Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 42


    "చిన్నబాబుకి ప్రాణం మీదికొచ్చింది గదా. అందుకు....."
    అలర్ట్ అయింది యశోద.
    "చినబాబుకి ప్రాణం మీది కొచ్చిందా! ఏం జరిగిందీ? వివరంగా చెప్పు"
    "హయ్ బాబోయ్, చినబాబుకి మళ్ళీ బతికిబట్ట కడతాడనుకోలేదండీ. నెల రోజులు మంచంలో ఉన్నారు. మన స్పృహేలేదు ఆ బాబు మళ్ళీ మన లోకంలోకి పడ్డాడంటే, అదంతా ప్రసూనమ్మ పూజలమహిమేనని చెప్పాలి."    
    "రత్తిగొడవకీ చినబాబు జబ్బు పడటానికీ ఏమిటి సంబంధం?"
    "అదంతా సానా గమ్మత్తుగా అయిందమ్మగారూ. తర్వాత పెద్దయ్యగోరు బాధపడతా నాతో అంతా చెప్పుకున్నారు పాపం పెద్దయ్యగారికి గుండె బరువు దింపుకోవటానికీ నేను తప్ప ఎవరున్నారు. ఇట్టాంటి విషయాలన్నీ మనసు విప్పి ఎవరితో చెప్పుకుంటారు?"    
    "చినబాబుకి జబ్బు ఎందుకు చేసిందో చెప్పు!"
    "జబ్బంటే జబ్బు కాదండీ గాలి సోకింది."
    "ఏమిటీ?"
    "అవునండీ. అప్పటికి చినబాబుగారికి ఏడేళ్ళుంటాయండీ. గుర్రబ్బండిలో టౌన్ కి బడికి కూడా వెళ్ళేవారు."
    "ఆరోజు చినబాబుకి సెలవు కామోనండీ ఎప్పుడొచ్చి పెంకుటింట్లో ధాన్యం కుప్పల మీద నిద్ర పోయారో, మాకు తెలవదండీ ఆడతా పడతా నిద్రపోయారు కామోసు."   
    "అయ్యగారు రత్తితో లోపలికెళ్ళి తలుపేసుకున్నారండీ. ఆళ్ళిద్దరూ గుడ్డలూడదీసుకుని పడుకుని ఉండగా చినబాబు లేచాడు. కళ్ళప్పగించి చూస్తా కూచున్నారు. కూసేపటికి పెద్దయ్యగారు చూశారు అదిరిపడి రత్తినొదిలేసి గబగబా ధోవతీ చుట్టుకున్నారు రత్తి మాత్రం అట్టాగే పడుకుంది నవ్వుకుంటా..."
    "ఇక్కడెందుకున్నావ్? వెంటనే ఇంటికెళ్ళు" అన్నారు అయ్యగారు కోపంగా.
    చినబాబు గుడ్డల్లేని రత్తినే చూస్తూ అన్నాడు "ఛీ నాన్నా! నువ్వు తప్పుచేస్తున్నావ్! అమ్మతో చెప్తా!"
    అయ్యగారిపై ప్రాణాలు పైనే పోయాయి, రత్తితో సంబంధం..... చినబాబు కళ్ళముందు..... అమ్మగారు ఊరుకోరు.....
    "అలా చెప్పకూడదు..... అదిపాపం" అన్నారు.
    "చెప్తా" చినబాబు మొండి పట్టు.
    "అది పాపం. అలా చెపితే నరక లోకంలో యమధర్మరాజు నిన్ను హింసలు పెడతాడు....."   
    "సలసలకాగే నూనెలో మూకుట్లో పడేయిస్తాడు, కణకణమండే నిప్పు స్తంభాన్ని కౌగలించుకోమంటాడు, ఇనుప ముక్కుల కాకులతో పొడిపిస్తాడు కోరల పళ్లకుక్కలతో పీకిస్తాడు..."     
    చినబాబు కళ్ళు బాగా పెద్దవయ్యాయి... భయంతో ముఖం పాలిపోయింది అది చూసిన అయ్యగారు స్థిమిత పడ్డారు ఇంత భయపెడితే ఇక పిల్లాడు తల్లితో ఏమి చెప్పడని అనుకున్నారు చినబాబు అప్పటికే గుడ్డల్లేని రత్తిని వేలితో చూపిస్తూ" దాన్ని....." అని అడిగారు.
    అప్పటికీ గుడ్డల్లేకుండా ఉన్న రత్తిని కోపంగా చూసి.... "దాన్ని కూడా సలసలాకాగే నూనె మూకుట్లోనే వేస్తారు...." అని దాని చీర దాని మీదకి విసిరేశారు.... అది తెయ్యిన లేచి నిలబడి, చీరని దూరంగా విసిరేసి బారలు జాపుతూ అంది..." ఆ. నిన్ను పూలరధం మీద ఊరేగిస్తారు, నన్ను సలసలాకాగే నూనె మూకుట్లో పారేస్తారు."   
