ఐదో అధ్యాయం
రవితేజకి కళ్లు వచ్చాయని తెలిసి అందరికన్నా ఎక్కువ సంతోషించింది విష్ణువర్ధనరావు.
తన కూతురు సరదాకి చేసిన అల్లరివల్ల రవితేజ అంధుడయ్యాడని తెలిసినప్పటినుంచి ఆయన చాలా కలత చెందాడు. ఆ కారణంగానే కూతురు అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు, అంతగా ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పలేదు.
అరకునుంచి అతడికి ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరి వస్తున్నామని రవితేజ ఫోనులో చెప్పాడు. సిరిచందన కిడ్నాప్ విషయం తెలుపలేదు.
ఆ ఫోన్ వచ్చిన చాలా సేపటివరకు దంపతులు రాకపోయే సరికి ఆయన కంగారుపడి అరకు ఫోన్ చేశాడు. అక్కడ చలమయ్య ఫోన్ లో సిరిచందన మహర్షితో కలిసి బయలుదేరిందని చెప్పటంతో ఆయన కన్ ప్యూజ్ అయ్యారు.
"మరి రవితేజ?" అని అడిగారు.
"ఆ బాబు పొద్దునే బయలుదేరి వెళ్ళిపోయారండీ" అన్నాడు చలమయ్య. విష్ణువర్థనరావు అయోమయం మరింత హెచ్చింది. అల్లుడికి చూపు వచ్చిన శుభ సందర్భంలో భార్యభర్తలిద్దరూ కలిసి రాకుండా ఇలా విడివిడిగా ఎందుకొస్తున్నారో అర్థంకాలేదు.
ఆయన రవితేజ తండ్రి సత్యనారాయణకి ఫోన్ చేశారు.
"అవును, రవి ఇప్పుడే వచ్చాడు. అర్జెంటుగా డ్యూటీకి రిపోర్టు చేయవలసి తను ముందు వచ్చేశానని, సిరిని తరువాత సామానంత తీసుకొని డ్రైవర్ తో కలిసి రమ్మన్నా"నని చెప్పాడు.
విష్ణువర్థనరావు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
ఇది జరిగిన గంటకి సిరిచందన ఇంటికి చేరుకుంది.
"ఏవమ్మా డ్రైవర్ ఏడి?" అని అడిగారు. సిరిచందన మాట్లాడాలేదు. వడివడిగా తన రూంకి వెళ్ళింది! అయిదు నిమిషాల్లో ఆమె తిరిగి బయటికెళ్ళటం గమనించి "ఎక్కడి కెళుతున్నావమ్మా? రవి ఆఫీసులో ఉన్నాడంట" అన్నారు.
"నేనిప్పుడే వస్తాను నాన్నా" అని ఆమె తిరిగి కారు తీసుకొని బయలుదేరింది.
"మహర్షి ఏడి?" వెనకనుంచి అడిగారాయన.
"పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు"
"ఎందుకు?" ఆశ్చర్యం ధ్వనించింది ఆయన కంఠంలో.
"ఈ ప్రపంచంలో కేవలం అన్యాయమే నాలుగు పాదాల నడుస్తూంది అని నిరూపించటంకోసం" అనిఆమె అక్కడినుంచి వెళ్ళిపోయింది. విష్ణువర్థనరావు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
* * *
సిరిచందన వెళ్ళేసరికి రవితేజ తన ఆఫీసులో ఏదో ఫైల్ చూసుకుంటూ వున్నాడు.
విసురుగా డోర్ తెరుచుకొని వస్తూన్న భార్యని చూడగానే అతడు లేచి నిలబడ్డాడు. ఆత్మాభిమానం మెండుగా ఉన్న ఆమె తనంతట తను తిరిగి వస్తుందని, అదీ ఆఫీసుకి వస్తుందని వూహించని అతను ఆనందంగా "రా సిరీ" అన్నాడు.
