Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 40

       
    "అనుమానం ఉండటంలో తప్పులేదు సిరీ! నేను చెప్పాను కదా ఎక్కడ ప్రేముంటుందో అక్కడే ఈర్ష్యాఅసూయలు ఉంటాయని. నేను కేవలం  నీ మీద ప్రేమతోనే అక్కడికొచ్చాను."

    "ప్రేమతోనే అక్కడికొచ్చారా! మరి అటువంటప్పుడు రివాల్వర్ ఎందుకు తెచ్చారు?" ఆమె సన్నటిస్వరంతో అడిగినా ఆ మాటలు బుల్లెట్ లా పేలాయి.

    ఆమె కొనసాగించింది. "ఆ క్షణం నిజంగానే నేనే ఎవరితోనన్నా ఉండి ఉంటే మీరు ఆవేశంతో ఏం చేసుండోవారో మీకే తెలీదు. ఆవేశం మనిషిని మూర్ఖుడ్ని చేస్తుంది. అయితే అంతకన్నా ఎక్కువ ఆవేశపరులైన మీరు మహర్షిని శిక్షించే అధికారం లేదు. అదీ నేను చెప్పదలచుకొంది."

    "నేను పోలీసాఫీసర్ని సిరీ! పోలీసాఫీసరు ఎక్కడికి వెళ్లినా వెంట రివాల్వర్ తీసుకెళ్తాడు."

    "ఓహో అలాగా! అయితే మీకు కాబోయే భార్య ఎలాటిదో తెలుసుకోవడం కోసం మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయనవసరం లేదు. దూరంగా చీకట్లో నిలబడి వుంటే మీకే అర్థమై ఉండేది. రెడ్ హాండెడ్ గా పట్టుకొని ఏం సాదిద్దామనుకున్నారు?"

    అతడు సమాధానం  చెప్పాలేదు.

    "సరే, ఆ సంగతి వదిలిపెట్టండి. మహర్షి నాకు వ్రాసిన ఉత్తరం చూసిన తర్వాతే మీరు  అతన్ని చంపేయాలనుకున్నారా?" రవితేజ తెల్లబోయి "నేను చంపాలనుకోవటం ఏమిటి?" అన్నాడు.

    "డూప్లికేట్ బిస్కెట్స్ ద్వారా"

    "అవి డూప్లికేట్ బిస్కెట్స్ అని నాకు తెలియదు."

    "మీకు తెలుసు."

    "తెలియదు.....తెలియదు" విసుగ్గా అన్నాడు రవితేజ.

    "తెలుసు రవితేజా! ఎందుకంటే వాటిని మీరే మార్చారు కాబట్టి."

    రవితేజ ఉలిక్కిపడి "నేను ....నేను మార్చడం ఏమిటి?" అన్నాడు.

    "డ్యూప్లికేట్ బిస్కెట్ వస్తున్నాయని చెప్పి ఖాన్ కి ఫోన్ లో మీరెందుకు చెప్పారు? అవి నిజంగా డూప్లికేట్ బిస్కెట్స్ అని మీకు తెలుసు. ఖాన్ వాటిని పరీక్షించి మహర్షే వాటిని మార్చేసాడనుకొని అతన్ని అక్కడే చంపి పారేస్తాడనుకున్నారు. అవునా" అతడు మాట్లాడలేదు.

    "అవి డూప్లికేట్ బిస్కెట్స్ అని ముందు మీకు తెలియదు. కమీషనర్ గారు మీకు ఒరిజినల్ బిస్కెట్స్ ఇచ్చారనుకొని, వాటిని కంసాలి షాపుకి తీసుకెళ్లి అలాంటివే డూప్లికేట్ తయారు చేయించారు. కాదంటారా?"

    "కాదు. అబద్ధం."

    "కాదు, నిజం. ఆ కంసాలి మిమ్మల్ని గుర్తుపట్టాడు. ఆ తరువాత అతను మీ ఇంటికి ఫోన్ చేస్తే, మీరు మా ఇంట్లో ఉన్నారేమో అనుకొని ఆ నంబరిచ్చారు మీ నాన్నగారు. అతనితో నేను స్వయంగా మాట్లాడాను."

