సర్కస్ డేరా పైభాగం వరకూ వెళ్లి అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఆకస్మిక సంఘటన అక్కడ ఒక్కసారిగా కలకలం రేపింది. జనం పెద్దగా, అరుచుకుంటూ హడావుడిగా అక్కడి నుంచి బయట పడటానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట మొదలైంది.
ఈలోపు నేత్ర రెడ్డినాయుడు కొడుకు చెయ్యి పట్టుకుని అదే వేగంతో వెనక్కి వెళ్ళాడు. ఫిరంగి దగ్గర నల్లటి ముసుగు వేసుకున్న తలారి లాటి మనిషి డేరా వెనుక నుంచి వెళ్ళిపోతూ కనిపించాడు.
నేత్ర వెనుక పరుగెత్తాడు. అయితే పక్కన కుర్రవాడు వుండటం వల్ల వేగం పుంజుకోలేక పోతున్నాడు.
దూరంగా ఫైరింజను వస్తూన్న చప్పుడు వినిపించింది.
జనం హడావిడిగా తొక్కిసలాడుతున్నారు. మంటల్ని చూసి బోనులో జంతువులు భూమి దద్దరిల్లేలా అరుస్తున్నాయి.
నేత్ర పిస్టల్ తీశాడు.
నెత్తిమీద ముసుగు తీసేసి, పరుగెడుతున్న వ్యక్తి వెనుదిరిగాడు.
అతడు ఏజెంట్ క్యూ.
నేత్ర పిస్టల్ గురి చూసి పేల్చాడు. అయితే క్యూ అంతకన్నా వేగంగా బోను తలుపు తెరిచాడు. మంటల రంగుకి భయపడిన పులి వేగంగా బయటకు దూకింది. ఆ సందు చూసుకుని క్యూ డేరా పక్కకి పరుగెత్తాడు. అపప్తికే మంటల వేడికి ఏనుగులు కట్ట దాటి బయటకొచ్చాయి. రెడ్డినాయుడి కొడుకు వాటి మధ్య చిక్కు పడిపోయాడు.
నేత్ర వదిలి పెట్టలేదు. ఎలాగయినా క్యూని బంధించాలన్న పట్టుదలతో మీదకొస్తూన్న జంతువుల్ని ఛేదించుకుని ముందుకు దూకాడు. డేరాకి అటువైపు రాడ్ కి వరుసగా గుర్రాలు కట్టి వున్నాయి. క్యూ దాని లింక్ తొలగించగానే గుర్రాలు వేగంగా జనంవైపు పరుగెత్తుకు రాసాగాయి. అవి జనాన్ని చేరితే రాంపెయిడ్ తప్పదు.
నేత్ర సందేహించకుండా గాలిలోకి పిస్టల్ పేల్చాడు.
తన పిస్టల్ లో వున్నవి ఆరు గుళ్ళేననీ, క్యూని వేటాడటానికి అవి కావాలనీ అతడికి తెలుసు.
కానీ...... ఒక విదేశీ గూఢచారి కన్నా, తన ప్రజల సంరక్షణ ముఖ్యం.
అతడు మరో రెండుసార్లు పేల్చాడు.
ఆ శబ్దానికి గుర్రాలు అదే వేగంతో పక్కకి తిరిగాయి. ఒక సరళరేఖలో మలుపు తిరిగి పక్కకు వెళ్ళాయి. రెడ్డినాయుడి కొడుకు కాలు డేరాకి కట్టిన తాళ్ళమధ్యలో ఇరుక్కుపోయింది. బోను నుంచి బయట కొచ్చినపులి వాడి చుట్టూ తిరుగుతూంది. మనుషుల మధ్య వున్నదే అయినా, ఆ మంటలూ ఆ వాతావరణం దాన్ని పిచ్చిదాన్ని చేస్తున్నాయి. చెవులు దద్దరిల్లేలా అరుస్తూంది. కుర్రవాడు భయంతో ఆర్తనాదాలు చేస్తున్నాడు. అయితే జనం హడావిడిలో అవి వినిపించడం లేదు.
నేత్ర ఈ దృశ్యం గమనించాడు. అయితే అతను ఏ మాత్రం ఇటు వచ్చినా అటునుంచి పరుగెత్తుకు వస్తున్న ఏనుగులు జనంవైపు వెళ్తాయి.
మంటలు కుర్రవాడివైపు వెళ్తున్నాయి.
అదే సమయానికి నేత్ర దృష్టి వాటర్ టాంక్ మీద పడింది. పదిహేను అడుగుల ఎత్తున స్తంభంమీద ఆరేడు డ్రమ్ములు కట్టి టెంపరరీగా ప్రేక్షకులకోసం నీటి ఏర్పాటు చేశారు. నేత్ర సంశయించకుండా దాన్ని పేల్చాడు.
నీరు పంపులోంచి వచ్చినట్టు జివ్వున చిమ్మింది. ఊహించని ఈ పరిణామానికి పులి వెనక్కు తగ్గింది. మంటల ఉధృతం చల్లబడింది.
