"సర్లే అయితే..... ఎవరో స్నేహితురాలై వుంటుంది. మాటి మాటికి ఇలా ఫోన్ చెయ్యకు" విసుగ్గా అన్నాడు శంకర్.
"ఇంకెవరైనా వచ్చారా?"
"చాకలి బట్టలు తీసుకొచ్చాడు"
"సర్లే- సర్లే" ఫోన్ విసురుగా పెట్టేసేడు శంకర్.
ఆ వెళ్ళింది అనూషేమో అన్న అనుమానం అతడికి రాలేదు. వచ్చే అవకాశం కూడా లేదు. ఒక అమ్మాయి అంత ఫాస్ట్ గా వర్క్ చేయగలుగుతుందన్న ఆలోచన కూడా అతడికి కలుగలేదు. ఆడవాళ్ళ తెలివితేటలు మీద అతడికి అంత గొప్ప అభిప్రాయం కలిగే అవకాశం ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు.
ఇక ముందు రాబోతూంది.
19
వీధి మొదట్లో నిలబడి ఉత్పల ఇంటికేసే చూస్తున్న మనిషి మాఫియాకి సంబంధించిన వాడని అనూషకి తెలుసు. అయినా పట్టించుకోకుండా ఆ ఇంటిలోకి ప్రవేశించింది. లాకప్ లోంచి లాయర్ సాయంతో (న్యాయబద్ధంగా) విడుదల అవగానే ఆమె చేసిన మొదటి పని విశ్వేశ్వరశాస్త్రి ఇంటికి వెళ్ళటం!
దానికి సరిగ్గా గంట- గంటన్నర క్రితం ఆమె ఉత్పల కంఠాన్ని విన్నది లాకప్ లో వుంది, బయట గదిలోంచి.....
"నేనొక విషయం చెప్పటానికి వచ్చాను".
"దేని గురించి?" ఇన్ స్పెక్టర్ కంఠం.
"......మాఫియా" ఉత్పల కంఠం.
"ఏమిటి?"
"అవునుసార్-"
"............."
"ఆ వుత్తరం ఎక్కడవుంది?"
"శ్రీనివాసరావు దగ్గిర వుండేది. అతడిని కూడా చంపేశారు. బహుశా వాళ్ళకి చేరి వుంటుంది."
"..............."
"నేనా ఉత్తరం చదివాను".
"గుడ్. ఏముందా వుత్తరంలో?"
"చెప్పొద్దు ఉత్పలా. ఈ ఇన్ స్పెక్టర్ వాళ్ళ మనిషే, చెప్పొద్దు" కటకటాల ఊచల్ని పట్టుకుని ఆందోళనగా మనసులో అనుకుంది! తరువాత ఇన్ స్పెక్టర్ లోపలి గదిలోకి వెళ్ళటం చూసింది. అతడు ఫోన్ లో ఏమి మాట్లాడాడో ఆమెకి వినపడలేదు. అతడు బయటకు వచ్చేసరికి ఉత్పల లేదని మాత్రం అతడు సెంట్రీల మీద ఎగిరిపడటం ద్వారా అర్థమైంది. కంగ్రాచ్యులేషన్స్ ఉత్పలా' అని మనసులో అభినందించింది.
ఉత్పల ఇన్ స్పెక్టర్ కి చెప్పిన విషయాలు ఆమెని కలవరపెట్టినయ్!
ఆమె నిజంగానే ప్రమాదం చివరి అంచులో వుంది.
లాయర్ వచ్చి బెయిల్ మీద తనని విడిపించగానే, అందుకనే వెంటనే విశ్వేశ్వర శాస్త్రి ఇంటికి బయల్దేరింది.
ఆ ఇల్లో శ్మశానంలా వుంది.
అందరూ ప్రొద్దున్నుంచీ మొహాలు కూడా కడక్కుండా ఏడుస్తూ కూర్చున్నాట్టున్నారు. ఉత్పలకి తెలిసిన అమ్మాయిని అంటూ వచ్చి పలకరించిన అనూషని చూసి అందరూ ఒక్కసారి చుట్టుముట్టారు. ప్రశ్నల వర్షం కురిపించారు.