    రవితేజ మొహం తెల్లగా పాలిపోయింది. అతనేం సమాధానం చెప్పలేదు.

    "చూశారా, నేను చీకట్లో వేసిన బాణం సూటిగా తగిలింది" అంది. రవితేజ చివుక్కున తలెత్తాడు. సిరిచందన మొహంలో మళ్ళీ అదే నవ్వు. "కంసాలి విషయం అబద్ధం చెప్పాను. పోలీసాఫీసరు భార్యను కదా, చీకట్లో బాణాలువేయటం నాకూ మీ సహచర్యంలో కొద్దిగా అలవడినట్టుంది" అని ఆగి ".....సో....డూప్లికేట్ బిస్కెట్స్ మార్చటం కూడా నిజమేనన్న మాట!"

    "ఆ అవసరం నాకు లేదు" అన్నాడు పళ్ళబిగువున కోపాన్ని అదిమిపెట్టి.

    "ఎందుకు లేదు? మహర్షి చనిపోవటం మీకు చాలా అవసరం. భార్య దృష్టిలో ఒక సిన్సియర్ పోలీసాఫీసరుగా కలకాలం ఉండిపోవాలని మీ కోరిక. మహర్షి రేపు కోర్టుకెళితే అతడు మళ్ళీ ఈ విషయాలన్నీ తిరగదోడవచ్చు. లేదా తన స్నేహితురాలినైన నాకే మీ గురించీ, ,ఈ అసలు స్వరూపం గురించీ వివరాలన్నీ చెప్పవచ్చు. శ్రీవాణి డైరీ చూపించవచ్చు. ఇవేమీ మీకిష్టం లేవు. అందువల్లే మీరుఖాన్ కి ఫోన్ చేసి, ఒక వేళ  అవి డ్లూపికేట్ బిస్కెట్స్ అయితే వాటిని తీసుకొచ్చే వ్యక్తిని వెంటనే చంపేయమని చెప్పారు. మీ దురదృష్టంకొద్దీ ఆ ఖాన్ తన సహచరుడైన శాస్త్రితో నాముందే ఈ వివరాలన్నీ చెప్పటంతో మీ అసలు స్వరూపం  నాకక్కడే తెలిసింది. కళ్ళు వచ్చినా కూడా మీరు అంధుడిగానే నటిస్తూన్నారెందుకు అన్న అనుమానానికి అప్పుడు అసలు సమాధానం దొరికింది. మీకు కళ్ళు  వచ్చినప్పుడు నేను మహర్షి కౌగిలిలో లేను. తన నిజాయితీ నిరూపించుకోవటం కోసం అతడు ఫాన్ కి  ఉరి వేసుకుంటే, దాన్నించి విడిపించటానికే అతన్ని పట్టుకున్నాను. మీరనుకున్నటువంటి సంబంధమేదీ మా ఇద్దరిమధ్య లేదు. మీరు నమ్మినా, నమ్మకపోయినా అది నిజం. మీ భార్యకి అతడు ప్రియుడు కాదు. అతడి భార్యకి మీరు ప్రియులు అంతే తేడా"

    "అయితే ఇప్పుడేం చేయమంటావ్?"

    "అది నిర్ణయించుకోవలిసింది మీరు" స్థిరంగా చెప్పింది సిరిచందన. "మీరు కోర్టుకి వచ్చి మహర్షి భార్య మరణం యాక్సిడెంట్ అని, అడిహత్య కాదని చెబితే సరేసరి. అలా చెప్పకపోయినా పక్షంలో శ్రీవాని డైరీ కోర్టులో ప్రవేశపెడతాను. శ్రీవాణికీ, మీకూ ఉన్న సంబంధం ప్రపంచమంతా తెలిసేలా చేస్తాను. మీరు డూప్లికేట్ బిస్కెట్స్ తయారుచేయించి వాటిని కిడ్నాపర్స్ కి అందించటం ద్వారా ఒరిజినల్ బిస్కెట్స్ మాయం చేయాలనుకున్నారన్నవిషయం అందరూ తెలుసుకునేలా చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా మహర్షిని మీరు చంపటానికి ఏ విధంగా ప్రయత్నించారో మీకు భార్యగా లోకానికి వెల్లడి చేస్తాను."

