అశ్వత్ధామ గదిలోకి ఆయన ప్రవేశిస్తున్న సమయానికి కమీషనరు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అతడి మొహం రక్తం లేనట్టు పాలిపోయి వుంది.
విష్ణువర్థనరావు లోపలికి ప్రవేశించి కుర్చీలో కూర్చోబోతుండగా కమీషనరు ఫోన్ పెట్టేసి, ఆయన వైపు చూస్తూ "మీకీ న్యూస్ ఎలా చెప్పాలో తెలియటం లేదు" అన్నాడు.
"ఏమైంది అశ్వత్ధామా?"
"మీ అమ్మాయి.... కిడ్నాప్...."
విష్ణువర్థనరావు చేతులు వణికాయి. పిడికిళ్లు బిగుసుకున్నాయి. మనిషిలో ఒక్కసారిగా బి.పి. పెరిగింది. "కిడ్నాపా! నాకూతుర్నా- ఎవరు? ఎందుకు?" అని అడిగాడు వణుకుతున్నకంఠంతో. "బంగారు బిస్కెట్లకోసం 'ఖాన్ అనే ఒక వ్యక్తి."
"ఏమిటి మీరు మాట్లాడుతున్నది? బంగారు బిస్కెట్లకీ, నా కూతురికీ ఏమిటి సంబంధం? అసలేం జరుగుతోంది?" దాదాపు అరిచాడు విష్ణువర్థనరావు.
"మీ కూతురికీ, ఆ బంగారానికీ ఏ సంబంధం లేదు. కానీ మేం పట్టుకున్న ఆ బంగారానికి బదులుగా వాళ్ళు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసారు. ఆ అమ్మాయిని వదిలిపెట్టడం కోడం మేం తిరిగి బంగారాన్ని అప్పగించాలని షరతు పెట్టారు" అంటూ రవితేజకి ఈ విషయం చెప్పటం కోసం ఫోన్ చేయసాగాడు కమీషనర్ అశ్వత్ధామ.
3
"టక్.... టక్.... టక్........."
చెవులు పగిలేలా వినిపిస్తున్న ఆ శబ్దానికి స్పృహలో కొచ్చింది సిరిచందన. చుట్టూ చీకటిగా వుంది. ఆమెకు ఒక్కక్షణం తనక్కడుందో అర్థం కాలేదు. లేవటానికి సత్తువలేనట్టు, అలాగే పడుకొని వుంది. బయట వినిపిస్తున్న చప్పుడు క్రమంగా ఆగిపోయింది. చుట్టూ చీకటి.
క్లోరో ఫామ్ తాలూకు మత్తు పూర్తిగా దిగిపోయాక ఆమె లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది. పైన ఏముందో చూసుకోకుండా లేచిపోవటంతో .......పెద్ద చప్పుడుతో..... తల పగిలేలా నుదుటికి పై కప్పు బలంగా తగిలింది! ఆ దెబ్బకి ఆమె గట్టిగా కేకపెట్టింది. అప్పుడొచ్చింది ఆమెకు అనుమానం. చెయ్యెత్తి తడిమిచూసింది. సరిగ్గా అడుగున్నర ఎత్తులో పై కప్పు తగిలింది.
ఆమెకు ఒక్కక్షణం ఏమీ అర్థంకాలేదు. చుట్టూ తడిమి చూసింది. చెరోపక్క చెక్కలు తగిలాయి.
అప్పుడు శబ్దం మళ్లీ వినిపించసాగింది.
"టక్.... టక్....టక్....." ఆమె భయంతో "ఎవరూ.....ఎవరదీ" అని గట్టిగా అరిచింది.
మళ్లీ చప్పుడు. ఎవరో సుత్తితో మేకులు కొడుతున్నట్టు.
కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. లోపల గాలి ఆడటం లేదు. ఆమె ఒళ్లంతా చెమటతో అతదిసిపోయింది. గొంతు చించుకుని గట్టిగా "ఎవరదీ...... ఏం చేస్తున్నారు?" అనడిగింది.