ఉత్పల ప్రాణభయంతో పరుగెట్టటానికి 'ప్రారంభం' కొన్ని గంటల ముందే అయిందని అనూష గ్రహించింది. కానీ ఆ విషయాలు వారికి చెప్పటం అంత మంచి పని కాదు.
"నా కూతురు ఏం తప్పుచేసి వెళ్ళిపోయిందమ్మ? మాతో కలిసి పడుకున్నది- అలా రాత్రికి రాత్రి ఇల్లొదిలి వెళ్ళిపోయిందంటే- ఈ ఇంటికి ఏ అప్రదష్ట సంభవిస్తుందో అని మనసు రెపరెపలాడుతూ వుందమ్మా. నిప్పుని కూడా నీళ్ళతో కడిగే వంశం మాది".
"మీరలాంటి ఆలోచన ఏమీ పెట్టుకోకండి. ఉత్పల కూడా నిప్పులాంటిదే. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఆమె చిక్కుకుని వుంది. మీరు వెంటనే పోలీసు రిపోర్ట్ ఇవ్వండి."
శాస్త్రి ఆశ్చర్యంగా "అంటే....పోలీసులు ఆమెకోసం వెతకటం లేదా?" అన్నాడు. "అర్థరాత్రి అమ్మాయి కోసం వాళ్ళోస్తే- ఏదో తప్పు చేసి పారిపోయిందనుకున్నాను".
"మీ ఇంటికి వచ్చింది పోలీసు కాదు. ఈ దేశంలో పోలీసులు కోట్లు చేసుకోవటానికి ఆశపడుతూ వుంటే, గూండాలు ఖాకీ బట్టలు వేసుకోవటంలో తప్పులేదండి. ఒకటి మాత్రం చెప్పగలను. మీ అమ్మాయి చట్టానికి వ్యతిరేకంగాగానీ, నైతికంగాగానీ ఏ తప్పు చేయలేదు. తనకు తెలియకుండా ఒక ఉచ్చులో ఇరుక్కుపోయింది. తొందర్లోనే బయటకు వస్తుంది. ఈ సమయంలో ఇంతకన్నా ఏమీ చెప్పలేను. నన్ను బలవంత పెట్టకండి."
"అమ్మాయి ఏమయిపోయిందో అన్న బాధకన్నా ఏం తప్పు చేసిందో అని ఎక్కువ భయపడ్డామమ్మా. ఏ తప్పు చేయలేదు కదా?"
"లేదండీ".
"ఏ అపాయమూ లేదు కదా".
"లేదు, మీరు నిశ్చింతగా వుండొచ్చు".
అప్పుడేడ్చాడాయన! అంతవరకూ ఒక కుటుంబ పెద్దగా, ఇంట్లో అందర్నీ ఓదారుస్తూ బింకంగా వున్న ఆ నిలువెత్తు మనిషీ, అనూష చేతుల్లో తన మొహం కప్పుకుని వలవలా ఏడ్చాడు. ఆమెకు చిత్రం అనిపించలేదు. ఆ ఆప్యాయత, ఆ ఇంటి సభ్యుల మధ్య పెనవేసుకుని వున్న ఆ బంధాలూ ఒక అద్దంలో ప్రతిబింబించినట్టు ఆ దృశ్యం తోచింది. తన జీవితంలో తను ఏం కోల్పోయిందో ఆ దుఃఖం చెపుతున్నట్టు అనిపించింది. తన కోసం ఏడ్చే వాళ్ళు ఒకరుండటం కన్నా అదృష్టం మనిషికి జీవితంలో ఏముంటుంది? లక్షలు, కోట్లు, కార్లు, సమాజంలో స్థానం ఇవన్నీ ఇవ్వలేని సంతృప్తి అది. ఆమెకి అలాంటి కుటుంబం- ఒక తండ్రి, ఒక అక్క ఒక చెల్లి, ఒక తమ్ముడు లేని లోటు ఆ క్షణం తెలిసి, జీవితపు మెటాఫిజికల్ ఎమ్టీనెస్ (ఆధ్యాత్మికమైన శూన్యత్వం) యొక్క స్వరూపం గోచరమైంది.