    "నువ్వు మనిషివి కాదు. రాక్షసివి" అన్నాడు రవితేజ.

    "అవును. నేను మనిషిని కాదు. రాక్షసినే. మీ భార్యని కదా" అంది. "కానీ, మీకు మరోమార్గం కూడా సూచిస్తున్నాను. ఇప్పటికైనా మీలో మానవత్వం తిరిగి మేలుకుందని, మీరు మారిపోయారని నమ్మకం కుదిరేలా ఈ ఒక్కపని చేయండి చాలు. కోర్టుకొచ్చి ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పండి. మీ భార్యగా కొనసాగుతాను. లేదా ఇంత తెలిసిన నన్ను  భార్యగా కొనసాగించుకోవటం ఇష్టం లేకపోతే  చట్టపరంగా విడాకులు తీసుకొని విడిపోదాం. మహర్షి మాత్రం బ్రతకాలి! బ్రతికి తీరాలి!! ఏ విషయం మీరాలోచించుకోండి." అని వెనక్కీ తిరగబోయింది.

    "సిరీ!" అన్నాడు వెనుకనుంచి. ఆమె ఆగింది. అతడు దగ్గరగావచ్చి "ఐ లవ్ యూ సిరీ" అన్నాడు. ఆమె మాట్లాడలేదు.

    "నీ వ్యక్తిత్వం, విశిష్టత- నిజంగా నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు. నేను చిన్న తప్పులు చేసినమాట నిజమే. కానీ నువ్వనుకున్నంత దుర్మార్గుణ్ణి కాను. హొటల్లో  నీ గురించి వెతుక్కుంటూ రావటం, నీకూ మహర్షికీ ఏదో సంబంధముందని అనుకోవటం, పగతో రగిలిపోవటం- ఇవన్నీ నా బలహీనతలు మాత్రమే. కానీ నేను బేసిక్ గా దుర్మార్గుణ్ణి కాను. ఆ ఒక్క విషయం నమ్ము! నువ్వు నాతో ఉన్నా, విడిపోయినా సరే"

    ఆమె నెమ్మదిగా వెనుదిరిగింది. అతడివైపు చూస్తూ "మనం కలిసి వుండాలా లేదా అన్నది మీ భవిష్యత్ ప్రవర్తన మీదే ఆధాపరడి వుంటుందండి. నిర్ణయించుకోవలసింది నేను కాదు, మీరు" అని అక్కడినుంచి బయటికొచ్చింది. రవితేజ అలాగే నిలబడిపోయున్నాడు. అతని మొహం మ్లానమైవుంది. తనకీ, తన  భార్యకీ మధ్య అఖాతం ఏర్పడిందని అతనికి తెలుసు. దాన్ని ఎలా పూడ్చుకోవాలా. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నట్టు అతడు అలాగే నిలబడి ఉన్నాడు.


                        *    *    *

     నెమ్మదిగా మెట్లు దిగుతూ సిరిచందన క్రిందకి వచ్చింది. వెళుతున్నప్పుడు ఉన్న ఆవేశమంతా భర్తముందు వెలిబుచ్చిన తరువాత ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. ముఫ్పై మెట్లు దిగటానికే దాదాపు పది నిముషాలు పట్టింది. అలాగే వచ్చి కారులో కూర్చొని స్టార్ట్ చేయబోయింది. అంతలో వెనకనుంచిఅలికిడి వినబడింది. ఆమె తలతిప్పి వెనక్కి చూడబోయేటంతలో ఒక చెయ్యి ఆమె మొహాన్ని అదిమిపట్టుకుంది. మరో చేత్తో కర్చీఫ్ ఆమె నాసికాపుటలకి అడ్డు పెట్టింది. ఆమె ఊపిరి బిగిద్డామనుకుంది కానీ సాధ్యం కాలేదు. కర్చీఫ్ తాలూకు కోర్లోఫాం వాసనకి ఆమెకి నెమ్మదిగా స్పృహ తప్పింది.


                                2

    ఇంటినుంచి హడావుడిగా బయలుదేరిన సిరిచందన ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి విష్ణువర్థనరావు కంగారుపడ్డాడు. రవితేజ ఆఫీసుకి ఫోన్ చేసి కూతురి విషయం అడిగారు.