    "చచ్చినోడా, కాగే నూనె మూకుట్లోనే దూకుదువు గాని, ఉండు!" అంది.  
    పెద్దయ్యగారు కోపంతో దాని మీదికి పోయేటంతలో అది తప్పించుకుని తలుపు తీసి పెద్దగారాగాలు పెడుతూ ఏడుపు మొదలుపెట్టింది.   
    పెద్దయ్యగారికి ఏం జరిగిందో తెలిసేలోగా, నాయుడి మనుషులు రత్తి మొగుణ్ణి ముందు పెట్టుకుని అయ్యగారి మీద పడ్డారు. గలాటా విని మేమంతా చేరాం అయ్యగారికి కర్ర అందించాను అయ్యగారు కర్ర తిప్పుతూనే వీరిగా! చినబాబు....." అని అన్నారు పెద్దయ్యగారు.   
    అప్పటికి చినబాబు బిత్తరపోయి చూస్తున్నారు. నేను బాబు నెత్తుకుని దూరంగా గడ్డి వాముల మధ్య పడుకో బెట్టి వచ్చేశాను. కాసుకోనీ దెబ్బ పెద్దయ్యగారికి బాగా దెబ్బలు తగిలాయి.   
    ఆయనకి తెలివి తప్పిపోయాక "ధూ" అని నేల మీద ఊసి. అప్పుడెళ్ళారు నాయుడి మనుషులు. ఆళ్ళని ఎంటాడే వాళ్ళం, కానీ ముందు మా అయ్యగారిని బతికించుకోవాలి ఎడ్లబండి కట్టుకుని టౌన్ లో ఉన్న ఆస్పత్రికి తీసికెళ్ళాం.
    ఈ సందట్లో చినబాబు మాటే మర్చిపోయాం. తెల్లారి ఎవరో చూసే వరకూ చినబాబు గడ్డి వాముల మధ్యనే పడి ఉన్నాడు వొళ్ళు కాలిపోతా కలవరిస్తా ఉంటే అమ్మగారి కప్పజెప్పారు.
    ఆ రోజు నుంచీ నెలవరకూ చినబాబు గారు మనలోకంలో లేరు! ఒకటే పలవరింతలు ఎవరో తన మీద పడతా ఉన్నట్లు, తనని పీక్కు తింటున్నట్లు, ఒకటే పలవరింతలు చీకటి రాత్రి ఆరు బయట గడ్డి వాముల మధ్య ఏ గాలో సోకిందన్నారు అందరూ.    
    భూతవైద్యాలు చేయించటానికి, తాయెత్తులు కట్టించటానికీ ప్రసూన ఒప్పుకోలేదు. ఒకటే పూజలు చేసింది చిత్తశుద్ధి గల తల్లి.... చినబాబు కోలుకున్నాడు. ఆ తర్వాతే వాళ్ళంతా పొలాలమ్మేసి ఆ ఊరినుంచి ఈ ఊరు వచ్చేశారు"
    ఈ విషయాలే యశోదకి కావలసినవి. ఆనందంతో లేచి నిలబడి "థేంక్స్" అని వంద రూపాయల నోటు తీసి వీరన్న చేతిలో పెట్టింది వద్దంటూనే తీసుకున్నాడు ఏం జరిగిందో అర్థమయింది యశోదకి.   
    తన తప్పు కమ్ముకోవటానికి తండ్రి నరకలోక శిక్షల భయం పెట్టాడు. చీకటి రాత్రిలో వొంటరిగా ఉండిపోయాడు పసివాడు, అంతకు ముందు తల్లి ట్రైనింగ్ లో కధలను, ఊహాగానాలను అలవర్చుకున్నాడు.    
    అంచేత ఆ చీకటి రాత్రి, తన చుట్టూ నరక లోకపు దృశ్యాల కధలల్లుకుంటూ గడిపాడు అదీ రహస్యం!
    "జానీ" పిలిచింది, అతడు తన మాటలేవి వినటం లేదనటానికి గుర్తుగా రెండు సార్లు పిలిచాకగానీ రాలేదు జానీ.    
    "వెళ్తాను. చాలా థేంక్స్! వచ్చిన పని చాలా వరకూ అయినట్లే అవసరమైతే మళ్ళీ వస్తాను"      
    "నీకు కూడా థేంక్స్!"
    "దేనికీ?"
    "నా గెస్ట్ రాక ముందే వెళ్ళిపోతున్నందుకు....." నవ్వాడు.           

 Previous Page Next Page