తండ్రి ఏడవడం చూసి బిక్కమొహంతో చుట్టూ చేరిన ఆ ఇంటిల్లిపాదినీ చూసి, ఆమె మాట మార్చటానికా అన్నట్టు "నాక్కొన్ని వివరాలు కావాలి. నిన్న రాత్రి జరిగిన విషయాలు....." అంది. ఆమెలో కనపడే అపురూపమైన వ్యక్తిత్వానికి అందరూ ఆకర్షితులై, అనాలోచితంగానే ఆమె పెద్దరికాన్ని వప్పుకున్నారు.
"నిన్న రాత్రి ఎన్నింటికి వచ్చింది ఉత్పల".
విశ్వేశ్వర శాస్త్రి చెప్పాడు.
"అంత రాత్రిపూట ఒక్కతే వచ్చి వుండదు. ఎవరో వచ్చి దింపి వుంటారు..... ఎవరు?"
అందరూ మౌనంగా వుండిపోయారు.
"ఒక్కతే వచ్చినట్టుంది. నేనే తలుపు తీశాను. ఎవరూ లేరు."
"వచ్చినప్పుడు ఎలా వుంది? భయపడుతూ కనిపించిందా?"
"చీకట్లో ఏదైనా కాగితం వుందా?"
"లేదు"
"పర్సు?"
"తను పర్సు తీసుకెళ్లాదు".
ఆమెకు వేరే ఏం ప్రశ్నించాలో తెలియలేదు. అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అంతలో ద్విపద అసహనంగా ఏదో చెప్పాలన్నట్టు కదలటాన్ని ఆమె సునిశితమైన దృష్టిని తప్పించుకోలేకపోయింది. 'ఏమిటి' అన్నట్టు చూసింది.
"నేను కిటికీలోంచి చూశాను. వీధి వరకూ రిక్షాలో వచ్చింది. తన తలుపు దగ్గరకు రాగానే......" తటపటాయిస్తూ ఆగి, "రిక్షా వెళ్ళిపోయింది. రిక్షాలో ఎవరో వున్నారు. చెయ్యికూడా వూపాడు".
విశ్వేశ్వరశాస్త్రి మొహం వాడిపోయింది. అయితే అనూష దాన్ని పట్టించుకోలేదు. ఆ ఒక్క మాటలో శ్రీనివాసరావు గురించి అంచనా వేయగలిగింది. రిక్షాలోంచి దిగకుండా దూరంగా వుండే ఉత్పలని ఇంటికి పంపించాడూ అంటే, "నేను ఇంటి వరకూ రావటం బావోదు మీవాళ్ళు చూస్తే" అన్న గిల్టీ ఫీలింగ్ ని ఆమె మనసులో నాటటానికి మొదటి ప్రయత్నం చేశాడన్నమాట, ఇలాంటి మొగవాళ్ళ గురించి అనూషకి బాగా తెలుసు. ఇలాటివాడు ఉత్తరాన్ని ఉత్పలకి ఇవ్వడు. పెద్ద ధైర్యవంతుడిలా తనే వుంచుకుంటాడు. ఉత్పల ఇన్ స్పెక్టర్ కి చెప్పినదాన్లో అబద్ధం లేదు.
ఆమె చటుక్కున లేచింది.
దాదాకో, శంకర్ కో ఫోన్ చేసి ఉత్పల తన దగ్గిరే వున్నట్టు ఇన్ స్పెక్టర్ చెప్పాడు. కానీ ఈ ఉత్తరం సంగతి చెప్పి వుండడు. కానీ ఆ మాఫియా వాళ్ళు తరువాత ఇన్ స్పెక్టర్ ని కలుసుకోని మిగతా విషయాలూ తప్పకుండా అడుగుతారు. వాళ్ళ కన్నా ముందు తాను త్వరపడాలి.