    "అదేమిటంకుల్! తను ఇక్కడినుంచి బయలుదేరి చాలాసేపయ్యిందే" అట్నుంచి కంగారుగా అన్నాడు రవితేజ.

    "అసలేం జరిగిందో నాకర్థం గావటంలేదు. వచ్చినప్పటినుంచీ సిరి అదోలా వుంది. అయిదు నిమిషాలు కూడా ఇంట్లో ఉండకుండా వెంటనే బయలుదేరింది. అరకులో ఏమన్నా గొడవజరిగిందా?"

    "చిన్న గొడవ జరిగిన మాట నిజమే కానీ, అదేమీ అంత పెద్ద విషయం కాదంకుల"

    పెళ్ళయిన మొదట్లో భార్యభర్తలమధ్య చిన్న చిన్న కలహాలు సహజమే కాబట్టి విష్ణువర్థనరావు కూడా ఆ టాపిక్ గురించి ఎక్కువ చర్చించలేదు. "మరెక్కడికి వెళ్లి వుంటుందంటావ్?" అని అడిగాడు.

    "తన స్నేహేతుల దగ్గరికేమన్నా వెళ్ళిందేమో!"

    "నాకేమీ అర్థం కావటంలేదు రవీ! నీకు చూపు తిరిగి వచ్చిన సందర్భంలో పెద్ద పార్టీ అరేంజ్ చేద్దామనుకున్నాను. మీరిద్దరూ మా ఇంటికి వచ్చి ఆ ఫంక్షన్ లో  ఆనందంగా పాల్గొంటారనుకున్నాను. అసలు మీరిద్దరూ విడివిడిగా రావటం ఏమిటి? రాగానే నువెళ్లి డ్యూటీలో జాయినవటం ఏమిటి? తను ఇల్లు పట్టకుండా తిరగటం ఏమిటి? ఇవేమీ నాకర్థం కావటంలేదు."

    "మీరేమీ కంగారుపడకండంకుల్. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. నేనిప్పుడే సిరి గురించి ఎంక్వయిరీ చేస్తాను" అని ఫోన్ పెట్టేశాడు రవితేజ. తన ఇంటికి ఫోన్ చేసి సిరిచందన అక్కడకు రాలేదని తెలుసుకుని, ఆ తరువాత పోలీస్ స్టేషన్ కి ఫో చేసి, మహర్షి గురించి ఎంక్వైరీ చేశాడు. అక్కడ మహర్షి సరెండర్ అయిపోయాడన్న విషయం తెలిసి, కమీషనర్ అశ్వత్ధామకి మళ్ళీ ఫోన్ లో చెప్పాడు.

    "వెరీగుడ్" అన్నాడు కమీషనర్. "ఇప్పుడే ఇన్ స్పెక్టర్ కిరణ్ వచ్చి చెప్పాడు. హంతకుడు అరకునుంచి పారిపోయాడని.....! ఏం చేద్దామా అని ఆలోచిస్తూండగా నువ్వీ వార్తా చెప్పావ్."

    "ఇప్పుడు మళ్ళీ అతనిమీద కేసు ఫైలు చేస్తారనుకుంటాను" అన్నాడు రవితేజ.

    "అవును. జైలునుంచి తప్పించుకున్న నేరానికి అతడిమీద కేసు మళ్ళీ దాఖలవుతుంది."

    "చాలా గమ్మత్తుగా వుంది సార్! ఉరికంబం ఎక్కబోయే వాడు ఒకరోజు ముందు అక్కణ్ణుంచి తప్పించుకుంటే అతనిమీద కేసు కోర్టులో నడవటం- దానివల్ల అతడి ఉరి పోస్ట్ పోన్ కావటం." అటునుంచి కమీషనర్ కూడా నవ్వాడు. "అదేగా మరి మన చట్టం". రవితేజ ఫోన్ పేట్టేసి కుర్చీలో వెనక్కి వాలాడు.

    అదే సమయానికి విష్ణువర్థనరావు భవంతిలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. అతను రాసిచ్చిన స్లిప్ పట్టుకుని గూర్ఖా లోపలి కెళ్ళాడు. విష్ణువర్థనరావు ఆ స్లిప్పు చూసి "ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. తర్వాత రమ్మను" అన్నాడు.

