Previous Page Next Page 
జీవనయానం పేజి 4


    ఆసిఫ్జాహీరాజ్యంలోని తెలుగుప్రాంతాలను తెలంగానా అన్నారు. తెలుగులు ఉండు ప్రాంతం తెలంగానా. దీనినే తరువాత 'తెలంగాణం' అంటున్నాం. అప్పుడు ఈనాడు ఉన్న ఆంధ్రప్రదేశం సాంతం తెలంగాణమే.

 

    సలాబత్ జంగ్ ఫ్రెంచివారి రుణం తీర్చుకోదలచాడు. ఫ్రెంచివారు తమ సైన్యం కర్చు 26 లక్షల రూపాయలు అని తేల్చారు. సలాబత్ లెక్కలను గురించి బాధపడలేదు. కాని తన దగ్గర డబ్బులేదు. ఫ్రెంచి అప్పులవాళ్లు అతని వెంట పడ్డారు. అతడు 1753లో తెలంగాణంలోని 1. ముస్తాఫానగర్, 2. రాజమహేంద్రవరం, 3. శ్రీకాకుళం జిల్లాలను ఫ్రెంచివారికి అప్పగించాడు. అప్పటి ఆ జిల్లాల సాలుసరి రాబడి 31 లక్షల రూపాయలు.  

 

    సలాబత్ కు ఫ్రెంచివారిమీద నమ్మకం సన్నగిల్లింది. అతడు ఇంగ్లీషువారితో రాయబారాలు సాగించాడు. ఫ్రెంచి బుస్సీ అసాధ్యుడు. సలాబత్ పథకం సాగనీయలేదు. అయినా సలాబత్ వదలలేదు. తన రక్షణకుగాను ఇంగ్లీషువారికి తెలంగాణంలోని మరికొంతభాగం అప్పగించాడు. 1759లో  సలాబత్ ఆంగ్లేయులకు 1. నిజాం పట్నం, 2. మచిలీపట్నం, 3. కొండవీడు, 4. వల్కమనేరు అప్పగించాడు.

 

    ఫ్రెంచివారికి - ఆంగ్లేయులకు సర్కారు వారినుంచి వచ్చిన జిల్లాల కావడాన సర్కారు జిల్లాలు అయినాయి. చరిత్ర గమనంలో ఫ్రెంచివారికి ఇచ్చిన జిల్లాలు కూడా బ్రిటిషువారి పరమయినాయి.

 

    బలవంతుడయినా బుస్సీ నిర్గమించాడు. ఫ్రెంచివారి ప్రాబల్యం తగ్గింది. బ్రిటిషువారు సలాబతును నమ్మలేదు. అతన్ని తొలగించారు. ఖమ్రుద్దీన్ నాలుగవ కొడుకును 1762ఓ గద్దెకు ఎక్కించారు.

 

    నిజామలీ నామ్ కే వాస్తే రాజు. అధికారం సర్వం బ్రిటిషువారు చలాయించారు. ఈలోగా మహారాష్ట్రులు నిజాంఅలీ మీద దండెత్తారు. ఇంగ్లీషువారు సాయపడలేదు. నిజాంఅలీ ఓడాడు. మహారాష్ట్రులు విధించిన షరతులు అన్నింటికీ వప్పుకున్నాడు.

 

    అప్పుడు 'మేము నిజామలీని రక్షిస్తా' మన్నారు ఆంగ్లేయులు. అతని రక్షణకు సైన్యం పెడ్తామన్నారు. వాటికి అయిన కర్చులు ఇవ్వాలన్నారు. నిజామలీ కాదనగలడా? కాని అతని దగ్గర డబ్బేది? అప్పటికే ఇంగ్లీషు కంపెనీల వద్ద అనేక అప్పులు చేశాడు.  తన రక్షణ కోసం ఇంగ్లీషువారు నిర్వహించే సేవల ఖర్చులకుగాను బ్రిటీషువారికి 1.కంభం, 2. కర్నూలు, 3. ఆదోని, 4. రాయదుర్గ, 5. గుత్తి, 6. కడప, 7. గుర్రంకొండ, 8. బంగనపల్లి, 9. అనంతపురం, 10. బళ్లారి, 11. మదనపల్లి, 12. వాయల్పాడు జిల్లాలను బ్రిటీషువారికి ధారాదత్తం చేశాడు. అది 1800 సంవత్సరం.

 

    ఈ విధంగా తెలంగాణంలోని మరికొన్ని జిల్లాలు బ్రిటిషువారి వశం అయినాయి. నిజాం బ్రిటీషువారికి దత్తం చేసినందుకు వాటికి 'దత్తమండలాలు' అని పేరు వచ్చింది.

