Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 4

   
    "కానీ ఎలా?... నాకా ఫీల్డులో బొత్తిగా అనుభవంలేదే!!... ఆడపిల్లల్ని ఎలా ఆకర్షించాలి... ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమింపబడాలి ఆ పద్ధతులేమీ తెలీవే!!..." తెల్లమొహం వేస్తూ అన్నాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు ఒక్కక్షణం ఆలోచించాడు. అతని కళ్ళు మెరిశాయ్.

    "నువ్వు ప్రేమానందం గురించి విన్నావా?" అని అడిగాడు చిట్టబ్బాయ్ ని.

    చిట్టబ్బాయ్ బుర్ర అడ్డంగా ఊపాడు తెలీదన్నట్టు.

    "మనం రేపు ఆయన దగ్గరికి వెళ్ళాలి!" అన్నాడు కన్నారావు.

    "ఎందుకూ?"

    "ఆయన ప్రేమికుల కోసం 'ప్రేమవిహార్' అనే ఆఫీసు పెట్టాడు. అక్కడ ప్రేమించదల్చుకునేవాళ్ళకి ఆయన సలహాలు ఇస్తుంటాడు... కన్సల్టేషన్ ఫీజు పాతికో ముప్పయ్యో ఉంటుందనుకో... చాలామంది ఆయన సలహాల కోసం వెళ్తుంటారు...."

    "అలాగైతే రేపు ఆఫీసు నుండి అటే వెళ్దాం.. ఎక్కడుంటారు ఆ నిత్యానందం?" ఉత్సాహంగా అడిగాడు చిట్టబ్బాయ్.

    "నిత్యానందం కాదు.. ప్రేమానందం! సికింద్రాబాద్ లో ఉంటాడు. సరేగాని ఏంటి ఇందాకట్నుండీ కుర్చీలు జరుపుతున్నట్టు జర్రుజర్రుమని శబ్దం వస్తుంది?"

    "కుర్చీలు జరపడం కాదు.... ఆయన పెరుగన్నం తింటున్నట్టున్నాడు...." చెప్పాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు అటువైపు చూశాడు. ఇందాక కోపం తెచ్చుకున్నాయన పెరుగన్నం జుర్రుకుంటూ తింటున్నాడు...

    ఇద్దరూ లేచి బిల్లు చెల్లించి ఇంటి దారి పట్టారు. దార్లో ప్రేమానందంకి ఎంతటి పేరున్నదీ, ఎంతమంది లవర్స్ ఆయన సలహాలు తీస్కుని సక్సెస్ అయ్యిందీ చెప్పాడు.

    "ఈ విషయాలన్నీ నీకెలా తెల్సు?" ఆశ్చర్యంగా అడిగాడు చిట్టబ్బాయ్.

    "మన పక్క డిపార్టుమెంట్లో ఈశ్వర్ లేడూ? వాడొకరోజు క్యాంటీన్ లో మాటల మధ్య ప్రేమానందం టాపిక్ వస్తే చెప్పాడు..." అన్నాడు కన్నారావు.

    ఇల్లు వచ్చేసింది... ఇంట్లోకి వెళ్ళబోతూ అటు పక్కకి చూసిన చిట్టబ్బాయ్ ఆశ్చర్యపోయాడు.

    "ఆ చెత్తకుండీ దగ్గర కుక్క చూశావా ఎలా చచ్చిపడుందో!... ఎందుకు చచ్చిందో..."

    "ఆ కుండీలోని నీ నల్ల పప్పు తినుంటుంది" ఠకీమని సమాధానం చెప్పాడు కన్నారావు.