బయటనుంచి సమాధానం లేదు.
ఆమెకి ఆకస్మాత్తుగా ఒక విషయం అర్థమయింది. తను ఆ చెక్కపెట్టెలో బంధింపబడుతోంది.
బయటెవరో మేకులు కొడుతున్నారు. సమాధిలో పూడ్చి పెట్టటం కోసం, శవాన్ని పెట్టెలో పెట్టినట్టు తనని అందులో బయట మేకులు దిగ్గొడుతున్నారు.
ఆ ఆలోచన రాగానే ఆమె నిలువెల్లా వణికిపోయింది. "నో......నో....." అని గట్టిగా అరవసాగింది.
నాలుగుసార్లు అలా అరిచేసరికి ఆమె గొంతు కీచుపోయింది. శబ్దం బయటికి రాలేదు. ఆమెకు మరో విషయం కూడా అర్థమైంది. తను ఎంత అరిచి గీ పెట్టినా బయటికి చిన్న శబ్దం కూడా వినిపించదు. ఆ లోచన రాగానే ఆమె అరవటం మానేసింది. గాలి ఆడకపోవడం కాదు. చీకటి.....! చీకటి ఆమెను భయపెడుతోంది. చుట్టూ ఒక అడుగు దూరంలో ఎటు చూసినా గోడలలాంటి చెక్కలు, ఆ చెక్కలమద్య గాడంధకారంలో పడుకొని వుండవలసి రావటం....... అది.....! అదే ఆమెను భయపెడుతోంది. చిన్న వెలుగురేఖ కోసం ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఊపిరి ఆడకపోవటం అన్నది శ్వాసకోసం కాదు, వెలుగుకోసం. ఆ పరిస్థితి అనుభవిస్తే గానీ తెలీదు. భయంకరమైన స్థితి అది.
ఇంతలో చెక్కపెట్టెని గాలిలోకి ఎత్తుతున్నట్లు అది కదిలింది.
ఎక్కడికి తీసుకువెళుతున్నారు తనని? ఇలాగే సజీవంగా భూమిలో పాతి పెట్టేస్తారా?
అవును. అలా కాకపోతే ఎందుకు తననీ విధంగా బంధిస్తారు? పెట్టెను నెమ్మదిగా క్రిందకు దింపుతున్నారు.
సిరిచందన ఊపిరి బిగబట్టింది. తనని గోతిలోకి దింపుతున్నారా, పైన మట్టి పోస్తారా?
ఎంతకాలం బ్రతుకుతుంది తను. అరగంటా? పావుగంటా? ఐదు నిమిషాలా? ఆడక మరణించదు. కాస్ట్రోఫోబియా (చీకటిని చూసి భయపడే వ్యాధి) వచ్చి మరణిస్తుంది. అప్పటికే ఆ సింప్టమ్స్ తనకి తెలుస్తున్నాయి.
తనుక్లోరో ఫామ్ మత్తునుంచి బయటకు వచ్చినట్టు, మెలకువగా వున్నట్టు బయటివాళ్ళకి తెలియాలని చెప్పి ఆమె పిడికిళ్లు బిగించి పైకప్పు చెక్కకేసి బలంగా కొట్టసాగింది.
ఐతే బయటినుంచి ఆమె చర్యకి ఏ ప్రతిస్పందన కనపడలేదు. తనున్న పెట్టెని మరో నాలుగడుగులు దూరంగా జరిపినట్టు ఆమె గ్రహించింది. ఆ తరువాత ఆ పెట్టె పడవలాగా కొద్దిగా ఇటూ అటూ వూగింది ఆమె దొర్లిపోకుండా వుండటానికి చెరో వైపు చెక్కని చేతుల్తో అదిమి తన శరీరం కదలకుండా వుండటానికి ప్రయత్నించవలసి వచ్చింది.