ఆమె అతని మొహంలోకి సూటిగా చూస్తూ "మహర్షి మీకేం ద్రోహం చేశాడు?" అని అడిగింది కఠినంగా.
రవితేజ తెల్లబోయి "అతను నాకు ద్రోహం చేయటమేమిటి?" అన్నాడు.
"నిజంగా మీకేమీ తెలియదా?"
"నిజంగా నాకేమీ తెలియదు. మహర్షి ఎక్కడ?"
"మహర్షిని మీరే అరెస్టు చేయించారు. ఎందుకబద్ధం చెపుతున్నారు?"
"నాకేమీ తెలియదు. మహర్షిని నేనెందుకు అరెస్టు చేయిస్తాను?"
"మీ ప్రియురాలిని చంపాడు కాబట్టి"
రవితేజ మొహం తెల్లగా పాలిపోయింది. "అయితే..... అతనంతా చెప్పాడన్నమాట" అన్నాడు.
"లేదు, అతను చెప్పలేదు. ఆఖరి నిమిషం వరకూ మిమ్మల్నీ మీ పరువునీ కాపాడటానికే ప్రయత్నం చేశాడు. కానీ నాకు మరొకరి ద్వారా మొత్తం విషయమంతా తెలిసింది. మీరు చెల్లెల్లా చూసుకుంటున్న మీ ప్రియురాలి శ్రీవాణి భర్తకదూ మహర్షి?"
రవితేజ కోపంగా "ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. శ్రీవాణి నా చెల్లెలని చెప్పాను. అంతే. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆమె......" అన్నాడు.
"డోంటాక్ రబ్బిష్ మిస్టర్ రవితేజా!" అని అరిచింది సిరిచందన. "ఒక స్త్రీతో శారీరకంగా కలిసిన తర్వాత కూడా ఆమెని చెల్లెలు అనేటంత నీచుడు నా భర్త అని నేను కల్లో కూడా ఊహించలేకపోతున్నాను."
"నువ్వు నమ్మకపోతే అది నీ ఖర్మ" అన్నాడు రవితేజ.
"నేను కాదు నమ్మాల్సింది. మొత్తం ప్రపంచమంతా నమ్ముతుంది శ్రీవాణి డైరీ కోర్టులో ప్రవేశపెడితే" అంది.
రవితేజ ఉలిక్కిపడ్డాడు. "శ్రీవాణి డైరీ ఏమిటి?" అన్నాడు.
"ఒకమ్మాయిని నువ్వెలా ట్రాప్ చేశావో, ఆమెని పెళ్ళిచేసుకుంటానని ఎలా మోసం చేశావో, ఆ తరువాత మరోవ్యక్తి ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాక కూడా ఆమెని తిరిగి ఎలా లోబరుచుకున్నావో అంతా విపులంగా వ్రాసిన డైరీ."
"ఆ డైరీ నువ్వు చదివావా?"
"చదవలేదు. వర్మ అని మహర్షి స్నేహితుడు మొత్తం పూస గుచ్చినట్లుగా చెప్పాడు."
రవితేజ తేలిగ్గా శ్వాస విడిచారు. "చుశావా? నేననుకుంటూనే వున్నాను. ఈ మహర్షీ, వర్మా వీళ్ళంతా ఒక గ్యాంగ్. నీ మనసు విరిచేయటానికి రకరకాల కథలల్లి చెబుతున్నారన్నమాట."
సిరిచందన విషాదంగా నవ్వింది. "నేను డైరీ చదవలేదనగానే నువ్వు మళ్ళీ కథ ఇలా మొదలుపెదతావని తెలుసు. అందుకే అబద్ధం చెప్పాను. నేను డైరీ చదివాను" అంది.
రవితేజ మొహం కోపంతో ఎర్రగా మారింది. "అంటే నన్ను పరీక్ష చేయాలనుకుంటున్నావా?" అన్నాడు.
