మధుర టీచర్ భుజం తట్టేసరికి గతుక్కుమని కాగితం కంగారుగా మడతపెట్టి హాండ్ బాగ్ లో వుంచేసింది. "నిన్న సెలవుపెట్టా వెందుకు?"
"అమ్మకి జ్వరం వచ్చింది హాస్పిటల్ కి తీసికెళ్లాను!"
అడిగిందేగాని జవాబు వినలేదు స్వప్న.
"ఏమిటే, ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు?" మధుర ఆశ్చర్యంగా అడిగింది.
"సాయంత్రం నాతో దేవీబాగ్ వస్తావా?"
"ఎందుకు?"
"తరువాత చెబుతాను. ముందు చెప్పు, వస్తావా? రావా?"
"అమ్మ ఇంకా లేచి తిరగడంలేదు. పని వుంటుంది."
"ఈ ఒక్కరోజుకు ఎలాగో తీరిక చేసుకు రాలేవూ?"
ఊరవతలవున్న దేవీబాగ్ ఆ ఊరి రాజాగారిది. దేశం నలుమూలలనుండి తెప్పించి నాటిక రకరకాల మొక్కలతో అందంగా పెంచబడిన తోట అది. చాలామంది షికారుగా వెడతారుట. ఇంట్లో బోరెత్తినప్పుడు తనూ, స్వప్న దేవీబాగ్ కు వెళ్లడం అలవాటే అయినా ఈరోజు స్వప్న ఆహ్వానంలో ఒక ప్రత్యేకత కనిపించసాగింది మధురకు. స్వప్న కళ్ళలోకి చూస్తూ అడిగింది, "అక్కడ ఎవరిని కలుసుకోవాలి?"
సాయంత్రం అయిదున్నరకి దేవీబాగ్ లో అడుగుపెడుతున్న స్వప్నకి గుండె దడగడ కొట్టుకుంది. కాళ్లలో వణుకు పుట్టడం, అరచేతుల్లో చెమట పట్టడంలాంటి అవస్థలన్నీ అనుభవంలోకి రాసాగాయి. ఒక పక్కగా ఆపిన స్కూటర్ కంటబడ్డాక ఆమెలో వణుకు మరింత అధికమైంది. తనని తాను స్వాధీనంలోకి తెచ్చుకుంటూ స్వరూప్ కోసం ముందుకు నడవసాగింది.
"అదుగో , నీ కథానాయకుడు! వెళ్లు. నేనిక్కడ కూర్చొని పుస్తకం చదువుకొంటాను" మధుర ఆగిపోయింది.
పచ్చికలో ఒరిగి ట్రాన్సిస్టరులో సంగీతం వింటున్నాడు స్వరూప్.
తడబడేఅడుగులతో సమీపించింది స్వప్న. గొంతులో తీవ్రత తెచ్చుకొని అంది : "ఈ ఊరు ఆడపిల్లల కోసం వచ్చారా! జాబ్ కోసం వచ్చారా?"
స్వరూప్ లేచి సర్దుకుని కూర్చున్నాడు. "వచ్చింది జాబ్ కోసమే. కాని ఆడపిల్ల దొరికింది." చిరునవ్వుతో అన్నాడు. "కూర్చో స్వప్నా!"
"ఈ తోట మీదే అయినట్టుగా మర్యాద చేస్తున్నారే!" దబాయించింది.