగబోతూందని, ప్రమాదం వాటిల్ల బోతూందని భయపడుతూ వుంటారు. స్టేషన్ వెళ్ళే వరకూ  ట్రెయిన్  వెళ్లిపోతుందేమో అన్నా భయం, దిగాక రిక్షా దొరికదేమోనన్న భయం..... వగైరా, వగైరా! తాము సుఖపడరు- అవతలివాళ్ళని సుఖపెట్టలేరు.

 

    నేత్ర  కూడా అదే ఆలోచిస్తున్నాడు. నిజంగానే ఈవిడతో తాతయ్య నలభై సంవత్సరాలు కాపురం చేసాడంటే హేట్సాఫ్ టు హిమ్! చాలా  చిన్న సమస్యలా కనపడుతుంది కానీ నిరంతరం భరించవలసి వస్తే తప్ప ఆ సమస్య  లోతు తెలీదు. ఒక చలి రాత్రి మంచి రొమాంటిక్ మూడ్ లో  "వళ్ళూ వళ్ళూ ముళ్ళేసుకున్నా తగ్గేట్టు లేదు కదూ ముళ్ళతో పొడిచే ఈ చలి-" అన్నప్పుడా భార్యామణి, "అయ్యో ఈ చలికి పాలు తోడుకుకుంటాయో లేదో - రేపు మజ్జిగ ఎలాగండి?" అని వాపోతే, అది చాలదూ జీవితం మీద  విరక్తి పెంచడానికి......

 

    నేత్ర ఆలోచనలో వుండగా, రెడ్డినాయుడు అతడి దగ్గిరకెళ్ళి "పోయొస్త" అన్నాడు.

 

    "మంచిది-"

 

    "మా  వూరెప్పుడొస్తరు?"

 

    "నాకో నెల, రెండు నెలలు పనివుంది. అది అయ్యాక వస్తాను-"

 

    "తప్పక రావాలె-"

 

    "తప్పకుండా."

 

    వాళ్ళు వెళ్ళిపోయారు. నేత్ర అటే చూస్తూ నిలబడ్డాడు. ఎక్కడెక్కడి సంఘటనలకి లింకు వుంటుందో ఎవరికీ తెలీదు కదా! తను యాదగిరి రూపంలో వాళ్ళింట్లో పనిచేయడం, ఆ తండ్రీ కొడుకు లిద్దర్నీ దాదాపు మృత్యువు అంచువరకూ తీసుకెళ్లింది. అదేనేమో బహుశా 'ఘటన' అంటే.

 

    గజపతిరావు అడిగాడు- "ఎవరి కేసు? మళ్ళీ రెండు నెలలు పని అంటున్నావు."

 

    "సర్పభూషణరావు పనిమీదే  సముద్రయాసం చేయవలసి రావొచ్చు తాతయ్య-"

 

    మళ్ళీ  పెద్ద ఎత్తున ఏడుపు వినిపించింది. "ఏమైంది నాయినమ్మా" అని అడిగింది గుడ్డిపిల్ల కంగారుగా. నేత్ర సమాధానం చెప్పాడు "ఈ  సముద్ర ప్రయాణాలూ, తిమింగలం వేటలూ ఏమిటి? ఏమన్నా అయితే!, అని ఏడుస్తూ వుండివుంటుంది బహుశా. అవునా?"

 

    ఆవిడ తలూపింది. ఏం మాట్లాడాలో అక్కడ ఎవరికీ తెలియలేదు. ఆవిడ భర్త కోపంగా, "నిజంగా నువ్వు అనుకున్నది జరిగి నేను ఈ  లోకం లోంచి పొతే తప్ప నీకు ఏడుపు పోదే-" అన్నాడు.

 

    "అయ్యో ..... తథాస్తు దేవతలుంటారండీ, శ్రావణ శుక్రవారప్పూట ఏ దేవత మీ నోటెంట ఈ మాట పలికించిందిరో దేవుడో-"

 

    ఆయన తల పట్టుకుని "ఒక వైపు భయం అని ఏడుస్తావు- మరొకవైపు ఆ భయం నిజం కాకూడదని ఏడుస్తావు. నీతో ఎలాగే?" అన్నాడు.

 

    సరిగ్గా  ఆ సమయానికి ప్రతిమ అక్కడికొచ్చింది. "-సర్పభూషణరావుని ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు" అని చెప్పింది.

 

    నేత్ర తలూపి, "నేను అడిగిన ట్రాన్స్ మిటర్ ఏర్పాటు చేసి వుంచారా?" అని అడిగాడు.

 

    ఆమె దాన్ని అతడికి అందించింది.

 

    చిన్న పావలా కాసు సైజ్ లో వుందది.

 

    చాలా పవర్ ఫుల్ ట్రాన్స్ మీటర్.


                                                        *    *    *

 

    నగరంలో కెల్లా ఖరీదయిన ఆస్పత్రిలో మంచం మీద పడుకుని వున్నాడు అతడు. చుట్టూ పత్రికా విలేకర్లు....

 

    "మిస్టర్ సర్పభూషణరావ్...... మీరు చేసిన సాహసానికి అభినందనలు."

 

    "మీకు తగిలిన గాయాలు అత్యంత ప్రమాదకరమైనవి, మీరు చేసిన మంచి కార్యమే మిమ్మల్ని రక్షించిందని మేమనుకుంటున్నాం. దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి?"   

 Previous Page Next Page