    గూర్ఖా వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి "మిమ్మల్నికాదుసర్, అమ్మాయిగారిని కలుసుకోవాలట" అని చెప్పాడు.

    విష్ణువర్థనరావు మొహం చిట్లించి "అమ్మాయినా? అమ్మాయి ఇంట్లో లేదని చెప్పు" అన్నాడు. గుర్ఖా వెళ్ళబోతుంటే మళ్ళీ  చెప్పాడు. "కాదులే. లోపలికి రమ్మను."

    అయిదు నిమిషాల తర్వాత ఆ వ్యక్తి లోపలి కొచ్చాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ "నమస్తే, నా పేరు వర్మ. సిరిచందన గారితో మాట్లాడాలి" అన్నాడు.

    "ఏమిటి విషయం?" అడిగాడు విష్ణువర్థనరావు.

    "ఆమె చిన్న ఎంక్వైరీ చేసిపెట్టమని చెప్పింది, దాని గురించిన వివరాలు కనుక్కున్నాను. ఆ విషయాలు ఆమెకి తెలియపరచాలి." విష్ణువర్థనరావు భృకుటి ఇంకొకసారి ముడిపడింది. "ఏమిటంత ఎంక్వైరీ చేయాల్సిన పెద్ద విషయాలు?" అని అడిగాడు చిరాగ్గా.

    "శ్రీవాణి అనే అమ్మాయి గురించి."

    "ఆవిడెవరు?"

    వర్మకి విసుగేసింది. ఆ ముసలాయన ఛాదస్తానికి తను కూడా చిరాగ్గా "అవన్నీ మీరు మీ అమ్మాయినడగండి. ఆమె నన్ను కొన్ని వివరాలు కనుక్కోమంది, అవి కనుక్కున్నాను! ఆ విషయం చెప్పండి చాలు" అని వెనుదిరగబోయాడు.

    "అసలు శ్రీవాణి ఎవరు? మా అమ్మాయికీ, ఆవిడకీ ఏమిటి సంబంధం? ఏ వివరాలు కనుక్కోమంది" కంఠంలోకి మార్దవాన్ని తెచ్చుకుంటూ అడిగారు విష్ణువర్ధనరావు. ముందున్న చిరాకు ఇప్పుడు లేదు.

    "శ్రీవాణి అనే అమ్మాయికి ఆమె ప్రియుడితో సంబంధాలున్నాయని తెలిపే రుజువులు కొన్ని దొరికాయని ఆమెకి చెప్పండి చాలు, మిగతా అంతా ఆవిడకి అర్థమవుతుంది. ఆవిడ ఆ పని మీదే నన్ను వినియోగించింది."

    "చూడు మిస్టర్! నువ్వు చెపుతున్నది అర్థంకావటంలేదు. "శ్రీవాణి అని సిరిచందనకి తెలిసిన ఒకమ్మాయి మర్డరు జరిగింది. ఆమె ప్రియుడు గురించి తెలిసి- శ్రీవాణి భర్త ఆమెని మర్డరు చేసాడు! ఆ వివరాలు నన్ను సిరిచందనగారు కనుక్కోమన్నారు" అన్నాడు.

    "ఎవడా ప్రియుడు?"

    "రవితేజ అని...."

    ఒక ఆటంబాంబు పడ్డట్టయింది.

    వర్మ ఎప్పుడు వెళ్ళాడో కూడా ఆయన గమనించలేదు.

    తన కూతురు అరకునుంచి ఒంటరిగా ఎందుకు వచ్చిందో- కారణం దొరికినట్టు....

    ....సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి దిక్కుతోచనట్టు విష్ణువర్థనరావుకి ఏం చెయ్యాలో తోచలేదు. ఈ పరిస్థితిలో తనకు సలహా ఇవ్వతగినవాడు తన స్నేహితుడు కమీషనరు అశ్వత్ధామే అనిపించింది. ముందు అతనికి ఫోన్ చేద్దామనుకున్నాడు. కానీ ఆ తరువాత పర్సనల్ గా వెళ్ళి కలిస్తే బావుంటుందనిపించింది. ఆయనవెంటనే కమీషనరు ఆఫీసుకి బయలుదేరారు.

 Previous Page Next Page