 

    అప్పటికి నిజాం రాజ్యంలో మిగిలిన తెలుగుప్రాంతం 'తెలంగాణం' గా మిగిలిపోయింది.

 

    నలభై ఒక్క సంవత్సరాలు నామమాత్రంగా పాలించిన నిజామలీ 1803లో  కన్నుమూశాడు.

 

    రెండో నిజాం నిజామలీ తన రక్షణకోసం తెలంగాణంలో మరికొంత భాగాన్ని అంగ్రేజులకు అప్పగించి కన్నుమూశాడు. తరువాత వచ్చిన నిజాములను గురించి అంతగా చెప్పుకోవలసిందేమీ లేదు. అయితే, నవాబుల వెర్రిదనాన్ని తెలిపే విషయాలు చూద్దాం.

 

    నాసిరుద్దౌలా నాల్గవ నిజాం ఏలుతున్న కాలం. బ్రిటిష్ రెసిడెంటు ఒక రెసిడెన్సీ నిర్మించాలనుకున్నాడు. మూసీ ఒడ్డున నిర్మించ తలపెట్టిన భవనపు ప్లాను తయారు చేయించాడు. నాసిరుద్దౌలా అనుమతి తీసుకోవాలనుకున్నాడు. అనుమతి ఎందుకంటే, ఆ భవనానికి అయ్యే కర్చు సాంతం నవాబు నెత్తిన వేయడానికి! ప్లాను ఎంతో వివరంగా తయారు చేయించాడు. అది చాలా పెద్ద కాగితం అయింది. రెసిడెంటు నవాబు దర్బారుకు వెళ్లాడు. సలాంలు మొదలైన లాంఛనాలు ముగించాడు. కాగితం చుట్ట విప్పాడు. నవాబుకు చూపించాడు. అంత పెద్ద కాగితం చూచి నవాబు భయపడ్డాడు. అది తన రాజ్యమంత ఉన్నది అనుకున్నాడు. అనుమతి నిరాకరించాడు.

 

    రెసిడెంటు ఇంగ్లీషువాడు. అంత తేలిగ్గా వదులుతాడా? అదే ప్లానును సైజు తగ్గించి గీయించాడు. అక్కడ ఒక బాల్కనీ, ఇక్కడ ఒక కిటికీ తగ్గించాడు. మళ్లీ యథాప్రకారం దర్బారుకు వెళ్లాడు. లాంఛనాలు పూర్తి చేశాడు. చిన్నకాగితపు ప్లాను చూపించాడు. నవాబు సంతోషించాడు. రెసిడెంటు తన ఆదేశం పాలించాడు అనుకున్నాడు. మురిసిపోయాడు. రెసిడెన్సీ నిర్మాణానికి అనుమతించాడు. తన కర్చుతో రెసిడెంటుకు కోట నిర్మించి ఇచ్చాడు.

 

    అదే ప్రస్తుతపు రెసిడెన్సీ కోఠీ. ప్రస్తుతం అందులో మహిళా కళాశాల, ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉన్నాయి.

 

    సుమారు అదేకాలంలో మరో విచిత్రం జరిగింది. నిజాం ఇంగ్లీషువారికి దత్తం చేసిన దత్తమండలాలలో నిరంతరం కరువు రాకాసి తాండవం చేసింది. మద్రాసులోని అంగ్రేజు సర్కారు కరువు నివారించడాన్ని గురించి ఆలోచించింది. తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టాలని నిర్ణయించింది. అయితే, నిజాం రాజ్యంలోని 54 చదరపు మైళ్ళ నేల జలమయం అవుతుంది. 54 చదరపుమైళ్ల ముంపుకు అంగీకరించవలసిందని నైజామును కోరడం జరిగింది. నిజాం అందుకు అంగీకరించలేదు. మద్రాసు ప్రభుత్వం వారు ఢిల్లీకి ఈ విషయం తెలియపరచారు. ఢిల్లీ ప్రభుత్వం నిజామును ఆ ప్రతిపాదన అంగీకరించవలసిందని కోరింది. నిజాం ఒక వింత షరతు విధించాడు. జలమయం అయ్యేంత బ్రిటిషువారి భూమి తనకు పరిహారంగా ఇవ్వాలన్నాడు!

 

    బ్రిటిషువారి వత్తిడికి లొంగి ఎంతో భూభాగం బ్రిటిషు వారికి ధారపోశాడు! ప్రజా ప్రయోజనం కోసం అర్థిస్తే కాదన్నాడు!

 

    ఇదీ నవాబుల తెలివి! ఇదే తెలివి అని మురిసిపోయారు!