"లేదు. మనుషులు ఎంత సులభంగా మాటని ఇటూ అటూ మార్చగలరో నాకు నేను నిర్ధారించుకుంటున్నాను" అంది.
"అయితే ఇప్పుడేం చెయ్యమంటావ్?"
"మహర్షి జైలునుంచి రప్పించగలిగే ఏకైక వ్యక్తివి నువ్వు. అతడు జైలునుంచి తప్పించుకున్నందుకు కేసు మళ్ళీ కోర్టు కెళుతుంది. దానిలో అంతకుముందు కేసుకూడా తిరిగి ఓపెన్ చేయిద్దాం. నువ్వొచ్చి సాక్ష్యం చెప్పు చాలు."
"ఏమని?"
"ఆ రోజు నువ్వక్కడే ఉన్నావని, అది హత్య కాదని, యాక్సిడెంటల్ గా ఆమె పడిపోయినందుకు నువ్వు ప్రత్యక్ష సాక్షివని ఒప్పుకో. అతడికి ఉరిశిక్ష తప్పుతుంది."
"కానీ, అతను నిన్ను చూడటంకోసం జైలునుంచి బయటికొస్తూ ఒక సెంట్రీని కూడా చంపాడు. ఆ విషయం తెలుసా?" వెటకారంగా అన్నాడు.
"అతడు చంపలేదు. మరెవరో ఖైదీలు ఆ సెంట్రీని చంపి పారిపోతూ మహర్షి సెల్ తాళాలు అతడి మీదకి విసిరేశారు. అనుమానమంతా మొత్తం అతడి మీదకే రావాలని వాళ్ళాపని చేశారు. తరువాత వాళ్లు పట్టుబడి పోలీస్ స్టేషన్ లో కన్ ఫెషన్ స్టేట్ మెంట్ ఇచ్చారట. ఆ విషయం కూడా కనుక్కున్నాను."
"ఓహూ! నీ ప్రియుడి మీద ఏయే నేరాలు ఉన్నాయో, అవన్నీ ఎలా తప్పించవచ్చో అంతా కనుక్కునే వచ్చావన్నమాట" అన్నాడు వెటకారంగా.
"నువ్వనుకుంటున్న సంబంధం మా ఇద్దరిమధ్యా ఏమీ లేదు రవితేజా."
"ఓహూ, అందుకేనా అతడంత ప్రేమమయమైన ఉత్తరం వ్రాశాడు?"
సిరిచందన నుదురు చిట్లించి "ఆ విషయం నీకెలా తెలుసు?" అని అడిగింది.
"నీ చీరల అడుగున దొరికిన ఉత్తరమే చెప్పింది."
"ఓహూ, అదికూడా చదివావన్నమాట. అయితే నీకు తెలీని మరో విషయం కూడా చెప్తాను విను. మహర్షితన ప్రేమనెప్పుడూ బయట పెట్టలేదు. అతడు జైలు నుంచి బయటికొచ్చింది కేవలం నన్ను ఆఖరిసారి చూద్దామనే. నా భర్త అంధుడని తెలిసి, అతడు ప్రాణాలకు తెగించి మందు తీసుకొచ్చాడు. చివరి నిమిషం వరకూ నాకు నీ మీద గౌరవం పోకుండా ఉండటం కోసం అన్ని విషయాలు దాచిపెట్టాడు. నేరం తనమీద వేసుకున్నాడు" అంది.