                     *                                 *                           *

    ఒక అరగంట నుండీ ప్రేమానందం ముందు అరమోడ్పు కళ్ళతో చిట్టబ్బాయ్, కన్నారావులు చేతులు కట్టుకుని కూర్చున్నారు. అంతసేపూ వీళ్ళిద్దరికీ ప్రేమానందం ప్రేమంటే ఏమిటి, ప్రేమలో రకాలు, ప్రేమకీ కామానికి ఉన్న తేడా, ప్రేమలో పడాలంటే ఏం చెయ్యాలి? ,మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమలోకి దించాలంటే ఏం చెయ్యాలి? ప్రేమికులకుండాల్సిన అర్హతలేమిటి!
ఉండకూడనివేమిటి? అబ్బాయిలు అమ్మాయిల్ని ఆకర్షించాలంటే ఏం చెయ్యాలి? అమ్మాయిలు అబ్బాయిల్ని ఆకర్షించాలంటే ఏం చెయ్యాలి? మొదలైన విషయాల గురించి గుక్క తిప్పుకోకుండా ఉపన్యాసం ఇచ్చాడు.

    ఆ ఉపన్యాసం వినగానే చిట్టబ్బాయ్ బుర్ర గిర్రున తిరిగిపోయింది. అలా నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు.
    "చాల్లే.... నోరు మరీ అలా తెరుచుకుని చూడకు... ఫీజెక్కువ అడుగుతాడు..." కన్నారావు చిట్టబ్బాయ్ చెవిలో మందలించాడు.

    చిట్టబ్బాయ్ చటుక్కున నోరు మూసేశాడు.

    ఆ క్షణంలో ఒక యువకుడు సుడిగాలిలా పరిగెత్తుకుని వచ్చాడు. అతను తన చేతిలోని గులాబీల దండని ప్రేమానందం మెడలో వేసి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు.

    "లే నాయనా!.." అంటూ ప్రేమానందం అతన్ని భుజాలుపట్టిలేపాడు.

    "ఎవరు నాయనా నువ్వు?" మెల్లగా ప్రశ్నించాడు.

    "నేను గురూజీ... రాజుని!" అన్నాడు అతను.
    "ఏ ఊరికి రాజువి నాయనా!"

    "అబ్బే... ఊరుకి రాజుని కాను గురూజీ...నేను మామూలు రాజుని... నన్నే గుర్తు పట్టలేదా గురూజీ?... పోయిన వారం మీ దగ్గరికి ప్రేమించడానికి సలహాలు తీస్కోడం కోసం వచ్చాను...." ఆశ్చర్యంగా చూశాడు రాజు ప్రేమానందం వైపు.

    ప్రేమానందం రాజువంక అర్దనిమీలిత నేత్రాలతో చూస్తూ చిరునవ్వు నవ్వాడు.

    యాభై ఏళ్ళ వయసు ఉన్న ఆయన మొహంలో వింత కాంతి కనిపించింది చిట్టబ్బాయ్ కి.
  
    "నీలాంటి యువతీ యువకులు ప్రేమనాశించి నా దగ్గరికి వేల సంఖ్యలో వస్తుంటారు నాయనా, అందరూ గుర్తుండాలంటే కష్టం బిడ్డా..." అన్నాడు ప్రేమానందం గిరజాలజుత్తుని కుడిచేత్తో నిమురుకుంటూ. "ఇంతకీ నీ ఆనందానికి కారణం ఏమిటి నాయనా?"

    "గురూజీ ... మీరు నాకు ఇచ్చిన సలహాలు బ్రహ్మాండంగా పనిచేశాయ్! వారం తిరక్కుండానే ఒకమ్మాయిని లవ్ చేసి ఆమెచేత లవ్ చేయబడ్డాను. త్వరలో పెళ్ళి కూడా చేస్కోవాలని అనుకుంటున్నాం గురూజీ. మా పెళ్లికి మీరు తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి గురూజీ..." సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ అన్నాడు రాజు.

    "అలాగే నాయనా.... శుభం".

    "ఈ కవరు ఉంచండి గురూజీ" అన్నాడు రాజు జేబులోంచి ఓ కవర్ తీసి ముందుకు చాపుతూ.

