13
యశోద ఆ రోజే, అనంత పద్మనాభస్వామి స్వామికి అంతా వివరించింది. స్వామి ఆనందం పట్టలేక వాత్సల్య పూర్వకంగా యశోద భుజం తట్టాడు.
"ఇక సందేహం లేదు... వివేక్ తప్పకుండా నార్మల్ మనిషి అయిపోతాడు."హీ ఈజ్ ఏ కో ఆపరేటివ్ పేషెంట్" అన్నాడు.
"నేను వెళ్తాను" లేచింది యశోద.
"ఇంక నీ ప్రోబ్లం సాల్వ్ అయినట్లే"
యశోద సంతోషం చూపలేదు. దిగులుగా తలవాల్చేసింది.
"ఓ.... ఓ...." అన్నాడు డాక్టర్.
"పింకూ ఎలా ఉన్నాడూ" అడిగాడు.
"బాగున్నాడు."
"అత్తగారూ వాళ్ళూ, వాడిని బాగా చూస్తారా!!"
"వాళ్లకి పింకూ నెత్తి మీద దేవత"
"ఓ.... ఓ...."
డాక్టర్ ఇంకా "ఓ"లలో ఆలోచిస్తూ ఉండగానే యశోద అక్కడినుండి బయలుదేరింది అశాంతి నిండిన మనసుతో ఉన్న యశోద వరండాలో కూచున్న వ్యక్తిని గమనించలేదు.
* * *
అది అరుణ, జానీ కోసం గెస్ట్ హౌస్ కి వచ్చింది అనుకున్న దానికంటే గంట ముందుగా వచ్చింది అలా రావటం అరుణకి అలవాటే.
స్వయంగా "ఫ్లల్ట్" అయిన జానీ, మిగిలిన గర్ల్ ఫ్రెండ్స్ ని కనుక్కోవటం ఆ రహస్యాలతో జానీని టీజ్ చెయ్యటం అరుణకి సరదా.
అంచేత అపాయింట్ టైమ్ కి ముందురావటం. "రాను" అని చెప్పి, ఆకస్మాత్తుగా రావటం ఇలాంటివి చేస్తూ ఉంటుంది వీటివల్ల ప్రయోజనం ఉండదు జానీ ఇలాంటివి లక్ష్యపెట్టడు.
అరుణ వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ లో మరో గర్ల్ ఫ్రెండ్ తో ఉంటే స్పష్టంగా ఆ విషయం చెప్పి అరుణని వెళ్ళిపొమ్మంటాడు... కానీ ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటుంది ఎలాగో తనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనుకోవటంలో, ఆ అమ్మాయికొక సంతృప్తి, అంతరాంతరాల్లో మరో ఆశ కూడా లేకపోలేదు జానీ అంతరంగిక రహస్యాలు అతడు బయటపెట్టడానికి భయపడేవి. ఏవైనా తను తెలుసుకుంటే, అతడిని బెదిరించి పెళ్ళి చేసుకోవచ్చని. జానీ ఎంతగా విదిలించినా అతడిని ప్రేమించకుండా ఉండలేకపోతోంది ఆ అమ్మాయి.
ఆ రోజు గెస్ట్ హౌస్ లోకి రాబోతున్న అరుణ, లోపలి నుంచి వస్తున్న యశోదని చూసి, గతుక్కుమంది....
భగ్గుమంది మనసు. "బోడి పతివ్రత వేషాలు వేస్తూ తనకి నీతులు చెప్తూ ఈవిడగారు చేస్తున్నది ఇదా? దర్జాగా జానీ గెస్ట్ హౌస్ కి వస్తూ ఎన్ని ఫోజులు పెట్టిందీ? ఎంత గొడవ చేసిందీ? అయినా వివేక్ లాంటివాడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న యశోదకిదేం రోగం!" యశోద ఆటో వాడితో "డాక్టర్ అనంత పద్మనాభస్వామి ఇంటికి, సైఫాబాదు!" అని చెప్పటం విన్నది.