"నేను కళ్లు తిరిగి రానట్టు నటించింది కూడా నీ మీద ప్రేమతోటే. జైలునుంచి బయటపడ్డ మహర్షి నిన్ను పొందటం కోసం మన గెస్ట్ హౌస్ లో కేర్ టేకర్ గా చేరాడని తెలుసు. నిన్ను మరింత ఆకర్షించటం కోసం నాగకోన వెళ్ళి మందు తెచ్చాడని కూడా తెలుసు. మీ ఇద్దరూ కౌగిలిలో వుండగా నేను చూశాను. అతడు ఉరి వేసుకుంటున్నట్టు నాటకమాడి నీకు దగ్గరయ్యాడు. అప్పుడే నాకు కళ్ళొచ్చాయి. మీ ఇద్దరిమధ్యా ఎఫైర్ ఇంకా ఎంత ముందుకు సాగుతుందో తెలుసుకుందామనే నేను అంధుడిలాగా కొనసాగించాను" అని రవితేజ ఆమె దగ్గరగా వచ్చాడు. అతడి స్వరంలో అకస్మాత్తుగా మార్చొచ్చింది. "ఇదంతా నీమీద ప్రేమవల్లే....! ఎక్కడ ప్రేముంటుందో అక్కడ ఈర్య్ష ఉంటుంది కదా! నువ్వా మహర్షికి ఏం దగ్గిరై పోతావో అని భయపడ్డాను. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించలేవా?"
"ఒక్క షరతుమీద క్షమిస్తాను" అన్నదామె స్థిరంగా.
"ఏమిటది?"
"కోర్టులో మీరు జరిగిందంతా ఒప్పుకోండి."
"కానీ నా పరువూ, ప్రతిష్టా.....?"
"చూడండి రవితేజా! పెళ్ళికాకముందే మీరు ఒక అమ్మాయిని అనుభవించారు. ప్రేమకలాపాలు కొనసాగించారు. ఆ విషయం ఇప్పుడు నాకు తెలుసు. అయినా నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ, మీరు.... మీరలా కాదు. నన్ను మహర్షి ప్రేమించాడన్నా విషయం నాకు మొన్న మొన్నటివరకూ తెలియదు. అయినా కూడా మీరు నాకు అతను వ్రాసిన ఉత్తరం చదివి ఏవేవో అనుమానాలు పెంచుకున్నారు...... సరే..... దానికి కూడా మిమ్మల్ని క్షమిస్తాను. కానీ, ఇప్పుడు లోకం దృష్టిలో మీ పరువూ, ప్రతిష్టా పోతుందని చెప్పి ఒక నిరపరాధిని ఉరికంబం ఎక్కేలా చేయకండి. కావాలంటే కోర్టులో ప్రోసిడింగ్స్ అన్నీ 'ఇన్కెమేరా' లో జరిగేలా చూద్దాం. అప్పుడు పత్రికలకి గాని, మిగతా వారికిగాని తెలిసే అవకాశమే ఉండదు. మీ పరువూ, ప్రతిష్టా ఎక్కడికీ పోదు. నిజం ఒప్పుకోండి రవితేజా! నేను మిమ్మల్ని జరిగిందంతా మర్చిపోయి ఒక భర్తగా గౌరివించగలను."
"కానీ, అతడు తన భార్యని ఆవేశంతో కిందకు తోయటం నేను కళ్ళారా చూసాను."
సిరిచందన మోహంలో ఒక జీవంలేని నవ్వు వెలిసింది. "మీకు గుర్తుందా రవితేజా? మన పెళ్ళికాకముందు మీకు నేను ఫోన్ చేసాను. ఏదో హొటల్లో మీకు కాబోయే భార్య తన బాయ్ ఫ్రెండ్ తో కలిసుందని చెప్పాను. అప్పుడు మీరు అక్కడికి వచ్చారు. మామూలుగా లోపలి ప్రవేశించకుండా బాల్కానీవైపు నుంచి లోపలికి ప్రవేశించి మా ఇద్దర్నీ రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలనుకున్నారు" ఆమె కంఠంలో రవ్వంత విషాదం తొంగి చూసింది. "......అప్పటికి మనిద్దరికీ వివాహంకూడా కాలేదు. పెళ్లి కాకుండానే మీకు నా మీద అంత అనుమానం ఉన్నప్పుడు తన భార్యని పరాయి వ్యక్తి కౌగిలిలో చూసిన మహర్షి పరిస్థితి ఎలా ఉండాలి?"