    "ఏంటి నాయనా ఇది?..." కవరందుకుంటూ ప్రశ్నించాడు ప్రేమానందం.

    "వెయ్యి నూటపదహార్లు గురూజీ... ఏదో నా తృప్తికోసం"

    "నాకు తీసుకోవడం ఇష్టం వుండదుగానీ ... నీలాంటి ప్రేమికులు చాలామందికి నా సహాయ సహకారాలు అందించడం కోసం త్వరలో ఓ కాలేజీ స్థాపించాలని అనుకుంటున్నా. అందుకోసమైనా తీసుకోక తప్పదు నాయనా..."

    "అలాగా గురూజీ? చాలా సంతోషం గురూజీ. తప్పకుండా కాలేజీని స్థాపించండి గురూజీ!.... ఈ ఊరుని, తరువాత ఈ జిల్లాని, ఆ తరువాత ఈ రాష్ట్రాన్ని, ఆనక దేశం మొత్తాన్ని ప్రేమమయం చేసెయ్యడం గురూజీ" గుక్క తిప్పుకోకుండా చెప్పి "గురూజీ ప్రేమానందంగారికీ..." బిగించిన పిడికిలి పైకెత్తి గట్టిగా అరిచాడు.

    చిట్టబ్బాయ్, కన్నారావులు మొహమొహాలు చూస్కున్నారు. అక్కడ రాజు, ప్రేమానందం కాకుండా తామిద్దరే ఉన్నారు.
    'అంటే ఇప్పుడు "జై" అని ఎవరనాలి? మనమిద్దరమేనా!' ఇద్దరూ మనసులోనే ప్రశ్నించుకున్నారు.

    రాజు పిడికిలి బిగించిన చేతిని దించకుండానే ఇద్దరివంకా కళ్ళు చిట్లించి విసుగ్గా చూశాడు. మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటన్నట్టువాళ్ళు కూడా అతన్ని విసుగ్గా చూశారు.

    ప్రేమానందం ఇద్దరివంకా మందస్మిత వదనంతో చూస్తూ "సిగ్గుపడకండి నాయనా" అన్నాడు.

    "జై" ఒక్కసారిగా అన్నారు చిట్టబ్బాయ్, కన్నారావు.

    "ఏంటి జై" నేను చెప్పిన పది నిమిషాలకి అన్నారు. మళ్ళీ అనండి. గురూజీ ప్రేమానందంగారికీ!" ఈసారి మరింత గట్టిగా అరిచాడు రాజు.

    "జై" వాళ్ళు కూడా గట్టిగానే అన్నారు.

    "గురూజీ ప్రేమానందంగారికీ."

    "జై" మళ్ళీ అన్నారు. కానీ ఈసారి జై అనే శబ్దంతోపాటు ఫట ఫటా శబ్దం కూడా వచ్చింది. రాజు, ప్రేమానందం కాస్త దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ శబ్దం వినపడలేదుగానీ, చిట్టబ్బాయ్ కి, పక్కనే ఉండడంచేత కన్నారావుకి ఫటఫట శబ్దం వినిపించింది.

    "నువ్వెలాగూ జై అని అనక తప్పదు. అలా పళ్ళెందుకు నూర్తావ్?" కన్నారావు చిట్టబ్బాబ్బయ్ చెవిలో అంటుండగా, రాజు మళ్ళీ "గురూజీ ప్రేమానందంగారికీ..." అంటూ అరిచాడు.

    "జై..."

    "నీ పళ్ళు చేసే ఫటఫట శబ్దం గురూజీ వింటే బాగుండదు... ప్రేమించాలని అనుకునేవాళ్ళు ఇటువంటివి చాలా భరించాలి!" ఇందాకటి వాక్యం ఇప్పుడు చిట్టబ్బాయ్ చెవిలో పూర్తిచేశాడు కన్నారావు.

 Previous Page Next Page