ఆమె మరి ఆలస్యం చేయకుండా అక్కణ్ణుంచి బయల్దేరింది. కిళ్ళీ కొట్టుదగ్గిర నిలబడిన మనిషి అలాగే వున్నాడు. ఓరకంట అతడిని చూస్తూ, తనని దాచుకునే సమయానికి మాత్రం తననెవరయినా వెంటాడుతున్నారా అని గమనించింది.
ఎవరూ చూడడం లేదని నిశ్చయించుకున్నాక లోపలికి ప్రేవేశించింది.
శ్రీనివాసరావు అమ్మమ్మ వుంది ఇంట్లో.
'వచ్చింది ఎవరు' అని ప్రశ్నించకుండానే ఆమె ఏడుపు మొదలు పెట్టింది. ఆ ఏడుపులో మనవడు పోయాడన్న బాధకన్నా పిల్లల్నెవరు పోషిస్తారన్న దుఃఖమే ఎక్కువుంది.
ఆమెని ఓదారుస్తున్నట్టు మాట్లాడుతూ, అనూష వెతకటం మొదలు పెట్టింది. పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టమ్ కోసం తీసుకెళ్ళి ఇంకా కొన్ని గంటలు కూడా కాలేదు. ఆ వీధిలో టెన్షన్ ఇంకా తగ్గలేదు.
ముందామె పక్క క్రింద, పక్క పక్కన వున్న అల్మైరాలో వెతికింది. తలగడ క్రింద చవకబారు పుస్తకాలున్నాయి. కిటికీలో ఒకటి రెండు డిటెక్టివ్ నవలలున్నాయి. అల్మైరాలో అంతకు ఏమాత్రం ఎక్కువ స్థాయిలో లేని నవలలు పది పన్నెండున్నాయి. వాటిలో ఎ వుత్తరమూ లేదు.
ఇక బీరువాలు వెతకాలి. వాటి తాళాలు ఇమ్మంటే ఇస్తుందో లేదో?
అనూష ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ మధ్య గదిలోకి వచ్చింది. ఆ గదిలో పిల్లల పుస్తకాలున్నాయి. వాటిని చూశాక బీరువాల గురించి అడుగుదామని, వాటిని తీసింది. సాంఘిక శాస్త్రం, సైన్సు పుస్తకాలు అవి.
వాటిలో ఉత్తరం లేదు.
ఆమెకి నిస్పృహ ఎక్కువయింది. ఈ లోపులో ఆ ముసలమ్మకి ఇప్పుడు అనుమానం వచ్చి "ఎవరమ్మ నువ్వు? ఏం కావాలి?" అని అడిగింది.
"మీ శ్రీనివాసరావుగారి ఆస్పత్రిలోనే పని చేస్తున్నానండి. ఒక కాగితం ఆయన ఇంటికి తీసుకొచ్చారు. దానికోసం వెతుకుతున్నాను".
ముసలమ్మలో అకస్మాత్తుగా రియాక్షన్ కనపడింది. "చెట్టంత పిల్లాడు పోయి మేమేడుస్తూంటే ఆస్పత్రి కాగితానికి తొందరొచ్చిందటమ్మా?" అని విరుచుకుపడింది.
అనూష ఏది సర్ది చెప్పబోయింది. కాని ఆవిడ వినిపించుకోలేదు. "తరువాత చూసుకోవచ్చు లేవమ్మా వెళ్ళు" అని తొందరపడింది. రెండు నిముషాల వాదన జరిగింది కానీ ఫలితం లేకపోయింది. మరేం చేయటానికీ తోచక పిల్లల పుస్తకాలు తీసిన చోట పెట్టెయ్యబోయింది. పెట్టబోతూ వుంటే అక్కడ కనపడ్డాయి కాగితాలు.
మడత పెట్టబడి వున్న మూడు కాగితాలు..... ఒక బొత్తుగా.
......చప్పున తీసి చూసింది దాన్ని.
ఆమె చేతులు వణకసాగాయి.
అది విష్ణుశర్మ వ్రాసిన వుత్తరం.