స్వామి సైకియాట్రిస్ట్ అని అరుణకి తెలుసు సైకియాట్రిస్ట్ తో యశోదకేం పని?
గెస్ట్ హౌస్ నుంచి నేరుగా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఏంటీ?.
గెస్ట్ హౌస్ లో అరుణ హైడ్ ఔట్. కారు షెడ్ అందులో నిలబడి, జానీ గర్ల్ ఫ్రెండ్స్ నీ అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు యశోదనీ అలాగే చూసింది.
యశోద సైకియాట్రిస్ట్ దగ్గరికి బయలుదేరగానే, తనూ మరో ఆటో వేసుకుని యశోదని అనుసరించింది.
అది డాక్టర్ కన్సల్టింగ్ టైమ్ కాదు... అంచేత వరండాలో ఎవరు లేరు. యశోదని డాక్టర్ మొదటి నుంచీ ఫ్రెండ్ లాగ చూడటం వల్ల, ఆమె చనువుగా లోపలికి వెళ్ళింది వరండాకి ఆనుకునే ఉంది కన్సల్టింగ్ రూం.
వరండాలో కూచుంది అరుణ కన్సల్టింగ్ రూంలోంచి మాటలు వినబడగానే, దగ్గిరగా వేసి ఉన్న తలుపులకి చెవి ఆనించి అన్ని విషయాలూ వింది. ఆమెకి తెలివైనది అంతా అర్థమయింది నిర్ఘాంతపోయింది.
"అయితే పింకూ జానీ కొడుకా?" అనుకుంది.
ఇన్నాళ్లకీ జానీని నిజంగా భయపెట్టడానికి ఒక క్లూ దొరికింది.
అశాంతి నిండిన మనసుతో వెళుతున్న యశోద అరుణని గమనించలేదు.
* * *
"ఇంత ఆలస్యం చేశావేం?" అనుకున్న టైంకి రాకుండా, గంట పైగా ఆలస్యం చేసినందుకు అరుణ మీద చికాకు పడ్డాడు జానీ.
ప్రేమించే వాళ్లంటే, ప్రేమించబడేవాళ్ళకి లోకువ. అందుకే, అరుణ మీద ఎప్పుడూ ధుమధుమలాడతావు జానీ.
"ఎందుకు చికాకు? నీకు నీ యశోద ఉందిగా"
పక్కన బాంబు పడినట్లు అదిరిపడ్డాడు జానీ. అరుణ వ్యక్తిత్వంలో జానీకి ఏ కోశానా నమ్మకం లేదు.
కొంపదీసి ఈ విషయం అల్లరి పెట్టదు కదా? పాలిపోయిన జానీ మొహం చూసి విజయం సాధించినట్లు పొంగిపోయింది.
"నీ సి.ఐ.డి. ప్రాక్టీస్ ఇంకా మానలేదన్నమాట! సిగ్గులేదూ"
"నాకు సిగ్గు దేనికీ?. నువ్వు పడాలి సిగ్గు" గర్వంగా అంది.
"నేనా? నేనెందుకు సిగ్గు పడాలట? నీ లాంటి స్నేహితురాలున్నందుకా?" మండింది అరుణకి.
"కాదు... కన్న కొడుకుని మరో తండ్రికి అప్పగించి, పెళ్ళి వద్దంటూ తిరుగుతున్నందుకు"
"ఏయ్! తాగి వచ్చావా?"
"తాగక్కరలేదు.... నాకు నీ సంగతి యశోద సంగతి అంతా తెలుసు"
"యశోద గురించి ఏమైనా వాగావంటే చెంప పేలగొడతాను. యశోదకీ, నాకు అలాంటి దేమీలేదు!. యశోద వేరే పని మీద ఇక్కడికి వచ్చింది."
"అవును నీ దగ్గర గీతోపదేశం పొందటానికి"
"వాగకు. యశోదని నేను పెళ్ళి చేసుకుంటానన్నాను ఆ విషయం మర్చిపోకు."