"ఈ సంఘటన పట్ల మీరెలా ఫీలవుతున్నారు?"
పత్రికా విలేకర్లు ఆస్పత్రి బెడ్ చుట్టూ చేరి అడుగుతున్నారు. సర్పభూషణరావు కుడికాలు ట్రాక్షన్ లో వుంది. చెయ్యికి బ్యాండేజి వుంది.
విలేకర్ల కెమెరాలు క్లిక్ మంటున్నాయి. అందరూ ప్రశ్నల బాణాలు కురిపిస్తున్నారు.
రాత్రి ఎనిమిదింటికి సర్కస్ కాలిపోయిన సంగతి, బాంబ్ బ్లాస్ట్ సంగతి పత్రికల వాళ్ళకి తెలిసింది. ప్రాణనష్టం ఏమీ లేదు కాబట్టి అదే పెద్ద విషయంగా కనబడలేదు. చిన్నసైజు ప్రముఖ వార్తగా పడిందంతే. అయితే, దాదాపు తొమ్మిదిన్నరకి సర్పభూషణరావు సెక్రటరీ అని చెప్పకుంటూ ఓ వ్యక్తి ఈ న్యూస్ బ్లాస్ట్ చేశాడు. ఈ సెక్రటరీ అనబడేవాడు ఎవడో సర్పభూషణరావుకి తలబ్రద్దలు కొట్టుకున్నా అర్థంకాలేదు. అయితే, వార్త మంచిదే కాబట్టి అతడు అంత పట్టించుకోలేదు.
ఒక చిన్నపిల్లవాడు పొరపాటున డేరా వెనుకవైపు వచ్చి ఆ హడావుడిలో పులుల మధ్య చిక్కుపడిపోయాడు. సమయానికి అటువైపు పరుగెత్తిన ఎస్.బి.ఆర్. ప్రాణాలకు తెగించి ఆ కుర్రవాడిని రక్షించాడు. ఆ ప్రయత్నంలో ఆయనకి గాయాలయ్యాయి.
ఈ వార్త బయటకు రాగానే ప్రెస్ చైతన్యవంతం అయింది.
సర్పభూషణరావులాటి ప్రముఖ వ్యక్తి తాలూకు ఏ న్యూస్ అయినా పత్రికలకి ప్రముఖ వార్తే. అందులోనూ పులిని ఎదుర్కొనడం.
విలేకర్లు ఆస్పత్రిని చుట్టుముట్టారు. అప్పటికి అతడు ఇంకా షాక్ నుంచి పూర్తిగా తేరుకోలేదు.
అయితే, డాక్టర్లు అనుమతి ఇవ్వలేదు. కావాలంటే రెండు రోజులు పోయాక రమ్మన్నారు. కానీ వార్త అంతవరకూ ఆగదు.
ఆ మరుసటి రోజే పత్రికలలో ఈ వార్తహెడ్ లైన్స్ లో వచ్చేసింది. దాని పరిణామమే రెండు రోజుల తరువాత ఈ ఇంటర్వ్యూ. కానీ, అతను ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. క్లుప్తంగా సమాధానాలు చెప్పాడు. డాక్టరు విలేకర్లని పంపించేశారు. కేవలం దగ్గర బంధువుల్నీ, కూతుళ్ళనీ మాత్రమే వుంచారు. వాళ్ళు కూడా అభినందనలు తెలిపి వెళ్ళిపోయారు.
అతడు కళ్ళు మూసుకున్నాడు. ఈ గాయాలు పూర్తిగా మానడానికి ఎలాగయినా నెల రోజులు పడుతుంది. అతడి మనసు కుతకుత ఉడికి పోతూంది. చేతికున్న బ్యాండేజిని చూసుకున్నాడు. డాక్టరు చాలా శ్రద్ధ తీసుకుని కట్టాడు దాన్ని.... నగరంకెల్లా ఖరీదైన నర్సింగ్ హోమ్ అది. తన డబ్బు డాక్టర్ చేత "శ్రద్ధ" చూపింపచేసిందని అథనుఇ అనుకుంటున్నాడు. కానీ , గోడ అవతల నేత్ర వున్నాడనీ, డబ్బుకన్నా అధికారం (ముఖ్యంగా సి.బి.ఐ. కున్న అధికారం), అధికారం కన్నా తెలివితేటలు గొప్పవని అతడు వూహించలేదు.
ఆ రోజు అతడిని డాక్టర్ ట్రీట్ చేస్తున్నప్పుడు నేత్ర దగ్గరే వున్నాడు. అతడికి ఇక కొద్ది సేపట్లో స్పృహ వస్తుందనగా , తనకి కావాల్సిన పనిని నేత్ర డాక్టర్ సాయంతో పూర్తి చేసుకున్నాడు. సర్పభూషణరావు చేత కట్టులో అతడికి తెలియకుండానే బ్యాండేజితోపాటు ఒక కొత్త వస్తువు అతడి శరీరానికి 'అటాచ్' చేయబడింది.
అతడి కావిషయం ఏ మాత్రం తెలిసే అవకాశం లేదు.
అతడలా కళ్ళు మూసుకుని వుండగానే చేతి మీద చెయ్యి పడింది. కళ్ళు విప్పితే ఎదురుగా నేత్ర వున్నాడు. "నువ్వా" కోపంగా అన్నాడు.
"సర్కస్ లో చిన్న పిల్ల వాడిని రక్షించింది నువ్వేనన్న వార్త పత్రికల వాళ్ళకి చెప్పింది నేనే" అన్నాడు నేత్ర.