పెట్టె ఇటూ అటూ వూగుతూనే వుంది. తరువాత నెమ్మదిగా అది ఆగిపోయింది. ఆగబోయే ముందుకూడా ఒక చిన్న కెరటం వచ్చి తగిలిన పడవలాగా అది కదిలి ఆ తరువాత నిశ్చలత్వాన్ని సంతరించుకుంది.
అప్పుడు అర్థమైందామెకు ఆ విషయం.
తనని నీ.....టి.... గుం.....ట.....లో......పడేసారు.
అవును. నిశ్చయంగా నీటిగుంటలోనే! ఆమెకు బిగ్గరగా ఏడవాలనిపించింది. ఏడవటానికి కూడా ఓపిక లేనట్టు అలా వుండిపోయింది. ఒక బ్రతికున్న మనిషిని చెక్క పెట్టెలో బంధించి నీటి గుంటలో పడేయటం...... అసలు మానవత్వం వున్న ఏ మనిషి కల్లోకూడా ఊహించలేని విషయం.
తనచుట్టూ నీరు వుందనీ, అది ఏ క్షణమైనా చెక్క సందుల గుండా లోపలికి రావచ్చనీ.......తనులోపలే చచ్చిపోతుందనీ, ఆ తరువాత తన శవం క్రుళ్లి, కృశించి నాశనం అయిపోతుందని ఆమెకి అర్థమయ్యేసరికి ఆమెకి ఫిట్స్ వచ్చినట్టు అనిపించింది. అసలా ఆలోచనలతోనే గుండె ఆగిపోతుందేమో అన్న భయం కలిగింది. ఒక దిండుతోమొహాన్ని గట్టిగా నొక్కిపెడితే ఉక్కిరిబిక్కిరి ఆడనట్టు కలిగే భయం. కాళ్ళూ చేతులూ కొట్టుకోవాలన్నంతగా ఈ చీకటి పిచ్చేక్కించేస్తోంది!
వెలుగు చూడాలన్న కాంక్ష ఆమెలో క్షణక్షణానికీ అధిక మవసాగింది! లోపల ఏదైనా మేకు దొరికితే దాంతో ఆ చెక్కకు రంధ్రం పెట్టి, లోపలపడే వెలుగురేఖని చూడాలన్న కాంక్ష అది! లోపలికి నీళ్ళు వచ్చి తను ఉక్కిరిబిక్కిరై మరణించినా సరే, ముందు వెలుగును చూడాలి! తనుచీకటి భరించలేదు.
ఆమె చుట్టూ తడిమి చూసింది. తలకు పైగా అర అడుగు ఎత్తులో వున్న ఇనుపఛట్రం లాంటిది తగిలింది. చెక్క పెట్టెలో అలాంటి ఇనుఛట్రం లాంటిది ఏముందా అని ఆమె దాన్ని పూర్తిగా చేతుల్తో పరీక్షించి బకెట్ తగిలింది.
తలకి కొద్దిగా ప్రక్కగా ఒక పేపర్ ప్యాకెట్ లాంటిది తోచింది. లోపల ఏముందో ఆమెకి అర్థం కాలేదు. దాన్నివిప్పి చూసింది. లోపల ఒక గట్టి పదార్ధం లాంటిది వుంది. అదేమిటో ఆమెకు అర్థం కాలేదు. కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చూస్తే ఏమైనా కనబడుతుందన్నఉద్దేశ్యంతో ఆమె దాన్ని మొహానికి దగ్గరగా తెచ్చుకుంది అప్పుడర్థమైంది అదేమిటో.
క్యాడ్ బరిస్ చాక్ లెట్....
4
కమీషనర్ అశ్వత్ధామ, రవితేజ తండ్రి సత్యానారాయణ, విష్ణువర్థనరావు ఆ గదిలో కూర్చొని వున్నారు. ముగ్గురి చూపూ టెలిఫోన్ మీదే వుంది. ఏ క్షణమైనా అది మ్రోగవచ్చు. దాని కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరోచోట తన ఆఫీసులో రవితేజ అదే ఫోనుకోసం ఎదురుచూస్తున్నాడు.
