Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 3

    అందమైనవాడు, మగసిరి కలవాడు అని చెప్పడానికి ఏమేం వుండాలో అన్నీ వున్నవాడు అనిపించింది స్వప్నకు.

    "దేవీబాగ్ కు వస్తావేమో, ఎన్నో...... ఎన్నెన్నో మాట్లాడాలనుకొన్నాను ప్చ్! నీ పిరికితనం మంచి ఛాన్స్ పోగొట్టింది! కనీసం ఈ లేఖయినా చదువుతావుకదూ?"

    అతడి మాట్లలోని మృదుత్వం అభ్యర్దన స్వప్న చెయ్యి ముందుకు వెళ్లాలా, అతడి చేతినుండి కవరు అందుకొనేలా చేసింది! అది పర్సులో పెట్టుకుని బడిటైం అయిపోతుందన్నట్టుగా గబగబా నడవసాగింది.

    ప్రార్దనలో నిలబడిందేగాని మనస్సు అంతా కవరు మీదే వుంది ఇంటర్వెల్ వరకు మనసు ఎలాగో బిగబట్టుకొని తరువాత కవరు చించింది. గులాబీరంగు కాగితం మీద వైలెట్ ఇంకుతో  వ్రాసిన అక్షరాలు ముద్దొస్తూ, కునేగాసెంటు వాసన హాయిగా చుట్టుముట్టి మరో లోకంలోకి తీసి కెళ్లింది! ఆతృతగా కాగితంమీద పరుగులు తీసాయి చూపులు.

    "డియర్ స్వప్నా!

    నిన్న దేవిబాగ్ లో నీకోసం చీకటి పడేదాకా ఎదురు చూశాను రాలేదెందుకు? నేనంటే ఇష్టం లేదా? ఆ మాట ఆత్మవంచన కదూ? ఇష్టంలేనిదే నా కళ్లలో కళ్లు కలిపే దానివి కాదు!

     మరెందుకు రాలేదు?

    నన్ను కలుసుకోవాలనీ, నాతో మాట్లాడాలనీ, నన్ను గురించి తెలుసుకోవాలనీ లేదా? వున్నా 'ఆడపిల్ల'వన్నజంకుతో వెనుకంజా? అంత జంకున్న దానివైతే నన్ను నీ చూపులతో ఎందుకు ప్రోత్సాహపరిచావు?

    నీ గురించి నాకు తెలుసు. (ఎలా తెలుసునని ఆశ్చర్యపడబోకు. బడిలో పనిచేసే పంతులమ్మ వివరాలు సేకరించాలంటే పెద్ద కష్టమైనా పనికాదు!)

    నా గురించి నీకు చెబుతాను.

    బి. ఇ., పూర్తిచేసి రెండు సంవత్సరాలైంది. ఈ సంవత్సరం ఇంటర్వ్యూలో సెలెక్టు అయి ఈ ఊరికి జూనియర్ ఇంజనీరుగా వచ్చాను, నెలరోజుల క్రిందటే. వచ్చిన మరురోజే నువ్వు కనిపించావు. (ఈ ఊళ్ళో ఇంతమంది ఉండగా నేనొక్కదాన్నే కనిపించానా అని నవ్వకు! ప్రేమ ఉదయించినచోట తప్పమిగతాదంతా శూన్యమై పోతుందనుకుంటాను మనిషికి!)

    .......అంతా ఇందులోనే చెప్పేస్తే మనం దేవీబాగ్ లో కలుసుకొంటే మాట్లాడుకోవడానికి మిగలొద్దా?

    ఈరోజు అయిదున్నరకు  దేవీబాగ్ కు తప్పక వస్తావు కదూ?

    రాకపోయావో నీకూ నాకు చెల్లు!

    ఇప్పటికి ఉంటా మరి. నీవాడి ననిపించుకోవాలని ఆశతో నిరీక్షించే -

                    స్వరూప్"

    "స్వరూప్!" లేఖని ముద్దుపెట్టుకొంది స్వప్న. అందమైన పేరు! అందమైనవాడు! జూనియర్ ఇంజనీరుగా జాబ్ చేస్తున్నవాడు! స్కూటర్ మీద తిరుగుతాడు. ఒక అంతస్తు కలవాడే అయివుంటాడు. అతను తమ కులస్తుడే అయితే అమ్మా నాన్న సమస్యను సులువుగా తీర్చింది అవుతుంది!

    కాకపోతే,

    నీకూ, నాకూ కుదరదని చెప్పేస్తుంది.

    ప్రేమకంటే ముందు పెళ్లి గురించి ఆలోచించసాగింది స్వప్న. పెళ్లివరకూ దారితీయని ప్రేమ ఎంత నరకంగా తయారవుతుందో, అది ఎన్ని సమస్యలను  సృష్టిస్తుందో ఊహించలేని పసిపిల్లకాదు తను. పాతికేళ్ల పడుచు. వయసు  పొంగు తగ్గి ప్రశాంతంగా ఆలోచించుకోగల వయసు  వచ్చేసింది!

    "ఏమిటే, స్వప్నా అంత పరధ్యానం? ఎక్కడినుండి ఉత్తరం?"

 Previous Page Next Page