 

    ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం:

 

    మన చరిత్ర వ్రాసినవారు అంగ్రేజులు! వారు 'మీకు చరిత్ర లేదు' అన్నారు. వారు పాలకులు, మనం బానిసలం! అవును, మాకు చరిత్ర లేదు అన్నాం. మేమే మీ చరిత్ర వ్రాస్తున్నాం అన్నారు ప్రభువులు. అదే మా చరిత్ర అన్నాం బానిసలం. ఇంకా అదే అని నమ్ముతున్నాం. నమ్మేటట్లు చేశారు అంగ్రేజులు!

 

    మన దేశం మీద అనేకులు దండెత్తారు. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం ఆర్యులుకూడా దండెత్తి వచ్చారు. ఆర్యులనాటి భారతదేశం - మధ్య ఆసియా వరకు వ్యాపించి ఉందని ఒక వాదం. అలాంటప్పుడు ఆర్యులు దండెత్తి వచ్చినట్లు కాదు - తమ దేశంలోనే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలివచ్చినట్లు!

 

    అది అప్రస్తుత అంశం. అయితే, భారతదేశం మీదకు దండెత్తిన వాడెల్లా గెలిచాడు. మనం ఎవరినీ వెనక్కు నెట్టలేకపోయాం. ప్రతి పోరాటంలోనూ తమ ప్రాణాలు అర్పించిన అమర వీరులను కీర్తించాం. వారి కీర్తిని గానం చేశాం.

 

    అయితే, ఒక విశిష్టమైన అంశం ఏమంటే - వచ్చిన విజేతలందరూ భారతీయులు అయిపోయారు. అందరూ భారత జీవిత విధానానికి ముగ్ధులు అయినారు. దీనిని అవలంబించారు. సుసంపన్నం చేశారు.

 

    మహమ్మదీయుల అన్యమతావలంబకులు. వారు మన దేశాన్ని సుమారు వేయి సంవత్సరాలు పాలించారు. తమ మతాన్ని - ఒక్కొక్కసారి బలప్రయోగంతో ప్రచారం చేశారు. కాని తాము భారతీయులం అని సగర్వంగా చెప్పుకున్నారు. అంతేకాదు, ఒక మిశ్రమ సంస్కృతికి తోడ్పడినారు. సంగీత సాహిత్యాల సహితంగా తాత్విక చింతనలోనూ భారతీయతను అలవరచుకున్నారు.

 

    కొందరు మత ఛాందసులుతప్ప హిందూమత వికాసానికి సహితం అడ్డుతగలలేదు. తులసీ రామాయణం - రామానుజుని విశిష్టాద్వైతం - చైతన్యప్రభు వైష్ణవం - గీతగోవిందం - వీరశైవం మున్నగునవి అన్నీ మహమ్మదీయుల పాలనలోనే అభివృద్ధి చెందాయి.

 

    సూఫీ సిద్ధాంతం మన భక్తితత్వానికి ప్రతీక

 

    ఆంగ్లేయులు భారతదేశానికి వ్యాపారం మాత్రం చేసుకోవడమనే ప్రధాన లక్ష్యంతో వచ్చారు. వారు ఈస్టిండియా కంపెనీ వచ్చారు. అంటే, వారి ప్రథమ లక్ష్యం తూర్పు ఇండియాలో వ్యాపారం చేసుకోవడం మాత్రమే. అయితే, ఆనాటి భారతదేశ పరిస్థితులు ఒక వ్యాపార కంపెనీని ప్రభువులను చేశాయి.   

 

    చరిత్ర సాంతంలో భారతదేశం మీదికి వచ్చిన ఏ మొనగాడూ భారతదేశాన్ని తన బలంతో జయించలేదు. అనైక్యత - పరస్పర విరోధం భారతదేశపు ప్రధాన లక్షణం. మన జగడాలు - క్రమశిక్షణారాహిత్యం శత్రువును గెలిపించాయి.

 

    వచ్చినవానికల్లా మనం బాహువులు చాచి స్వాగతం పలికాం.

 

    మనమీద అందరూ దండెత్తారు!

 

    మనం ఒక్కసారికూడా వేరుదేశంమీద దండెత్తలేదు!!

 

    అనైక్యత - పరస్పరవిరోధం - ఈర్ష్యాద్వేషాలుకాక విలాస జీవనం మన జాతీయతత్వంగా గోచరిస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న వృత్తాంతం:

 

    నాదిర్ షా ఢిల్లీ మీద దండెత్తాడు. మూడు హత్యలు చేశాడు. ఢిల్లీని ద్వంసం చేశాడు. సర్వనాశనం చేశాడు. మొత్తం సంపదను కొల్లకొట్టాడు. అతనికి అడ్డులేదు. తిరిగిపోవచ్చు. కాని, అతనికి ఇంక చిన్న ఆలోచన వచ్చింది.   

 Previous Page Next Page