ఖాన్ ఎక్కడికి ఫోన్ చేస్తాడో తెలియదు. అందువల్ల ఎవరూ రిస్కు తీసుకోవటానికి సిద్ధంగా లేరు. చెరో ఫోన్ దగ్గిరా వున్నారు.
అరగంట తర్వాత కమీషనర్ ఆఫీసులో ఫోన్ మోగింది.
అశ్వత్ధామ చప్పున ఫోన్ తీసుకొని "హల్లో" అన్నాడు.
అట్నుంచి ఏ సమాధానమూ లేదు. అశ్వత్ధామ గట్టిగా "హలో.... హలో..." అన్నాడు. అట్నుంచి గురగుర శబ్దం వినిపించింది. ఆ తరువాత కంఠం వినిపించింది అవతలి వ్యక్తి మాట్లాడటంలేదని, అది కేవలం టేప్ లో రికార్డ్ చేసిన కంఠం అని కమీషనర్ కి అర్థమైంది.
అంటే.....
తనేం మాట్లాడినా లాభంలేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటల్నే తను వినగలడు. అంతలో అవతలినుంచి కిడ్నాపర్ కంఠం వినపడసాగింది.
"జాగ్రత్తగా వినండి. సిరిచందన సురక్షితంగా వుంది. ఐతే ఆమె ఒక శవపేటికలో భద్రపరచబడింది. చుట్టూ ఫైబర్ గ్లాస్ వున్న ఆ శవపేటిక ఒక నీటిగుంటలో అడుగున పారవేయబడి వుంది. నీటి వత్తిడికి ఆ పేటిక పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. లోపలికి నీటిచుక్క కూడా పోదు. ఐతే ఒక చిన్న ప్రమాదం ఏమిటంటే లోపల చీకటికి ఆమె అలవాటు పడాలి. ఆ నిశ్శబ్దానికి ఆమె పిచ్చెక్కిపోకుండా వుండగలగాలి. అలా మరణించకుండా వుండాలంటే వీలైనంత తొందరలో నాకా బిస్కెట్లు అందించవలసి వుంటుంది. ఎలా, ఎప్పుడు అనేది నేను మళ్ళీ చెప్తాను" టేప్ రికార్డర్ ఆగిపోయిన శబ్దం.
ఆ ఫోన్ ఎక్కడినుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం ఏం చేయలేదు అశ్వత్ధామ. దానివల్ల ఏ లాభమూ ఉండదని తెలుసు. ఒకవేళ పోలీసులు అక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరూ వుండరు. మహా దొరికితే ఒక చిన్న టేప్ రికార్డర్ దొరుకుతుంది. ఆయన కిడ్నాపర్ గురించి ఆలోచించటం లేదు. సిరిచందన స్థితి గురించి ఆలోచిస్తుంటే రోమాలు నిక్కబోడుచుకున్నాయి. వళ్ళు గగుర్పొడిచింది.
అంత అనుభవం వున్న పోలీసాఫీసరూ వణికి పోయాడు.
అశ్వత్ధామ ఏం జరిగిందో చెప్పాడు.
ఒక శవపేటికలో భూమి అడుగున బురగుంటలో తన కూతురు నిస్పహాయంగా పడివుందిని..... ఏ క్షణమైనా ఆమె ప్రాణాలు పోవచ్చని కమీషనర్ చెప్తున్నది వినగానే విష్ణువర్థన రావు స్పృహ తప్పాడు.
5
చుట్టూ గాఢమైన నిశ్శబ్దం, చీకటి.
సిరిచందన అరవటం ఎప్పుడో మానేసింది. చుట్టూ ప్రపంచమంతా నిశ్శబ్దంలో నిద్రపోతున్నట్టు వుంది.
ఇదంతా కల కాదని, నిజమనీ- తను మరణానికి చివరి అంచున ఉన్నానని అర్థం చేసుకోవటానికి ఎంతసేపు పట్టింది.