బంగళావైపు వెళుతున్న అతనిని చూస్తూ కోటి నిట్టూర్చాడు.
వెంటనే ఆ సమాధులకు వందగజాల దూరమూ వున్న ఒక బండరాయిని పైకి లేపాడు. అక్కడ సొరంగం వుంది. రంగారావు శవాన్ని ఈడ్చుకువచ్చి లోపలకు తోసి తిరిగి ఆ బండరాయిని సరిచేశాడు కోటి.
అక్కడి సమాధుల మీదవున్న పేర్లను చూస్తున్న కోటిలో దుఃఖం కట్టలు తెంచుకుంది. అతనికి తెలియకుండానే చాలాసేపు ఒక సమాధిపై తల పెట్టుకుని రోదిస్తూనే నిద్రలోకి జారిపోయాడు.
తెల్లవారుఝామున మూడుగంటల ప్రాంతంలో ఎవరో తట్టిలేపడంతో ఉలిక్కిపడి మేలుకొన్నాడు కోటి...
ఎదురుగా రంగారావు కూతురు...రమాదేవి పదహారు సంవత్సరాలు వుంటాయి. లంగాఓణి వేసింది.
"లోపలకువచ్చి పడుకో తాతా...ఇలా మంచులో పడుకుంటే జలుబు చేస్తుంది..."
కోటి కళ్ళలో నీళ్ళు గిర్రున తరిగాయి...
"తాతా!...రాత్రి మా నాన్న ఇటువైపు ఏమన్నా వచ్చాడా?"
"ఊహూ..." తల అడ్డంగా వూపుతూ లేచి బంగ్లాలోకి వెళ్ళిపోయాడు కోటి.
రమాదేవి అవుట్ హౌస్ వైపు చకచకా నడచుకుంటూ వెళ్ళిపోయింది.
* * * *
తెల్లవారింది...
బంగ్లాలో మకాంవేసివున్న సూట్ వాలా ముందు చేతులు కట్టుకుని నిలుచుని వున్నాడు కోటి.
"మీ అశోక్ బాబు ఏమంటున్నాడు?"
"ఏం చెప్పమంటారు...ఎప్పుడు వెళతాడో తెలియదు. పిచ్చిపట్టినట్లు అలా తిరిగి తిరిగి ఎప్పటికో బంగళాకు చేరుకుంటాడు. ఒక్కొక్కసారి రెండు రోజులకు కూడా రాడు... ఏం తింటాడో ఆయనకే తెలియాలి..." అంటూ నిట్టూర్చాడు కోటి.
"ప్చ్... తల్లీ తండ్రీ పోయాక ఉన్న ఆస్తులన్నీ అప్పులవాళ్ళు సొంతం చేసుకోగా ఈ భూత్ బంగళా మాత్రం మిగిలింది అన్నమాట..." అన్నాడు సూట్ వాలా.
"ఈ బంగళా... దీనిచుట్టూ వున్న పళ్ళతోటలు... అంతే బాబూ...ఒకప్పుడు నిత్యకళ్యాణంలా వెలిగిపోయే ఈ ఇంద్రభవనం నేడు శిధిలమయిన స్మశానంలా మారిపోయింది..."
"అది సరేలే... మన పని ఎంతవరకు వచ్చింది?"
ఆ మాట అడిగేసరికి కోటిలో సన్నటి వణుకు బయలుదేరింది.
"ఏం మాట్లాడవు?"
"అవుతుంది బాబూ... పని జరుగుతూనే వుంది"
అప్పుడే ఆ ఔట్ హౌస్ లో వుండే డ్రయివర్ రంగారావు కూతురు అటుగావచ్చి...కొత్తవ్యక్తిని చూసి ఆగిపోయింది.
ఆ పిల్లను చూసిన సూట్ వాలా... కోటివైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"రంగా కూతురయ్యా... పేరు రమాదేవి రాత్రి వాళ్ళ అయ్య దీనితో చెప్పా పెట్టకుండా పట్నం వెళ్ళినట్టున్నాడు" సర్దిచెప్పాడు కోటి. సూట్ వాలా చూపు ఆమె పదహారేళ్ళ పరువం మీద పడింది. ఆమె బెదరిన లేడిలా పరుగు పరుగున వెనుదిరిగింది.
"కోటీ రాత్రి నాతో వచ్చిన డ్రయివర్ ను కారు రడీ చేయమని చెప్పు... వచ్చినపని అయిందిగా...పట్నం వెళ్ళిపోతాను..."
"అలాగేబాబూ..." అంటూ వెళ్ళినంత వేగంగా వెనుదిరిగివచ్చాడు కోటి.
"బాబూ... మీతో వచ్చిన డ్రయివరు కనిపించలేదు కానీ కారులోమాత్రం రక్తంతో తడిసిన అతని షర్టు నిపించింది....." వణికిపోతూ చెప్పాడు.
ఒక నిమిషం నిశ్శబ్దం...
"ఆల్ రైట్! వాడు ఏమయ్యాడో నీకూ తెలుసు...నాకూ తెలుసు...ఎందుకయినా మంచిది...కారు నంబర్ ప్లేట్ తీసేసి F/R బోర్డు తగిలించు... ఎటూ టౌన్ కు వెళుతున్నాను కాబట్టి దాని రూపురేఖలు మారిపోయేలా ఏదో ఒక రంగు పెయింట్ చేయిస్తాను..."