సరిగ్గా అదే సమయానికి క్యూ డేరా వెనుకనుంచి వచ్చి కారువైపు పరిగెత్తాడు. నేత్ర గురి చూసి కాల్చాడు. కానీ...... అప్పటికే పిస్టల్ లో గుళ్ళు అయిపోయాయి. క్యూ కారెక్కి వేగంగా వెళ్ళిపోయాడు. నేత్ర వెనుక నుంచి నవ్వు వినపడింది. చప్పున వెనుదిగిరి చూచాడు.
సర్పభూషణరావు నవ్వుతున్నాడు.
"ఇప్పుడర్థమైంది...... నువ్వు యాదగిరివి కావనీ, భారత సీక్రెట్ ఏజంట్ నేత్రవనీ."
దూరంగా ఫైరింజన్ మంటలు ఆర్పుతూంది. జంతువుల్ని సర్కస్ మనుషులు తిరిగి యాథాస్థానాలకు చేరుస్తున్నారు.
"కంగ్రాట్స్....... రెడ్డినాయుడి కొడుకుని రక్షించినందుకు, కానీ ప్రమాదం అంతటితో తొలగిపోయిందని సంతోషపడకు. అనుక్షణం అదినిన్ను వెంటాడుతూనే వుంటుంది."
"నీకు ఇంటర్ పోల్ ఏజెంట్స్ సంగతి అంతగా తెలిసినట్టు లేదు భూషణరావు...... ప్రమాదం లేకపోతేనే వాళ్ళు విచారంగా వుంటారు."
"నిజమా.....? అయితే వామనమూర్తిని ఎలాగూ చంపబోతున్నాం. రక్షించే ప్రమాదంలో మళ్ళీ ఇంకొకసారి ఇరుక్కో."
"పాపం..... అతన్నెందుకు చంపడం.....! మీకంత సాయం చేసిన వాడిని ఎందుకు చంపడం.....?"
"సాయమా......?"
"విదేశాలనుంచి అమ్లజలం తెప్పించే నీ ఫైలుమీద అతడు ఈ ఉదయమే సంతకం పెట్టాడు. ఆ విషయం తెలియక నువ్వు అతన్ని చంపటానికి ప్రయత్నం చేసావ్."
సర్పభూషణరావ్ విస్మయంతో "నేను నమ్మను" అన్నాడు.
"నువ్వు నమ్మని విషయాల అతి స్వల్పకాలంలో చాలా జరగబోతున్నాయి భూషణరావ్. వాటిని నీ కళ్ళారా నువ్వే చూడబోతున్నావ్."
"చాలా ఆశావాదివి అనుకుంటాను నువ్వు. ఏం నిరూపించగలవు నువ్వు....? నిన్ను చంపడానికి నేను రెడ్డినాయుడిని ఉపయోగించాను. నిజమే.... మీ వాళ్ళు నిరూపించగలరా? వామనమూర్తిని చంపుదామనుకుని కుర్రాడిని ఉపయోగించాను. నిజమే....... నిరూపించగలరా.....? ఈ దేశాన్ని శత్రుదేశపు ఆధీనంలోకి తీసుకు వెళ్ళబోతున్నాను. నిజమే. నిరూపించగలరా.....?"
నేత్ర పిస్టల్ తో ముందుకు వెళ్ళాడు. అతడు ముఖకవళికని చూసి భూషణరావు భయపడి వెనక్కి వెళ్ళాడు. వెనుక బోను వుంది. నేత్ర చప్పున తలుపు పైకెత్తి అతడిని లోపలికి తోశాడు.
"నేను నిన్ను చంపటానికి లోపల తోశాను. నిజమే, నిరూపించగలవా.....? నీ శరీరంలో నా పిస్టల్ బులెట్స్ నాటుదామనుకున్నాను. నిజమే. నిరూపించగలవా.....? ఇప్పుడు నీ శరీరంలో ఎముకల మీద మాంసాన్నంతా ఆ పులి తినేస్తే దానికి కారణం నేనే. నిరూపించగలవా.....? విష్ యూ లాంగ్ లైఫ్ భూషణరావ్ ఇన్ హెవెన్..... గుడ్ బై....." అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
సర్పభూషణరావు తలతిప్పి చూసాడు.
పులి బోనులో ఒక మూల తీరిగ్గా కూర్చుని, లోపలకు వచ్చిన పరాయి ప్రాణిని చూసి ముందు కాళ్ళమీద లేచింది.
అరవడానికి కూడా ధైర్యం లేనట్టు నిశ్చేష్టుడై చూస్తున్నాడు అతడు.
మొహం మీద నుంచి చెమటలు కారుతున్నాయి.
రెడ్డినాయుడి కొడుకుని తీసుకుని నేత్ర కారు దగ్గరకు వచ్చాడు. వాడిని కారులో ఎక్కించి తనూ కారెక్కాడు. సిగరెట్ వెలిగించి, కారు స్టార్ట్ చేసి నగరంవైపు పోనిచ్చాడు.