"నా సెక్రెటరీగా?"
"అవును. నీ సెక్రెటరీగా-"
"ఎందుకు?"
"అభినందన అన్నది ఎంత బలమైనదో తెలిస్తే నయినా నువ్వు మరతావని నేను అనుకుంటున్నాను. నువ్వు చేయకపోయినా, కనీసం నువ్వు చేశావన్న వార్త. ఎంతమంది చేత నిన్ను అభినందింప చేస్తుందో చూడు. స్వార్థం కన్నా అభినందన గొప్పది యస్బీ. ఆర్."
"పిస్టల్ పారేసి గౌతమ బుద్ధుడిలా ప్రవర్తించడం మొదలు పెట్టావన్న మాట-" వ్యంగ్యంగా అన్నాడు యస్బీఆర్.
"పిస్టల్ తో ప్రయత్నించాల్సినవస్తే నిన్నూ లేపెయ్యాల్సి వస్తుంది యస్బీఆర్. విషయం అంతవరకూ వస్తే అది ఎలాగూ తప్పదు. కాని చట్టం పరిధిలోకి నిన్ను తీసుకురావాలన్నదే నా కోర్కె నీ ద్వారా ఏజెంట్ క్యూ వ్యవహారం కనుక్కోవాలి. అదీ ముఖ్యం. నీ మీద కేసులన్నీ ఉపసంహరించుకుంటాం. ఏజంట్ క్యూ భారతదేశం ఏ పని మీద వచ్చాడో చెప్పు."
భూషణరావు నవ్వి, "కాళ్ళ బేరానికి వస్తున్నావా?" అన్నాడు.
"కాదు. ఆఖరి యుద్ధానికి అంతిమ రాయబారం చేస్తున్నాను. పూర్తిగా నాశనం అయిపోకముందే ఒక మంచి నిర్ణయం కన్నా సరి అయినది లేదు. 'నిన్ను నువ్వు రక్షించుకోవడం ద్వారా ప్రజల్ని రక్షించడం' అన్న విషయానికి ఆఖరి అవకాశం ఇస్తున్నాను. బి ఎ గుడ్ మాన్ యస్బీఆర్!"
సర్పభూషణరావు నవ్వేడు. "మనిషి స్వార్థానికి ఎంత దట్టంగా కోటింగ్ వేస్తే, అంత బాగా తన తరపున వాదనని నిర్మించుకోవచ్చు నేత్రా. ప్రభుత్వానికి సాయం చేయడం కోసం నువ్వు లైసెన్స్ డ్ మర్డర్స్ చేస్తావు. నా అంతస్థు కోసం, డబ్బు కోసం నేను హత్యలు చేస్తాను. మిస్టర్ నేత్రా...... ఈ ప్రజలంత అమాయకులు మరెవరూ వుండరు. అంతిమ విజయం ధర్మానిదే అని వీళ్ళు నమ్ముతారు. రాబోయే ఆ విజయం కోసం జాలిగా, ఆర్తిగా ఎదురుచూస్తూ వుంటారు. అదెప్పుడూ సుదూర తీరాల్లో అశగా కనపడుతూ వుంటుందే తప్ప నిరంతర విజయం మాత్రం ఎప్పుడూ చెడుకే. ఈ చెడు అన్నది మళ్ళీ రెలెటివ్ టర్మ్. రాజకీయాల్నుంచి వ్యాపారం వరకూ అన్ని రంగాల్లోనూ అది మిళితం అయ్యే వుంటుంది. ఎప్పుడో చివర్లో వచ్చే అంతిమ విజయం నాకొద్దు. అధర్మమయినా సరే, నిరంతరం విజయమే కావాలి."
నేత్ర అతడివైపు సూటిగా చూశాడు. "చాలా కరెక్ట్ గా చెప్పావు."
"నా లాజిక్ అర్థం చేసుకున్నందుకు థాంక్స్-"
నేత్ర తాపీగా "నువ్వు కరెక్ట్ గా చెప్పవన్నది నీ లాజిక్ గురించి కాదు. ముందు చెప్పిన ఆత్మవంచన గురించి-" అన్నాడు.
యస్. బి. ఆర్. మొహం వాడిపోయింది.
నేత్ర లేచాడు- "అభినందనల్తో తప్ప మారదు. త్వరలోనే నీకలాటి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నాను- చూస్తూ వుండు."
"అంతకన్నా పెద్ద షాక్ నీకూ, నీ మనసు మారుతుందనుకోవడం నా పొరపాటు. అది సమ్మెట దెబ్బల్తో తప్ప మారదు. త్వరలోనే నీకలాటి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నాను- చూస్తూ వుండు."
"అంతకన్నా పెద్ద షాక్ నీకూ, నీ దేశ ప్రజలకూ తగలబోతూ వుంది చూస్తూ వుండు. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టుగా విదేశాలనుంచి వస్తూన్న ఆమ్లజలమే ఉదాహరణ. మీరందరూ కలిసినా ఆ ఆమ్లజలాల దిగుమతిని ఆపుచెయ్యలేకపోయారు. అవునా-" నవ్వేడు.
నేత్ర కూడా నవ్వి. "నీకు తగలబోయే షాక్ ఆ ఆమ్లజలంలోనే వుండొచ్చుగా" అంటూ అడుగు ముందుకేసి "నీకు షాక్ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వగలను యస్బీఆర్! నీతో ఈ మాత్రమైనా మాట్లాడుతున్నానంటే డానికి కారణం కేవలం నాకూ, 'క్యూకీ, కీ మధ్య నువ్వు లింకువి కాబట్టే!"