Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 4


    కోటి వెళ్ళిపోయాడు.

    అరగంట తరువాత__

    సూట్ వాలా ఒంటరిగా కారులో పట్నంవైపుకు బయలుదేరాడు.

    తిరిగివచ్చిన రమాదేవిని చూసి

    "నువ్వు ఔట్ హౌస్ కు వెళ్ళమ్మా... మీ అమ్మ ఒక్కతేవుంది__"

    "అమ్మకూడా కనిపించడం లేదు తాతా" బిక్కముఖం పెట్టింది.

    "వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి వెతుకు ఎక్కడో వుండే వుంటుంది" నమ్మకంగా చెప్పి పంపాడు రమాదేవి ఆత్రుతగా మరలా అవుట్ హౌస్ కు బయలుదేరింది.

    ఆమె వెళ్ళిన తరువాత సమాధుల ప్రక్కనుంచి నడచివెళ్ళి బండరాతిని జరిపి రక్తంతో తడిసిన షర్టును కూడా లోపలకు విసిరివేసి యధాప్రకారంగా రాతిబండతో ఆ బిలాన్ని మూసివేశాడు కోటి__

    ఔట్ హౌస్ కు చేరుకున్న రమాదేవి అన్ని ప్రదేశాలు వెదికి తల్లి ఎక్కడా కనిపించకపోవడంతో బావురుమంది. అప్పటికి కోటి అవుట్ హౌస్ కు చేరుకున్నాడు.


                       *    *    *    *


    సాయం సంధ్య __లకడీకా ఫూల్ __ పబ్లిక్ గార్డెన్స్ లో__   

    "ఆంటీ!"

    టింకూ పిలుపుకు కృష్ణప్రియ ఉలిక్కిపడి తల ఎత్తింది.

    "స్విమ్మింగ్ కు వెళతాను ఆంటీ__"

    "వద్దమ్మా__ నీకు ఇప్పుడు టెంపరేచర్ వుంది. తగ్గిన తరువాత ప్రాక్టీస్ చేద్దువుగానీ" అనునయంగా చెప్పింది.

    "నువ్వు ఎప్పుడూ ఇంతే! నాకు ఇంటరెస్టుగా వున్నప్పుడే వద్దంటావు__"

    టింకూ బుంగమూతి పెట్టి అన్నాడు.

    "ఒరే మొద్దూ__నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు. ఇంతవరకు ఎప్పుడన్నా  వద్దన్నానా? అసలు స్విమ్మింగ్ క్లబ్ లో నిన్ను ఎవరు చేర్పించారు__ నేను కాదా?"

    "సారీ ఆంటీ! యూ ఆర్ వెరీ వెరీ స్వీట్__" అంటూ టింకూ ఆమె ఒడిలోచేరి మెడచుట్టూ చేతులు వేశాడు.

    "ఆంటీ_అటు చూడు__" అంటూ  చేయి చూపించాడు.

    అక్కడవున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నతను తమవైపే చూడడం గమనించింది కృష్ణప్రియ.

    అతని చూపులలోని  తీక్షణతను తట్టుకోలేనట్టు క్షణం అతని చూపుల నుంచి తల ప్రక్కకు తిప్పుకుంది.

    నిప్పులు కురుస్తున్నట్టువున్న అతని చూపులకు తోడు అతని భుజాన వెళ్ళాడుతున్న  రైఫిల్ చూశాక కృష్ణప్రియకు మరింత భయం కలిగింది.

    "రారా టింకూ__ఇక్కడ వద్దు వెళాదాంపద__" లేచి టింకూను నడిపించుకుంటూ  కారు దగ్గరకు వెళ్ళింది.

    అతని భ్రుకుటి ముడిపడింది.

    "ఆగండి__!" అతను కేక పెట్టాడు.

    కృష్ణప్రియ ఠక్కున ఆగిపోయింది.

    పిలిచింది ఎందుకోనన్న  సంశయం-భయం ఆమె చూపులలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి__

    అతను వడివడిగా వాళ్ళ కారు దగ్గరకు వచ్చాడు.

    "మీరు పుస్తకం మరచిపోయారు__"

    అప్పటివరకు చదివి_టింకూ పిలవడంతో కింద పెట్టిన నవలను తను తీసుకురావడం మరచింది కృష్ణప్రియ.

    వెంటనే అందుకుని "థాంక్స్__" అన్నది.

    అతను తిరిగి చకచక నడుచుకుంటూ  బెంచ్ దగ్గరకు వెళ్ళాడు.

    "అతను ఎవరు ఆంటీ__! అతన్ని చూసి నువ్వు ఎందుకు భయపడ్డావు__?" టింకూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగాడు.

    "చెప్పినా నీకు అర్ధం కాదురా."

    కారు సరాసరి నర్సింగ్ హోమ్ లోకి పోనిస్తూ అన్నది.

    విషయం అర్ధంకాని టింకూ బుగ్గన చేయి పెట్టుకున్నాడు__సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు!

 Previous Page Next Page